[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
అంత అందమైన ప్రదేశాలు పెద్దయ్యాకా చూస్తాననీ, ఇలా ఒంటరిగా, ఒక్కర్తినీ, అమెరికా అంతా తిరుగుతాననీ, అంతకు ముందు పదిహేడేళ్ళ క్రితం దాకా కూడా అనుకోలేదు కదా! అనిపించింది.
నాకు ఊహ తెలీనప్పుడు మా అమ్మమ్మ సీతయ్య తోటలో, రెండు గదులు తీసుకుని మమ్మల్ని అందులో పెట్టి పెంచింది అని చెప్పాను కదా! అమ్మ సెన్సెస్ డిపార్ట్‌మెంట్‌లో టెంపరరీగా జాబ్ చేసేదిట అప్పట్లో. అసలు ఆంధ్రా మెట్రిక్ కూడా కట్టి పాసవడం అన్నయ్య పుట్టాకనే! అమ్మని సెన్సెస్ పని మీద ఊళ్ళకి పంపించేవారుట. మా సాయి బాబాయి కూడా అప్పుడు అమ్మ కొలీగ్. అంతే కాక, తనకి తోడుగా వుంటుందని తన పిన్ని కూతురు సావిత్రిని, అందరూ ‘చిన్నపిల్ల’ అంటారు, తనకి కూడా అందులో జాబ్ వేయించిందట. చిన్నపిల్ల అక్క చంద్రభానుని ‘పెద్ద పిల్ల’ అనేవారు… ఆసలు ఆవిడ పుట్టినప్పుడే ‘పెద్ద పిల్ల’ అని ఎలా పిలిచేవారు, రెండవ సంతానం అయిన ఆవిడ ముందు అన్నయ్య, ఆ తరువాత ఈవిడ! మరో ‘చిన్న పిల్ల’ పుడ్తుందని తల్లిదండ్రులకి తెలుసా? ఇలాంటి ప్రశ్నలు వేసేదాన్ని నేను అప్పట్లోనే. అసలు వాళ్ళ పేర్లే విచిత్రంగా పెట్టారు మా శేషగిరి తాతగారు. అబ్బాయి మహాదేవ నియోగి, తర్వాత అమ్మాయిలు చంద్రభాను నియోగీ, సావిత్రీ నియోగీ! కానీ ఆ పేర్లు ఆఫీసుల్లో తప్ప బంధువులకి గానీ, చుట్టుపక్కల వాళ్ళకి గాని తెలీవు! బాబూ, పెద్ద పిల్లా, చిన్న పిల్లా అని అంతా పిలిచేవారు. మేము బాబు మావయ్య అనేవాళ్ళం. ఇప్పుడూ కూడా బాబు తాతయ్య, పెద్ద పిల్ల పిన్నీ, చిన్న పిల్ల పిన్నీ అంటున్నారు. ఆ బాబు మావయ్యే అమ్మ వాళ్ళ ముగ్గురు అక్కచెల్లెళ్ళకీ, ఈ స్వంత చెల్లెళ్ళకీ ఒక్కగానొక్క అన్నదమ్ముడు. మా సాయి బాబాయి భాషలో “అన్ని చీరల మధ్యలో ఒక ప్యాంట్ ఈ నియోగి” అంటాడు. చాలా మంది మిత్రులూ, తెలిసినవాళ్ళూ నియోగి అని పిలుస్తూ వుంటారు. భవానీ శంకర్ నియోగీ అనే ప్రముఖ నాయకుడి పేరు చూసి మా చిన్న తాతగారు పిల్లలకి ఇలా పేర్లు పెట్టారు. ఎవరూ మీ శాఖ ఏమిటీ అని అడగక్కరలేదు!
