Site icon Sanchika

జీవన రమణీయం-144

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]మ[/dropcap]ళ్ళీ 2014లో మాధవ్ దుర్భా అట్లాంటా నుండి “ఈసారీ నేనే ‘నాటా’కి కల్చరల్ ఛైర్, మీరు వస్తున్నారు” అని మెయిల్ ఇచ్చాడు. ఫణీ, మాధవ్ మొదటిసారి కలిపినప్పుడే నాకు స్వంత తమ్ముళ్ళతో సమానం అయిపోయారు. కృష్ణకాంత్ స్ప్రింగ్‍లో ఎమ్.ఎస్.‍కి వెళ్ళాల్సింది, ఫాల్‍కి మారింది వాడి ఏక్సిడెంట్ వల్ల, అందుకే నేనూ వెంటనే సరేనన్నాను. నేను అమెరికాలోనే వుంటే, వాడ్ని రిసీవ్ చేసుకుని, యూనివర్సిటీ కూడా చూసి రావచ్చు అన్న ఆశతో. ఇది మార్చ్‌లో అనుకుంటా చెప్పాడూ, పాస్‍పోర్టూ, వీసాలూ అన్నీ రెడీగా వున్నాయా లేదా చూసుకోమని… మేలో కృష్ణకి NCSU (నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ)లో, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి! సరే, నేను ఉత్సాహంగా ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటున్నాను, మా లలిత చిట్టె అనే ఫ్రెండ్ కువైట్ నుండి ఫోన్ చేసింది. “మేడం… మనం దుబాయ్ వెళ్ళొద్దామా?” అని. “ఎందుకూ?” అన్నాను. “ఏదైనా కొనుక్కోవచ్చు” అంది.

“చూడు లిల్లీ…” నేను తనని అలాగే పిలుస్తాను. ఆంధ్రభూమిలో తను ‘కోయిలా… కోయిలా’కి కవితలు రాసే టైం నుండీ పరిచయం. ఇప్పుడు కౌముదికి కూడా రెగ్యులర్‍గా ‘పరదేశి కథలు’ ఫీచర్ రాస్తోంది. “మా ఆయనలో ఒక దేశభక్తుడున్నాడు… నేను బొబ్బిలి వెళ్ళి వీణా, శ్రీకాకుళం వెళ్ళి చీపురూ, సిమ్లా వెళ్ళి షాల్స్, అనకాపల్లి వెళ్ళి బెల్లం కొనుక్కుంటానంటే వూర్కుంటారు కానీ, మన కష్టార్జితం వేరే దేశాల్లో ఖర్చు పెడ్తే వూర్కోరు” అన్నాను. “నేను ఓసారి వెళ్ళొచ్చాను మేడం… చాలా బావుంటుంది” అంది లిల్లీ. నేనూ టెంప్ట్ అయ్యాను. ఆలోచించి “సరే” అనేసాను. వీసా కోసం అప్లై చెయ్యడానికి మా ట్రావెల్ ఏజంట్ గణేష్ వుండనే వున్నాడు.

లిల్లీ వెంటనే మేరియట్ (జెడ్డాఫ్)లో కొత్తగా కట్టినది, రూమ్ బుక్ చేయించడం, టికెట్ కొనడం చేసేసేంది. లిల్లీ మేరియట్ కువైట్‍లో గెస్ట్ రిలేషన్స్ ఆఫీసర్‍గా చేస్తుంది. నేను ఫ్రెండ్స్ విషయంలో చాలా అదృష్టవంతురాలిని మొదటి నుండీ!

మే 28 రాత్రి నేను హైద్రాబాద్‍లో ఎయిర్ ఇండియా ఫ్లయిట్ ద్వారా దుబాయ్ వెళ్ళేట్లూ, అప్పటికే కువైట్ నుండి వచ్చి ఖతార్‍లో తన చెల్లెలి దగ్గరున్న లిల్లీ ఎయిర్ అరేబియా ద్వారా వచ్చేట్లూ ఏర్పాటు అయింది!

