Site icon Sanchika

జీవన రమణీయం-133

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]ఓ[/dropcap] వ్యక్తి నేను ఈటీవీ నుండి బయటకి రావడానికీ, సుమన్ గారికీ నాకూ డిఫరెన్సెస్ రావడానికీ కారణం అన్నాను కదూ! అతనే ఈ మధ్య తరచూ ఫోన్ చేసి, ఇప్పుడు ప్రసారం అవుతున్న తన టీవీ సీరియల్‌కి స్క్రీన్‍ ప్లే రాయమనీ, ఛానెల్ వాళ్ళు కూడా నా పేరే సజెస్ట్ చేస్తున్నారనీ అడుగుతున్నాడు… గతంలో అంటే, రెండేళ్ళ క్రితం కూడా నేను “అప్పట్లో నన్ను ఎందుకు తీసేయించావు? ఇప్పుడు నా అవసరం వచ్చిందా?” అని వుండేదాన్నేమో… కానీ ఇప్పుడు మాత్రం “అప్పట్లో నాకు ఆ సీరియల్ చాలా అవసరం… ఇప్పుడు నాకు టీవీ సీరియల్ రాయడం అవసరం లేదు! నేను చెయ్యను” అని చెప్పాను.

“బలభద్రపాత్రుని రమణికి టీవీ అవసరం లేకపోవచ్చు… కానీ టీవీ ఇండస్ట్రీకి బలభద్రపాత్రుని రమణి చాలా అవసరం… కాదనకండి… ఒకవేళ మనసు మార్చుకుంటే ఫోన్ చెయ్యండి” అని తెగ బతిమాలాడు.

ఇప్పుడు నేను అతను అప్పట్లో చేసిన విషయం గురించి అస్సలు మాట్లాడకపోవడానికి కారణం నాకు కొత్తగా వచ్చిన జ్ఞానం! ఇక్కడ ఎవరూ శాశ్వత శత్రువులూ కాదు, మిత్రులూ కాదు! అవకాశం వచ్చినప్పుడు విర్రవీగనివాడు సామాన్యంగా కనిపించడు. ఎంత మందిని, ఎన్ని జీవితాలని చూసి వుంటానో… నా గురించి వెనక చెడుగా మాట్లాడిన వాళ్ళు, నేను ఏ నంది అవార్డుల, లేదా జాతీయ అవార్డుల జ్యూరీ లోనే వున్నప్పుడు వారికి నాకూ జన్మజన్మల అనుబంధం అన్నట్ట్లు మాట్లాడ్తారు! నేనూ నాకు తెలీని విషయాలను, విన్న విషయాలను ఎవరి మీదైనా చెడుగా, ఇదివరలో మాట్లాడే వుంటాను… వదంతులు నమ్మనీ, చాలా పరిణతీ, గొప్ప వివేకం కలిగిన జ్ఞానులెవరూ వుండరు! నేనూ అజ్ఞానుల్లో ఒకదాన్నే! ఇంకో విషయం – అడగనిదే అమ్మ అయినా పెట్టదు అన్నది అవకాశాల విషయంలో ఈ ఫీల్డులో పరమ సత్యం!

నేను అడగలేదూ, వాళ్ళు చెయ్యలేదూ అనే ఇప్పటికీ నా మిత్రులు అంటుంటారు! అడగడం అందరికీ రాని విద్య! నేను అందులో పూర్!

‘వెల్‌కమ్ ఒబామా’లో నేను ఏక్ట్ చేస్తున్నప్పుడే పారలల్‌గా ‘నేనేం చిన్నపిల్లనా?’ అనే నా కథ రామానాయుడు గారు సినిమాగా నిర్మించారు. దాని వెనుక ఓ కథ వుంది!

