[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]’వె[/dropcap]ల్‌కమ్ ఒబామా’ సినిమా క్రూలో ఇంకో ముఖ్యమైన వ్యక్తి ‘పూర్ణప్రజ్ఞ’గారు. ఈయన సింగీతం గారి స్వంత తమ్ముడి కుమారుడు అయినప్పటికీ కోడైరక్టర్‌గా ఎంతో మెళుకువతో, పెద్దాయన మనసులో ఏముందో ఆయన కళ్ళ ద్వారా గ్రహించి చేసుకుపోతూ వుండేవారు. కళ్యాణి గారు, అంటే సింగీతం గారి శ్రీమతి వచ్చాక, ఆంటీ ద్వారా ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. సింగీతం గారికి ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు పూర్ణప్రజ్ఞ గారి భార్య అంటే వదిన గారితో చాలా క్లోజ్‌గా వుంటారు. ఆయన పెళ్ళయి, భార్య కాపురానికి వచ్చిన నాటి నుండీ, సింగీతం గారి ఫ్యామిలీతోనే కలిసున్నారు. పిల్లలు పుట్టి పెద్దయి పెళ్ళిళ్ళు అయినా పూర్ణప్రజ్ఞ గారు వీళ్ళింట్లోనే వుంటున్నారు. తల్లితో చెప్పని విషయాలు కూడా, సింగీతం గారి పిల్లలు, వదినగారితోనే పంచుకునేవారనీ చిన్నతనంలో – ఆంటీ నవ్వుతూ చెప్పారు. ఒక ఇంట్లో స్వంత పిల్లలతోనే కలిసుండడం అసాధ్యం అయిన న్యూక్లియర్ ఫామిలీస్ రోజుల్లో, ఇంకా పూర్ణప్రజ్ఞ గారు ఇలా సింగీతం గారితో వుంటూ ఆయనని నీడలా కనిపెట్టుకుని వుండడం, ఆయన మంచితనం, ప్రజ్ఞాపాటవాలు. సింగీతం గారి అన్నీ సినిమాలకు పూర్ణప్రజ్ఞ గారు పనిచేసారు. “స్వంత కుమారుడు లేడన్న కొరత మాకు లేనే లేదు, కోడలు కూడా మమ్మల్ని ప్రాణంగా చూసుకుంటుంది” అని ఆంటీ చెప్తారు.
సింగీతం గారికి ఇద్దరు అమ్మాయిలు – సుధా కార్తీక్, శకుంతలా సతీష్. ఒక అమ్మాయి లండన్‌లో వుంటుంది. ఆంటీ షూటింగ్‌లో నాకు పరిచయం అవగానే, మా అమ్మతో ఆవిడకి ఫ్రెండ్‌షిప్ కుదిరిపోయింది. సమవయస్కులూ, రాజమండ్రీ, భీమవరం పక్కవాళ్ళూ కావడం చేత, తెగ కబుర్లు చెప్పుకునేవారు.
కళ్యాణి గారు రాసిన సింగీతం గారి బయోగ్రఫీ ‘శ్రీ కళ్యాణం’ నేను చదివాను. చాలా మంచి రచయిత్రి. ఒకసారి కేన్స్ ఫెస్టివల్‌లో, సింగీతం గారితో “ఒక అర్జెంటీనా సినిమా నాకు బాగా నచ్చింది” అని చెప్పారట. ఆయన “అయితే తెలుగులో తీస్తే ఎలా రాయాలో, రాయి” అన్నారట. ఆవిడ ప్రయత్నించి రాసారట. దానికి ఆయన తన బాణీలో మెరుగులు దిద్దితే ‘సొమ్మొకడిదీ సోకొకడిది’ అయిందట.
ఆంటీ ఇప్పటికీ, అంటే ఆయనకి 89, తనకి 83 ఏళ్ళు వచ్చినా, ఇంటి పనులు, ముఖ్యంగా ఆయనకి దోశలు వెయ్యడం, చపాతీలు చెయ్యడం తనే చేస్తారట. తెలుగుదనానికి రూపంలా వుంటారు ఆంటీ పెద్ద బొట్టుతో, అంచు చీరలతో. ఆవిడతో స్క్రిప్ట్ డిస్కస్ చేసే సింగీతం గారు ఏ సినిమా అయినా చేసేవారుట.
