Site icon Sanchika

జీవన రమణీయం-150

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]అ[/dropcap]మ్మ చాలా ప్రపంచం చూసింది కాబట్టి, తన 18వ ఏట నుండీ ఆ రోజుల్లోనే వుద్యోగం చేస్తోంది కాబట్టి, ముఖ్యంగా స్టేజ్ మీద పాట పాడేదీ, కళాకారిణి కాబట్టి మిగతా ఆడవాళ్ళ కన్నా ఎక్కువ లోకజ్ఞానం వుండబట్టి నాతో ఆ మాట చెప్పింది.

అక్కా వాళ్ళింటికి వెళ్ళగానే, మొదట నేను మా అక్క కుశల ప్రశ్నలకి జవాబివ్వకుండా, ఇంటి ఓనర్ ఎంత వెధవో చెప్పేసాను. “మరి ప్రభాకర్‍కి చెప్పావా?” అంది. “ఇప్పుడు మీ ఇంటి నుండి ఫోన్ చేస్తాను” అన్నాను. అది సెల్ ఫోన్‍ల యుగం కాదు, 1990 లో మాకు లాండ్ లైన్ కూడా లేదు! 1993లో వచ్చింది టెలీఫోన్ ఇంటికి.

మా ఆయనతో నేను “నువ్వు అర్జెంటుగా వేరే ఇల్లు చూడాలి! ఆ ఇంటి ఓనర్ మంచి వాడు కాదు… పొద్దుట…” అని ఆ సంఘటన మొత్తం చెప్పేసాను.

అవతల వైపు నుండి ఈయన “వాడి కాళ్ళూ చేతులు విరగ్గొట్టనా?” అన్నాడు.

బాగా కోపం వచ్చిందని అర్థం అయి, “అక్ఖర్లేదు, వాడి పాపం వాడిని వదిలిపెట్టదు, ఏమంత సుఖంగా వున్నారు ఆ కుటుంబం… పాపం పెళ్ళాన్ని, పిల్లల్ని తలచుకుంటే జాలేస్తోంది, వేరే ఇల్లు చూడు!” అన్నాను.

నాకు ఆయన్ని చిన్నప్పటి నుండీ ‘నువ్వు’ అనడం అలవాటు… ఈ మధ్య ‘మీరు’ అంటున్నాను… కొన్నిసార్లు. ఎట్లా పిలిచినా ఏమీ అనుకోరు.

నేనూ ఉమ అక్కా అన్నం తింటున్నంత సేపూ ఇలాంటి వేషాలు వేసే వెధవల గురించే మాట్లాడుకున్నాం. బయటకి వెళ్ళి వుద్యోగాలు చెయ్యకుండానే ఇలాంటి దరిద్రులు తగుల్తారు, ఇంక బయటికి వెళ్ళి వుద్యోగాలు చేస్తున్నప్పుడు తగలరా? ఇలాంటప్పుడు పెళ్ళాలకి మనం వెళ్ళి చెప్తే, ఆ పతివ్రతా శిరోమణులు ఠక్కున ప్లేట్ తిప్పి “మా వారు దేవుడు… అలాంటి మాటలంటే కళ్ళు పోతాయి… నీ బుద్ధులే మంచివి కావు!” అని ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో సంగీతలా అనినా అనచ్చు! ఎందుకంటే, ఆ మనిషితో ఆమె పిల్లల్ని కన్నది… వాళ్ళ చదువులూ, పెళ్ళిళ్ళూ, పేరంటాలూ అన్నీ పీటల మీద కూర్చుని చెయ్యాలి… అసహ్యించుకుంటూ అయినా ఇంకో ముప్ఫై నలభై ఏళ్ళు కలిసి ఒకింట్లో బతకాలి! ఈలోగా అతగాడు ఏం చేసినా, ఒంటరిగా వున్నప్పుడు తిట్టి, ఏడ్చి, మొత్తుకున్నా, నలుగురిలో పలచన చేసుకోరు… వెనకేసుకొస్తారు! నేను ఎంతో మందిని చూసాను. అసలా ఇంట్లోకి – మా బావగారూ, తోడికోడలూ పక్కింట్లో వుంటారని, పెద్దవాళ్ళకి దగ్గరగా వుండాలని వెళ్ళాం.

ఎందుకనో మా బావగారికి ఈ నైబర్ భక్తి కానీ, భజనలు కానీ, పిల్లల విచిత్ర ప్రవర్తన కానీ, ఆవిడ అతివాగుడు కానీ నచ్చేవి కావు! విమర్శించేవారు… మా వారు కానీ, వాళ్ళ అన్నయ్య కానీ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా మాట్లాడ్తారు. ‘No Drama People’. అస్సలు ఎమోషన్స్, అతి ప్రేమలూ, నాటకీయమైన డైలాగ్స్ వాళ్ళకి రావు! నేనూ, మా తోడికోడలు గీతా నవ్వుకుంటాం! ఆవిడ ‘హెపటైటిస్ బి’కి వాక్సిన్ కనిపెట్టిన శాస్త్రజ్ఞురాలు, అయినా ‘ఒక్కోసారి కాస్త ఎమోషన్, డ్రామా కోరుకుంటాం కధా! భర్త నుండి’ అనేది. ఆవిడ ఎప్పుడూ బిజీగా వుండి ఈ నైబర్స్‌ని పట్టించుకోలేదు కానీ, మా బావగారు “ఈడియెట్స్… వాళ్ళతో జాగ్రత్త… ఏదో నేచురల్‍గా లేదు వాళ్ళలో” అని మొదట్లో హెచ్చరించినా, నేను ఆయనకి ఈ భజనలు డిస్టర్బెన్స్‌గా వుండి అంటున్నారు అనుకున్నా! మొత్తానికి మా వారు, నేను అక్క దగ్గర్నుండి వచ్చేసరికి ఇల్లు చూసారు, మారిపోయాం. ఆవిడ కానీ, ఆయన కానీ, ‘ఎందుకు మార్తున్నారు?’ అని మా వారిని అడగలేదు! తేలు కుట్టిన దొంగల్లా వూరుకున్నారు.