అలా అమ్మ తన చెల్లెలు అయిన చిన్న పిల్లతో సెన్సెస్ డ్యూటీ మీద కేంపులకి వెళ్తూ వుండేదిట. అక్కడ ట్రావెలర్స్ బంగళాలో గవర్నమెంట్ సర్వెంట్స్ బస చేసేవారుట. అసలు ఆ ట్రావెలర్స్ బంగ్లా అన్న పేరు వినగానే పాత హిందీ సినిమాల్లో కనిపించే భూత్‌బంగ్లాలూ, గుమ్నామ్ సినిమాలూ గుర్తొస్తాయి. అక్కడ వంటవాడు మహారాష్ట్రా వాళ్ళు కాబట్టి రోటీలు, పప్పూ, కూరా, ఉప్పూ కారం లేకుండా చేసేవాడుట! కానీ వీళ్ళ వయసుకి అన్నం సరిగ్గా లేదనే ధ్యాస వుండేది కాదట… రోజూ ఆ ఊళ్ళో ఉన్న థియేటర్లో సినిమా చూసేవారుట. అలా జిద్దీ, జబ్ ప్యార్ కిసీసే హోతా హై, ప్యార్ కా మౌసం, కశ్మీర్ కీ కలీ, వున్నన్నాళ్ళూ రోజూ చూడడం వల్ల పాటలన్నీ కంఠతా వచ్చేసేవిట. మంచి గాత్రాలూ, పాత హిందీ పాటలు లతా, ఆశాల పాడేస్తూ వుండేవారట. వాళ్ళ ఆఫీసర్ మీర్ ముష్‌రఫ్ హుస్సేన్ గారు వీళ్ళకి ఫ్రీగా హోటల్‌లో టిపిన్స్ పెట్టించి ఆ బిల్ ఆయన కట్టేవారుట! ఇంక తిండి అయితే జామకాయలూ, సీమ చింతకాయాలూ, చెరుకు గడలూ, తేగలూ, సీతాఫలాలూ, ఏవి కనిపిస్తే అవి నమిలేసేవారుట. ఆడపిల్లలకి అంతలేసి స్వేచ్ఛలిచ్చి ఆ వుద్యోగాలకి పంపినందుకు ఆ రోజుల్లో, అంటే 1957, 58 లలో – మా అమ్మమ్మన్నీ, చిన్న అమ్మమ్మా తాతగారల్నీ నేను అభినందించకుండా వుండలేకపోతున్నాను. పైగా వీళ్ళు సైకిల్ తొక్కడం, పంజాబీ డ్రెస్‍లు వేసుకోవడం, లేదా ఓణీలతో ఆఫీస్ పని చేయడంట!
అప్పటికే అమ్మకి అన్నయ్య పుట్టాడు. ఇంటి దగ్గర అమ్మమ్మ, పెద్దమ్మ పిల్లలతో కలిపి, అందర్నీ శ్రద్ధగా చూసుకునేది. చిన్న పిల్ల పిన్నికి ఇంకా పెళ్ళి కాలేదు అప్పటికి. పెద్ద పిల్ల పిన్ని అంటే, చంద్రభాను పిన్ని ఎమ్.ఎ. ఎకనామిక్స్ చేసి కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల, రాజమండ్రిలో లెక్చరర్‌గా చేరింది. ఆ తర్వాత అక్కడే వైస్-ప్రిన్సిపాల్‍గా రిటైరయ్యింది. మహాదేవ నియోగి మావయ్య ‘సర్వే ఆఫ్ ఇండియా’లో వుద్యోగం చేశాడు. అప్పట్లో ఆఫీసర్… అంటే ‘బాబుకి నాలుగంకెల జీతం’ అని పెద్దవాళ్ళు గొప్పగా చెప్పుకునేవారు. మేము కూడా ఆయన్ని గౌరవంగా చూసి భయభక్తులతో వుండేవాళ్ళం. ఆ బాబు మావయ్య, నాగమణి అత్తయ్య ఫీనిక్స్‌లో రెండో కొడుకు శీను దగ్గర వున్నారనే నేను మొదటి అమెరికా యాత్రలో ఫీనిక్స్ వెళ్ళాను!
అమ్మకి ఆ సెన్సెస్ వుద్యోగ పర్వం అయ్యేనాటికి నేను పుట్టానుట! అప్పుడే ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ వాళ్ళు పిలిచి, మా అమ్మనీ, పిన్నినీ “ఆర్.టి.సి. అనే రోడ్డు రవాణా సంస్థలో వుద్యోగాలున్నాయి, వెళ్తారా?” అని అడిగారట. వీళ్ళు ఇళ్ళకొచ్చి చెప్పారుట.
