[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]
మరో హారర్ స్టోరీ ‘అనుపమ కథ’ ముదిగొండ శివప్రసాద్ గారు రాసినది అర్ధరాత్రి చదివాను పెళ్ళి గాక ముందు. వెన్నులోంచి చలి వచ్చేసింది భయంతో. అలాగే తులసిలో సిద్ధేశ్వరి, స్త్రీ కాదు, నీకు వెన్నెముకకి ఫలానా చోట ఖేచరి చెయ్యాలి, నువ్వు పురుషుడివి… శ్రీనివాస పిళ్ళైవి అన్నప్పుడూ… పిళ్ళైకి శిక్షగా గుండు కొట్టించి, కుండలో నుండి ఒక్కొక్క చుక్క పడేట్లు పెట్టినప్పుడూ, మేథమెటీషియన్ కాబట్టి అతను ఆ చుక్కకీ చుక్కకీ మధ్య వ్యవధిని కాలిక్యులేట్ చేస్తూ, పిచ్చివాడైపోవడం… అది ఆంధ్రభూమిలో కనకాంబరరాజు గారు ఫాంట్‌లో చిన్న అక్షరాలు క్రమంగా పెద్దవవుతున్నట్లు టప్… టప్… అని పెద్ద పెద్ద అక్షరాలుగా మారేట్లు ప్రింట్ చెయ్యడం, ఓ వింత అద్భుత ప్రపంచంలోకి ఎంటర్ అయినట్లు ఫీలయ్యాను. అలాగే హారర్ కాకపోయినా ‘ఈ దేశం మాకేమిచ్చింది’ నవలలో యద్దనపూడి సులోచనారాణి గారు క్రియేట్ చేసిన హెల్పర్ ధనలక్ష్మి పాత్ర… చివర్లో తను నమ్ముతున్న ధనలక్ష్మిని ఎక్కడో దాచేసి శత్రువులు తెలివిగా బిందుకి అనుమానం రాకుండా ఆమె ఇంట్లో ఆమె కవల సోదరిని వుంచినట్లు తెలిసినప్పుడూ షాక్‌లా ఫీలయ్యాను. నేనూ ఆ టెక్నిక్కు పట్టుకుని ఓ కుటుంబ నవలలో మానవ సంబంధాలు చర్చిస్తూ కూడా చివరిదాక ముగింపు పాఠకులకు తేటతెల్లం అవకుండా సస్పెన్స్ మెయిన్‍టెయిన్ చెయ్యచ్చు అని ‘ఎందుకీ సందెగాలి’ రాసినప్పుడు, కిరణ్‌ప్రభ గారు (కౌముది ఎడిటర్) సమీక్ష చేయడానికి చదివి – “కుటుంబ నవలల్లో ఇంత సస్పెన్స్ రాయచ్చా? అనిపించింది. ఎక్కడా ‘క్లూ’ ఇవ్వకుండా కథనాన్ని భలే ఇంట్రస్టింగ్‌గా తీసుకువెళ్ళారు” అన్నారు.
‘ఈ దేశం మాకేమిచ్చింది’ చదివినప్పుడు నేను తొమ్మిదో తరగతిలో వున్నాను. పెద్దగా వూహ లేకపోయినా ఆ నవలలో సులోచనారాణి గారు అప్పటి విజయవాడ పోలీస్ ఆఫీసర్, రౌడీషీటర్స్‌కి సింహస్వప్నం, ‘గ్రేహౌండ్స్’ పోలీస్ యూనిట్‌ని నడిపిన ఎస్.పి. వ్యాస్ గారి ఆధారంగా రాసారని తెలిసింది. ఎంతో ఇంట్రస్టింగ్‌గా శలవులకొచ్చిన మా ఉమక్కా నేనూ చదివాము.
ఆ వ్యాస్ గారి సతీమణి అరుణా వ్యాస్ గారిని మేం టీ.వి. కొన్న కొత్తల్లో టీవీలో చూసి ఆవిడ రామాయణం చెప్తుంటే అభిమానిగా మారి ఇప్పుడు నా ఎఫ్.బి.లో నా రాతలనీ, భావాలనీ మెచ్చుకుంటూ, కామెంట్స్ పెడ్తుంటే ఎంతో గర్వంగా, మరెంతో ఆనందంగా వుంది. కలవలేను అనుకున్న ఎందర్నో నేను జీవితంలో పరిచయం చేసుకోగలిగాను… వాళ్ళూ నన్ను అభిమానించడం నా అదృష్టం!
