[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]
[dropcap]లి[/dropcap]ల్లీ ఫోన్ నుండి మా వి.ఎన్. ఆదిత్య (డైరక్టర్) చెప్పిన దినేష్‌కి కాల్ చేసాను. లోకల్ టూర్‍కి అతను గైడ్ చేస్తాడని ఆదిత్య నెంబరు ఇచ్చాడు. మేం వెళ్ళే ముందే యండమూరి వీరేంద్రనాథ్ గారు దుబాయ్‍లో తన ప్రోగ్రాం వుందనీ, వస్తే తప్పక కలవమని చెప్పారు. దినేష్ అక్కడికీ తీసుకెళ్తానన్నాడు. లిల్లీ స్నానం చేస్తుండగా, ఆమె ఫ్రెండ్ ఫర్జానా ఫోన్ చేసింది. ఆ మూడు నిమిషాల ఫోన్ కాల్‍లో నేనూ ఫర్జానా మంచి స్నేహితుల్లా మాట్లాడుకున్నాం. ఆవిడ భర్త ఒకప్పుడు లిల్లీ పని చేసే కువైట్ హోటల్‌కి ఫైనాన్షియర్‌ట, అలా పరిచయంట.
దినేష్ ప్రేమ్ అనే అతని నెంబర్ ఇచ్చాడు. ప్రేమ్ ఆ రోజు మాకు లోకల్ క్రూయిజ్ బుక్ చేసాడు.
నేను లిల్లీ తయ్యారయి, రెండో థాట్ లేకుండా ‘గోల్డ్ సూక్’కి టాక్సీ మాట్లాడేసుకున్నాం. లిల్లీ అంతకు ముందు ఓసారి వచ్చింది కాబట్టి, ఆ ఏరియాని ‘దాయెరా’ అంటారని తెలుసు. టాక్సీ డ్రైవర్లు మనం ఎక్కగానే ఒక స్లిప్ ఇస్తారు. దాంట్లో అతని పేరు, ఫోన్ నెంబరూ, లైసెన్స్ నెంబరూ వుంటుంది. మనం ఏదైనా మరిచిపోయి దిగిపోతే, వెంటనే తెచ్చి ఇస్తారన్న మాట. ఆ పద్ధతి మనకెప్పుడు వస్తుందో? ఇస్మయిల్ అనే టాక్సీ డ్రైవర్ మమ్మల్నిద్దరిని చూసి “మీరు అక్కా చెల్లెళ్ళా? పోలికలు వున్నాయి” అన్నాడు. అతను బంగ్లాదేశీ. ఎక్కువగా బంగ్లా, ఫిలిప్పీన్స్, సింహళీ, పాకిస్తానీ, ఇండియన్స్ టాక్సీలు నడుపుతుంటారు. ముఖ్యంగా దుబాయ్ టూరిస్టుల మీద ఆధారపడి నడిచే దేశం కాబట్టి వాళ్ళు టూరిస్టుల ఎడల చాలా మర్యాదగా వ్యవహరించాలి. క్రైమ్ రేట్ అస్సలు వుండకూడదు. క్రైమ్స్‌కి దారుణమైన శిక్షలుంటాయి. ఇది ఆ దేశపు రాజు అహ్మద్ జాయేద్ శాసనం! ఆ శిక్షలకి భయపడి ఎవరూ క్రైమ్ చెయ్యరు.
