జీవన రమణీయం-11

    1
    3

    [box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

    [dropcap]ఓ[/dropcap]సారి పిల్లనిచ్చిన మావగారు “దేశాలు పట్టుకు తిరిగితే నీ సంసారాన్ని నేను చూసుకోవాలా?” అన్నారని, అమ్మమ్మనీ పిల్లలనీ తీసుకొచ్చి, మిత్రుడు పెట్టిన ‘గో సంరక్షణ శాల’లో కాపురం పెట్టారుట. షరా మామూలే… అటునుండి వెళ్ళే ‘రైలు గొలుసు’లు లాగి రైళ్ళాపేసి, ధర్నా చేసారుట ధరల పెరుగుదల గురించి.

    అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో పెట్టారు.

    ఇక్కడ రమణమ్మ పిల్లలతో బిక్కుబిక్కుమంటూ ఉంది. వర్షం మొదలయిందిట. ఎదురుగుండా వున్న లీల అనే చాకలమ్మాయీ భర్తా వచ్చి, “మా ఇంటికి రండమ్మా” అంటే, “ఆయన రానీ… వచ్చి వేరే ఇల్లు చూస్తా అన్నారుగా” అని భర్త మీద కోపంతో ఆవిడ సమాధానం ఇచ్చిందట. వాళ్ళు పిల్లల్ని తీసుకుని, ‘ఈవిడ మాత్రం తక్కువా మొండితనంలో’ అనుకుని వెళ్ళిపోయారు!

    వర్షంలో ఈవిడ నవారు మంచం మీదే అలాగే పడుకునుంది రాత్రంతా. తెల్లారాకా తాతయ్య వచ్చారు. అమ్మమ్మ మాట్లాడలేదు! ఆవిడ కోపాన్ని గ్రహించి “నాతో జీవితం సాఫీగా ఉండదు… ఇలాగే ఒడిదుడుకులుగా ఉంటుందని నీకు తెలుసుగా? మీ నాన్న దగ్గర వదిలెయ్యనా?” అన్నారుట.

    “వెళ్ళను” అని ఆవిడ శివంగిలా లేచిందిట. ఆయన పకపకా నవ్వారుట, “నువ్వు నన్ను వదలవుగా!” అని.

    “కుక్క తోక పట్టుకుని గోదారి ఈదుతోంది” అని ఆవిడ తండ్రొచ్చి మనవరాళ్ళని తీసుకెళ్ళాడుట.

    ***

    ఉరవకొండలో వున్నప్పుడు వీళ్ళ పక్కింట్లో శారద అనే పిల్ల తల్లీదండ్రీ లేక మేనమామ పంచన పడి, ఇంటెడు చాకిరి చేస్తూ ఉండేదట. ఒకసారి అమ్మమ్మ వింటుండగా పొద్దుటే “నేను అంబాచారి బావిలో పడి చస్తాను… ఈ పెళ్ళి చేస్తే” అందట శారద.

    పనిమనిషిని పిలిచి అమ్మమ్మ “శారద ఇలా అందేమిటీ?” అంటే, పనిమనిషి, “ఏం చెప్పమంటారమ్మా? శారదమ్మని క్రిష్ణమూర్తి బాబు పెళ్ళాడతానన్నాడు… ఈడూ జోడూగా ఉండేవారు జంటా! ఆ మేనత్త వేగనిచ్చింది కాదు. ఆమె కొడుకు నారాయణాచారి కూతురికి ఓ సంబంధం చూడ్డానికి వెళ్తే ఆ ఇంట్లోనే వున్న పిల్లవాడి మేనమామ అరవై ఐదు ఏళ్ళ వాడికి, శారదనిచ్చి చేస్తే ఈ సంబంధం ఒప్పుకుంటానన్నారట! ఆ బావ ముసలాడితో శారదకి సంబంధం కుదుర్చుకు వచ్చాడు” అంది.

    రమణమ్మ “అవ్వ. ముక్కుపచ్చలారని పిల్లకి ముసలాడితో పెళ్ళా? పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనుకుంటున్నారా” అంది.

    ఆ రాత్రి శ్రీహరిరావుగారు లెక్చర్స్ అయి వచ్చాకా అన్నం వడ్డిస్తూ, “శారద  బావిలో పడ్తుందట” అని విషయం మొత్తం చెప్పింది.

    అయన మౌనంగా విని “ఆ క్రిష్ణమూర్తి ఎక్కడ ఉంటాడు?” అని అడిగారు. “రాయదుర్గంలో” అని చెప్పిందావిడ.

    మరునాడు ఈయన రాయదుర్గం వెళ్ళి, “క్రిష్ణమూర్తి ఎవరిక్కడా?” అని వాకిలి తలుపు మీద కొట్టగానే, “గురువు గారూ” అని క్రిష్ణమూర్తి ఈయన కాళ్ళకి దణ్ణం పెట్టాడుట.

    ప్రతీ రోజూ ఆ కుర్రవాడు శ్రీహరిరావు స్పీచ్‌లు వినడానికి వెళ్తున్నాడట.

