Site icon Sanchika

జీవన రమణీయం-147

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]ఇ[/dropcap]లా చెప్తూ బస్‍లో మమ్మల్ని దుబాయ్ నుండి పరదుబాయ్ తీసుకొచ్చారు. తిరుగు ప్రయాణంలో మేం దుబాయ్ మాల్ దగ్గర దిగిపోయాము. అజీజ్ మాతో ఫోటో తీయించుకుని తన మెయిల్ ఐడీ ఇచ్చి మెయిల్ చెయ్యమనీ, ఎప్పుడొచ్చినా కాల్ చెయ్యమని చెప్పాడు, కార్డ్ ఇచ్చి. నేను, లిల్లీ మాల్‌కి వెళ్ళేముందు ఫుడ్ కోర్ట్‌ కెళ్ళి పిజ్జా, బర్గర్ తిన్నాం. దుబాయ్‍లో అన్నీ ఖరీదే… అసలు దుబయ్ అంటే Do-buy అని అర్థం. మంచి నీళ్ళు కూడా!

మాల్‍లో విండో షాపింగ్ చేసాకా, మళ్ళీ గోల్డ్ సూక్‍కి వెళ్ళాం. ఈసారి అమ్మకీ, మా ఆడపడుచుకి కూడా రెండు చిన్న గొలుసులు కొన్నాను, దుబాయ్ జ్ఞాపకంగా. ఆ రోజు తులం రేటు వేరేగా వుంది! కొంచెం తగ్గింది. సాయంత్రం ఫర్జానా కుటుంబం డిన్నర్‍కి తీసుకెళ్తారని, త్వరత్వరగా టాక్సీ చేసుకుని మేరియట్ కొచ్చాం.

కాసేపు రెస్ట్ తీసుకుని లేచి తయ్యారయ్యేసరికి ఫర్జానా ఫోన్ వచ్చింది, బయట వెయిట్ చేస్తున్నాం అని. మేం కిందకి దిగేసరికీ పొడవాటి ఖరీదైన వ్యాన్‍లో ఫర్జానా, ఆమె భర్త అక్తర్, ఆమె కూతుళ్ళు ఆస్మా, ఈ అమ్మాయి మెడిసిన్ చదువుతోందట, అమ్నా, బిలాల్ అనే ఇంకో అమ్మాయి, అబ్బాయి… వీళ్ళు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారట, అంతా రెడీగా వున్నారు.

ఆ తర్వాత కాలం మాకు తెలీకుండా దొర్లిపోయింది. వాళ్ళ పిల్లలు మాతో కలిసిపోయారు. అందరం బోలెడు పాటలు పాడుకున్నాం, అల్ బ్రహ్మిస్ అనే పాకిస్తానీ రెస్టారెంట్‍కి వెళ్ళాం. అక్కడ ‘అల్’ అని వుంటుంది అన్నింటికీ. అంటే ‘శ్రీ’ అని మనకి అర్థం వచ్చే పదంలాగా అన్న మాట. నా గుండెలు గుబగుబలాడాయి పాకిస్తానీ రెస్టారెంట్ అనగానే, నేను వెజిటేరియన్‍ని కాబట్టి. కానీ అక్కడ అతి పెద్ద బఫే వుంది, అందులో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్ని డిషెస్ వున్నాయి!

పానీ పూరీ మనదానిలా లేదు కానీ పెట్టారు… ఫ్రైడ్ రైస్, దాల్, రకరకాల పుడ్డింగ్స్‌తో బాటు జిలేబీ, గులాబ్ జామ్, ఫాలుదా, బర్ఫీ, కలాకండ్ లాంటి ఇండియన్ స్వీట్స్ కూడా వున్నాయి. ఆ తర్వాత ఫ్రూట్స్.

