టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం.
అసలు చిన్నప్పటి నుండీ ‘స్వేచ్ఛ’ అంటే ఏమిటీ? అనేది నాకు ఒక ప్రశ్నే! చాలామంది పిల్లలు వేసవికాలపు శలవుల్లో కూడా ఇళ్ళలోంచి బయటికొచ్చి ఎంచక్కా చింతపిక్కలూ, అష్టాచెమ్మా మధ్యాహ్నాలూ, పరిగెత్తి ముట్టించుకునే ఆటలు, చోర్ పోలీస్ సాయంత్రాలూ, ఇంకాస్త పెద్దయ్యాకా ఇళ్ళల్లో కేరమ్ బోర్డ్, చెస్; ఈవెనింగ్స్ టెన్నికాయిట్, బాస్కెట్ బాల్, కో ఆట ఆడేవారు కారు! “మా ఇంట్లో ఒప్పుకోరే!” అనేవారు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మేం పొద్దుటే వేసవిలో పది గంటల కల్లా భోం చేసి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి, బైండ్ చేసిన చందమామలూ, బాలమిత్రలూ, బొమ్మరిల్లులూ, తర్వాతర్వాతొచ్చిన బుజ్జాయి లాంటి పిల్లల మాసపత్రికలూ చదువుకునే వాళ్ళం!
అలాంటప్పుడు కొంతమంది ఇళ్ళల్లో మాతో పంపించేవాళ్ళూ కాదు! మా భవాని ఎప్పుడూ “అమ్మ ఇవాళ చింతకాయలు తొక్కాలి… ఎక్కడకీ వెళ్ళద్దు… అంది” అనో, “ఇవాళ బియ్యం బాగు చేస్తోందట… నేను నాన్నగారికి అన్నం పెట్టాలి, వెళ్ళద్దు అంది” అనో చెప్పేది! ఇంకా మంజూ, వినోలియా, బుజ్జీ, బేబీ లాంటి వాళ్ళు నాతో వచ్చినా, బయట గ్రౌండ్‌లో ఆడుకోవడానికే ఎక్కువ ఇష్టపడేవారు. నేను మాత్రం పుస్తకాల పురుగులా ఒక దాని నుంచి ఇంకో దానికి పాకి, ఒక్కోసారి పిల్లల సెక్షన్ నుండి పైకి పెద్దవాళ్ళ సెక్షన్‌కి పాకి వారపత్రికలూ, నవలలు కూడా నవిలేసే ప్రయత్నం చేసేదాన్ని! మా ఇంట్లో అమ్మా, పెద్దమ్మలూ కుట్టిన వారపత్రికల్లోని సీరియల్స్ – ‘మృత్యోర్మా అమృతం గమయ’, ‘ఏటి ఒడ్డున నీటి పూలు’, ‘సెక్రటరీ’, ‘జానకి విముక్తి’; మా అమ్మ ఆఫీస్‌లో పని చేసిన పి.వి. కృష్ణమూర్తి గారు రాసిన ‘ఆ తరం కథ’ లాంటి పుస్తకాలు నాకింకా జ్ఞాపకమే!
అయితే ఇలా పుస్తకాలు చదువుకునే పాటి ‘స్వేచ్ఛ’ కూడా చాలామంది పిల్లలకి, అదీ ఆడపిల్లలకి వుండేది కాదు! “మా అమ్మ చంపేస్తుంది, క్లాస్ పుస్తకాలు కాకుండా ఇలాంటివి చదివితే” అని వాళ్ళు నాతో అనేవారు. నేను ఎంతో ఆశ్చర్యపోయి మా అమ్మమ్మతో “పుస్తకాలు చదవడం తప్పా అమ్మమ్మా?” అని అడిగితే, “ఇంట్లో వాళ్ళకి భయం అమ్మా” అందావిడ. “భయం ఎందుకూ?” అంటే, “తెలివి మీరి పోతారనీ” అంది. ఆ మాటకి అర్థం నాకు పెద్దయ్యాక తెలిసింది! మా ఇంట్లో ఆడవాళ్ళు, అమ్మమ్మా, పెద్దమ్మలూ, అమ్మా అంతా కూడా చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తూండేవారు. హాయిగా కనిపించిన పుస్తకమల్లా కొని తెచ్చుకుని చదువుకునేవారు. దీపావళి జ్యోతీ, యువా లాంటివి అయితే, హైదారాబాదు నుండి ఎవరెళ్ళినా తెప్పించుకునేది నాగపూర్‌కి పెద్దమ్మ! అంత లావు పుస్తకాలు వడ్డాది పాపయ్య గారి రంగు రంగుల బొమ్మలతో ఇంట్లోకి రాగానే మా పిల్లలకి పండగే అయ్యేది. అందులో జోక్స్ అన్నీ మొదట చదివేసేవాళ్ళం. దీపావళి ప్రత్యేక సంచికలు కాబట్టి, ఎక్కువగా ఇళ్ళల్లో తయారుచేసే మందుగుండు సామాన్ల మీదే, వచ్చిన లాంటివే మళ్ళీ మళ్ళీ వచ్చేవి! అప్పుడే ‘చందమామ’లో రామాయణానికి బొమ్మలు వేసిన ‘శంకర్’గారి పేరు చూసాం! ఆ శంకర్ గారు మొన్నే స్వర్గస్థులయ్యారట. ‘చిత్ర’వి కూడా బొమ్మలు ఫేమస్.