లిల్లీ రోజూ ఫైవ్ స్టార్ ఫుడ్ తింటుంది, ఇంటి ఫుడ్ తనకి ఇష్టం అని పులిహోరా, పూరీలు ప్యాక్ చేసుకుని, ఆవకాయతో బాటు ఓ ఐదు గంటల ముందు సాయంత్రం ఐదు గంటల కల్లా శంషాబాద్ ఎయిర్‍పోర్ట్‌కి చేరాను. నా దుబాయ్ వీసా కలర్‍లో ఫొటోస్టాట్ తీయించారు మా వారు. కానీ కౌంటర్‍లో క్లర్క్ బ్లాక్ అండ్ వైట్ బ్యూటీ చాలు అన్నాడు. …దేవుడా! అని వెళ్ళి బయట వున్న కౌంటర్‍లో బ్లాక్ అండ్ వైట్ కాపీ చేయించాను. సరే… మూడు గంటలు వెయిట్ చెయ్యాలి ఇంటర్నేషనల్ ఫ్లయిట్‍కి, చిప్స్ తింటూ మా వాట్సప్ గ్రూప్ ‘అమిగాస్’లో చాటింగ్ చేసాను. ఆ పేరు మల్లాది గారి శ్రీమతి పద్మజ పెట్టింది, మా ఫ్రెండ్స్ గ్రూప్‍కి. ఇంతలో ఓ అబ్బాయొచ్చి కాలింగ్ కార్డ్ 900/-కే ఇస్తాను, కొనుక్కోమని ఎంతగానో బతిమలాడాడు. నేను నిర్లక్ష్యంగా “నా ఫోన్ మీద రోమింగ్ వేయించాలే… అది చాలు” అన్నాను. చాలదని తర్వాత తెలిసింది!

ఈలోగా అక్కడ ఖతార్‍లో లిల్లి కూడా, తనని ఎయిర్‍పోర్ట్‌కి తీసుకెళ్ళాల్సిన చెల్లెలు ఇంటికి రాలేదని టెన్షన్‍గా ఎదురుచూస్తోంది. ఆమె చెల్లెలు అక్కడ ఖతార్‍లో కింగ్స్ ప్యాలెస్‍లో వర్క్ చేస్తుంది. ఎంతో టెన్షన్ తర్వాత ఫ్లయిట్ మిస్ అవుతానేమో అని తను కంగారు పడ్తుండగా, బుజ్జి అని పిలుచుకునే ఆమె చెల్లెలొచ్చి వేగంగా లిల్లీని ఎయిర్‍పోర్ట్‌కి చేర్చింది. లేకపోతే నేను దుబాయ్‍లో దిగి చాలా యాతన పడేదాన్ని!

నేను ఫ్లయిట్ ఎక్కాను ఇక్కడ. ఫ్లయిట్ నిండా ఇళ్ళల్లో పని చెయ్యడానికెళ్ళే చిన్న చిన్న అమ్మాయిలూ, మట్టి పని చెయ్యడానికి వెళ్ళే కార్మికులూ. గొడవ గొడవగా మాట్లాడుకుంటూ “నీకు ఎస్.ఎమ్.ఎస్ వచ్చిందా? నాకు రాలేదే?” అని ఏడవడం, కంగారుపడడం గమనించాను.

నా పక్కన సీట్ ఖాళీ, ఆ పక్క ఓ అనకాపల్లి అబ్బాయి. ఏదో కూలీ పని చేసే అతనే. తండ్రి పోయాడని పాపం, ఇంటికొచ్చి వెళ్తున్నాడట. ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్‍లు కాస్త వయసు మీరిన వాళ్ళు వుంటారు. ఖతార్‍లో దానిమ్మ మొగ్గల్లా నవ్వుతూ, తమ దానిమ్మ గింజల లాంటి పలువరుసని చూపిస్తారు, వీళ్ళు కాస్త చిరాగ్గా, ధుమధుమలాడ్తూ వున్నారు. ఎంత కాదన్నా ప్యాసింజర్ల స్టాటస్‍ని బట్టి ట్రీట్‍మెంట్ వుంటుంది అనిపించింది! కానీ ఏ మాట కా మాటే. ‘తాజ్’ హోటల్ నుండి తెప్పిస్తారేమో, ఫుడ్ మాత్రం చాలా బావుంటుంది! అమెరికా వెళ్ళేటప్పుడు కూడా చూసాను.

9.30 p.m.కి నా ఫ్లయిట్ బయల్దేరింది. టీ.వీ.లో ‘కామెడీ విత్ కపిల్’ షోస్ కొన్ని చూసి ఎంజాయ్ చేసాను. నాకు అవి ఇష్టం! షార్జా చేరేటప్పటికి మన టైమ్‍లో 11.30, వాళ్ళ టైమ్‍లో 10 అయింది. వాళ్ళు గంటన్నర వెనక్కి అన్నమాట. అమెరికా వెళ్ళినప్పుడయితే, ఒక స్టేట్ నుండి వేరొక స్టేట్‍కి వెళ్ళినప్పుడల్లా ఈ టైమ్ జోన్‍లు నన్ను పిచ్చిగా కన్‌ఫ్యూజ్ చేస్తాయి!

