[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]నే[/dropcap]ను నవ్వుకున్నాను… నేను పని చేసిన టెర్మ్‌లో ఎవరూ అందుకు ప్రయత్నించలేదు. ప్రయత్నిస్తారని నా కొలీగ్స్ చెప్పినా, నేను… “ఇది సరదాగా చేస్తున్నాను. ఏ పని చేసినా సిన్సియర్‌గా చేస్తాను. మా తాతగారు సూరంపూడి శ్రీహరిరావుగారు ఫ్రీడం ఫైటర్… ఆయన దేశానికి స్వాతంత్ర్యం తెల్లవారి నుండే కాదు, లంచగొండుల నుండీ, కుటిల రాజకీయ నాయకుల నుండీ కూడా కావాలని, పదవులిచ్చినా తీసుకోక, దేశం కోసం బలి అయ్యారు. నేను ఆయన వారసురాలిని” అని చెప్పాను.
మొన్నటికి మొన్న “ఓ వెబ్ ఛానెల్‌లో మకు ఓ వెబ్ సిరీస్ మీ పలుకుబడిని వుపయోగించి ఇప్పిస్తే, మీ రుణం వుంచుకోము, రెండో మూడో లక్షలిస్తాం…” అని అడిగాడో వ్యక్తి! ఆ వ్యక్తి నా రచనలు మొదలుపెట్టిన రోజు నుండీ నాకు తెలుసు… ఊరూ పేరూ లేకుండా ఇలాగే లంచాలిప్పించి పనులు చేయించుకుంటూ, శుభ్రంగా బతికే వాళ్ళని ప్రలోభపెట్టి లంచగొండులుగా మారుస్తూ, తన పనులు చేసుకుపోతున్నాడు! అందరికీ తెలుసు… కానీ నేను అడిగాను… “మీరు ఇస్తున్న సబ్‌స్టెన్స్‌లో నాణ్యత లేదని మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడే కదా, మీరు ఇలా డబ్బు ఎర చూపుతున్నారూ? నాణ్యత కల సరుకు ఎందుకు అమ్మరూ? ఇది జనం నెత్తిన ఓ ఛానెల్ ఎందుకు రుద్దాలి? అది చూసిన జనం మీకు ఏం ప్రశంసలు ఇస్తారు? ఇదేమైనా నూలు బట్టా, కంది పప్పా తర్వాత నాణ్యత తెలియడానికి? కొనగానే చూసి జనం ‘ఛీ’ కొడ్తారుగా? అసలు ఈ రంగంలో పని చెయ్యడానికి కావల్సిన మంచి కథలూ, ఆ కథలు ఇచ్చే రచయితలకి రెమ్యూనరేషన్లూ, మంచి దర్శకులూ, నటీ నటులూ, ఇతర సాంకేతిక నిపుణలకీ ఖర్చు చేయడానికి మాత్రం ఎందుకు చెయ్యి రాదూ? లంచం ఇచ్చి ఆ ప్రోడక్ట్‌ని తోసేసి, దానికి అవార్డులూ, తద్వారా పేరూ, డబ్బూ సంపాదించాలని చూస్తూ జీవితంలో తెల్ల జుట్టొచ్చేదాకా శ్రమిస్తూనే వున్నారు, ఎందుచేతా?” అంటే దానికి నన్ను ఓ పనికి రాని ప్రాణిని చూసినట్లు చూసాడు ఆ వ్యక్తి!
“మీకు తెలిసినంత పెద్ద పెద్ద వాళ్ళు నాకు తెలిస్తే, ఇంత పలుకుబడి వుంటే మీలా వుండేవాడిని కాదు, ఇంకా సంపాదించేవాడిని… పెట్రోల్ బంకులకి పర్మిషన్లు తీసుకునేవాడిని… హీరోల డేట్లు సంపాదించి పెట్టి, కమీషన్ తీసుకునేవాడిని… మీడియేటర్‌గా వుండి… మీరిప్పుడు చాలా మందికి ప్రాజెక్ట్‌లు కుదిర్చిపెట్టి చేస్తున్న సాయాలకి ‘ఫీజు’ కలెక్ట్ చేసి ‘ఓ స్థాయి’లో వుండేవాడిని” అన్నాడు. అవును… నేను చాలా మందికి సాయం చేసి, ప్రాజెక్ట్‌లు వర్క్ అవుట్ అయ్యేట్లు చేస్తాను… ప్రొడ్యూసర్‌లకి, డైరక్టర్‌లనీ, కొన్నిసార్లు రచయితలనీ కూడా కలిపి, ఆ ప్రాజెక్టు వర్క్ అవుట్ అయ్యేట్లు చేస్తుంటాను! “కనీసం నేను ఏమీ స్వలాభాపేక్ష లేకుండా ఓ మంచి పని చేస్తున్నాను అన్న పేరు బయటకొచ్చింది కదా, అది చాలు!” అన్నాను… ఆ వ్యక్తి వెళ్ళిపోతుంటే “కరోనా మీ తలుపు తట్టకుండా ఎంత ఇస్తారూ?” అన్నాను. అతను కోపం తెచ్చుకోలేదు. “రేపు మీరన్నట్లే అది వస్తే ఓ ఇరవై లక్షల దాకా అయితే నా దగ్గర వున్నాయి.. మీ దగ్గర వున్నాయా?” అన్నాడు. “అవి వున్న వాళ్ళంతా బయటపడ్తారా?” సీరియస్‌గా అడిగాను. అతను నవ్వేసి వెళ్ళిపోయాడు. నిజానికి నిజమైన కమ్యూనిస్ట్ ‘కరోనా’. రాజూ పేదా తేడా లేకుండా షెహన్‌షాకీ, బాహుబలి సృష్టికర్తకీ, గాన గంధర్వుడికీ, బ్రిటన్ రాజ కుమారుడికీ, వలస కూలీలకీ ఎవరికైనా రావచ్చు! ఎవరూ అతీతులు కారు!