నన్నూ అనబడే ఫర్జానా – ఈలోగా ఆస్మా నాతో చనువుగా వుండడం చూసి “మీరు అత్తాకోడళ్ళులా వున్నారు” అనేసింది. ఆస్మా అయితే, “ఇలాంటి సాస్ దొరికితే అంతకన్నా ఎక్కువేం కావాలి?” అని నన్ను కౌగిలించుకుంది. “మంచి డాక్టర్ కాబోతున్న పాకిస్తానీ కోడలు వెతకకుండానే దొరికితే ఇంతకన్నా ఏం కావాలి?” అని నేనూ నవ్వాను.

నన్నూ నాతో “మీతో ఎన్నో ఏళ్ళుగా నాకు స్నేహం అనిపిస్తోంది” అంది. అందరం ఫెస్టివల్ సిటీ కెళ్ళాం. నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎక్కడో పాకిస్తానీ కుటుంబంతో ఇలా ఇంత స్నేహం అవుతుందని. స్నేహానికి ఎల్లలు లేవు కదా!

వాళ్ళు మమ్మల్ని హోటల్ దగ్గర దింపి వెళ్ళిపోయేసరికి అర్ధరాత్రి అయింది. నేనూ, లిల్లీ చాలా సేపు గడిచిపోయిన రోజూ, గడిచిన జీవితం గురించి మాట్లాడుకునేసరికీ తెల్లారిపోయింది. మర్నాడు చాలా లేట్‍గా లేచాం. షాపింగ్ తప్ప డెజర్ట్ సఫారీ లాంటివేం పెట్టుకోలేదు. వద్దు, మీకు ఆ ప్రయాణం సరిపడదని మా న్యూరోసర్జన్ చెప్పి పంపాడు. నాకు స్పైనల్ కార్డ్ సర్జరీ చేసిన డాక్టరు గారు డా. ఆర్.టీ.ఎస్. నాయక్ గారు.

ఇక్కడ హైదరాబాద్‍లో వుండగానే వీరేంద్రనాథ్ గారు తను 29న బయలుదేరి దుబాయ్ 30న వస్తున్నట్లూ, అక్కడ TEAM అనే సంస్థ వాళ్ళు పిలిచారనీ అతిథిగా అని చెప్పారు. నేను ఆ ప్రోగ్రామ్‍లో కలుస్తానని చెప్పాను. హైదరాబాద్‍లో కలవలేని వాళ్ళని కూడా నేను అమెరికా లాంటి ఇతర దేశాలలో స్టేట్స్ దాటి వెళ్ళి కలిసి వస్తాను… కొన్నిసార్లు సికింద్రాబాద్ నుండి కోఠీ వెళ్ళడం కుదరదు నాకు! మధ్యాహ్నం దినేష్ వచ్చి నన్నూ లిల్లీనీ లంచ్‍కి తీసుకువెళ్ళాడు. బాగా ఎండలో చాలా దూరం వెళ్ళి తిన్నాం. ఫుడ్ విషయంలో దుబాయ్‍లో ఏమీ ప్రాబ్లం వుండదు. లిల్లీ ఫ్రెండ్స్ మేరియట్‍లో పెద్ద పోస్ట్‌లలో వున్నవాళ్ళు కొందరు కలిసారు. అందులో రిజ్వాన్ ఒకరు. అతి పెద్ద పోస్ట్‌లో వున్నాడు. కువైట్‍లో అతను వున్నప్పుడు, తనకీ, తన చెల్లెలికీ కొలీగ్ అని చెప్పింది. అతను పలకరించి వెళ్ళాడు. అహమ్మద్ అనే ఈజిప్షియన్ లిల్లీ బుకింగ్స్ గురించి ఫోన్‍లో మాట్లాడాడుట కానీ పర్సనల్‍గా చూడలేదుట! అతను వచ్చి పలకరించి, మరునాడు బ్రేక్‌ఫాస్ట్‌కి ఆహ్వానించాడు. మేం తీసుకెళ్ళిన ఇండియన్ స్వీట్స్ ఇచ్చాం.