మా అమ్మ ఇప్పటికీ సత్యసాయి డివోటీ! దానికీ, దీనికీ సంబంధం లేదు… ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం భక్తుల్ని తప్పుగా అనకూడదు. వీళ్ళు గంజాయి మొక్కలు తులసి వనంలో!

***

నేను పెళ్ళయి వేరే ఇంట్లో వున్నా, నెల తప్పానని తెలిసాక, మా అత్తగారు ఆగలేక, వంశాంకురం పుడ్తున్నాడని, ఇల్లు ఖాళీ చేయించి, నా మూడు గదుల ప్యారడైజ్ నుండి, తన ఇంటికి తీసుకెళ్ళిపోయారు 1985లో… ‘ప్యారడైజ్ లాస్ట్’ అని పేజీలు పేజీలు రాసేసుకున్నాను కూడా!

ఆవిడ నన్ను బాగా చూసుకున్నారు. నాకు ఏం ఇష్టమో తెలుసుకుని వండి పెట్టేవారు. అప్పటికి ఇంకా డిగ్రీ పరీక్షలు అవలేదు నాకు. మా అశ్విన్‍ని కడుపులో మోస్తూనే ఫైనల్ పరీక్షలు రాశా కస్తూరీబా గాంధీ కాలేజీ‌లో. మా అత్తగారికి చాలా పద్ధతులుండేవి! ప్రొద్దుటే లేవడం, పూజా, శుభ్రతా, పనీ పాటా… ఇవన్నీ సినిమాల్లో చూపించే కోడళ్ళలా నేనూ చేస్తే బావుండనని వుండేది.

నాకు వంట వచ్చు కానీ, ఆవిడలా అంత పొందికగా రాదు. టీ పెడ్తే పొంగిపోవడం, కూర చేస్తుంటే పోపు మాడడం, అన్నం మెత్తబడిపోడం, ఇలాంటివి జరిగేవి! కుంకుడుకాయలు కొట్టుకుని, శీకాయ ఉడక బెట్టుకుని, బాయిలర్ వేసుకుని తల స్నానాలు చేసే రోజులవి! నేను స్నానం చేస్తే బాత్‍రూంలో కుంకుడు పిప్పి వదిలి పెట్టేసాననీ, సరిగ్గా కడగలేదనీ, బట్టలు ఆరేస్తే ముడతలు వున్నాయనీ, ‘నీకు ఇమర్శ లేదు’ అనేవారు! అంటే ఏమిటో ఇప్పటికీ నాకు తెలీదు.

“బట్ట జాడింపూ, కూర తాళింపూ ఆడదాని పనితనం పట్టిస్తాయి” అనేవారు. ఆవిడ గుంటూరు జరీ చీరలు ఆరేస్తే కొంచెం కూడా ముడతలు వుండేవి కావు… ఒప్పుకోక తప్పదు. నాకు ఆ పనీ పాటలతో బాటు పూజా పునస్కారం కూడా పుట్టింట్లో అలవడ లేదు! మా అమ్మ ఏ వ్రతాలూ, నోములూ చేసినట్టు నాకు గుర్తు లేదు.

మా అత్తగారి కళ్ళకి పొద్దుట లేచేటప్పటికీ ఇద్దరు అరాచకమైన వ్యక్తులు కనిపించేవారు. ఒకరు పూజా పునస్కారాలు లేకుండా యోగాసనాలు వేస్తూ కనిపించే మా మావగారు అయితే రెండవది బారెడు పొద్దెక్కాకా లేచి, పూజ చెయ్యడానికి దేవుడి గదిలోకి వెళ్ళని నేను!

ఆ సమయంలో ఎదురు క్వార్టర్స్ ఖాళీ అయి ఓ పార్వతీ పరమేశ్వరుల లాంటి దంపతులు, బుజ్జి బుజ్జి ఆడ వినాయకుడూ, కుమార స్వామిల్లా, ఇద్దరు ఆడపిల్లల్ని వేసుకు దిగారు. ఏడెడ్ ఎట్రాక్షన్ తెల్ల చీరలో నందివర్దనంలా గుండు బామ్మగారూ! వాళ్ళు అమలాపురం వైపు వాళ్ళు. పొద్దుట నుండీ ఇంట్లో అభిషేకాలు, పూజలూ, మంత్రాలూ, తద్దినాలూ, పేరంటాలూ, నోములూ! ఇంక ఆవిడ ‘పిన్నిగారూ’ అని మా అత్తగారిని పిలుస్తూ లైన్ కలపడంతో ఈవిడ మనసు ఆనంద రాగ తరంగం అయింది…  

(సశేషం)

Exit mobile version