Site icon Sanchika

జీవన రమణీయం-111

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఆ[/dropcap] ‘వేపచెట్టు’ గురించి ‘ఆత్మకథ’ రాస్తే, ఆంధ్రభూమి పెద్ద కథలో పోటీలో నాకు ప్రథమ బహుమతొచ్చింది. ఇప్పటికీ మా గురువు గారు యండమూరి వీరేంద్రనాథ్ గారు “ఆ వేపచెట్టు కథకి సాహిత్య పురస్కారం రావలసింది… అంత మంచి కథ” అని చెప్తూ వుంటారు. మేం ఓ సారి కలిసి అల్లు అరవింద్ గారి ఆఫీసుకి వెళ్ళినప్పుడు కూడా “రమణిగారు రాసిన ‘ఆత్మకథ’ అనే కథ చదివారా? చాలా గొప్ప కథ” అని చెప్పారు. అరవింద్ గారికి పుస్తకాలు చదవడం మీద అంత శ్రద్ధ లేదు. వ్యాపారం ఒక్కటే ఆయనకి నిరంతరం మనసులో వుంటుంది! సాహిత్యం చదవాలనీ, తెలుసుకోవాలనీ ఆశ వున్నా, టైం అనుకూలించదు అనే మాట అంటూంటారు. నాకు తెలిసి సాహిత్య ప్రియులకి పీ.వీ. నరసింహారావు గారూ, బిల్ గేట్స్‌లా టైం అనుకూలించకపోవడం వుండదు! అంత చదివేరు వాళ్ళు. బిల్‍ గేట్స్ రికమెండ్ చేసిన పుస్తకాలు కొన్ని నిన్ననే మా అబ్బాయి అమెజాన్‍లో తెప్పించాడు!

సో… అలా ఆ ఆర్.టి.సి.లో వుద్యోగం, తత్ఫలితంగా ఒక ఇల్లూ అమరాయి అమ్మకి. ఆ ఇల్లు బంధువులకీ, శుభకార్యాలకీ, అయినవాళ్ళని ఆదుకోవడానికీ, కష్టనష్టాల్లో పనికి వచ్చింది కానీ, ఆ ఇంటివల్ల నా చిన్నతనంలో కొన్ని కష్టాలు కూడా పడ్డాం! రిసాలా గెడ్ద అనే ముస్లిం ఏరియాకి దిగువన వుండేది ఈ ఇల్లు. ముస్లింలది మైనారిటీ అంటారూ కానీ, ఆ కొన్ని ఇళ్ళవాళ్ళవీ డామినేషన్ ఎక్కువగా వుండేది!

డ్రైనేజ్ ఫెసిలిటీ లేకుండా వాళ్ళు కట్టుకున్న ఇళ్ళ వల్ల, ఆ డ్రైనేజీ వాటర్ మా ఇళ్ళ ముందర నుండి మురికి కాలవగా పారేది! ఆ పిల్లలు మా ఇళ్ళల్లో వున్న పండ్ల చెట్ల మీద కెక్కి యథేచ్ఛగా కోసుకు తినడమే కాకుండా, రాళ్ళు విసిరి మా అమ్మమ్మ లాంటి వాళ్ళని వెక్కిరించేవారు. ఒక్క పిల్లాడిని అదిలించినా, వేట కొడవళ్ళు లాంటివి తీసుకుని మొత్తం రిసాల గెడ్డ అంతా తరలివచ్చేవారు! మా కాలనీలో కూడా ముస్లిం డ్రైవర్లూ, కండక్టర్లూ వున్నా సామరస్యంగా వుండేవారు మా పట్ల!