కళ్యాణి గారు ఒక పత్రికకి కరెస్పాండెంట్‌గా కూడా, పెళ్ళి కాక ముందు, పని చేసారట. బాగా పాడుతారట. అసలు పెళ్ళి చూపుల్లోనే “రామ నీ కన్న ఆనందమా” అని పాడారుట.
ఇప్పటికీ ఆంటీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడ్తారు. “మీ అమ్మగారు ఎలా వున్నారు?” అని తప్పక అడుగుతారు.
‘పెళ్ళిచూపులు’ సినిమా రిలీజ్ అయ్యాక, నేను సింగీతం దంపతులని తీసుకుని వెళాను ఐనోక్స్‌లో. అప్పుడే ఆంటీకి ఓ చీర పెట్టి పాదాలకి నమస్కారం పెట్టాను. ఆది దంపతుల లాంటి ఆ పెద్దల ఆశీర్వాదం కావాలనిపించింది! కొన్ని జంటలు జగతికే ఆదర్శదాయకం. మన తెలుగు సినిమా చరిత్రలో సింగీతం గారి అధ్యాయం లేకపోతే పరిపూర్ణత వుండదు!
పింగళి నాగేంద్రరావు గారు ‘మాయాబజార్’ సినిమా అయ్యాక, ఒక టేబుల్, నాలుగు ఛైర్స్ వీరికి ప్రెజెంట్ చేసారట. ఆంటీ “ఆ టేబుల్ మీదే నేను ‘శ్రీ కళ్యాణం’ రాసాను” అని గర్వంగా చెప్తారు.
“సినిమా వాళ్ళకి డిగ్రీ చదివిన పిల్లని ఎలా ఇస్తున్నారు?” అన్నారు ఆ రోజుల్లో, కానీ నేను అప్పుడూ ఇప్పుడూ కూడా సింగీతం గారి భార్యని అని చెప్పుకోడానికి గర్వపడతాను” అంటారు ఆవిడ.
***
షూటింగ్‌కి వెళ్ళాకా మొదట కలిసిన వ్యక్తి భువనచంద్ర గారు. పెద్ద పెద్ద మీసాలతో, చూడగానే మిలట్రీ మనిషి అని తెలిసేట్టు వుండే ఆయనని జీ తెలుగు ‘సారిగమ’లో జడ్జిగా చూసాను. ఆ తర్వాత వంగూరి చిట్టెన్‌రాజు గారు, మా ఇద్దర్నీ సదస్సుకి అమెరికాకి పిలిచినప్పుడు, నేను వెళ్ళలేకపోయాను. లేకపోతే, అప్పుడే మేం కలిసేవాళ్ళం. మా అమ్మకి ఎందుకో ఆయన పెద్ద కొడుకు స్థానంలో సెటిల్ అయిపోయారు. ఆయన మాట అన్నా, పాట అన్నా ఆవిడకి ప్రాణం. నన్ను రమణిగారని కానీ, మరోటి కానీ పిలవరు. ‘బాలాజీ’ అని పిలుస్తారు. ఓ సారి అమ్మని చూడ్డానికి నాతో బాటు మా అన్నయ్య ఇంటికి ఆయన వచ్చినప్పుడు మా వదిన అడిగింది, “మా ఆడపడుచుని మీరు బాలాజీ అని ఎందుకంటారు?” అని.
ఆయన ఓ క్షణం కళ్ళు మూసుకుని “నాకు తిరుపతి బాలాజీ ఆరాధ్య దైవం… అంత పవిత్రత మా బాలాజీకి ఇస్తాను… ఆమె గుణగణాలు అంటే నాకు అంత అభిమానం” అని చెప్పారు. నేను ఆ మాటలు ఎన్నటికీ మరువలేను. వారి శ్రీమతి సామ్రాజ్యలక్ష్మి గారు కూడా నన్ను చాలా అభిమానించటం నా సుకృతం! ఆయన మా దగ్గర కూర్చుని వడ్డించి ప్రొద్దుట పూట టిఫెన్, లంచ్‌లో భోజనం తినిపించేవారు కొసరి కొసరి, ఎందుకనో ఆయన తినేవారు కాదు! ఎందుకనో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు తెలిసింది. ఆయనకి అప్పుడు ఒంట్లో బాగాలేదు! చాలా పానిక్ అవ్వాల్సిన పరిస్థితి! డాక్టర్ వెంటనే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టమన్నా, ఆయన డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసి అప్పుడు చెన్నై వెళ్ళారు. అదీ ఆయన కమిట్‌మెంట్!
