[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
అలా మొదటిసారి నేను శరత్ మరార్ పేరు విన్నారు. ఆయన తండ్రి మరార్ గారు మన దూరదర్శన్‌కి డైరక్టర్‌గా చేసారు. ఈ శరత్ మరార్ గారు తర్వాత మాటీ.వీ.కి సి.ఇ.ఓ.గా వున్నప్పుడు నేను క్రియేటివ్ కన్సల్టెంట్‍గా వర్క్ చేయడం; తర్వాత ఆయన పవన్ కళ్యాన్ సినిమాలకు ప్రొడ్యూసర్‍గా మారి ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘గోపాల గోపాల’ తియ్యడం; మళ్ళీ బయటకొచ్చి నార్త్ స్టార్ అని ప్రొడక్షన్ హౌస్ పెట్టాకా, నేనెళ్ళి ఒక కథ సినిమాకి అమ్మి, పెద్ద మొత్తం అడ్వాన్స్ తీసుకోవడమే కాకుండా, చాలా ఆత్మీయుడైన వ్యక్తిగా కూడా ఆయన నాకు మారతారు అని ఆనాడు వూహించలేదు! అరవింద్ గారు ఎవరి గురించైనా, చాలా సంశయిస్తూ, తానే మాట్లాడటానికి మొహమాట పడ్తున్నట్లు చెప్తారు! నేనూ అలాగే అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది, శరత్ గారికి అరవింద్ గారంటే ఎనలేని గురు భక్తి! ఈయన ఎంత చెప్తే అంత!
అరవింద్ గారు ఏదైనా మాటిచ్చాకా, ఆయనకున్న రకరకాల వ్యాపార వ్యవహారాలలో పడి, నాకు చెప్పిన విషయం మర్చిపోతారు. ఆ సందర్భాలలో నేను ‘స్వాతిముత్యం’లో కమల్ హాసల్ లాగా ఆయన వెంటపడి ఆ పని చేయిస్తుంటాను. ఈ సుజాత విషయం కూడా నేను ఆయనకి రోజూ “చిరంజీవిగారితో చెప్పారా?” అని మెసేజ్ పెట్టడం, ఫోన్ చెయ్యడం చేస్తుండేదాన్ని. పాపం… ఆయన పి.ఏ. శశిరేఖ కూడా నా ఫోన్స్‌కి బలి అయ్యేదనుకుంట! ఆయన మాత్రం నన్ను విసుక్కునేవారు కారు కానీ, అసలు ‘ఏ విషయం?’ అని మర్చిపోయినట్టు మొదట నుండీ మళ్ళీ చెప్పించుకునేవారు! సరే… మొత్తానికి ఆ సుజాతని తీసుకెళ్ళి ఈయనకి పరిచయం చేసాను. అప్పట్లో మా ఇంట్లో పై వాటా కట్టి గృహప్రవేశం పెట్టుకున్నాం. నేనూ, మా ఆయనా ఇంటికి వెళ్ళి అరవింద్ గారినీ, ఆయన భార్యనీ ఆహ్వానించాము. నిర్మల గారు “తప్పకుండా వస్తాం” అని అతిథి మర్యాదలు చేసారు. అప్పుడు అరవింద్ గారు ఇంట్లో లేరు, మేం వస్తాం, రిసీవ్ చేసుకోమని ఆవిడకి చెప్పి వెళ్ళారుట.
ఈ సుజాత తీరా మా గృహప్రవేశం రోజే ఆ ‘రేడియో మిర్చీ’ లాంచింగ్ పెట్టింది. అరవింద్ గారు రాకుండా చిరంజీవిగారు వెళ్ళనన్నారట. దాంతో, ఈ విషయం వినగానే, “మా ఇంటికి రాకుండా ఆ లాంచింగ్‌కి వెళ్తారా? అది ముఖ్యమా మీకు?” అని నేను అరవింద్ గారి మీద అలిగాను. ఎందుకంటే అప్పుడు ‘బాస్’ సినిమాకి పని చేస్తున్నాను. సుజాతని నాగార్జున గారికి కూడా పరిచయం చేసాను. ఎంతో ఫేవర్ చేసాను ఆ అమ్మాయికి. మా గృహప్రవేశానికి అక్కినేని నాగేశ్వరరావుగారూ, ‘బాస్’ ప్రొడ్యూసర్ శివప్రసాద్ రెడ్డి గారూ, పరుచూరి బ్రదర్స్, వి.ఎన్.ఆదిత్యా, ఇంకా శివనాగేశ్వరరావు, ఉత్తేజ్, సమీర్, అస్మితా, సుమిత్రా పంపనా, ఢిల్లీ రాజేశ్వరీ, పొత్తూరి విజయలక్ష్మీ అందరూ వచ్చారు. అరవింద్ గారు రాకపోతే నాకెంత బాధగా వుంటుందీ? ఆయన నవ్వి “నేను ఎలాగొలా మేనేజ్ చేసి వస్తాగా” అన్నారు. అలాగే నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడే సతీ సమీతంగా నిండుగా వచ్చి, మొత్తం ఫంక్షన్ అయ్యేదాక వుండి, భోజనం చేసి నన్ను ఆనందపరిచారు. మా సైనిక్‌పురిలో ఉన్న ఇంటికి, మా మేనకోడలి భర్త, దారి పొడుగునా సెక్యూరిటీ గార్డ్‌లని పెట్టి, ప్లై కార్డ్స్ తో ఎడ్రస్ డిస్‌ప్లే చేసే ఏర్పాటు చేసాడు. నాగేశ్వరరావు గారిని తీసుకురమ్మని మా అసిస్టెంట్ డైరక్టర్ రవికాంత్‍ని పంపించాను. ఆయన “రమణి ఎంత బాగా ఏర్పాటు చేసింది” అని నన్ను తెగ మెచ్చుకున్నారట! అసలు నేను “మా గృహప్రవేశం, మీరు రావాలి” అంటే, “జిలేబీ చేయించు… నాకిష్టం” అన్నారు. జిలేబీలూ, ఆవడలూ, ఆ రోజు నేను వడ్డిస్తే తిన్నారు. మా కేటరింగ్ నాగేశ్వరరావు గారు (మూర్తీ కేటరర్స్) కూడా చాలా సంతోషించారు ఆ రోజు.