ఈ మాల్స్ లేదా ‘సూక్’ లన్నీ నీట్‍గా ఎయిర్ కండీషన్ చేయబడ్డవే. ఈ ఒడ్డు నుండి సూక్స్ వున్న ఒడ్డుకి చేర్చడానికి బోట్‍లో ఒక దీరమ్ తీసుకుంటారు, అదే టాక్సీలో అయితే చుట్టు తిరిగి వెళ్లాలి కాబట్టి పాతిక దీరమ్స్ తీసుకుంటారు. మేం బోట్ ప్రయాణం బాగా ఎంజాయ్ చేసాం. ఆహ్లాదంగా అనిపించింది, నీటి నుండి వచ్చే చల్లటి గాలికి. అక్కడ రెండే వెదర్స్. ఒకటి హాట్ వెదర్… ఇంకోటి వెరీ హాట్ వెదర్! అక్కడ రోడ్ల మీద టూ వీలర్స్, బైక్‍ల వంటివి కనిపించవు! ఆ వెదర్ వల్ల వాటి రేట్లు అధికంగా పెంచి, కార్ల రేట్లు చవగ్గా చేసి అమ్ముతారట. ఒక బైక్ 15000 దీరమ్స్ నుండి 80,000 దీరమ్స్ వరకూ వుంటే, కారు 10,000 దీరమ్స్‌కే కారుచౌకగా వస్తుందట. 1.6 దీరమ్స్‌కి ఒక లీటర్ పెట్రోల్ అయితే, మంచి నీళ్ళు కూడా అంతే! పెట్రోల్ నీళ్ళలా వాడడం అంతే ఇదేనేమో! కేవలం దుబాయ్ లోనే అత్యంత పొడవాటి రైల్వే ట్రాక్, ఓల్డ్ దుబాయ్ నుండి న్యూ దుబాయ్ దాకా చూస్తాం. ఇక్కడంతా… The biggest, the greatest, the longest, the honest… లాంటి పదాలే వాళ్ళ దేశానికి సంబంధించి వాడ్తూంటారు. ఎంత అదృష్టం!
ఈ గోల్డ్ సూక్‌లలో 18 కేరట్ల నుండీ 24 కేరట్ల వరకూ బోర్డ్‌లు కట్టి ఆ వేళటి గ్రామ్ ధరలు వేస్తారు. తెరలు కట్టినట్లూ, తోరణాలలా బంగారం వేళ్ళాడుతూ కనిపిస్తుంది. అసలు షాపుల నిండా అలా బంగారం వేళ్ళాడదీసి షాపులు వదిలేసి వెళ్తుంటారు… ఎక్కడా పోలీసులు కనిపించరు! కానీ మనం కాస్త స్వరం పెంచి, “క్యా బోల్ రే ఆప్” అని కానీ, “క్యా హై ఏ” అని అరిచినా, వెంటనే “క్యా హుహా?” అని మన వెనుక నుండి వచ్చి అటెండ్ అవుతారట. చుట్టూ మఫ్టీలో వుంటారట! జనంలో ప్రతి నాలుగో వాడూ పోలీసట! ఇవన్నీ మాకు తర్వాత అజీజ్ అనే గైడ్ చెప్తే తెలిసింది!
నాకు ఆ గోల్డ్ సూక్స్‌లో తిరుగుతుంటే మన కృష్ణదేవరాయల కాలంలోలా ‘అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట’ అని పాడాలనిపించింది. ప్రతి దుకాణంలోనూ గ్రామ్ ధర దీరమ్స్‌లో 18 కేరట్లదీ, 22 కేరట్లదీ, 24 కేరట్లదీ రాసి పెడ్తారు. ప్రతీ చోటా అదే ధర వుంటుంది. కౌంటర్ చెక్ చేసుకోనవసరం లేదు! దుబాయ్ బంగారం కల్తీ లేని స్వచ్ఛమైనది. మన గొలుసు మారుద్దాం అని చూపిస్తే నవ్వుతారు. అంత కల్తీ వుంటుంది.
మేం గోల్డ్ సూక్స్‌లో రెండు గొలుసులూ, నాకు చెవి రింగులు కొనుగోలు చేసి, తిరిగి తిరిగి చూసి చూసి కళ్ళూ, కాళ్ళూ నొప్పెట్టి, వెళ్ళి ఢిల్లీ దర్బార్ అనే హోటల్లో మన భోజనం చేసాం. బిరియానీ, రోటీలు, కూరా, అన్నీ అద్భుతంగా వున్నాయి. ముఖ్యంగా ఇలాచ్చీ టీ అద్భుతంగా వుంది.