అచ్చం ముఖేష్‌లా పాడే ఆయన పాటలంటే నాకు ప్రాణం. ఆయన రాసిన ‘బంగారు కోడిపెట్టా’, ‘వానా వానా వెల్లువాయె’, ‘గువ్వా గోరింకాతో’, ‘అరె ఓ సాంబా’, ‘అమలాపురం’ పాటలు రీమిక్స్ అయి మరీ మళ్ళీ ఈ తరంలో కూడ పాపులర్ అయ్యాయి. ఈ విషయం మొన్న భువనచంద్ర గారికి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినప్పుడు నేను కల్చరల్ చైర్‌పర్సన్‌గా వున్న తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్‌లో, చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పి, భువనచంద్ర గారిని కౌగిలించుకున్నారు. ఇంత కన్నా ఘన సన్మానం ఒక గీత రచయితకి ఏం వుంటుంది? ఆయన రాసిన ‘వాళ్ళు’ అనే ఆధ్యాత్మిక నవలకి నేను ఫ్యాన్‌ని!
కానీ కలసినప్పుడు నేను ‘వాళ్ళు’ చదవలేదు. కానీ ఆయన కలుపుగోలుతనం, ఆప్యాయతా నచ్చింది. అది జన్మబంధం అయింది. మా అమ్మ, ఆయన ఆరోగ్యం సరి లేనప్పుడు చెయ్యని పూజ లేదు! ఆ విషయాలూ, మా తీర్థయాత్రలూ కూడా విపులంగా చెప్తాను. ఆవిడ పూజలూ, దీవెనలూ ఫలించి ఆయన ఆరోగ్యం బాగైపోయింది. రచయితగానే కాదు, ఆయన మనిషిగా ఉత్తములు. పరిపూర్ణమైన ఆదర్శవాది. భక్తి విషయంలో కూడా నేను చెప్పేటంత దాన్ని కాదు. ‘పాశురాలు’ అన్నీ తెలుగులోకి అనువదించారు. మొన్న చిన్నజీయర్ స్వామి వారు యాగం చెయ్యడానికి చెన్నై వెళ్ళినప్పుడు భువనచంద్ర గారిని చూసి పిలిచి, పక్కనే కూర్చోబెట్టుకుని పాశురాలు కొన్ని విన్నారు. అది ఆయన పూర్వజన్మ సుకృతం. వాళ్ళమ్మ గారు చంద్రమౌళీదేవి గారు, మా అమ్మ సత్యవతీ దేవి కూడా తొలి ఏకాదశి రోజునే పుట్టడం కాకతాళీయం. వాళ్ళమ్మగారు ఆ కాలంలోనే పంచాయతీ బోర్డ్ ప్రెసిడెంట్‌గా పని చేసారుట చింతలపూడికి. ఇక ఆయన జీవితంలో ఆధ్యాత్మికతా, ఎయిర్‌ఫోర్స్ జీవితం అన్నీ ‘వాళ్ళు’, ‘పాదచారి’, ‘మనసు పొరల్లో’ అనే పుస్తకాలు చదివితే తెలుస్తుంది. ఆయన ఎయిర్‌ఫోర్స్‌లో వున్నప్పుడు తనకి తల్లిని మరిపించేటంత ప్రేమని చూపి, సేవలు చేసిన భువనేశ్వరీ దేవి అనే మరో తల్లి పేరుతో స్వంత తల్లి పేరు జత చేసి ‘ప్రభాకరరాజు’ గారు కాస్తా భువనచంద్రగా అవతారం ఎత్తారు.
(సశేషం)