జీవన రమణీయం-15

0
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నా[/dropcap] క్లాస్ పిల్లలు చిన్నపిల్లలు. వాళ్ళకి ఇండియాలో వున్న డిఫరెంట్ స్టేట్స్‌ని రిప్రజెంట్ చేసే ‘బ్రైడ్ అండ్ బ్రైడ్‌గ్రూమ్స్’గా  నేను ఒక రూపకం రాసి ప్రెజెంట్ చేశాను. నేను రాస్తాననీ, రాయగలననీ సుశీలకీ, లలితకీ తెలిసింది! తర్వాత లలిత కొంచెం పెద్ద పిల్లలకి ‘అదరక్ కీ పంజే’ అనే ఉర్దూ నాటకం నేర్పించింది. తొమ్మిది, పది క్లాసులు పిల్లలు వేస్తామంటే ‘డిటెక్టివ్ గుర్నాథం’ అనే కామెడీ ప్లే నేను రాస్తానని సుశీలకి చెప్పాను. తను టెన్త్ క్లాస్ టీచర్. ‘సరే’నంది. సుశీల అప్పటికే నాగినీ, పీకాక్ డాన్స్, ‘ప్రియుడా పరాకా’ ‘అగ్నిపూలు’  లోది మా భారతి పిల్లలలు మల్లికా, గాయత్రీలకు నేర్పిస్తోంది. అక్కలిద్దరికీ వేషాలిచ్చి తమ్ముడికి ఇవ్వలేదని మా ‘చందూ’ గాడు ఏడుస్తున్నాడు అని భారతి కంప్లయింట్ చేస్తే, లలితతో చెప్పి చందూకి ‘అదరక్ కీ పంజే’లో దూద్‌వాలా వేషం ఇప్పించాను.

నేను రాసిన నాటిక పిల్లలు నటిస్తూంటే నేను డైరక్షన్ చేశాను. అద్భుతంగా పండాయి డైలాగులు. ఓ నాడు ప్రిన్సిపల్ మొగుడి ముందు ప్రదర్శనలు ఇప్పించాం, ఏన్యువల్ డే కన్నా వారం ముందు, బాలేనివి తీసేద్దాం అని.

మా రెండు నాటికలకీ ఆయన పగలబడి నవ్వాడు. పిల్లలు అంతా బ్రహ్మాండంగా చేశారు!

నా క్లాసులో ‘సుందరి’ అనే చిన్న పిల్లుండేది. వాళ్ళు మా ప్రిన్సిపాల్‌తో పాటు ఒకే ఇంట్లో అద్దెకుండేవాళ్ళట మొదట్లో. వాళ్ళమ్మ కనకదుర్గ సింగర్. తను వస్తూ ఓసారి ‘రమ’ అని తన చెల్లెల్ని తీసుకొచ్చి ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ‘సింగింగ్’కి ఓ టీచర్ ఉండాలని ఆ స్కూల్లో జాయిన్ చేసింది.

రికమండేషన్ టీచర్ అని నేనూ లలితా ‘సుందరి పిన్ని’ ఏం చేసిందో చూడు… అని తనని కొన్నాళ్ళు ఆట పట్టించుకుంటూ మాలో మేం దూరం పెట్టాం. తీరా ఏన్యువల్ డే దగ్గరకొచ్చేటప్పటికీ రమ మాతో కలసి చిందులేస్తూ, చక్కని కోకిల స్వరంతో పాటలు పాడ్తూ దగ్గరైపోయింది! పెళ్ళి కాని మణీ, బీనా చాలా కోతి పిల్లలు. మేం కూడా అల్లరిలో తక్కువ తినలేదు… మా సుశీల ఒక్కర్తే కాస్త పెద్దమనిషి తరహా! కల్పన ఎల్.కే.జీ. టీచర్. చాలా చిన్న పిల్ల. ఇద్దరు పిల్లలు మా కళ్ళ ముందే పుట్టినా ఆ పిల్ల మాకు చిన్నపిల్లే! నాగాలాండ్ నుండొచ్చి, కళ్ళద్దాలతో, బాబ్‌కట్‌తో మోపెడ్ మీదొస్తుంటే కార్టూన్‌లా వుండేది.

“కల్పానా… ఈ రోజు రెండు పిలకలకు బదులు, ఒక పిలకే వేసుకున్నావు ఎందుకూ?” అంటే చాలు… “నేను చెప్తాను… నేను చెప్తాను… మా అమ్మ నన్ను ఒక్క జడ వేసుకోమంది. నాకు సమాధానం అవలేదు… నేను ఆలకించలేదు… అప్పుడు అమ్మ కోపగించారు…” లాంటి తెలుగు మాట్లాడేది. వాళ్ళ నాన్నగారు ఎయిర్‌ఫోర్స్ కమేండర్. మొత్తం అస్సాం, నాగాలండ్, త్రిపుర లాంటి చోట్ల పెరిగి వచ్చింది. చూడ్డానికి ‘పాష్‌గా’ వుండేది. మేమందరం గోంగూర మొహాలమే. మా పంజాబీ టీచర్స్ మహా అయితే చుడీదార్లు వేసుకునేవారు. కల్పన మాత్రం జీన్స్ వేసుకొచ్చేది. “మీదేం కులం?” అని మేం ఎప్పుడూ అడగలేదు. ఒకనాడు తనే “రమణీ మేడం. మీరు భోజనానికి ఆహ్వానిస్తున్నారు… మేం చేపలు పట్టేవాళ్ళం…. పర్లేదా?” అంది.

