[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap style=”circle”]అ[/dropcap]టువంటి అమ్మమ్మ తాతయ్యలు వుండడం మా అదృష్టం! చెప్పుకుందుకూ రాసుకుందుకూ చరిత్ర మిగిలింది! ఆయన ఎప్పుడూ దేశం మనిషే… కుటుంబానికి కాదు!
కుటుంబానికి వటవృక్షంలా నీడనిచ్చి ఆదుకున్నది ఆదిశక్తి అమ్మమ్మ.
అటువంటి అమ్మమ్మ తన కవాడిగుడా ఇల్లు అమ్మేసాకా, తన డబ్బు మూడు భాగాలు చేసి, ముగ్గురు కూతుళ్ళకీ పంచేశాకా, మేం ఇల్లు కట్టుకోవాలని యోచనలో వున్నప్పుడు మా దగ్గర కొచ్చేసింది.
మా బావగారి స్నేహితుడు “కాకతీయ నగర్ అని నేరేడ్‌మెట్ దగ్గర లోపలకుంటుంది, కొత్త కాలనీ. మా మేనల్లుడు నాగేశ్వరరావు ఇల్లు కట్టుకున్నాడు… పక్క ప్లాట్ ఖాళీగా వుందట. మీ తమ్ముడ్ని కొనుక్కోమను” అని మా బావగారితో అన్నారు.
ఓ ఆదివారం మేం మా వెస్పా మీద అతని వెస్పా వెనుక వచ్చి చూసుకున్నాం స్థలం. ఇంకో ఆలోచన లేకుండా నారాయణరావు అనే ఆయనకి ఎడ్వాన్స్ ఇచ్చాం, 300 గజాలకి. 1990లో మేం కనకాద్రి శాస్త్రి గారింటి నుంచి నాగేశ్వరరావు గారి ఇంట్లోకి అద్దెకొచ్చి, పక్క ప్లాట్‌లో శంఖుస్థాపన చేసుకున్నాం.
అమ్మమ్మ తన డబ్బుతో కొన్న స్థలం అని గొప్ప సంతోషంలో వుండేది. కొత్తగా పడ్తున్న కాలనీ. ఓల్టేజ్ లేని మసక దీపాలు. అక్కడో ఇల్లూ, ఇక్కడో ఇల్లూనూ. రోడ్లు లేవు. అంతా బురద. బస్‌స్టాప్‌కి నడిచేటప్పటికి కాళ్ళు పడిపోయేవి.
ఆ సమయంలో మా అన్నయ్య కొత్తపేట దగ్గర ఫ్లాట్ కొని గృహప్రవేశం చేసుకున్నాడు. మా మేనకోడలు సుధతో ఆరేళ్ళ అశ్విన్‌నీ, మూడేళ్ళ కృష్ణకాంత్‌నీ తీసుకుని బస్‌స్టాప్ దాకా నడవలేక, “సుధా! మీ మావయ్య చూడు… నన్ను అడవిలో పడేసారు…” అని భోరున ఏడ్చేసాను!
ఇంకోసారి, మా ఉమ పిల్లలు మా అశ్విన్ డీ.ఎ.వీ.లోనే చేరారు. వాళ్ళ స్కూల్‌కి నేనూ, ఉమా వెళ్ళి వస్తూ తప్పిపోయాం. కనిపించిన అందరినీ, “మా ఇల్లు ఆ పోలీస్‍స్టేషన్ దాటాకా, ఓ రావి చెట్టు వస్తుందీ, అక్కడ ఓ త్రిశూలం బొమ్మ వస్తుందీ… మీకు తెలుసా?” అని అడిగితే, “మీ ఇల్లు మీకే తెలియదా?” అని నవ్వారు. చివరికి ఇద్దరం వున్నాం కాబట్టి వెతుక్కుని నవ్వుకుంటూ ఇల్లు చేరాం.
అచ్చు పల్లెటూరిలా సాయంత్రం అయితే దీపాలు వుండవని, ఐదింటికే వంట చేసుకుని ఆరింటికల్లా పిల్లలకి పెట్టి, మేం తిని ఎనిమిదింటికి పడుకునేవాళ్ళం. గూట్లో దీపం నోట్లో ముద్దా రోజులు.
అమ్మమ్మ పెరడంతా ఆకుకూరల విత్తనాలు జల్లింది. సొరపాదూ, బీరపాదూ పెట్టింది. నేను తెలీక పొట్లపాదు వేస్తే, “అయ్యో, మనకి అచ్చి రాదే…” అని పీకి పారేసింది. ఆవిడ కడుపుతోటున్నప్పుడు పొట్లపాదు వేస్తే మగపిల్లాడు దక్కలేదని భయం! చుక్కకూర అయితే ఎంత కాసేదో. అందరికీ పంచేదాన్ని!
