జీవన రమణీయం-142

4
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]మ[/dropcap]నకి రాచరిక వ్యవస్థ లేదే! కీలుగుర్రం, గులేబకావళీ కథల్లో రాణుల్ని మనం చూడలేదే అన్న బెంగ ఏదైనా వుంటే తమిళనాడు ముఖ్యమంత్రి పురుచ్చి తలైవి, జయలలిత గారిని చూసాకా పూర్తిగా పోయింది! ఏమి రాజసం… ఎంత దర్పం… ఏమి పటాటోపం… ఆవిడ వస్తూ వుంటే అందరూ భూమిలోకి వంగే వారే తప్ప, తలెత్తిన వారు లేరు! మేం ఇదంతా ఆవిడ స్టేజ్ మీదకి ఎక్కుతుంటే చూసాం. ‘అయ్యయ్యో! బ్రహ్మయ్య… అన్యాయం చేసావేమయ్యా’ అనీ, ‘కట్టుకో కట్టుకో పట్టుచీరా పట్టుకో పట్టుకో మల్లెపూలూ’ అనీ మన ఏ.ఎన్.ఆర్, ఎన్.టీ.ఆర్‍.లతో డ్యూయెట్‍లకి డాన్స్ చేసినది ఈ నటేనా? అని అనుమానం కలిగింది ఆవిడని చూస్తే!

నాగేశ్వరరావు గారికి స్పెషల్ చార్టర్డ్ ఫ్లయిట్ వేయించారు, కుటుంబంతో వచ్చారు. అప్పటికే కాక్‍టైల్స్, డిన్నర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆయన్ని కలవడం అసాధ్యం అనిపించేలా చుట్టూ పాత హీరోయిన్స్, కొత్త హీరోయిన్స్ గుమిగూడారు! మన వందేళ్ళ సినిమా వేడుకల్లో మహానటుడ్ని సన్మానించుకోవడం గొప్ప గౌరవం!

“తాగేవాళ్ళ మధ్య ఎక్కువ సేపు వుండకూడదమ్మా… ఎప్పుడెప్పుడివో మనసులోంచి తన్నుకొచ్చి కాసేపటికి గొడవలు పడ్తారు… త్వరగా వెళ్ళిపోవడం బెటర్… భోజనానికి రా” అన్నారు పరుచూరి గోపాలకృష్ణగారు. ఆ మాట నిజం అని వెంటనే ప్రూవ్ అయింది, ఒక పెద్ద హీరో అందరినీ తిట్టడం ప్రారంభించగానే! మేం లేచి భోజనాల వైపు వెళ్ళాం.

కృష్ణకుమారి గారితో నేను

మర్నాడు అందరం మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ దగ్గర కలుసుకున్నాం. కుర్రాళ్ళు, తమన్, దేవిశ్రీ ప్రసాద్, అల్లరి నరేష్, తరుణ్, నానీ… చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో కలిసారు. బయట మేనేజర్లు కార్లు ఎరేంజ్ చేస్తున్నారు. తరుణ్‍తో, కోట శ్రీనివాసరావు గారితో నేను ఫొటోలు దిగాకా, జమునా రాణి గారు కనిపించారు. “ఒక ఫొటో తీయించుకుందాం అండీ” అని నేను ఆవిడ దగ్గరకి వెళ్ళి అడిగితే “తప్పకుండా తల్లీ… మీ తరానికి మేం తెలుసన్న మాట!” అన్నారావిడ. “మీ ‘ముక్కు మీద కోపం…’ ఎలా మరిచిపోగలం?” అని సెల్ ఎవరికిచ్చి ఫొటో తీయమందామా అని చుట్టూ చూస్తే, కెమెరామెన్ ఛోటా. కె. నాయుడుగారు వస్తూ, నన్ను “హెలో మేడం” అని పలకరించారు. నేను “సార్… ప్లీజ్ ఒక్క ఫొటో తీయండి మాకు” అని నా సెల్ ఇస్తే, “సరే” అని అడ్జస్ట్ అవుతూ, “కొంచెం డల్‍గా వుంది… సరిగా రాదేమో” అన్నారు నా ఐ పోన్‍లో చూస్తూ. జమునారాణి గారికి ఆయనెవరో తెలియదు పాపం, “కొంచెం తెలిసినవాళ్ళకి ఇచ్చి తియ్యమనమ్మా” అన్నారు. ఆయనా, నేను కూడా మొదట బిత్తరబోయి, తర్వాత నవ్వేస్తూ, “ఆయన నెంబర్ వన్ కెమెరామాన్ మేడం” అన్నాను. ఆవిడ వెంటనే “సారీ, ఏం అనుకోకు బాబూ… సరిగా రావడం లేదు అంటే నేను మిస్ అండర్‌స్టాండ్ చేసుకున్నాను” అన్నారు. ఇప్పటికీ ఆ ఫొటోలో నా నవ్వు చూస్తే ఆ సంఘటన గుర్తొస్తుంది!