‘స్వీట్ హోం’… ఇది కూడా నేను చిన్న వయసులో అంటే పెళ్ళి కాకముందే చదివాను. విమలలో నన్ను వూహించుకునేదాన్ని. చాలా వరకూ నాకూ అవే భావాలుండేవి! అసలు స్వీట్ హోం లాంటి సోషల్ రెస్పాన్స్‌బిలిటీ వున్న కామెడీ నవలని నేను మళ్ళీ జీవితంలో చదవలేదనే నా అభిప్రాయం.
“విమలా నీ కోసం నీ ఫ్రెండ్ వచ్చింది, చెవులకి జడగంటలు పెట్టుకుంటుందీ… తను…”
“మా బుచ్చి ఎగ్జిబిషన్‌కో, మరో షాపింగ్‌కో వెళ్తే ‘అంగదుడి’లా అంగలు వేసుకుంటూ వెళ్ళిపోతాడు.”
విమలకి సడెన్‌గా తను ఇంజన్ డ్రైవర్ అయిపోతే ఎంత బావుంటుందీ అనిపించి, ఆ దిశగా ఆలోచించడం…
వరుసకి పిల్లలకి అమ్మమ్మలూ, నానమ్మలూ, ఎవరూ లేరని, ఓ ముసలమ్మని, జబ్బు పడ్డ దూరపు బందువుని తీసుకొచ్చి సపర్యలు చేయడం, అసలు పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలో చెప్పడం,
గృహిణి వంటిల్లు ఎలా పెట్టుకోవాలో, పిల్లలకి ఆదివారాలు ఏ పిండి వంటలో చేసి పెట్టుకోవాలో, అందులో మిగతా కుటుంబ సభ్యుల పార్టిసిపేషనూ…
పనివాళ్ళతో ఎలా వ్యవహరించాలీ, మహిళా సంఘాలూ.
బుచ్చి ఉత్తరం రాసినప్పుడు ‘వి…’ అని ఒక లైన్‌లో రాసి, ‘మల’ అని కింద రాస్తే, “ఎంత కర్కశంగా నా పేరు చీల్చి చెండాడావు, నీకు చేతులెలా వచ్చాయి బుచ్చీ!” అని విమల సెన్సిటివ్‌గా బాధపడడం, ఇవన్నీ నన్ను విమలలో చూసుకునేట్లు చేసాయి.
రంగనాయకమ్మ గారి ‘కూలిన గోడలు’ తప్ప మిగతా నవలలన్నీ నాకిష్టం!
పాత్రల మీద అత్యాచారాలు, చాప కింద నీరులా జరుగుతుంతే, ఎదురు తిరిగితే బావుండ్ను, అని మనం రెచ్చిపోయేట్లూ, వుద్రేకపడేట్లూ చేసాకా, ఆ పాత్ర అచ్చంగా మనం అనుకున్నట్లే ఎదురు తిరిగి, మనకి సంతృప్తి నిస్తుంది!
‘జానకి విముక్తి’లో జానకి తలనీలాలు ఇస్తానని అత్తగారు మొక్కుకుని, బలవంతంగా తిరుపతి తీసుకెళ్ళి, తల మీద జుట్టు తియ్యడానికి కత్తి పెట్టేదాకా తీసుకెళ్ళి, అప్పుడు జానకి ఒక్కసారిగా వాళ్ళని తోసి, ఎదురుతిరిగి, ఆ చెర లోంచి బయటపడేట్లు చేస్తారు!
‘చదువుకున్న కమల’లో ఎంగిలి కాఫీ పిల్లలకి ఇచ్చే, ఖళ్ ఖళ్ మని దగ్గే మావగారినీ, తన కంచంలో నుండి, చెయ్యి నాకుకుంటూ తింటున్న అత్తగారు కమల కంచంలో పచ్చడి వెయ్యడాన్నీ రచయిత్రి రాసే తీరుకు మనకే చిరాకేసి, కమల ఎదిరిస్తుంటే, ఇంకా నెమ్మదిగా మాట్లాడుతుందేవిటీ? ఘాటుగా స్పందించకా? అనేట్లు రాస్తారు రంగనాయకమ్మగారు.
‘కళ్ళు తెరిచిన సీత’లో వంకాయలు కొనలేదనీ, ముదురు రంగు బెడ్ షీట్స్ మంచం మీద వేసారనీ, ఆడబిడ్డ మీద అలిగి, మొగుణ్ణి వదిలేసిందా సీత అని కొందరు ఆశ్చర్యపోయినా, సున్నితంగా అందులోని మర్మం వివరిస్తారు. “వంకాయలు కొనమంటే సీత, అక్కకి ఫోన్ చేసి మొగుడు ‘సీత కొనమంటోంది’ అంటే, ‘అక్కర్లేదు’ అంటుంది ఆడబిడ్డ… ముదురు రంగు బెడ్ షీట్స్ కూడా ఆడబిడ్డ టేస్ట్! మొగుడిది కాదు… చివరికి సీతని తమ్ముడు దగ్గరకి తీసుకోవాలా? ఆమె పిల్లల్ని కనాలా లేదా? కూడా ఆడబిడ్డ నిర్ణయిస్తుంది!
