Site icon Sanchika

జీవన రమణీయం-115

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]”ఎ[/dropcap]మ్.రావు ముసలాడు… తండ్రిలా చూస్తే ఓ.కే. లేకపోతే నువ్వు చాలా తప్పు చేస్తున్నట్లు. నువ్వంటే నాకు చాలా జాలి… అందుకే చెప్తున్నాను. నీకున్నంత డబ్బు నేను జన్మలో కళ్ళ చూడకపోవచ్చు… కానీ నేను స్వేచ్ఛగా వున్నాను. అతను నీ రెక్కలు కత్తిరించి, నిన్ను తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఎవరైనా ఆఫీసు కొస్తే నిన్ను కళ్ళతో అదిలించి, అక్కడి నుండి పంపించేస్తున్నాడు. గమనించాను. వ్యాపారంలో బిజీగా వున్న నీ భర్త నిన్ను సరిగ్గా పట్టించుకోకపోయినా, నీ మీద ప్రేమతో నువ్వు అడిగినంత డబ్బు ఇస్తున్నాడు. నువ్వు చెత్త సినిమాలకీ, ఈ ఎమ్.రావు సరదా తీర్చుకోడానికి పెట్టుబడి పెడ్తుంటే వూరుకుంటున్నావు. నీకు రూపాయి లాభం లేని పనులే చేయిస్తున్నాడు. వాడికున్న తెలివికి గూగుల్ లాంటి కంపెనీ కాదు, కట్టెల అడితీ నడపలేడు! ముగ్గురు ఆడపిల్లలూ వయసుకొచ్చారు… నువ్వు ఇలా ఇతనే లోకంగా తిరుగుతుంటే, నిన్ను చూసి వాళ్ళూ నీలా తయారవుతారు! నేను కటువుగా మాట్లాడినా, నీ మంచి కోరి చెప్తున్నాను” అని పెట్టేసాను.

వింధ్య ఏమీ మాట్లాడలేదూ, అతన్ని వెనకేసుకురాలేదూ, అప్పటికే అతని రంగు కొద్దిగా తెలుస్తున్నట్లు వుంది. చిన్న చిన్న సినిమా నటుల దగ్గరకి తీసుకువెళ్ళడం, ఎలాగో అలా రాజశేఖర్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళీ “ఈమెని పాలిటిక్స్ లోకి తీసుకురావాలనుకుంటున్నాను” అని దండేయించడం ఆయనకి, చేసి వింధ్యని పడేసాడు. ఈ బిస్కట్ల ఎరకి, అస్సలు లోకం తెలీని ఆడవాళ్ళు పడిపోతారు! నెమ్మదిగా, కాస్త పల్లెటూరి మనిషిలా వున్న ఆ భర్తకి వీళ్ళ సంబంధం విషయం తెలిసినా, ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలి, ఇంట్లో నుండి వెళ్ళిపోతే పరువు పోతుందేమో అని, ఆమె ఆడినట్టు ఆడనిచ్చాడు!

రెండేళ్ళ తర్వాత వింధ్య ఓ రోజు మెసేజ్ పెట్టింది మళ్ళీ “ప్లీజ్ నా కాల్ తియ్యక్కా” అని.

తీసాను. “అక్కా… నన్ను అన్ని విధాలా అన్యాయం చేసాడు ఈ ఎమ్.రావు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే, ‘మా ఆవిడ వుంది… తర్వాత మాట్లాడ్తా’ అని పెట్టేస్తున్నాడు. ఒకప్పుడు ‘గంట సేపు నువ్వు మాట్లాడకపోతే నేను ఆక్సీజన్ కరువై అల్లాడి ప్రాణాలు పోగొట్టుకుంటా… నేను బ్రతకడానికి ఆక్సీజన్ నువ్వు’ అనేవాడు” అంది.

“ఇంకా అతన్ని వదిలి పెట్టెయ్యలేదా?” చిరాగ్గా అడిగాను.