మళ్ళీ ఒడ్డుకొచ్చి, పడవెక్కి, అవతల ఒడ్డుకి దిగి దీరమ్ ఇచ్చి, మళ్ళీ టాక్సీ ఎక్కి మా హోటల్ కొచ్చాం. టాక్సీ రేట్ మన రూపాయిల్లో వెయ్యికి తక్కువ అవదు!
రిఫ్రెష్ అయ్యేలోగా డైనర్ క్రూయిజ్ కార్ పికప్‍కి వచ్చింది. మేం తయ్యారయి పరిగెడ్తూ కూడా కారిడార్లో ఫొటోలు తీసుకోవడం మర్చిపోలేదు! అంత బావుంది ఆ హోటల్. మేం ఆ కార్లో వెళ్తూ ఆ డ్రైవర్‍తో మాకు మర్నాడు సిటీ టూర్ కావాలనీ, ఇలాగే వచ్చి పికప్ చేసుకోవాలనీ మాట్లాడుకున్నాం.
ఇంక డైనర్ క్రూయిజ్‍లో ఒకటే సందడి. బోలెడు తినుబండారాలు పెట్టారు. లిల్లీ నాకు ఆ తినుబండారాలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అరబిక్ రోటీలూ, ఫాలుదా, రకరకాల పుడ్డింగ్‍లూ, జెల్లీలూ, పేస్ట్రీలూ, సలాడ్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్, సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్… అన్నీ ఎంత తింటే అంత!
మధ్యలో ఓ అరబిక్ అబ్బాయి ఒళ్ళంతా లైట్స్ పెట్టుకుని అరబిక్ నృత్యం, బెల్లీ డాన్స్‌లు చేసాడు. పక్క నుండి వెళ్ళే షిప్పులు లైట్లతో ధగధగలాడిపొతూ అందంగా కనిపించాయి. దాదాపు గంటన్నర సేపు భోజనం చేస్తూ, డాన్స్‌కి చప్పట్లు కొడ్తూ వుండిపోయాం. ఔత్సాహికులు లేచి నృత్యం చేసారు అతనితో బాటు. డైనర్ క్రూయిజ్‍కి మా ఇద్దరికీ కలిపి 180 దీరమ్స్ తీసుకున్నారు. తర్వాత కార్లో మా హోటల్ దగ్గర దింపి, మర్నాడు పొద్దుట 9.30 కల్లా రెడీగా వుండాలి సిటీ టూర్‍కి అని చెప్పి వెళ్ళిపోయారు. మరునాడు రాత్రి లిల్లీ ఫ్రెండ్ ఫర్జానా ఫ్యామిలీ, వచ్చి మమ్మల్ని డిన్నర్‍కి తీసుకెళ్తాం అని చెప్పారు. మేం రాత్రి కబుర్లతో ఆలస్యంగా పడుకుని, లేచి ఆలస్యంగా తయ్యారయి 20 నిమిషాలు లేట్‍గా కారెక్కి క్షమార్పణలు చెప్పుకున్నాం. సిటీ టూర్ 220 దీరమ్స్ ఇద్దరికీ కలిపి.
మా గైడ్ అజీజ్ చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కల షార్ప్ అబ్బాయి. అక్కడ స్త్రీలు ధరించేది ‘అబయా’, ముసుగుని షైలా అంటారు. మగవాళ్ళు ధరించే అరబిక్ డ్రెస్‍ని ‘స్కస్‌డోరా’ అనీ, పొడవాటి తెల్లగౌనుని ‘స్కోర్ఫియా’ అనీ, నెత్తి మీద వేసుకునే దాన్ని, తల మీద పెట్టుకునే నల్లటి చట్రాన్ని ‘అకిల్’ అనీ అంటారు. అరబ్ కంట్రీస్ అన్ని చోట్లా కర్జూరం విపరీతంగా పండుతుంది. ‘అజ్వా’ అనే జాతి కర్జూరం గుండెకి చాలా బలంట!
(సశేషం)