నేను రెండు గంటల సేపు నిద్రపోయాక  లేచి, ఇద్దరం తయ్యారయి షెరటాన్ హోటల్‍కి వెళ్ళాం. గుమ్మంలోనే వీరేంద్రనాథ్ గారు ఎదురుపడ్డారు. ఆప్యాయంగా పలకరించారు. ‘TEAM’ అంటే ‘తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ ఎఛీవ్‍మెంట్ మీట్’ అట. అక్కడ బిజినెస్ చేస్తూ, కోట్లు గడిస్తూ, పెద్ద పెద్ద సంస్థలకి డైరక్టర్స్‌గా వున్న మన తెలుగు వాళ్ళని అక్కడ కలిసాను. బిజినెస్ అంటే కొంత అవగాహన ఏర్పడింది. వీరేంద్రనాథ్ గారి స్పీచ్ అయితే హైలైట్.

ఎన్నో విషయాలు చెప్పారు జీవితంలో పైకి వస్తున్న ఆ యంగ్ ఎంట్రప్రెన్యూర్స్‌కి. నాకు ఆయన రాసిన ‘డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు’ నవల గుర్తొచ్చింది. ఆ నవల చదివాక, చాలామంది కుర్రవాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ కింద ఆటోలు కొనుక్కుని నడుపుతూ, వెనకాల ‘దుడ్డు’ అని రాసుకునేవారట. అంతలా ఆయన నావెల్స్ మా చిన్నతనంలో యవ్వనంలో ఇన్‍స్పైర్ చేసేవి! యండమూరి అంటే చేతబడుల నవలలనీ, యద్దనపూడి అంటే కలల ప్రపంచంలోకి యవ్వనంలో వున్నవారిని తోసే నవలలనీ అనుకుంటారు అన్నీ చదవకుండానే చాలామంది. నోటికొచ్చినట్టు మాడ్లాడే ప్రాథమిక హక్కు అఫ్‍కోర్స్ ప్రజలకి వుంది కానీ చదివి మాట్లాడితే బావుండు. యద్దనపూడి గారి నవలలు – ఆత్మాభిమానం, మా కాళ్ళ మీద మేము నిలబడడం నేర్పిస్తే ఆడపిల్లలకి; రంగనాయకమ్మగారి నవలలు స్త్రీ స్వేచ్ఛ అంటేనూ, మూఢనమ్మకాలకి దూరంగా ఎలా వుండాలీ అనేవి నేర్పించాయి. కమర్షియల్ నవలల్లో సాహిత్య ప్రమాణాలు వుండవని చాలామంది అభిప్రాయం. విశ్వనాథ సత్యనారాయణ గారు అతి పెద్ద కమర్షియల్ రచయిత. ఆయన నవలల్లో సాహిత్యం లేదా? ‘సెల్లింగ్ వాల్యూ’ కమర్షియాలిటీ అయితే శరత్ చంద్ర చటర్జీ, రబీంద్రనాథ్ టాగోర్‍లని మించిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు – 18వ శతాబ్దంలో వాళ్ళు రాసిన నవలలు కూడా సినిమాలుగా, వెబ్ సిరీస్‍గా తీస్తే అద్భుతంగా ఆడ్తున్నాయ్!

ఇదంతా త్రిమూర్తులు కేశవులు అనే ఒక వీరేంద్రనాథ్ గారి అభిమానీ, యంగ్ ఎంట్రప్రెన్యూర్ నిర్వహించాడు. ఆ కంపీరర్ పాపం, ‘యందమూరి’, ‘ఎండమూరి’ అని ఈయన పేరు ఖూనీ చేస్తూ ఈయన్ని డయాస్ మీదకి ఆహ్వానించింది. తప్పక తెలుగు అమ్మాయి అయి వుంటుంది! ప్రోగ్రాం తర్వాత యండమూరి గారు నన్ను అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేసారు. చాలామంది డ్రింక్స్ వైపూ, మేం కొందరం భోజనాల వైపూ వెళ్ళాం.

