Site icon Sanchika

జీవన రమణీయం-14

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]అ[/dropcap]శ్విన్ స్కూల్‌కి వెళ్తున్నాడు. క్రిష్ణని అమ్మమ్మ చూసుకుంటోంది కదా అని ఇంటి దగ్గరగా వున్న స్కూల్‍లో కెళ్ళి ఉద్యోగం అడిగాను. ఆ ఓనర్ పంజాబీ. భార్య ఎమ్.ఎ., బి.ఇడి. ఈయనకేం చదువు సంధ్యలు లేవు. నేను వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ కిరణ్ వుంది. ఆవిడ చాలా మంచి మనిషి. క్రిష్ణ తప్పిపోయినప్పుడు నేను ఏడుస్తూ పరుగులెత్తడం చూసినట్టుంది. “బాబు బాగున్నాడా?” అని అడిగింది. నాకు బి.ఇడి. లేదు కాబట్టి ఫస్ట్ క్లాస్‌కి అన్ని తరగతులూ తీసుకోమంది.

నాకు ఆ వయసున్న పిల్లలు వుండడం కూడా ఒక కారణం. ఆవిడ కొడుకు కూడా నా క్లాసులోనే వుండేవాడు. పేరు ఆషిష్.

మొదటి రోజు క్లాస్‌రూమ్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ‘అనూహ్య’లో తర్వాత రాశాను. ఇంత పొడుగు బెత్తం ఎందుకు టేబుల్ మీద అని దాన్ని పుటుక్కున విరిచేశా… కాసేపట్లో క్లాస్‌రూమ్‌లో రాకెట్లు స్వైరవిహారం చేశాయి. పిల్లలు ఒకళ్ళనొకళ్ళు గిచ్చుకున్నారు, కరుచుకున్నారు. ఒకడు ఎబ్‌నైజర్ అనేవాడు, బ్లేడ్ కూడా పెట్టి కోసాడు పక్కవాడిని!

పాఠం చెప్పడానికి నేను అరిచి టేబుల్ మీద దబదబా బాది, వాళ్ళు మాట వినక నానా హైరానా అయింది. బెత్తం బల్ల మీద వుంటే మనం వుపయోగించకపోయినా ఆ పిడుగులు కామ్‌గా వుంటారని అర్థమైంది.

లంచ్ టైమ్‌లో ఇంటికి వెళ్ళిపోయాను భోజనానికి. క్రిష్ణ నా కాళ్ళు చుట్టుకుని ఏడ్చాదు. వాడిని వూర్కోబెట్టి, అన్నం పెట్టి, నేను తిని, అమ్మమ్మకి గేట్లు గట్టిగా తాళం వేసుకోమని చెప్పి నేను స్కూల్‌కి వచ్చాను.

స్కూల్‌లో స్టీఫీ అనే టీచర్ సెకండ్ క్లాస్ చూసేది. మణీ, బీనా ఇద్దరు పెళ్ళి కాని పిల్లలే, పాటలు పాడ్తూ కులాసాగా ఉండేవారు. సుజాన్ మేడం ఇన్‌ఛార్జ్. కవితా మేడం హిందీ చెప్పేవారు. వీళ్ళిద్దరూ ఏజ్‌లో నా కన్నా చాలా పెద్దవాళ్ళు! నాగ సుశీలా మేడం కళ్ళద్దాలు పెట్టుకుని, “నేను మామ్మగారి కోడలిని” అని పరిచయం చేసుకుంది. అది ఇప్పటికీ నిలిచిన స్నేహబంధం అవుతుందని అప్పుడు అనుకోలేదు! “మీ ఇంట్లో దొంగలు పడ్డారట కదా… ఎవరినైనా ఏమైనా చేశారా? అప్పుడు మీరేం చేశారు?” లాంటి ప్రశ్నలేవో ఉత్సుకతతో వేశాను.

వాళ్ళు మా కన్నా ముందే కాలనీలో ఇల్లు కట్టుకున్నారు. ఓ రాత్రి వేళ, హిందీలో మాట్లాడ్తూ, ఏ బీహారీ వాళ్ళో దొంగల గుంపు గ్రనేట్ రాళ్లతో తలుపులు విరగ్గొట్టి, వాళ్ళ ఇంట్లో చొరబడి ఆవిడ భర్తని కత్తి చూపించి బెదిరించి, బీరువా తాళాలు అడిగారట. మగపిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. మహా అయితే మా పిల్లల కన్నా రెండేళ్ళు పెద్దవాళ్ళు. ముసలి అత్తగారు.

మా సుశీలే అందరిలోకీ ధైర్యస్తురాలు కావడం మూలాన “ఆయన్ని ఏమీ చెయ్యకండి… బీరువా తాళాలు నేనిస్తాను” అని రాత్రిపూట ఎక్కడ పెడ్తారో తీసి ఇచ్చిందట. సుశీల మెడలో మంగళసూత్రం తాడు తీసివ్వమని, దానిలోంచి జాగ్రత్తగా సూత్రాలు తీసి ఆ దొంగ వెనక్కి ఇచ్చేసాడుట.

