Site icon Sanchika

జీవన రమణీయం-106

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]న[/dropcap]వీన్, అతని భార్య సుచరితా కూడ టీ.వీ.లో, ఇంకా సినిమాల్లో నటించేవారు. సుచీ అనేవారు ఆమెని. నేను ‘చెలి’ అని రాసిన టెలీఫిల్మ్‌లో కూడా ప్రభాకర్ సుమా, సుచీ నవీన్ నటించారు. అది పది వారాలొచ్చింది ఆదివారాలు ఈటీవీలో. ఏకవీర లాంటి కథ. ఒకరు ప్రేమించిన వాళ్ళని ఒకరు పెళ్ళి చేసుకుని స్నేహితులు, భార్యలని అడగకుండా, మార్చేసుకుందాం అనుకుంటారు. కానీ భార్యలు ఒప్పుకోరు. మంచి రేటింగే వచ్చింది. సంభాషణలూ, స్క్రీన్‌ప్లే రాసాను. ఆ నవీన్ ‘పద్మవ్యుహం’లో అస్మితకి జోడిగా చాలా ఎపిసోడ్లు నటించగా, ఆ సీరియల్ రాసాను అప్పట్లో. రేటింగ్‍లు 10, 12, 14 వచ్చేవి. రాత్రి 8.30కి ‘చక్రవాకం’ వచ్చేది  జెమినీలో. దానికీ ఈటీవీలో ఈ పద్మవ్యూహానికీ పోటీ. ఈ ‘పద్మవ్యుహం’లోనే నేనూ, డైరక్టర్ గారూ కలిసి ‘నారాయణ’ అనే కేరక్టర్ సృష్టించి, పాటలు పాడే చలపతిరాజు చేత వేయిస్తే, అందులో నేను రాసిన కామెడీ వల్ల అతనికి చాలా మంచి పేరొచ్చి, ఆ తర్వాత, ‘చంద్రముఖి’ అనే సీరియల్లో కూడా సేమ్ కేరక్టర్‌లో వంద ఎపిసోడ్లు, ప్రేక్షకాదరణతో నటించాడు. చలపతిరాజు, గంగాధర శాస్త్రి స్నేహితుడు. ఇద్దరూ మంచి గాయకులు అవడం వలన కలిసి ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు.

అందులో ‘బిగ్ బిగ్ మేడమూ’ అని షెర్లీ అనే నటి దగ్గర మేనేజర్‍గా పని చేస్తూ, ఆవిడనే ఆటపట్టించే కేరక్టర్. నేను రాసిన డైలాగుల్లో కొన్ని నాకు గుర్తున్నవి…

“ఊరుకోండీ రామాయణం రాసింది బోయ, భారతం రాసింది కోయ… ఎవరి జాతకాలు ఎవరు రాస్తారో ఎవరికి తెలుసూ?” అంటాడు.

అలాగే చెప్పులు కుట్టుకుంటుంటే, షెర్లీ వచ్చి “ఒక్క కుట్టుకి హదహారు రూపాయలు అడుగుతావురా? ఆశపోతు వెధవా?” అంటే, “ఆ వెనుక కనిపిస్తున్నదేవిటి? ఐదు నక్షత్రాల ఆస్పత్రి… అక్కడ కుట్టుకి లక్ష రూపాయలు తీసుకుంటారు… అదీ తోలే… ఇదీ తోలే! వెల్లెల్లవమ్మా” అంటాడు.

ఇంకోసారి ఇంట్లో పనిచేసే నాగమణి గారూ, చలపతిరాజూ కలిసి, యజమానురాలు షెర్లీ, ఓ వేళ చచ్చిపోతే ఆ చావు ఎంత ఘనంగా చేస్తామో ఊహించుకుని, వర్ణిస్తూ “వెనుక డప్పు… నేను పులి డాన్స్… మరమరాలు జల్లుతూ నేను… పైసలు ఏరుకుంటూ నువ్వు… దేఖ్‌తడీ… పోచమ్మ గుడీ… డుం డుం డుం… అరె డుం డుం డుం..” అని ఇల్లంతా ఆమె శవయాత్ర చేసి ప్రాక్టీస్ చేస్తుంటే ఆ దృశ్యాల కోసం నారాయణ సీన్స్ కోసం ప్రేక్షకులు ఎదురు చూసేవారు. నేను కామెడీ బాగా రాస్తాననీ, మాట్లాడతాననీ నాకు మా డైరక్టర్ అనిల్ కుమార్ గారు చెప్పేవారు. ఆ తరువాత నేను చాలా నవ్విస్తూ మాట్లాడగలను అని చాలా మంది అన్నా, అల్లు అరవింద్ గారూ, సత్యానంద్ గారూ, భువనచంద్ర గారూ, కోడి రామకృష్ణ గారూ మాత్రం ఆ హాస్యం వల్లే స్నేహం వృద్ధి చేసుకున్నారు.