నేను అమెరికా వెళ్ళినప్పుడు 2012లో కిరణ్ ప్రభ గారి ఇంట్లో ‘చెర్రీ పికింగ్’కి వెళ్ళొచ్చాకా, కావలసినన్ని బకెట్ నిండా కోసుకుని, పొట్టనిండా తినొచ్చే కార్యక్రమం అది! పొట్టలో వున్నవాటికి ధర చెల్లించనవసరం లేదు, బకెట్‍లో వాటికి ధర చెల్లించాలి. ఆ ‘పికింగ్’కి వెళ్ళొచ్చాకా, మధ్యాహ్నం కిరణ్ ప్రభ గారూ, వారి అబ్బాయి సుమన్ పాతురికి నేను ‘పారడైజ్’ అనే కథ రాసానని చెప్పాను (కిరణ్ ప్రభ గారి అబ్బాయి సుమన్ పాతురి ‘ఇంకోసారి’ అనే సినిమాతో డెబ్యూ డైరక్టర్‌గా నంది అవార్డు కూడా పొందాడు). అది నేను సురేష్ బాబు గారికి చెప్తే, “రానాకి బావుంటుందీ, ఇప్పుడు చెయ్యకపోతో, ఇలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్‍వీ, లవ్ స్టోరీస్ ఇకముందు చెయ్యలేడూ” అన్నారు. కానీ రానా ఎందుచేతనో మరి ఇంట్రస్ట్ చూపినట్లు లేదు! ఇది ‘లీడర్’ వచ్చిన కొత్తల్లో మాట! అతను అప్పుడు రెండో సినిమా ఇంకా ఒప్పుకోలేదు.

ఆ కథ వినగానే సుమన్, కిరణ్ ప్రభ గార్లు ఇద్దరూ “చాలా బావుంది అండీ, పెద్ద హీరోలకి కూడా బావుంటుంది” అన్నారు.

ఉమ్మడి కుటుంబంలో, అన్నింటికీ ప్రేమానురాగాల పేరుతో ఆంక్షలు పెట్టి పంజరంలో బంధిస్తూన్నారు ఇంట్లో వాళ్ళు అని అపోహ పడిన ఓ అమ్మాయి, యు.కె. వెళ్ళి, నా అనేవాళ్ళు లేని స్వేచ్ఛగా వుందే అబ్బాయి జీవనశైలితో ప్రేమలో పడి అతన్ని తన పల్లెటూర్లో వున్న ఇంటికి తీసుకొచ్చి పెళ్ళి చేసుకుంటానని పరిచయం చేస్తుంది.

తండ్రి ఆ అబ్బాయిని “మీ నాన్నగారి పేరేవిటీ? ఏం చేస్తారు?” అని అడుగుతే, ఆ అబ్బాయి తల్లీ తండ్రీ తను పుట్టగానే విడిపోయారు కాబట్టి తనకి తెలీదు అంటాడు.

“పిల్లనిచ్చే ముందు ఏడు తరాలు చూడాలంటారు… నాకు నీ తండ్రెవరో కూడా తెలీదు, ఎలా ఇస్తాను?”, పొమ్మంటాడు ఆమె తండ్రి.

ఆ తండ్రిని వెదుకుతూ వెళ్ళిన ఆ అబ్బాయికి, తండ్రితో బాటు, ఒక కుటుంబమే దొరుకుతుంది. దొరకడమే కాదు, కాన్సర్‍తో వున్న తండ్రీ, తమ్ముడూ, చెల్లీ, పినతల్లీ, దెబ్బతిన్న బిజినెస్సూ, అతని మీద ఆధారపడ్తాయి. ఏమయ్యాడో అని వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి అతన్ని చూసి సంతోషపడినా, అతని ‘బాగేజ్’ని చూసి “నేను ప్రేమించిన క్రిష్… నువ్వు కాదు! స్వేచ్ఛగా ఈ పూట తనకేది కావాలంటే అది చేసేవాడు!” అంటుంది.

“కుటుంబం అంటే, దాని విలువేంటో మీ ఇంటికొచ్చాకే తెలుసుకున్నాను… ‘నాకూ ఓ కుటుంబం ఇవ్వు దేవా!’ అని వేడుకొంటే, నా ప్రార్థనలు విని భగవంతుడు వెంటనే కరుణించి ప్రసాదించాడు! నాకూ నువ్వూ, కుటుంబం రెండూ కావాలి! నీకు స్వేచ్ఛ మాత్రమే కావాలంటే, నువ్వే నన్ను మర్చిపో” అంటాడు.

ఆ తర్వాత ఆ అమ్మాయి అటు నుండి నరుక్కు రావాలని ట్రై చేసి “వాళ్ళ పిన్ని డబ్బు మనిషి, డబ్బు ఆశ చూపితే అతన్ని వెళ్ళగొట్టేసింది. కానీ అతను వాళ్ళే కావాలని ఆక్కడ వుండిపోయాడు” అని ఏడుస్తూ తండ్రికి చెప్తుంది!