లిల్లీ నేనూ, మర్నాడు రాత్రి షార్జా ఫ్లయిట్ ఎక్కాల్సిన వాళ్ళం. అనుకోకుండా తన ఫ్లయిట్ పొద్దుటే ఎక్కవలసిందని వాళ్ళ ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేసి చెప్పాడు. అంటే, రాత్రి దాకా నేను ఒక్కత్తినీ హోటల్‍లో వుండాలన్న మాట! దేశం కాని దేశంలో కొంచెం భయం వేసినా, ఆ దేశం ఎంత సురక్షితమో తెలిసి ఒక్కదాన్నీ కేబ్ చేయించుకుని ఎయిర్‍పోర్ట్‌కి వెళ్ళగలనని ధైర్యం వచ్చింది.

ఈ త్రిమూర్తులు కేశవులు అనే వ్యక్తిని నేను మూడు నెలల అనంతరం హైదర్‌గూడ అపోలోలో హడావిడిగా, ఈ సూటూ బూటూ లేకుండా పైజామాస్‍లో అతి మామూలుగా నడుస్తూ వస్తుంటే చూసి గుర్తు పట్టాను. నేనే వెళ్ళి మాట్లాడాను. “రమణి గారు కదూ!” అని వెంటనే గుర్తుపట్టి, “మా ఫాదర్ అండీ, సైకిల్ మీద వెళ్తూ ఏక్సిడెంట్ చేసుకున్నారు. మా వూరు నుండి వెంటనే తీసుకొచ్చాం” అన్నాడు.

ఆయన లెవెల్‌కి తండ్రి సైకిల్ మీద వెళ్ళడం ఏమిటీ? ఆనే ఆలోచన నాకు వచ్చే లోపే, “ఆయనకి 76 అండీ, వినరు, సైకిల్ మీద వెళ్ళొద్దు అంటే” అన్నాడు.

పెద్దవాళ్ళూ, పల్లెటూరి వాళ్ళూ వినరు… అన్నది అక్కడ ముఖ్యమైన పాయింట్ కాదు! ఆ వయసు వరకూ అంత బలంగా సైకిల్ తొక్కగలగడం అక్కడ వేలిడ్ పాయింట్. వాళ్ళ ఆహారపు, ఆరోగ్యపు అలవాట్లు అలాంటివి!  నేను మా డాక్టర్ గారికి చెప్పాను, నాకు తెలిసినవాళ్ళని!

లిల్లీ కొలీగ్‍తో ప్రొద్దుట బ్రేక్‌ఫాస్ట్ అయ్యాకా, తను నన్ను ఒక్కదాన్నీ గదిలో విడిచివెళ్ళడానికి చాలా బాధ పడింది. హోటల్‍లో నా ఫ్లయిట్ టైమింగ్స్ దాకా వుండేటట్లు మాట్లాడింది. ఏం ఫరవాలేదని నేను లిల్లీకి ధైర్యం చెప్పాను. మా సూట్‍కేసులు మేం కొన్న వస్తువుల వల పొట్టలు విచ్చుకుపోయాయి. లిల్లీ ఎడిషనల్‍గా ఇంకో సూట్‍కేస్‌ కూడా ఇచ్చింది, వాళ్ళ చెల్లెలికిమ్మని.

ముందు రోజు రాత్రి “ఇంకా మాట్లాడండి మేడం… మళ్ళీ ఎన్నాళ్ళకి ఇలాంటి అవకాశం మనకి వస్తుందో…” అంటూ వుండగానే నేను నిద్రపోయానుట.

అహమ్మద్ అనే లిల్లీ కొలీగ్‍తో బ్రేక్‍ఫాస్టు చేస్తున్నప్పుడు “పెళ్ళి అయిందా?” అని అడిగాను. “లేదు” అన్నాడు. అతను ఈజిప్షియన్. “హోటల్లో ఎవరూ అమ్మాయిలు నచ్చలేదా?” అన్నాను.  

(సశేషం)

Exit mobile version