Site icon Sanchika

జీవన రమణీయం-130

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]కా[/dropcap]నీ ఇంటర్‌మీడియట్ కొచ్చాకా, మా హనుమంతు అన్నయ్య ద్వారా నా జీవితంలోకి ఓ ప్రభంజనంలా ‘రుషీ’, ‘చెంగల్వ పూదండా’, ‘తులసీదళం’, ‘వెన్నెల్లో ఆడపిల్లా’, ‘ఆనందో బ్రహ్మ’ లొచ్చాయి! క్లాస్ పుస్తకాల కన్నా వీటి మీద ఇంట్రస్ట్ పెరిగిపోయింది.

ఓ పక్క ఆంధ్ర సచిత్ర వారపత్రికలో యద్దనపూడి గారి ‘సహజీవనం’ వస్తుండేది. మేం క్లాసులో చర్చ పెట్టుకునేవాళ్ళం “జ్యోత్స్న అలా పెళ్ళి కాకముందే ఒక మగపిల్లాడిని కలుసుకోడానికి గుడికి వెళ్ళచ్చా? మనం అలా చేస్తే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే?” లాంటివి! అప్రయత్నంగా భయం వేసేది. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ చదివి – రమ్య అడిగే పజిల్స్‌కి తెల్ల మోహాలు వేసి, “ఏమైనా, మరీ అంత సతాయించకూడదు రేవంత్‌ని! అసలే ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్” అని నిట్టూర్చేవాళ్ళం! నేను నా పదరహారవ ఏట సరస్వతీ దేవిలందరినీ ఒక్క చోట చూసాను.

‘ముత్యాల ముగ్గు’ శతదినోత్సవం అయ్యాకా, చిక్కడపల్లిలో ‘వెండి తెర’ అనే పత్రికాఫీస్, సరిగ్గా మా బాబు మావయ్యా వాళ్ళింటి కెదురుగా వుండేది. ఆ వెండి తెరని ‘శాండిల్య’గారు అనే ఆయన నడిపేవారు. ఆయన తమ్ముడు చిన్న శాండిల్య అనే ఆయన నాటకాలు వేసేవారు. ఓ సారి ఏదో నాటకంలో పాట పాడడానికి అమ్మని అడగడానికి ఇంటికొచ్చారు. “మా అమ్మాయికి ముత్యాల ముగ్గు అంటే చాలా ఇష్టం… అచ్చు నీ పేరేంటి అంటే ‘శాంతా IV B’ అని ఆ అమ్మాయి చెప్పినట్లే సెక్షన్‌తో సహా చెప్తుంది” అని నవ్వుతూ మా అమ్మ నన్ను చూపించింది!

అసలు పెద్దవాళ్ళు ఇలా పిల్లల్ని పరాయి వాళ్ళ ముందు అవమానపరచడానికి నిమిషం ఆలోచించరు కదా! ఆయన నవ్వి, “అయితే ఆ శాంతని కలుద్దువు గాని… రేపు వాళ్ళంతా మన వెండి తెర కొస్తున్నారు… మొత్తం ఏక్టర్లు అందరునూ” అన్నారు. అంతే కాదు, మర్నాడు మమ్మల్ని తీసుకురమ్మని మనిషిని కూడా పంపారు. నేనూ, మా అమ్మా, అన్నయ్యా వెళ్ళాం! అన్నయ్య నా కన్నా పదేళ్ళు పెద్ద. ఇంటర్ సెకండ్ ఇయర్ లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంట… ఓ ఆటోగ్రాఫ్ పుస్తకం కొనుకొచ్చాడు. “ఇదెందుకురా? ఇంత చిన్నదీ… ఇందులో ఏం రాస్తాం” అంటే, “ఇది ఆటోగ్రాఫ్ పుస్తకం… శ్రీధర్ గారిదీ, సంగీత గారిదీ, సూర్యకాంతం గారిదీ, అల్లు రామలింగయ్య గారిదీ… అందరివీ ఆటోగ్రాఫ్స్ ఈ పుస్తకంలో తీసుకోవాలి” అన్నాడు. నేను ఓ కొత్త విషయం విన్నట్లుగా ఆశ్చర్యపోయాను.

నేను పట్టు పరికిణీ వేసుకుని, రెండు జడల్లో కనకంబరాలూ, కళ్ళ నిండా కాటుకా, బొట్టూ అన్నీ అమ్మ చేత పెట్టించుకొని, హుషారుగా వెళ్ళాను. అంతా నడిచి వెళ్తుంటే, మేం రిక్షాలో వెళ్ళాం!

యద్దనపూడి సులోచనారాణిగారితో తర్వాతి కాలంలో

నిజంగానే సినిమాలో నటించిన ఏక్టర్స్ అంతా వచ్చారు. ముందు వరుసలో కొంత మంది ఆడవాళ్ళు కూర్చున్నారు… అందులో ఒకావిడ వెనక్కి తిరిగి నన్ను చూసి “ఎంతెంత కళ్ళో… ఎంత బావుందో చూడండీ… సినిమాల్లో ఏక్ట్ చేస్తావా?” అనడం, ఆ ఆడవాళ్ళతా వెనక్కి తిరిగి నన్ను చూడడంతో నేను చాలా సిగ్గుపడిపోయి, తల వంచేసుకున్నాను. మా అమ్మ మళ్ళీ సరిగ్గా నాకు ఏం ఇష్టం వుండదో అదే చేసింది, బలవంతంగా వాళ్ళ దగ్గరకి తీసుకెళ్ళి, ఒకావిడ ఒళ్ళో బలవంతంగా కూర్చోబెట్టింది! ఆ తరువాత ఇంటికొచ్చాకా, అమ్మమ్మతో “మాదిరెడ్ది సులోచన గారు దీన్ని చూసి ఎంత మెచ్చుకున్నారో… వాసిరెడ్డి సీతాదేవిగారూ, యద్దనపూడి సులోచనారాణి గారూ, గోవిందరాజుల సీతాదేవి గారూ… రచయిత్రులంతా వచ్చారు” అని చెప్తుంటే, “అమ్మో… అమ్మో సరస్వతీ దేవిలంతా వచ్చారా?” అని అమ్మమ్మ చారులో పోపు పెట్టడం మానేసి బోలెడు ఆశ్చర్యపోయింది.