“మా రెండోది ఇంట్లోంచి ఓ రెండో పెళ్ళివాడితో వెళ్ళిపోయింది. తర్వాత వాడి మొదటి భార్యా, వాడూ డబ్బు తెమ్మని వేధించి కొడ్తుంటే, నాకు ఫోన్ చేసి ఏడ్చింది… అప్పటికే మొదటి అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నా భర్త డబ్బు అంతా పోగొట్టానని నాతో మాట్లాడ్డం లేదు. తాగుతూ, నేను కనిపిస్తే, ‘దరిద్రపుదానా, నాకు కనిపించకు’ అంటాడు.

ఎమ్.రావు తనకి తెలిసిన గూండాలతో నా రెండో కూతుర్ని లేపుకుపోయినవాడిని బెదిరించి, వాడి మొహాన కొంత డబ్బు కొట్టి, ఆ పెళ్ళి రద్దు చేయించి, తీసుకొచ్చాడు! దానికి గాను నా ఒంటి మీదున్న బంగారం అంతా కరిగిపోయింది. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని, పోర్టల్ తీసేసాకా టీవీ సీరియల్ మొదలుపెట్టించాడు… వున్న ఇల్లు కూడా పోయింది. నా భర్త నన్ను వదిలిపెట్టేసి ఎటో వెళ్ళిపోయాడు… రెండు సార్లు విషం మింగీ, పై నుండీ దూకీ ఆత్మహత్యా ప్రయత్నం చేసీ, పాపాత్మురాలిని కాబట్టి బతికి బయట పడ్డాను. నేనెందుకు బతకాలి అక్కా? ఆఖరుది ఈ ఏడు ఇంజనీరింగ్ పాసయి అమెరికా వెళ్తానంటోంది. బ్యాంక్‍లో చిల్లి గవ్వ లేదు! తండ్రి పట్టించుకోడు, బంధువులు నన్ను వెలివేసారు… అత్తమామలు తమ కొడుకు తాగుబోతు అవడానికి నేనే కారణం అని నిందిస్తున్నారు!… ఒక్కసారి నిన్ను కలుసుకోవాలి అక్కా…” అంది.

“అమెరికా వెళ్తున్నాను… వచ్చాక కలుద్దాం” అని ఫోన్ పెట్టేసాను.