చాలా రోజుల క్రితం ఆంధ్రజ్యోతి ఎడిటర్ నామిని సుబ్రమణ్యం నాయుడుగారు “ఆడ రచయిత్రులు ‘మబ్బుగా’ రాస్తారు… మీరు చాలా హాస్యంగా, అదీ సహజమైన ధోరణిలో, హాస్యం కోసం అతిశయోక్తులు కాకుండా రాస్తారు” అని అన్నారు. నేను పర్సనల్‌గా తెలిసిన స్నేహితులు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ వుంటారు. ఈ మధ్య పరిచయం అయిన తేజాబ్ డైరక్టర్ ఎన్. చంద్ర గారు, మేం మైసూర్ దగ్గర రాంపూర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు “షోలే ఇక్కడే తీశారు” అంటే, నేను షోలే లో ‘రామూ చాచా’ కేరెక్టర్‌ లేకపోతే షోలే సినిమానే లేదు అని అతని కేరక్టర్ గురించి హాస్యంగా చెప్తే, పడీ పడీ నవ్వి, “రమణీజీ!… మీలో మంచి కామెడీ రైటర్ వున్నారు, మీ తెలుగు ఇండస్ట్రీ వాడుకోలేదా?” అని అడిగారు. నిజంగా ‘రామూ చాచా’ కేరక్టర్ చూడండి, అమితాబ్, ధర్మేంద్రలని అతనే తీసుకొస్తాడు రైల్వే స్టేషన్ నుండి. జయబాధురిని చూపించి “ఆమె జీవితంలో రంగు లేకుండా పోయింది” అని అమితాబ్‌ని అన్యాపదేశంగా హెచ్చరిస్తాడు… ఠాకూర్‌కి రెండు చేతులూ లేకపోవడంతో, దిక్కుమాలిన దైనందిన చర్యలన్నీ అతనే చెయ్యాలి పాపం… ఎంత శిక్ష? కోడలు కేవలం దీపాలు ఆర్పుతుంది అంతే! పోనీ శలవు దినాలున్నాయా పనికి? అంటే… లేవు… ఆదివారాలు ఠాకూర్ చెప్పులు తిరగేసి, మేకులు కొట్టే పని అప్పగిస్తాడు… అసలు పెళ్ళి చూపులకెళ్ళి, ఠాకూర్ కోడలిగా జయబాధురీని సెలెక్ట్ చేయడం, జయ్, వీరూలని వూళ్ళోకి తీసుకురావడం దగ్గర నుండీ, లాస్ట్ సీన్ దాకా, ఠాకూర్‌కి రెండు చేతులూ లేవన్న విషయం జయ్, వీరూలకి తెలియకుండా, చక్కగా షాల్ కప్పి, పిన్‌లు పెట్టడం వరకూ రాము చాచా పనే పాపం! సో… అసలు షోలే సినిమాకి ప్రధాన పాత్ర ‘రామూ చాచా’నే అన్న నా ఎనాలిసిస్‌కి ఆయన తెగ నవ్వాడు. దీనికి ముందు నేనోసారి ఈ చర్చ సత్యానంద్ గారితో చెయ్యగా, ఆయన ‘సత్తెన్ కప్పు’ పేరు టైటిల్స్‌లో ముందు వెయ్యకుండా, చివర్లో వెయ్యడం మనం ఖండించాలి” అన్నారు.