ఆ రోజు సంగీత, శ్రీధర్, రావు గోపాలరావు గార్లతో బాటు హలం, జయమాలినీల ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నాడు మా అన్నయ్య. ‘జమమాలిని’ అని పొడి అక్షరాలతో పెడితే, అదేదో జోక్‌లా అందరికీ చూపించి, అన్నయ్యా నేనూ నవ్వుతుంటే, అమ్మ కోప్పడింది – “తెలుగు రాని అమ్మాయి… ఆ మాత్రం అక్షరాలు నేర్చుకుని సంతకం పెట్టడమే చాలా గొప్ప” అని.

అప్పుడు నేను “అదేమిటీ? అమ్మకేం తెలీదా? తెలుగు రాకపోతే అసలు తెలుగెలా మాట్లాడ్తారూ? తెలుగు సినిమాలో ఎలా ఏక్ట్ చేస్తారూ?” అని బోలెడు ఆశ్చర్యపోయాను. అమ్మ దగ్గర  నల్లని ఆల్బంలో, గోల్డ్ కలర్ బిళ్ళలు కార్నర్స్‌లో అతికించి, వాటిలో చాలా ఫొటోలుండేవి! అందులో ఈ రచయిత్రులందరితో అమ్మా, నేను తీయించుకున్న ఫొటో వుండేది! నాకు అక్షరాలా పదేళ్ళు! కాలప్రవాహంలో ఆ ఫొటో ఎక్కడో కొట్టుకుపోయింది.

ఆ మురళీ, రాధా అన్న బాల నటులని చూశాకా, వాళ్ళు కోతిని (అంజిని) తేలేదని నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను! ఆ రోజు బాపూ గారూ, ముళ్ళపూడి వెంకట రమణ గారూ కూడా వచ్చారు. అల్లు రామలింగయ్యగారు మాత్రం రాలేదు!

యండమూరిగారు, అల్లు అరవింద్ గార్లతో

సినిమా భాషలో చెప్పాలంటే, కేలండర్లో ఓ ముప్ఫై ఏళ్ళు తిరిగాకా, అల్లు అరవింద్ గారితో నాకు పరిచయం అయ్యాకా, ఆయనతో ‘ముత్యాల ముగ్గు’ గురించి మాట్లాడుతూ, “అచ్చం కోతిలా చేసారే మీ నాన్నగారు… ఆ సీన్ నాకు చాలా ఇష్టం!” అని చెప్పినప్పుడు ఆయన చిన్నగా నవ్వి నా చిన్నతనానికి, “ఆ సీన్ చేసే ముందు రోజున మా తమ్ముడు చనిపోయాడు, రైల్లోంచి పడి… బాపూ గారూ ‘వద్దు రావద్దు లెండి’ అన్నా, వెళ్ళి మా నాన్నగారు, ఆ షెడ్యూల్ బాకీ వుండకూడదని, ఆ సీన్ నటించి వచ్చారు…” అన్నప్పుడు, నాకు కళ్ళ నుండి కన్నీటి బొట్లు జారిపడ్డాయి! ఊరికే ఎవరూ గొప్పవాళ్ళు అవరు… ఏ రంగంలో అయినా తపస్సులా కృషి చేస్తేనే గుర్తింపూ, ఉన్నతీ లభిస్తాయి అని మరోసారి అర్థమైంది. మొన్న ‘సాక్షి’ సినిమా చూస్తుంటే ‘మాస్టర్ అల్లు వెంకటేశ్వరరావు’ అని వాళ్ళ తమ్ముడి పేరు టైటిల్స్‌లో చూసి, మళ్ళీ సినిమా మొత్తం ఆ అబ్బాయి కోసం చూసాను. ఆ రోజే ఆయనకు మెసేజ్ పెట్టాను “మీ తమ్ముడ్ని సాక్షిలో చూసాను… ఉంటే అచ్చు మీలాగే వుండి వుండేవారేమో… మీ చిన్నతనం చూస్తున్నట్టు అనిపించింది” అని. ఆ మెసేజ్ చదవగానే ఆయన ఫోన్ చేసారు. “నాకు యూట్యూబ్ లింక్ పంపించు… చూస్తాను” అని! అలా ఎన్నో ముత్యాల ముగ్గు జ్ఞాపకాలు… అప్పత్లో ఆ పదేళ్ళ పిల్లని “సినిమాల్లో ఏక్ట్ చేస్తావా?” అని వాళ్ళు అడిగినప్పుడు “ఊహూ” అన్నాను. ఇంకో విధంగా సినిమా ఫీల్డ్‌లో కొస్తాను అని అనుకోలేదు.

(సశేషం)

Exit mobile version