అలాగే అరవింద్ గారు వాళ్ళావిడతో, “నీకు పానీపూరీ ఇష్టం కదా… తిను” అని తినిపించడం మా ఇంట్లో, నేను మరువలేని విషయాలు.
ఆ సుజాత తన అవసరం తీరిపోయాకా మళ్ళీ ఎప్పుడూ నాతో మాట్లాడలేదు! నేను ఆ మధ్యలో వుచితంగా ‘రేడియో మిర్చీ’ జాకీల ఆడిషన్స్‌కి కూడా జడ్జ్‌గా వెళ్ళాను. చాలా జ్యూరీలకి, జడ్జిగా వెళ్తుంటాను. అందులో ఇది ఒకటి! ఆ ఆడిషన్స్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు ప్రముఖ ఏంకర్స్. ఆ తర్వాత రేడియో సిటీ, ఇంకా కొన్ని స్టేషన్స్ మొదలయి, కార్ ఎక్కితే రేడియో వినాల్సొచ్చేట్టు తయారయ్యాము… ఎందుకంటే రేడియో పెట్టద్దు అంటే డ్రైవర్ వినడు! అ జాకీల వాగుడు కొన్నిసార్లు అతిగా, విసుగ్గా వుంటుంది. కాని కొంతమందివి వినసొంపుగా వుంటాయి. అదీ సుజాతా, రేడియో మిర్చీ ప్రహసనం!
ఈ వారం, ఈ కాలం రాస్తుండగా శ్రీ రావి కొండలరావు గారు పోయారన్న వార్త విన్నాను. ఆయన్ని మొదటిసారి వి.ఎన్.ఆదిత్య ఇంట్లో రాధాకుమారి గారితో కలిసి వస్తే చూసాను. ఆ తర్వాత మా ‘మధుమాసం’లో ఏక్ట్ చేసారు. నేనంటే చాలా అభిమానంగా వుండేవారు. నాకు ఆప్తులు, గురుతుల్యులు. వారి శ్రీమతి రాధాకుమారి గారు స్వర్గస్తులు అయినప్పుడు, మా వంగూరి చిట్టెన్‌రాజుగారి ఆహ్వానం మీద కొండలరావు గారు, యూ.ఎస్. ప్రయాణం అయి వెళ్తున్నారు. ఆయనకీ విషయం తెలీదు! వి.ఎన్.ఆదిత్య నాకు ఫోన్ చేసి, “ఆయనకి ఈ విషయం కనీసం దుబాయ్‌లోనైనా తెలిస్తే, పాపం అక్కడి నుండి వెనకొచ్చేస్తారండీ… చిట్టెన్‌రాజు గారిని కాంటాక్ట్ చేస్తే చెప్పించండి” అన్నాడు. ఆ విధంగా ఆ దుర్వార్త నేను నా నోటి ద్వారా చిట్టెన్‌రాజు గారికి చెప్పి, కొండలరావు గారికి దుబాయ్‌లో చెప్పిస్తే, ఆయన అక్కడి నుండి వెనక్కొచ్చేసారు!
మొన్నీ మధ్యే నేను కల్చరల్ ఛైర్‌పర్సన్‌గా వున్న తెలుగు సినీ రచయితల సంఘం, సిల్వర్ జుబ్లీ సెలెబ్రేషన్స్‌లో రావి కొండలరావు గారికి లైఫ్ టైం ఎఛీవ్‍మెంట్ అవార్డు ఇచ్చాము. చాలా ఘనంగా, చిరంజీవి గారు పాద నమస్కారం చేసి మరీ అవార్డ్ ప్రదానం చేశారు. పెద్దలు ఆదివిష్ణుగారికీ, ఈయనకీ, భువనచంద్రగారికీ కూడా లైఫ్ టైం ఎఛీవ్‌మెంట్ ఇచ్చాం! ఆ సందర్భంగా “ఏదో ఇచ్చాం అంటే ఇచ్చాం కాదు. శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు కల్చరల్ ఛైర్‌పర్సన్‌గా మొన్నా, నిన్నా, ఇవాళ పొద్దున్నా నాకు ఫోన్ చేసి గుర్తు చేసారు! పరుచూరి గోపాలకృష్ణ గారు ప్రెసిడెంట్ అయి వుండీ, రోజూ ఫోన్ చేసారు… ఇంతకన్నా గౌరవం, ఘన సన్మానం ఏం వుంటుంది నాకు?” అని ఆనందపడ్డారు తన ప్రసంగంలో.
లైఫ్ టైం ఎఛీవ్‍మెంట్స్ ఫంక్షన్‍కి సింగితం శ్రీనివాసరావు గారు, కె. విశ్వనాథ్ గారు ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోయారు… ఆదివిష్ణు గారికి, రావి కొండలరావుకి గారికి, భువనచంద్రగారికి, కోదండరామిరెడ్డి గారికి కూడా మెగాస్టార్ చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారం ఇచ్చాం… అది నా ఆధ్వర్యంలో జరగడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.