తండ్రి “ఆ పిన్ని ఆ డబ్బు సూట్‍కేస్ ఆ రోజే తెచ్చి నాకు అందించి, వాడి భవిష్యత్తుకి మేం అడ్డు రాము, వాడిని మనసు రాయి చేసుకుని ఇంటి నుండి వెళ్ళగొట్టేసాం, మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోమనండి” అని చెప్పింది అన్న నిజం చెప్పి సూట్‌కేస్ కూతురి మొహం మీద కొట్టి, “ఇదేనా నేను నీకు నేర్పిన జీవితపు విలువలూ?” అని ఈసడిస్తాడు. అప్పుడు ఆ సవితి తల్లి గొప్పదనం, క్రిష్ చెప్పిన ‘ప్రేమ’ అన్న మాటకి అర్థం తెలిసి అతని దగ్గరకి క్షమించమని వెళ్ళి “నీతో బాటు నీ బాధ్యతల్లో కూడా పాలు పంచుకుంటాను” అంటుంది. ఇదీ కథ!

తర్వాత అది ‘మీ శ్రేయోభిలాషి’ తీసిన ఈశ్వర్ రెడ్డి గారికి నాయుడు గారు తియ్యమని ఇస్తే, ఆయన రోజు ఓ సారి నా చేత చెప్పించి, రికార్డు చేసి సాయంత్రం తన మిత్రులకి వినిపించడం, వారు నెక్స్ట్ డే రకరకాల సూచనలు ఇవ్వడం, ఇలా కొన్నాళ్ళు సాగాకా, ఆ కథ ఆధారంగా ఓ సినిమా వచ్చింది. నేను నంది అవార్డుల జ్యూరీలో వుండగా ఈశ్వర్ రెడ్డి గారు ఫోన్ చేసి, “ఆ సినిమా మీ కథే! నేను ఇప్పుడే చూసాను” అన్నారు.

“మీరు రికార్డు చేసి, రోజూ సాయంత్రాలు బోలెడు మందికి చెప్తే, మరి కాపీ కొట్టరా?” అన్నాను. తర్వాత కొన్నేళ్ళు నాయుడు గారు ఆ వూసు ఎత్తలేదు!

మళ్ళీ ఓ రోజు సడెన్‍గా ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ పి. సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమా చూసి, అది ఆయన తక్కువ బడ్జెట్‌లో చక్కగా తీసారని మెచ్చుకుని నన్ను పిలిపించి, సునీల్ కుమార్‌ రెడ్డిగారిని డైరక్టర్‍గా పెట్టి ఈ సినిమా తీద్దాం అన్నారు. నేను రామానాయుడి గారికి ఎదురు చెప్పే దాన్ని కాదు! ‘సరే’ అన్నాను.

సునీల్ కుమార్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన ‘సొంతూరు’, ‘గంగపుత్రులు’ చూసాను. ఆ ఏడు నంది అవార్డులలో మా ‘అందరి బంధువయా’కి ఆయన ‘గంగపుత్రులు’ గట్టి పోటీ వచ్చింది. ఈ విషయం అప్పుడు జ్యూరీలో వున్న నా మిత్రులు చెప్పారు. ‘గంగపుత్రులు’ ఆ ఏడు ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డు, ఉత్తమ కథ ఎవార్డూ కొట్టేసింది. ‘అందరి బంధువయా’కి ఉత్తమ కుటుంబ కథా చిత్రం అవార్డు వచ్చింది. అందువల్ల నేను కుతూహలంతో ఆ సినిమా తెచ్చుకుని చూసి, ‘దీనికి అవార్డు రావడం కరెక్టే’ అని నిర్ణయించుకున్నాను! అప్పటి నుండీ ఆయన అంటే గౌరవం. అంతే కాకుండా మా ఇద్దరికీ డిజిక్వెస్ట్ బసిరెడ్డి గారు ఆత్మీయులు! ఎల్.బి.శ్రీరాం గారు మిత్రులు! అన్ని విధాలా బాగానే వుంటుంది మా కాంబినేషన్ అనుకున్నాను. 

(సశేషం)

Exit mobile version