జమునారాణి గారితో నేను

తరుణ్, నేను, కోటా గారు ఒకే కార్లో ఎక్కాం. హోటల్ నుండి కొంత దూరం రాగానే నా బ్యాగ్ భుజానికి లేదని గమనించి కెవ్వుమని “నా బ్యాగ్… నా బ్యాగ్” అని అరిచాను. నిజంగా వీళ్ళందరినీ చూసి ఒళ్ళు మరిచిపోయాను. కోటాగారు వెంటనే “కంగారు పడకమ్మా. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఎక్కడ పెట్టినా పోదు” అన్నారు. తరుణ్ “కానీ వెనక్కి వెళ్తే ఫ్లయిట్ మిస్ అవుతాం. ఎలాగ?” అన్నాడు. నేను గుడ్ల నీరు కుక్కుకున్నాను… అందులో డైమండ్ నెక్లెస్ ఉంది… కోటా గారు ముందు సీట్లో డ్రైవర్ పక్కనా, వెనకాల నేనూ తరుణ కూర్చున్నాం. నేను నసుగుతూ “ఆర్నమెంట్స్ వున్నాయి అండీ అందులో” అన్నాను. కోట గారూ చిద్విలాసంగా “ఎక్కడికీ పోవు… నేను తెప్పిస్తాగా” అని సెల్ తీసి మేనేజర్‍లకి కాల్ చేశారు. “బలభద్రపాత్రుని రమణి గారు, రైటర్. తన బ్రౌన్ హేండ్ బాగ్ మరిచిపోయారు… కారిడార్‍లో సోఫా దగ్గర… చూడండి… ఎవరొస్తున్నారు హైదరాబాద్ ఫ్లయిట్‌కి ఎయిర్‍పోర్ట్‌కి… వాళ్ళకిచ్చి పంపించండి” అన్నారు. మేం ఎయిర్‍పోర్ట్ చేరాం… నేను కళ్ళ నీళ్ళు ఆపుకుంటూ, ఎంట్రన్స్ దగ్గరే నిలబడ్డాను.. మేనేజర్ మోహన్‍కి రెండు సార్లు ఫోన్ చేసాను. ఎంగేజ్ వచ్చింది. మన టెన్షన్ మనది కానీ, వాళ్ళు ఇంతమంది సెలెబ్రిటీస్‌ని పంపించడం, స్టార్ హోటల్‍లో బిల్స్ సెటిల్ చెయ్యడంలో బిజీగా వున్నారు. రాత్రంతా రూం సర్వీస్ తెప్పించుకుని, తాగీ, తినీ, “మేం ఎక్స్‌ట్రా కట్టం” అన్న ప్రముఖులని కూడా చూసాను.

తరుణ్‌తో నేను

చివరకి మేనేజర్ ఫోన్ చేసి, “మేడం… మీ ఐడెంటిటీ కార్డ్ వుంది. బ్యాగ్ గుర్తు పట్టాం… వడ్డేపల్లి క్రిష్ణ గారితో పంపిస్తున్నాం” అన్నారు. అట్లాంటా వెళ్ళేటప్పుడు వడ్డేపల్లి గారి సెల్ ఫోన్ మేం చూస్తూ వుండగానే పోయింది పాపం. సెక్యూరిటీ చెక్‍లో వేసి, మరిచిపోయి సగం దూరం వచ్చి “నా సెల్” అని వెనక్కి వెళ్తే, లేదు. పైగా కనెక్టింగ్ ఫ్లయిట్‍కి పరిగెత్తాలి, అలా పోయింది పాపం!

తరుణ్, కోటా గారు నాకు ధైర్యం చెప్తూనే వున్నారు. శ్రీకాంత్, నరేష్, శివాజీ రాజా, అంతా కూడా నా బ్యాగ్ వచ్చేదాకా, “కంగారు పడద్దు… వచ్చాకే వెళ్దాం” అని నాకు తోడున్నారు. ఆ మూడు రోజులు అందరం కలిసి మెలిసి వున్నాం.

చివరకి వడ్డేపల్లి క్రిష్ణ గారిని చూడగానే అరిచాను. క్రిష్ణగారు భుజానికి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకు వస్తూ కనిపించారు! ప్రాణాలు కుదుట పడ్డాయి. ఆయన నాకు బ్యాగ్ ఇస్తూ “రాగానే సూట్‍కేస్… వెళ్ళేటప్పుడు బ్యాగ్ పారేసుకున్నారా? చూసుకోండి… అన్నీ వున్నాయా, లేవో?” అన్నారు. నేను బ్యాగ్ తెరిచి, జ్యూవెలరీ బాక్స్ తెరిచి చెక్ చేసుకున్నాను. డైమండ్ సెట్ వుంది… అది చాలు నాకు అనుకున్నాను!

సుధాకర్, అక్కినేని ప్రసాద్, వర్మా, మోహన్ అన్న ఆ మేనేజర్‌లందరికీ నా శతకోటి కృతజ్ఞతలు. నిర్వాహకులకి, ముఖ్యంగా అన్నీ తానే అయి చూసిన శ్రీ. కె.ఎస్. రామారావు గారికి అభినందనలు. ఎంతో బాగా నిర్వహించారు. అంత పెద్ద వుత్సవం!  

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here