నాకు రెండు రోజులు వింధ్య మొహమే కళ్ళల్లో ఆడింది. వాళ్ళది తెలంగాణ ప్రాంతంలో ఓ జమీందారీ కుటుంబంట… ఎంతో వున్న వాళ్ళు. ‘అందంగా వుంది, కాస్త డిగ్రీ దాకా చదివింది’ అని వింధ్యని ఏరి కోరి పెళ్ళి చేసుకున్నాడు ఆమె భర్త. తోటికోడళ్ళు ఎప్పుడూ పూజలూ, పునస్కారాలూ, వంటలూ, వడ్డింపులతో బతికేస్తున్నారని, హైదరాబాద్‍లో కాపురం పెట్టించింది. జూబ్లీహిల్స్‌లో వుండే పిచ్చితో, అక్కడ ఫ్లాట్ కొనిపించింది. అటూ ఇటూ సినిమా వాళ్ళు వుండడంతో సినిమా పిచ్చి పట్టుకుంది. డబ్బు వుండీ, గుర్తింపు కోసం ఎదురు చుస్తున్న ఈ మాదిరి గృహిణులు ఎమ్.రావు లాంటి వాళ్ళకి ‘ఈజీ ప్రే’లు! ఈమెకి కొత్త వాళ్ళతో మాట్లాడడం రాదు, పుస్తకాలు చదవడం, మనుషులని అర్థం చేసుకోవడం లాంటి తెలివితేటలు లేవు! అస్సలు లోకం తెలీదు… అంత కన్నా ఏం కావాలి ఎమ్.రావుకి? ఈమె భర్త లేనప్పుడు ఇంటికి వెళ్ళి పరిచయం వృద్ధి చేసుకుని, తనకి తెలిసిన చోటా మోటా నటుల దగ్గరకి తీసుకెళ్ళి ఫొటోలు తీయించి, నా లాంటి వాళ్ళని కలిపించి, “చూశావా ఎంత ధైర్యంగా అక్కినేని నాగేశ్వరరావూ, రామానాయుడూ, అల్లు అరవింద్‍లతో మాట్లాడ్తుందో… నిన్నూ అలా ట్రయిన్ అప్ చేస్తా! పాలిటిక్స్‌లో కొస్తే ‘నన్నపనేని’ లాగో, ‘రోజా’ లాగో అయిపోతావు. మీ బంధు బలగం, నీ స్నేహితులూ ఆశ్చర్యపోతారు…” అని తన దారికి తెచ్చుకుని, బలహీన పరిచి, తన వశం చేసుకున్నాడు. నేను హెచ్చరించే నాటికే ఆస్తి చాలా వరకూ హారతి కర్పూరం చేయించేసాడు. ఆడపిల్లలు మానసికంగా, మగపిల్లల కన్నా త్వరగా ఎదుగుతారు… తల్లిని చూసి కుమిలిపోయి, ఎదిరించి, పోట్లాడి, వాదించి, “పోయిన డబ్బు మళ్ళీ సంపాదించాలంటే ఎమ్.రావు మాట వినాల్సిందే” అన్న ఆమె వాదనకి ఎదురు చెప్పలేక, ఆ ఇంటి నుంచి బయటపడడానికి దారులు వెతుక్కుంటే, అన్నీ పెడదారులే దొరికాయి పాపం! తల్లిలాగే అందమైన పిల్లలు. ఒక్క పెద్దమ్మాయి మాత్రం పెళ్ళి చేసుకున్నట్లుంది.

వింధ్య రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసీ, బతికిందంటే, ఇంక చచ్చిపోదనే నేను అనుకున్నాను. ఆమె భర్త ఆమెతో కలిసి వుండడం ఇంక జరగని పని! ఆ నిర్ణయం తీసుకునే ముందు అతను ఆమెని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేసి వుంటాడు. ఏ విధంగానూ ఆమెని కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ప్రయోజనం లభిస్తుందని నేను అనుకోలేదు! అందుకే అమెరికా నుండొచ్చాకా కూడా కలవలేదు…

ఎమ్.రావు నాకు రకరకాల నెంబర్ల నుండి ఫోన్ చేసి, “ఏదైనా తప్పు చేస్తే చెప్పు… ఇలా నెంబర్ బ్లాక్ చెయ్యడం ఏమిటీ?” అన్నాడు.

“నువ్వు చేసిన తప్పు ఓ నిండు కుటుంబాన్ని నాశనం చెయ్యడం… నీలాంటి వాడు నాకు తెలుసు అని కూడా చెప్పుకోను!” అన్నాను.

“అదెలాంటిదో తెలుసా నీకు అసలు?” అని ఏదో చెప్పబోతుంటే కట్ చేసాను.

ఈ మొత్తం కథలో ఎమ్.రావు తెలివైనవాడు కాదు కానీ, వింధ్య వెర్రిబాగుల్ది అని చెప్పగలను. ఆడపిల్లలు ‘అందమైనదానివీ, తెలివైనదానివీ’ అన్న మాటలకి ఎందుకు పడిపోతారో నాకు అర్థం కాదు! ఇప్పుడు వింధ్యా, ఆమె పిల్లలూ ఏ స్థితిలో వున్నారో తెలుసుకోవాలని కూడా లేదు… నా కళ్ళ ముందే ఒక్కొక్క మెట్టే దిగుతూ వింధ్య అధఃపాతాళంలోకి దిగిపోయింది! అది ఉద్యానవనం అనుకుంది… ఊబి! పూర్తిగా మునిగిపోయింది.

(సశేషం)

Exit mobile version