    అతని తల్లి తులసమ్మ గారు “మీ గురించి బిడ్డ చెప్తూనే వున్నాడు బాబుగారూ! ఏం పని మీద వచ్చారు?” అందిట.

    శ్రీహరిరావుగారు ఆలస్యం చెయ్యకుండా, “క్రిష్ణమూర్తీ, శారదని పెళ్ళి చేసుకుంటావా? లేదా వాళ్ళ బావ నారాయణ స్వామి తన కూతురుని వయసువాడికిచ్చి చెయ్యడానికి, ఆమెని ముసలివాడికిచ్చి కట్టబెడ్తున్నాడు” అంటూ విషయం చెప్పేసారు.

    క్రిష్ణమూర్తి తల్లి వైపు చూసి, ఆవిడ నవ్వగానే, “నాకిష్టమే మాస్టారూ!” అన్నాడుట.

    మరునాడు శ్రీహరిరావు ఏకంగా పెళ్ళికొడుకునే వెంటపెట్టుకొచ్చి, “ఇదిగో ఈవిడ తులసమ్మ గారు, మన వియ్యపురాలు. రేపు తెల్లవారుజామున శారదకి పెళ్ళి చెయ్యాలి” అన్నారట.

    “అయ్యో రామ – మీ తొందరా మీరూ! శారదకి చెప్పాలి… వాళ్ళ కళ్ళు కప్పి ఎక్కడికి తీసుకెళ్తామండీ?” అందిట అమ్మమ్మ. “అదంతా నేను చెప్తాగా” అన్నారుట.

    తెల్లారి పేడనీళ్ళు జల్లుతున్న శారదని గోడ మీద నుండి రమణమ్మ “శారదా… చేతులు కడుక్కుని ఒకసారి మా ఇంటికి రా” అని కేకేస్తే, ఆ పిల్ల చేతులు కడుక్కుని వచ్చిందట.

    ముందుగదిలో కృష్ణమూర్తిని  చూసి నోరు తెరుస్తుండగా, తులసమ్మ వచ్చిందట. “అత్తా!” అని తులసమ్మ మెడ పట్టుకుని వలవలా ఏడ్చిందిట.

    శారదకి మొహం కడిగించి, కాఫీ ఇచ్చి, “స్నానం చేసి ఈ పెళ్ళి చీర కట్టుకో. నీకు పెళ్ళి… బండి రాగానే బళ్ళారి వెళ్ళాలి” అన్నారట.

    వీళ్ళు బళ్ళారి వెళ్తుండగా, పక్కింటి కుమారస్వామి చూసి, నారాయణాచారి దగ్గరికి వెళ్ళాడుట. “మీ శారదని ఆ ఉత్తరాదివాళ్ళు బండిలో ఎక్కించుపోయారు” అని చెప్పాడట.

    కాని అప్పటికే వాళ్ళు శారద కనిపించక అంబాచారి బావి దగ్గరకి పరిగెత్తారుట, మునిగి చచ్చిపోయి ఉంటుందని.

    బళ్ళారి చేరి శ్రీహరిరావు ఓ ఊరి చివర గుడికి చేరి, పూజారి గారితో “తాళిబొట్టునీ, పిల్లనీ, పిల్లాడినీ తెచ్చాను. పెళ్ళి జరిపించండి” అన్నారుట.

    పక్కనే ఉన్న బోయ్స్ హాస్టల్ వాళ్ళకి విషయం చెప్తే, వాళ్ళు పరమానందంగా మెస్‌లో వండిన పదార్థాలన్నీ ఇక్కడి చేరేసారుట.

    పెళ్ళి అయి క్రిష్ణమూర్తి శారద మెడలో పుస్తె ముడి వెయ్యగానే, పెద్ద పెద్ద ఏడుపులతో, తిట్లతో పోలీసులని వెంటపెట్టుకుని మేనత్తా, బావా “శారదని పట్టుకుపోతాం, ఆమె పసి పిల్ల… ఎత్తుకొచ్చి పెళ్ళి చేశారు” అంటూ వచ్చారుట.

    శారదా, క్రిష్ణమూర్తీ తాము మేజర్లం అని ఇన్‌స్పెక్టర్‌కి చెప్పారుట. వాళ్ళనీ భోజనాలు చేసి వెళ్లమన్నారట హాస్టల్ కుర్రాళ్ళు.

    ఆ మేనత్త మాత్రం శ్రీహరిరావునీ, రమణమ్మనీ శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళిందట.

    అలా వారి జీవితంలో మొదటిసారిగా శ్రీహరిరావూ, రమణమ్మా కన్నె ధారపోసి పెళ్ళి చేసిన పిల్ల శారద.

    శారద ఆడబిడ్డ లీలకి ఉల్లిగుండం పూర్ణప్రజ్ఞతో వీళ్ళే తర్వాత పెళ్ళి చేశారు. అతని అక్కగారి పిల్లలే షావుకారు జానకీ, కృష్ణకుమారి గార్లు. ప్రసిద్ధ సినీనటీమణులయ్యారు తర్వాత.

     (సశేషం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here