పిల్లల్లో చిన్నప్పటి నుండే మంచి పుస్తకాలు చదివే అభిరుచిని పెంచాల్సిన పని పెద్దవాళ్ళు చెయ్యాలి. ఒక వేళ మనం తెలియక గాడి తప్పినా కూడా, పెద్దవాళ్ళు అరిచి, తిట్టి కొట్టి, “పెద్దవాళ్ళ కథలు కావల్సొచ్చాయా నీకు?” అని భయపెట్టేసి, పుస్తకం అంటే హడల్ వచ్చేసి, ఇంక జన్మలో ముట్టుకోకుండా చెయ్యకుండా, “ఇవిగో… ఇవి బావుంటాయి… ఇవి చదవండి… పెద్దయ్యాకా అవి చదవవచ్చు” అని చెప్పాలి. లేదా బళ్ళో పుస్తక పఠనం మీద ఆసక్తిని పెంచే టీచర్లు అయినా వుండాలి! అలాంటి టీచర్లు ఇప్పుడున్న కాలంలో అస్సలు లేరని కొంత మంది పిల్లలతో మాట్లాడితే తెలిసింది… ఒక వేళ వుంటే చాలా సంతోషం! మా టైంలో వుండేవారు. టెన్త్‌లో తెలుగు పండిట్ నూకల సీతారామశాస్త్రి, ఇంటర్‌మీడియట్‌లో పట్టెసం రాధా మహాలక్ష్మీ, సి.ఎస్.రావు గారు అనే లెక్చరర్స్ మాకు మంచి పుస్తకాలు సూచించేవారు.
ఇంట్లో అమ్మమ్మ అయితే అనువాదం చెయ్యబడిన శరత్‌బాబు నవలలన్నీ నా చేత చదివించుకుని వినేది. నేను తొమ్మిదో తరగతిలోనే, ‘కవితా, ఐ.ఎ.ఎస్.’ అనే నవల మొదలెట్టాను. ఇది తెలిసి మా అక్కలు వెక్కిరిస్తే, ఏడ్చి అది ఎక్కడో పారేసాను. నేను ‘బడదీదీ’, ‘రాముని బుద్ధిమంత తనం’, ‘బ్రాహ్మణ పిల్లా’, ‘జ్ఞానదా’, ‘తీరని కోరికలూ’, ‘పల్లీయులూ’, ‘నవవిధాన్’, ‘బిందుగారబ్బాయీ’, ‘వాగ్ధాత్తా’, ‘పరిణీతా’, ‘వైకుంఠుని వీలునామా’, ‘శ్రీకాంత్’, ‘దేవదాస్’, ‘గృహదహనం’ అన్నీ స్కూల్ చదువు పూర్తి కాకుండానే చదివేసాను. ఆ తర్వాత ఇంట్లో సాక్షి వ్యాసాలుండేవి పానుగంటి వారివి, బారిస్టర్ పార్వతీశం వుండేది మొక్కపాటి వారిది, చిలకమర్తి వారి గణపతి తొంగి చూస్తుండేవాడు. విశ్వనాథ వారి చెలియలి కట్టా, పునర్జన్మా, పులిముగ్గూ, దిండు కింద పోక చెక్కా వుండేవి… అస్సలు అర్థం కాని భాషలో అడవి బాపిరాజు గారి నారాయణరావూ, కోనంగీ చదివేదాన్ని! ఇవన్నీ బాహటంగా అమ్మా, అమ్మమ్మా ముందే దర్జాగా చదివేదాన్ని.
(సశేషం)