వెళ్ళిన పూటే, వెనుక రాజమండ్రి వాళ్ళు, ఇంటిల్లిపాదీ బయటే కబుర్లాడుతూ కనిపిస్తే, నేను గడ్డపార కోసం వెళ్ళి పరిచయం చేసుకున్నాను. చింతపెంట వాళ్ళు. ఆయన వోల్టాస్‍లో పని చేస్తాడని వోల్టాస్ కృష్ణారావుగారంటారు. ఇంకో కొసలో వున్నది నండూరి వాళ్ళు. భారతి వచ్చి పరిచయం చేసుకుంది. భారతీ కృష్ణారావుగర్లకి ఇద్దరు ఆడపిల్లలు మల్లికా, గాయత్రీ. వెనుక మగపిల్లాడు చందూ.
నా ఆప్త నేస్తం సుశీలా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారని అంతా చెప్పుకున్నారు. సుశీల అత్తగారు, తెల్ల పంచె నెత్తి మీద ముసుగేసుకుని సాయంత్రాలు భారతి ఇంటికి వచ్చేవారు. సుశీల నాకింకా పరిచయం కాలేదు.
ఎదురుగా మరాఠీవాళ్ళు మట్టితో ఇల్లు కట్టుకుని, పైన సిమెంట్ ప్లాస్టరింగ్ చేసుకుని వుండేవాళ్ళు. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరే వచ్చి ఆ కొత్త కాలనీలో చేరుతుండేవారు!
ఈయన పొద్దుటే పెరేడ్ గ్రౌండ్స్ ఎదురుగా వున్న మహీంద్ర హౌస్‌లో ఉద్యోగానికి వెళ్ళిపోయేవారు. నేనూ అమ్మమ్మా ఇల్లు కడ్తున్న పనివాళ్ళకి మంచినీళ్ళూ, మధ్యాహ్నాలు పచ్చడి బద్దలూ, పప్పు చారూ సప్లై చేస్తూ అరుగు మీదే కాలక్షేపం చేసేవాళ్ళం. అశ్విన్ స్కూల్‌కి గోపాల్ ఆటోలో వెళ్ళేవాడు. క్రిష్ణ ఇంటి దగ్గరుండేవాడు. ఇంకా మాటలు రాలేదు!
భారతీ వాళ్ళ అత్తగారి ఆడపడుచు, వరహాలత్తయ్య, ద్రాక్షారం నుండొచ్చింది. మాటల్లో ఆవిడ ఓసారి తొక్కుడు లడ్డూలు బాగా చేస్తుందని భారతి చెప్పింది. నేను “అయితే మాకు చేసి పెడ్తారా?” అని అడిగాను.
ఆవిడ అదేం మహా భాగ్యం అమ్మా?” అంది. అన్నదే తడవుగా నేను అన్నీ తెప్పించి మర్నాడు తొక్కుడు లడ్డూలు చెయ్యడానికి ఏర్పాటు చేశాను.
ఆ తరువాతి రోజు మా కొత్త ఇంటికి లింటల్స్ పొయ్యాలని సెంటరింగ్ చెక్క కొడ్తున్నారు. ఆ హడావిడిలో మా ఆయన ఆ మేస్త్రీతో బజారుకీ, ఇంటికీ తిరుగుతున్నారు.
వంటింట్లో మేం మహధ్వజాయమానంగా తొక్కుడు లడ్డూలకి జంతికలు చేసి వేయించి, వాటిని రంగు మారకముందే తీసి మిక్సీ వేస్తున్నాం.
బయట మాటలు రాని మా క్రిష్ణ తండ్రి వెంటపడి ‘నేనొస్తా’ అని సైగలు చేశాడు. ఆయన “రమణీ, వీడ్ని చూసుకో…” అని చెప్పి బండి వేసుకుని వెళ్ళిపోయారు.
నాకు ఆయన మాట వినబడలేదు. మిక్సీ చప్పుడులో వున్నాం.
బయట పిల్లాడు చెప్పులు లేని కాళ్ళతో, గ్రీన్ చొక్కా, పొడుగు లాగుతో, చేతిలో ఎర్ర బంతి పట్టుకుని తండ్రి బండి వెళ్ళిన వైపే నడుచుకుంటూ, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు.
మాకేం తెలీదు, ఇంట్లో తొక్కుడు లడ్డూ కట్టేస్తున్నాం.
(సశేషం)