రంగనాయకమ్మ గారి సున్నితత్వం ఎక్కడ తెలుస్తుందంటే, ఆ చెరలో నుండి అమెరికాలో వున్న సీతని బయటకి తీసిన స్నేహితురాలు, మర్నాడు పాస్‌పోర్ట్‌కి అప్లయి చేయించి, ఇండియా పంపిస్తాను… ‘సీత ఇక్కడే పిల్లలతో వాళ్ళ రూంలో పడుకుంది… మీరు నిశ్చింతగా వుండండి’ అంటే, “అదేమిటీ? ఇంత చేసిన నీతో సీత మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా మాట్లాడ్తూ నీతో కలిసి ఒక రూంలో పడుకుంటాననలేదా? నువ్వైనా చెప్పలేదా?” అటారు… అచ్చంగా నేను నా స్నేహితురాళ్ళు వస్తే అలాగే ఆలోచిస్తాను. పగలంతా కలిసి తిరిగినా, రాత్రుళ్ళు స్నేహితురాళ్ళతో (నేను స్త్రీని కాబట్టి) కబుర్లు చెప్పుకుంటూ పడుకునే ఆ అనుభూతే వేరు!
నా స్నేహితురాళ్ళు కౌముది కో-ఎడిటర్ కాంతి కిరణ్ పాతూరి, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి సతీమణి పద్మజా, కువైట్‌లో పనిచేసే లిల్లీ అని పిలవబడే లలిత చిట్టే అనే ఇంకో స్నేహితురాలు, దివ్యజ్యోతి నడిపినేనీ, అందరం ఏడాదికోసరి అయినా కాంతిగారూ, లిల్లీ ఇండియా వచ్చినప్పుడు మా ఇంట్లోనో, మల్లాది గారి ఇంట్లోనో, కాంతిగారి అక్కగారింట్లోనో ఇలా నైట్ అవుట్ చేస్తూంటాం!
చిన్నపిల్లల్లా ఏ డమ్ షెరాడ్సో, పేకాటో ఆడుకుంటూ, మా పర్సనల్ విషయాలూ, చిన్ననాటి ముచ్చట్లూ పంచుకుంటూ, మాటలు తక్కువా నవ్వులు ఎక్కువగా వుంటే ఆ నైట్ అవుట్స్, పగలంతా ఎక్కడ బ్రేక్‍ఫాస్ట్, ఎక్కడ లంచ్, ఎక్కడ డిన్నర్… ఏ సినిమా, ఎగ్జిబిషన్ లేదా చీరల షాపింగ్ ఎక్కడా… లాంటి ప్లానింగ్‌లు చాలా సందడిగా చేస్తాం! బహుశా… తిరిగి చూసుకుంటే జీవన మలిసంధ్యలో ఇవే నిలుస్తాయి! స్నేహితులూ, ఆ స్నేహాలు ఇచ్చిన మధురానుభూతులునూ!
ఇక్కడే కాదు, నేనూ, మల్లాది గారి ఫ్యామిలీ అమెరికా వెళ్ళినా, కాంతి గారున్న వూరు వెళ్ళి ఈ నైట్ అవుట్ చేయడం మరపురాని అనుభూతి. మల్లాది గారూ, కిరణ్‌ప్రభ గారూ కూడా మా సమావేశంలో పాలు పంచుకుంటూ వుంటారు అప్పుడప్పుడు! అందుకే అమెరికాలో ‘స్లీప్ ఓవర్’కి వెళ్తుంటారు పిల్లలు… మనకీ పెద్ద వయసులో కూడా స్నేహితులతో అలా ‘స్లీప్ ఓవర్’లు వుండాలి. మనం కల్పించుకోవాలి!
మా అమ్మ స్నేహితులతో అలా ఇప్పటికీ కులాసాగా గడుపుతుంది… ఏలూరులో సావిత్రి వుంది… విజయవాడలో శేషుమాంబ వుంది… మా ఇంద్రగంటి జానకీబాల వుంది…. అని వెళ్ళి రెండు రోజులుండి రావడం, వాళ్ళూ అలాగే వచ్చి మా ఇంట్లో కానీ, అమ్మ ఇంట్లో కానీ వుండడం… ఇప్పటికీ జరుగుతుంది. ఆవిడకిప్పుడు 82 ఏళ్ళు.
(సశేషం)