మాకైతే అంతా ముస్లిం క్లాస్‌మేట్సే. బదర్ సుల్తానా, షాహీన్ బానూ, రయిజా బేగం, సందానీ, జాఫర్, రెహమాన్… వీళ్ళతోనే ఎక్కువ ఆడేదాన్ని. కానీ యుక్త వయసుకొస్తుంటే  ఈ రిసాలా గెడ్డ పిల్లలతో కొంచెం ఇబ్బందిగానే వుండేది.మా కాలనీలో జరిపే ఆర్.ఎస్.ఎస్ శాఖకు మా అన్నయ్యలు  ఖాకీ లాగూ, తెల్ల చొక్కా వేసుకుని, టోపీలు పెట్టుకుని, దండా అనే కర్ర తీసుకుని మా ఇళ్ళ వెనుక మైదానంలో జరిగే శాఖకి వెళ్ళేవారు!

ఓసారి ఇలాగే గెడ్ద మీద ముస్లింలకీ, శాఖ నడిపే ఆర్.ఎస్.ఎస్. సంఘ్ సేవక్‍లకీ ఎందుకో గొడవ అయింది. నేను చిన్న పిల్లని. సుగుణమిత్ర అనే ఆయన్ని వాళ్ళు చితక్కొట్టారు. వాళ్ళ అమ్మాయి వనజ నా ఫ్రెండ్. పట్టపగలు నడి వీధిలో కొట్టినా, ఎవరూ పోలీసులొచ్చి “ఎవరు కొట్టారు? ఎవరైనా చూసారా?” అంటే సాక్ష్యం చెప్పలేదు. అందులో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ కూడా వున్నారు. ముగ్గురు అన్నదమ్ములు. ఒకే ఒక పెద్దాయన, చూడ్డానికి ఒంటి వూపిరి బక్క పలచగా వున్న ఆయనెళ్ళి సాక్ష్యం చెప్పొచ్చారు, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి, రిటన్‌గా రాసి. అంతా ముక్కు మీద వేలేసుకున్నారు ఆయన ధైర్యానికి! ఆయనే బలభద్రపాత్రుని వెంకట చలపతిరావు గారు, తర్వాత మా మావగారయ్యారు. ఆ కొట్టిన వాళ్ళు, ఈయన భయానికి అమెరికా పారిపోయారట చర్చ్ సాయంతో. మా పెద్దబ్బాయి పెళ్ళయ్యాక ఓసారి ఇండియా వచ్చినప్పుడు మా వారిని కలిసి “మీ నాన్న సాక్ష్యం చెప్పి, మమ్మల్ని భయపెట్ట పట్టి, అమెరికా వెళ్ళి లైఫ్ సెటిల్ చేసుకున్నాం రా… అనవసరంగా అప్పట్లో రిసాలా గెడ్డ వాళ్ళ సోపతి పట్టి అట్ల పాడయినాం” అన్నాడుట.

అలా అని రిసాలా గెడ్డ మీద అందరూ గొడవ చేసేవాళ్ళే కాదు, మాతో మిత్రత్వం చేసేవాళ్ళూ కూడా ఉండేవారు. అమ్మమ్మ బకేర్ భాయ్ అనే అతన్ని తమ్ముడూ అని పిలిచి ఎవరైనా ఇబ్బంది పెడితే అతనికి చెప్తుండేది. అతను వాళ్ళని మందలించేవాడు. అమ్మమ్మని అక్కా అని పిలిచేవాడు. బకేర్ భాయ్ రిసాలా గెడ్డ మీద లీడర్. ఆ తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్ళాడు.

మా ఆయనకి ఓ పెన్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడుట డాడీ, అబడీ, కబడీ అనే వాళ్ళల్లో చివరివాడు! మా మావగారు పోయారని తెలిసి చాలా బాధపడి కృతజ్ఞతలు కూడా చెప్పమన్నారట వాళ్ళ తల్లిదండ్రులు. జీవితంలో ఇలాంటివి చాలా తమాషాలు జరుగుతుంటాయి… ఇవి ఏవీ నేను కల్పించినవి కాదు!