ఇదంతా సరదాకే… ఏ టాపిక్ లేనప్పుడు ఏదో టాపిక్‌లో కామెడీ వెతుకుతుంటాను. ‘షోలే’ నా అభిమాన చిత్రం. ఓ ఇరవైసార్లు చూసుంటాను. అసలు మొదటి సీన్‌లో జయ్, వీరూలని సంజీవ్ కుమార్ తీసుకెళ్తే మాల్‌గాడీలో ఏముందని దొంగలు వెంటబడ్దారో, వీళ్ళు అంతమందిని చంపి, వున్న రైలు బొగ్గులనీ, కిరోసిన్‍నీ వీళ్ళే తగలబెట్టి ఏం కాపాడారో, అసలు ఎలెక్ట్రిసిటీ లేని వూళ్ళో వాటర్ టాంకర్ ఎందుకుందో… పాపం అంత పెద్ద బందిపోటు దొంగా, ఆ మాట అనిపించుకునేందుకు అన్ని అర్హతలు వుండి,  గబ్బర్‌సింగ్ అనే ఆ టైటిల్ కొనుక్కోడానికి తెలుగు ప్రొడ్యూసర్ల చేత ఎన్ని కోట్లు ఖర్చుపెట్టించిందో, ఈనాటికీ ఆ ‘టైటిల్’ కొనుక్కోడానికి కోట్లు ఖర్చు పెట్టించిన గజదొంగ అంత నికృష్టంగా, నిలువ నీడ లేకుండా, ఆ కొండల్లో వుండి ఎందుకు మాడిపోయాడో, ఏం అనుభవించాడో… పాపం జలాల్ ఆగా ‘మెహబూబా’ డాన్స్ చెయ్యడానికి హెలెన్‍ని తీసుకురాకపోతే… ఆ కాలియా, కొండ మీద నిలబడి నిలబడి ఎలా నల్లగా మారిపోయాడో… అని జోక్స్ వేస్తూనే ఆ సినిమా ఓ సీన్ చూస్తూ, వదిలిపెట్టకుండా ఆఖరి సీన్ దాకా చూస్తుంటాను. చంద్రగారు ఫోన్ చేసి కాసేపు నాతో మాట్లాడి, “బాగా నవ్వించావు తల్లీ… మళ్ళీ మనసు బాగోలేనప్పుడు చేస్తా” అంటారు.

మోహన్ అగాషె, ఎన్. చంద్ర గార్లతో రచయిత్రి

మోహన్ అగషే అని ఓ హిందీ నటుడు, ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ ఏక్టింగ్‌కి ప్రిన్సిపాల్‌గా కూడా చేసారు. ‘అంకుర్’ లాంటి శ్యాం బెనెగళ్ అన్ని మూవీస్‌లో ఏక్ట్ చేసారు. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన నాతో మాట్లాడ్తూ, “అరే, ఈ అమ్మాయి మన సెన్స్ ఆఫ్ హ్యుమర్‌కి ఎగ్జాక్ట్ మేచింగ్ భాయ్” అన్నారు చంద్రగారితో.  ఆయన్ని కలిసినప్పుడు, “మేరే సౌభాగ్య్ హై, ఆప్ సే ఏ ములాకాత్” అంటే, “హమారే దుర్భాగ్య్ హై క్యా? హమ్ ఏసే క్యా కియా? హమారే భీ సౌభాగ్య్ హై” అన్నారాయన. అనంత్ మహదేవన్ కూడా నాతో మాట్లాడి చాలా ఆనందపడ్డారు ఆ ట్రిప్‌లో.

ఇదంతా నేను కామెడీ రాసినప్పుడొచ్చిన అప్లాజ్ తలుచుకుంటూ వుంటే వచ్చిన సంగతులు. తాజాగా నేను ‘మిసెస్ సుబ్బలక్ష్మి’ వెబ్ సిరీస్ కూడా కథా, స్క్రీన్‌ప్లే సంభాషణలు కూర్చినదీ, ప్రధానంగా కామెడీనే. అందులో మంచు లక్ష్మి, అవసరాల శ్రీనివాస్, సుధీర్ కుమార్ (మహేష్ బాబు కజిన్) ఏక్ట్ చేసారు. జీ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.

(సశేషం)

Exit mobile version