నేను వెళ్ళి దుబాయ్‍లో ‘న్యూ వీసా ఐ స్కాన్’ క్యూలో నిలబడ్దాను. అప్పుడు నా ఫోన్‍లో దుబాయ్ సిగ్నల్స్ వచ్చాయి, కానీ వెంటనే పోయాయి. నా ఫోన్ పని చెయ్యదని అర్థమైంది! లిల్లీని ఎలా కలవడం? తన తెలివితేటల మీద ధైర్యంతో లగేజ్ కలెక్ట్ చేసుకునే చోట నా కోసం వెతుకుతుందిలే అని ధైర్యంగా వున్నాను. ఇంతలో వెనక నుండొచ్చి, నా కళ్ళు మూసి “ఎవరో చెప్పుకోండీ?” అంటూ నా ఐక్యూని అంతలా అంచనా వేసింది. “లిల్లీ ఈ దేశంలో ఎవరు నా కళ్ళు కప్పగలరూ?” అన్నాను. ఐ స్కాన్ అయి మేం బయటపడేసరికీ 12.30 అయింది. వరుసగా లైన్‍లో వున్న టాక్సీల దగ్గరకి వెళ్ళి మేం మేరియట్ జెడ్డాఫ్ అని చెప్పాం… ఇక్కడ  నాకున్న సౌలభ్యం భాష. హిందీ, వుర్దూ అర్థం చేసుకుంటారు. అరబిక్ మాట్లాడ్తారు అనుకుంట.

మేం అడిగిన టాక్సీ అతను, లైన్‍లో మొదట వున్న టాక్సీ అతన్ని చూపించాడు. అతన్ని అడిగితే, అతను పోలీస్‍ని చూపించాడు, ఎందుకా అనుకున్నాం. అతను మమ్మల్ని లేడీస్‍మని, లేడీ నడిపే టాక్సీలో ఎక్కించాడు. మా టాక్సీ డ్రైవర్ నీల్‍మినీ, సింహళీ అమ్మాయి. సురక్షితంగా హోటల్ చేరాం.

మహిళా క్యాబ్ డ్రైవర్

ఆ అమ్మాయి చెప్పిన మాటల వల్ల, ఎంత రాత్రి అయినా స్త్రీలకి ‘భయం’ అనే మాటకి తావు లేదని అర్థమైంది.  బహుశా, అంత కఠినమైన శిక్షలుంటాయి అనేమో! హోటల్ చేరటానికి ఆ నిర్మానుష్యమైన వీధుల్లో ముప్ఫై నిమిషాలు పట్టింది. హోటల్ కనిపిస్తూనే వున్నా, సర్కిల్స్ సర్కిల్స్‌గా తిరిగి చేరటం జిగ్‌జాగ్ పజిల్‍లా అనిపించింది!

టాక్సీకి ఎనభై దీరమ్స్ అయితే, లిల్లీ వంద దీరమ్స్ ఇచ్చేసింది. ఒక దీరమ్ మన రూపాయల్లో 16. ఫోర్త్ ఫ్లోర్‍లో ఉన్న మా రూంకి చేరుకున్నాం. అహమ్మద్ అనే అబ్బాయి అప్పుడు ఫ్రంట్ డెస్క్ డ్యూటీలో వున్నాడు.

స్నేహితురాలు లలితతో రచయిత్రి

మేం రూం చేరి, టీ.వీ. ఆన్ చేస్తే టీ.వీ.లో స్క్రోలింగ్ ‘Welcome to Lalitha Chitte, Marriott Hotel and Marriott Executive Apartments’ అని వస్తోంది. అప్పుడిక దుబాయ్ చేరాం, అని నమ్మకం చిక్కి నవ్వుకున్నాం. “నేను ఎయిర్‍పోర్ట్‌కి లేట్‍గా చేరాను, ఖతార్‍లో గేట్ మారిపోయింది… నేను వెళ్ళలేకపోతే మేడం ఎంత ఇబ్బంది పడ్తారో అనుకున్నాను” అంది లిల్లీ. ఇద్దరం కరువు తీరా కబుర్లు చెప్పుకుంటూ, డ్రెస్ చేంజ్ చేసుకుని, నేను తెచ్చిన పూరీలు, పులిహోరా తిన్నాం.  

(సశేషం)

Exit mobile version