ఒక్కసారిగా నేనూ లలితా తెల్లబోయి, ఆ తర్వాత కల్పనని దగ్గరకు తీసుకుని ఫక్కుమని నవ్వేసాం. కల్పన మాటకి ముందు “మా కొండమాయ్య ఏం అన్నాడంటే…” అని మొదలుపెట్టేది. వరుసకి మావయ్య అయ్యే అతనితో పీకలోతు ప్రేమలో వుండేది. వాళ్ళమ్మకి ఆ పెళ్ళి ఇష్టం వుండేది కాదు!

మొత్తానికి ‘ఏన్యువల్ డే’ మేం వూహించిన దానికన్నా అద్భుతంగా మా రమ నేతృత్వంలో గ్రాండ్‌గా దిగ్విజయంగా జరిగింది.

నేనూ, లలితా, సుశీలా, రమా, మణీ, బీనా అందరం ఓ గ్రూప్ సాంగ్ కూడా పాడాము. రమణ అనే ఈనాడు రిపోర్టర్ వచ్చి వ్యాఖ్యానం చేశాడు. ఇప్పుడు విశ్వహిందూ పరిషత్, బ్రాహ్మణ సంఘంలో చాలా ఏక్టివ్‌గా కనబడ్తున్నాడు.

మొత్తానికి ఏన్యువల్ డే అయ్యాక నా ప్రాణసఖులు ఏతావాతా తేల్చిందేంటంటే ‘నేను రచయిత్రిని’ అని. నన్ను “నీలో టాలెంట్ వుంది… రాయి… రాయి” అని ప్రోత్సహించేవారు లలితా, సుశీలా.

నేను ఓ నాలుగు లైన్ల కవిత రాసి ఆంధ్రజ్యోతికి ఫొస్ట్ చేశాను. ఓ నాడు పోస్ట్‌మేన్ రెడ్డి ‘గణగణ’ గంట కొట్టుకుంటూ వచ్చి, “ఉత్తరం వచ్చిందా?” అంటే, “కాదమ్మా, మనీయార్డర్” అన్నాడు. “ఎక్కడి నుండీ” అని చూస్తే ఆంధ్రజ్యొతి నుండి. కవితకి పదిహేను రూపాయలు వచ్చింది. నేను పరుగెత్తి లలితకీ, సుశీలకీ చెప్పాను. వాళ్ళిద్దరూ నాకన్నా ఎక్కువగా ఎగిరి గెంతులేశారు.

“వెనుదిరిగినంతనే గుసగుసలు వినబడే
కుచ్చిళ్ళు జీరాడే, కాళ్ళేమో తడబడే
అద్దంల నా రూపే వెక్కిరించినట్టుండె!
ఇది ఏమి సోద్యమని నిగ్గదీయగ
నేడు….
కళ్ళల్లో గుచ్చుకునె నీ సూపు
ఛీ పాడు!”

అది నా మొదటి కవిత! తరువాత ఓ కథ వ్రాసి విపులకి పంపించాను. కానీ ఎంతకీ ఏ సమాచారమూ లేదు. తిరిగి పంపడానికి పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి, అవి బరువు తూపించి, పోస్టేజ్ పెట్టిన కవర్ కూడా జత చేశా! పోస్ట్ ఆఫీసులో రెడ్డికి అలా నేను రచయిత్రినని తెలిసింది. వాళ్ళేమీ తిరిగి పంపనూ లేదు, వెయ్యనూ లేదు.

నేను రోజూ ఒక లాంగ్ నోట్‌బుక్‌లో ‘తృప్తి’ అనే నవల రాస్తూ వుండేదాన్ని. అందులో అంతా ఉద్యోగాలు చేసే కోడలూ, ఉద్యోగాలు చెయ్యని అత్తా; ఉద్యోగం చేసే అత్తగారూ, ఆమెకి ఉద్యోగం చెయ్యని కోడలూ; పెళ్ళికాని ఉద్యోగస్తురాలూ, శ్రామిక మహిళలూ… వాళ్ళ సమస్యలూ! రోజూ స్టాఫ్‌రూమ్‍లో లలితా, సుశీలా అది డెయిలీ సీరియల్‌లా చదువుతూండేవారు! ఆ నవల శరవేగంతో ముందుకెళ్తోంది.

ఇది 1993లో మాట! ఒకనాడు మా రమక్క వచ్చి, నేను వంట గదిలో కాఫీ కలుపుతుంటే “ఓ కథ చదివాను ఇవాళ, విపులలో… ‘ముళ్ళబాట’ అని చెప్తోంది. “రచయిత్రి భావాలు భలే వున్నాయి… పెళ్ళి కాకుండానే వైదేహి అనే అమ్మాయికి గర్భం వస్తుంది” అనగానే… “హే… అది నేను రాశాను… నేనే…” అని అరిచాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here