మొత్తానికి నేను సిన్సియర్‌గా వుండడం నా డీమెరిట్ అని చాలామంది తేల్చారు! నేను ఓ మాట అంటే చాలామంది మనోభావాలు దెబ్బ తింటాయి కానీ, కొందరి ఇళ్ళల్లో వున్న నంది అవార్డులూ, జాతీయ అవార్డులు కేవలం పైరవీల వల్ల వచ్చినవే! అవి ఎంత పెద్ద స్థాయిలో జరుగుతాయో నాకు తెలుసు! కానీ… డబ్బు కోసం ఏ జ్యూరీ మెంబరూ ఆ పని చెయ్యరు… రాజకీయ ఒత్తిడుల వల్ల కొన్నిసార్లు తల వంచాల్సి వస్తుంది! అవి సంపాదించిన వాళ్ళు స్టేజ్ ఎక్కి సిగ్గు లేకుండా ‘అవార్డు’ని ఎలా అందుకుంటారో. వాళ్ళ మనస్సాక్షి ఎలా అంగీకరిస్తుందో నాకు అర్థం కాదు. వీరి శాతం తక్కువే.. 20% ఇలా వుంటారు. మిగతావారు కాదు!
సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా నేను నాకు గవర్నమెంట్ వారు కవర్‌లో పెట్టి ఇచ్చిన డబ్బు మాత్రమే తీసుకున్నాను. ఏనాడు తప్పు చేసి, నిద్రపట్టని రాత్రులు నా జీవితంలో గడపలేదు!
కట్‌లు పెట్టడం కొన్ని డైలాగ్‌లకీ, కొన్ని దృశ్యాలకీ ఎలా అనివార్యమో… అలాగే తప్పు లేని సంభాషణలకి అర్థాలు వెతికి, ఆ ప్రొడ్యూసర్, డైరక్టర్‌లని “డైలాగ్ మార్చండి..”, అంత ఖర్చు పెట్టి తీసిన “సీన్ మార్చండీ” అని వేధించడం కూడా అంటే తప్పు అని, నేను రీజనల్ ఆఫీసర్‌కి ఎదురు తిరిగి పోరాడిన సందర్భాలు నన్ను ఆవిడకి శత్రువుని చేసాయి.
అందుకు కారణాలు ఆవిడకి తెలుగు పూర్తిగా రాదు. మాతృభాష తెలుగు కాదు. కొన్నిటికి తప్పు అర్థాలు వెతికేది. నాకు నిజంగా అర్థం కాదు, కొన్ని బాధ్యతగల పోస్టుల్లో, ముఖ్యంగా టీవీ, సినిమా, ఇప్పుడు వెబ్ రంగాలలో తెలుగు రాని అధికారులనీ, సి.ఈ.వో.లని ఎందుకు పెడ్తారో, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వాళ్ళకి కళ్ళూ, చెవులూ అయి పక్కన ఎక్కించే వాళ్ళ మాటలనే వింటూంటారు. ఇటీవల ఓ వెబ్ ఛానెల్‌లో నా తెలుగుని ‘గ్రాంథికం’ అని నేను డైలాగ్ చదువుతుంటేనే ఓ అమ్మాయి రిజెక్ట్ చేసింది… ఆ డైలాగ్ ఏవిటంటే, ఇంపోటెంట్ అయిన భర్తతో, ఆ భార్య “నేను మీతో చాలా ఆనందంగా వున్నానండీ… నిజం!” అంటే… అతను అవిటివాడు, చక్రాల కుర్చీలో కూర్చుని “అసంతృప్తికి అరుపెక్కువ! అది నాకు వినబడ్తోంది” అంటాడు…
ఇది నన్ను పొగుడుకోడానికి కాదు… ఆ వెబ్ ఛానెల్‌లో పని చేసే ఓ పిల్ల “ఇది తెలుగు కాదు… బుకిష్ లాంగ్వేజ్… ఈవిడ మన డబ్బింగ్ సిరీస్ రాయడానికి పనికిరాదు” అందని, నా కాంట్రాక్ట్ రద్దు చేసారు… ఆ ఛానెల్‌కి ‘ఫేస్ ఆఫ్ ది ఛానెల్’ నాకు ఆప్త మిత్రుడు. నా వెనుకబడి నావెల్ రైట్స్ అడిగిన సి.ఈ.ఓ. పరభాష వాడు. ఆ అమ్మాయి మాటే ప్రామాణికంగా తీసుకున్నారు! ఆమె ఓ ప్రముఖ తమిళ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్‌గా చేసొచ్చిందట! మన వాళ్ళ పరభాషా వ్యామోహం ఆ లెవెల్‌లో వుంటుంది. వాళ్ళు పరభాష వాళ్ళయితే చాలు… అగ్ర తాంబూలం… ఇచ్చి తల మీద కూర్చోపెట్టుకుంటారు. ఆ ఛానెల్ ఫిక్షన్ హెడ్‌కి కూడా తెలుగు రాదు! ఒక తమిళ వెబ్ ఛానెల్‌లో కాని, హిందీ ఛానెల్‌లో కాని, మరేతర భాష ఛానెల్‌లో కాని భాష రాని వాళ్ళని ఇంత పెద్ద పెద్ద పదవులలో తీసుకుంటారా? మన తెలుగువాళ్ళకేనా తెగులు?