మా చిన్న తాతగారు “పెళ్ళి కావల్సిన పిల్లవి, కండక్టర్లూ, డ్రైవర్లూ వుండే ఆ సంస్థలో పని చేస్తావా? ఒద్దు” అన్నారుట. మా చిన్న పిల్ల పిన్ని “నాన్నగారు ఒద్దంటున్నారే పాపక్కా” అని మానేసింది. అదే చిన్న పిల్ల పిన్ని నలుగురు ఆడపిల్లలు పుట్టాకా, అమ్మని బతిమాలి, మళ్ళీ ఆర్.టి.సి.లో బుకింగ్ క్లర్క్‌గా చేరింది. కానీ మా అమ్మమ్మ ధైర్యవంతురాలు. అప్పటికే మా తాతగారు పోయాకా, దుర్గాబాయమ్మ గారిచ్చిన స్ఫూర్తితో, సర్వోదయ పాత్ర వసులు చేసీ, గాంధీభవన్‌లో నూలు వడికీ, హిందీ ట్యూషన్లు చెప్పీ ఇంటిని నెట్టుకొస్తోంది. “మహారాజులా వెళ్ళమ్మా, ఏదైనా వుద్యోగమే!” అందిట. మా నాన్నగారి అనుమతి అడిగినట్లు లేదు అమ్మ. ఆయనకి అంత ఇష్టమూ లేదు! అమ్మ వెళ్ళి… ఆర్.టీ.ఆర్.సి అనేవారు ఆర్.టి.సి.ని అప్పట్లో… జాయిన్ అయిపోయింది. ఆ వుద్యోగం వల్ల అమ్మకి, చార్మినార్ చౌరస్తాలోంచి లోపలికి వెళ్తే వజీర్ సుల్తాన్ టుబాకో ఫ్యాక్టరీ, వెనకాల వున్న అజమాబాద్‌లో క్వార్టర్స్ ఇచ్చారు! ఆ క్వార్టర్స్ లోనే పెద్దమ్మ పిల్లలవీ, మావీ చదువులూ, పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ అన్నీ అయ్యాయి! ఇంతా చేసి ఇల్లు ఓ ముందు వసారా, హాలూ, పడక గదీ, చిన్న వంటిల్లూ, వెనుక వసారా… అంతే. ఆ ఇల్లు పుష్పక విమానంలా ఎంతమంది బంధువులొచ్చినా, ఇంకొకరికి స్థలం ఇచ్చేది! ఎవరికి హైదరాబాదులో పనిపడినా “పాపాయి ఇల్లు సెంటర్‍లో వుంది” అని దిగిపోతూ వుండేవారు. అమ్మ ఎవరినీ విసుక్కునేది కాదు. డొక్కా సీతమ్మ గారిలా అమ్మమ్మ వుండనే వుంది వండి పెట్టడానికి! ఎక్కువమంది అతిథులొచ్చినా, శుభకార్యాలొచ్చినా, పెరట్లో మావిడి చెట్టు కింద గాడిపొయ్యి వేసి, పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలతో, రాచ్చిప్పలతో, పప్పూ, పులుసూ వండేసేది! అసలు ఆ ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగించిన రోజే మా రెండో పెద్దమ్మ కొడుకు హనుమంతు అన్నయ్య తల మీద పెద్ద కొబ్బరి బోండం అంత బంగినిపల్లి మావిడిపండు పడి, పిచ్చి పిచ్చిగా మాట్లాడాడుట! ఆ చెట్టు ఎన్ని వందల కాయ కాసేదో! ఆ తీపి కాయతో అమ్మమ్మ బెల్లం ఆవకాయ కూడా పెట్టేది. వెనక స్థలంలో మావిడీ, సపోటా, జామ చెట్లుండేవి. వీధి వాకిట్లో పెద్ద వేప చెట్టుండేది! మమ్మల్ని 11వ నెంబరు ఇల్లుగల వాళ్ళూ అనేవారు కాదు! వేపచెట్టు వాళ్ళు అనేవాళ్ళు.
(సశేషం)