ఇలా ఆ ఆర్.టి.సి. కాలనీలో ఆర్.టి.సి. స్కూల్లో, ఆ తర్వాత ఎమ్.బి.హెచ్.ఎస్ అనే మిషనరీ స్కూల్లో చదివి పెద్దయ్యాము. ఆ కాలనీలోనే మాది పదకొండవ నెంబరు ఇల్లు అయితే, మా ఆయనా వాళ్ళది 139వ నెంబరు ఇల్లు. నాకన్నా ఎనిమిదేళ్ళు పెద్దయిన మా అన్నయ్య క్లాస్‌మేట్, ప్రభాకర్ నా భర్త అవుతాడనీ, అదే కాలనీలో ఒక పక్క పెరిగి పెద్దవుతున్నాడనీ ఎప్పుడూ అనుకోలేదు! అనుకోనివి చాలా జరుగుతూ వచ్చాయి నా జీవితంలో.

ఏ గీతా తిన్నగా వుంటే నాకు ఇష్టం వుండదు. కాస్త అల్లిబిల్లిగా తీగలా వంకర్లు సాగుతూ వుంటే ఇష్టం… నా జీవన రేఖలులాగా!

సెడోనా నుండి వచ్చాకా, నేను తెచ్చిన చీర పెట్టి సింధుకి, అదిచ్చిన హేండ్ ‍బేగ్ గిఫ్ట్‌గా తీసుకుని, మా తమ్ముడికి కూడా ఒహోయోలో పని పడ్తే ఇద్దరం ఒకే కేబ్‌లో ఎయిర్‌పోర్ట్‌ కొచ్చి, అక్కడో కెపేచినో కాఫీ తాగి, “ఈ ఎదవలకి కాఫీ చెయ్యడం రాదక్కా మనలా… ఈ కుంకుడు రసానికి వీళ్ళు కాఫీ అని పేరెట్టుకున్నారు” అని మా తమ్ముడు బాధ పడ్డాకా, నవ్వుకుని ఎవరి ఫ్లయిట్స్ వాళ్ళం ఎక్కాం.

నేను ఓక్‌లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగేసరికి కిరణ్ ప్రభగారు రెడీగా వున్నారు ఇంటికి తీసుకెళ్ళడానికి. కాంతి గారు లంచ్ సిద్ధం చేసి వున్నారు. “ఏం చేసొచ్చారు ఫీనిక్స్‌లో?” అంటే, “ఆగండి ఈ నెల కాలం అదే రాస్తాను” అని, పైన గదులకి వెళ్ళే మేడ మెట్ల మీద కూర్చుని కాలం రాసేసాను.

జ్యోతిర్మయీ కొత్తా, అసలు అట్లాంటా నుండి నన్నూ, కాంతీ, కిరణ్ ప్రభ్ గార్లని తమ వూరు చార్లెట్‍కి తీసుకెళ్ళాలని చాలా అనుకుంది. కానీ పడలేదు. ఆ తరువాత ట్రిప్‌లో అనుకోకుండా తన దగ్గర ఎనిమిది రోజులు వుండాల్సొచ్చింది. అదో పెద్ద కథ… అదీ చెప్తాగానీ, తను అడిగేది “ఇలా మాతో మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తునే కాలం దాటని కబుర్లు ఎలా రాసేస్తారు? చేతికీ, మెదడుకీ లంకె ఎలా కుదుర్తుందీ?” అని! రైల్వే ఫ్లాట్‌ఫారమ్ మీద కూర్చుని కూడా ఏకాగ్రతతో డైలాగ్స్ రాయగలను నేను… గొప్ప కాదు అభ్యాసం… అంతే! తరువాతి రోజు విజయ అసూరి, తన రేడియో స్టేషన్‌లో ‘విరిజల్లు’ కార్యక్రమానికి అతిథిగా పిలిచి కిరణ్ ప్రభ గారినే ఇంటర్వ్యూ చెయ్యమంది. అక్కడికి మేం వెళ్తూ మేం మొదటగా ఒద్దిరాజు చందర్ అనే కిరణ్ ప్రభ గారి అభిమాని పిలిస్తే, వాళ్ళ అబ్బాయి బారసాల అటెండ్ అయ్యాం.

(సశేషం)

Exit mobile version