వీళ్ళ ఆయన్ని మొదట కొద్దిగా కొట్టడంతో తలకీ, భుజానికీ దెబ్బలు తగిలాయి. కానీ ఎవరినీ ఏమీ చెయ్యలేదు. అంతా కలిపి ఏడు, ఎనిమిది నిమిషాలలో జరిగిపోయిందట! ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బూ, బంగారం, వస్తువులు… అప్పట్లో టీవీ, మిక్సీ తప్ప ఏం వుంటాయీ? చీరలు, పాంటూ షర్ట్‌లూ కూడా మూట కట్టుకుని వెళ్ళి వుంటారు. దాంతో దొంగలు కొట్టే కాలనీ అని దానికి పేరొచ్చింది.  అలా సుశీలని ఇంటర్వ్యూ చెయ్యడంతో పరిచయం బాగా అయింది. తెలుగుకి కమల వుండేది. పెద్ద జడ చక్కగా వూగుతూ నడిచేది. ఈశ్వరయ్య సార్ అని స్కూల్ చూసుకోవడానికి వుండేవాడు పెద్ద మనిషి.

టీచర్లు అందరూ బాగానే చదువు చెప్పేవారు. పిల్లలు కొద్దిగా లేనివాళ్ళు వచ్చేవారు. వాళ్ళు జీతం కట్టలేదని, వాళ్ళమ్మలని పిలిచి అడగమంటే నాకు మొహమాటంగా వుండేది. నేను కొన్నాళ్ళకి సెకండ్ క్లాస్‌కి ప్రమోట్ అయ్యాను. ఈ పిల్లలు కొంచెం ముదుర్లు. కాని నాకు చిన్నపిల్లలతో కాలం గడపడం, ఉద్యోగం స్ట్రెస్ కాకుండా స్ట్రెస్ బస్టర్‌లా మారింది.

అశ్విన్ రెండో క్లాసుకి వచ్చాకా, క్రిష్ణనీ డీ.ఏ.వి.లో జాయిన్ చెయ్యడానికి తీసుకెళ్ళాం. శేషగిరిరావ్ అనే కరెస్పాండెంట్ వుండేవాడు. పిల్లలంతా ‘సార్’ అని అతన్ని చూసి భయంతో పరుగులు తీసేవారు. అయనని మొదటిరోజే మా క్రిష్ణ వెనకనుండి వెళ్ళి, వీపు కింద గుప్పెటతో కొట్టి, అయన తన వైపు చూడగానే నవ్వి, “నన్ను పట్టుకో” అని పరిగెత్తుకొచ్చాడు.

ఎల్.కె.జి. ఎడ్మిషన్ కోస్ం మేం ఎంతో భయపడితే, వీడి ముద్దు మాటలకి ఎడ్మినిస్ట్రేటర్ ఉమా మేడమ్ సీట్ ఇచ్చేసింది.

పిల్లల్ని… కొంచెం అల్లరి చేసే పిల్లల్ని లక్ష్మీ టీచర్ అనే ఆవిడ కింద కూర్చోపెట్టేది. ఓ నాడు నేను సడెన్‌గా వెళ్ళేసరికి వీడూ, ఇంకో ఇద్దరు బుగ్గల నిండా మట్టి మరకలతో నేల మీద కూర్చుని పాఠాలు వింటున్నారు. నా రక్తం ఉడికిపోయింది. ఆవిడ్ని ఛడామడా తిట్టి, పిల్లాడ్ని తీసుకుని ప్రిన్సిపల్ సీతా కిరణ్ దగ్గరికి వెళ్ళి “నేనూ టీచర్‌నే, వాళ్ళని ఇలా అసమానతతో చూస్తే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా వుంటుంది?” అని అరిచానో, ఏడ్చానో కానీ ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే క్రిష్ణని కౌగిలించుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటాను. వాడిప్పుడు ఎం.ఎస్. చేసి కాలిఫోర్నియాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు! నన్ను ఏడిపించడానికి “అమ్మా… ఇక్కడ మా బాస్ ఏడిపిస్తోంది… రా, ఒకసారి వచ్చి మాట్లాడు…” అంటూంటాడు.

నేను పిల్లల కోడిలా వుండేదాన్ని. వీళ్ళకి తోడు మా అన్నయ్య పిల్లలు రవిచంద్రా శరత్‌లు కూడా శలవలొస్తే చాలు మా ఇంటికొచ్చేస్తూ వుండేవారు. నలుగురికీ తలంట్లు పోసి ఒళ్ళు నలుస్తూ ‘వినాయకుడి కథ’ చెప్పేదాన్ని. అన్నం పెడ్తూ ఏ కూర తిననంటే, ఆ కూర గురించి కథ కల్పించి చెప్పేదాన్ని.

ఆ స్కూల్లో మందకోడిగా నా జీవితం సాగుతున్న తరుణంలో ఓ రోజు గ్రౌండ్‌లో నా క్లాసు పిల్లల్ని ఆడిస్తుంటే, వాళ్ళ ఆడపడుచుని తీసుకుని ఉద్యోగానికి లలిత వస్తూ కనపడింది!

స్నేహితురాలు లలితతో రచయిత్రి

‘ఈవిడ నవ్వుతుంటే ఎంత బావుందో?’ అనుకున్నాను. నన్ను చూసి “ఈ స్కూల్లో టీచర్‌గా వస్తే ఈవిడతో స్నేహం చేసుకోవాలి” అని లలిత అనుకుందట. తర్వాత చెప్పింది.

అలా లలిత హిందీ పండి‍ట్‌లా ఆ స్కూల్లో చేరింది. ఇంతలో ఏన్యువల్ డే సెలెబ్రేషన్స్ వచ్చాయి. పిల్లల చేత ఏం పెర్‌ఫార్మ్ చేయిస్తారో రాసి ఇమ్మన్నారు.

 (సశేషం)

Exit mobile version