జీవన రమణీయం-152

0
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను ‘బాస్’ సినిమాకి స్క్రీన్ ప్లే చేసే రోజుల్లో ఒక అతను నన్ను కల్కి భగవాన్ దగ్గరకు తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేసేవాడు! “భగవాన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసారు, తీసుకురమ్మన్నారు” అని. వీళ్ళని మగవాళ్ళని దాసాలు, ఆడవాళ్ళని దాశీలు అంటారుట. వీళ్ళు ఇంతమందిని అని ఒక కోటా జనాన్ని, కల్కి భగవాన్ భక్తులుగా మార్చాలిట! అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్లు చెప్పారు. ఏదో కలిపిన పానీయం, తీర్థం అని ఇస్తారుట. తర్వాత మనం భజనలో పక్కవాళ్ళని ముద్దు పెట్టుకోవాలట… చేతులు  కలిపి గిరగిరా తిరుగుతాముట. భగవాన్‍ని ఎంత దూరం నుండి చూడాలో మనం కొనే టికెట్ నిర్ణయిస్తుందట! తర్వాత మహా టీ.వీ.లో అక్కడ ఆశ్రమాన్ని, పిచ్చిగా, వున్మత్తంగా ప్రవర్తిస్తున్న శిష్యులనీ చూస్తే, ఏవో డ్రగ్స్ తీసుకున్నారేమో అనిపించింది! కానీ ఆయన్నీ, వాళ్ళావిడ్నీ సింహాసనాల్లో కూర్చోపెట్టి భక్తులు 5 లక్షల దాకా టికెట్ కొని, వారి పాదాలు ముద్దాడడం చూసాను. తర్వాత నాకు తమ్ముడిలా క్లోజ్‍గా ఉండే అతనూ, ఒకప్పటి హీరో, తనని స్థలం విషయంలో వాళ్ళ అబ్బాయి కోట్లు రూపాయలు మోసం చేసాడని చెప్పాడు! అన్నీ విన్నవే… మహత్యాలూ విన్నవే… మోసాలు విన్నవే! ఎందుకు మనం భగవంతుడితో కలవడం, చాయ్ తాగడం? ఫొటోకి పూలేసి పూజ చెయ్యక అనుకునేదాన్ని!

జహీరాబాద్‍లో మావారు పని చేసేటప్పుడు మేం కార్లో వెళ్తుంటే, దారి పొడవునా బోలెడు ఆశ్రమాలుండేవి! మహారాష్ట్రా, కర్నాటకల్లో అవధూతలని ఎక్కువగా పూజిస్తారు. మగడంపల్లి అనే చోట ఒక బాబాకి వందేళ్ళు పైన వుంటాయి, కానీ చిన్న వయసులాగే కనిపిస్తారని, మా వారి ఆఫీస్ కొలీగ్స్ నన్ను తీసుకెళ్ళారు. అక్కడ ఫొటోలున్నాయి. బాబా వుడుకుతున్న అన్నం చేతితో కలుపుతున్నట్లూ అదీ! నాతో ఆ బాబా ప్రేమగా సంభాషించారు. “నువ్వు వస్తావని నాకు తెలుసు!” అన్నారు. అచ్చం సాయిబాబా లాగే తల గుడ్డా, కింద పొడవాటి అంగారఖా కాషాయంది ధరించి వున్నారు!

ఆ  బాబా మహత్యాలు ఏమో కానీ, అక్కడికి వెళ్లినప్పుడు నాతో వున్న మా పనిమనిషి తర్వాత మా ఇంట్లో అమ్మ చంద్రహారం దొంగిలించడం వల్ల, నేను ఆ బాబా పేరు వాడి “మగడంపల్లి బాబా మంత్రించిన నిమ్మకాయ ఇచ్చాడు,ఇది దొంగిలించిన వారింట్లో పెడ్తే, ఇంటిల్లిపాదీ రక్తం కక్కుకుని పడి చచ్చిపోతారు” అని వాళ్ళింట్లో మంచం మీద పెట్టబోతుంటేనే, అది భయంతో అరిచి, నానా ఆగం చేసింది. తర్వాత ఓ గంటకే అమ్మ దగ్గరకొచ్చి, అమ్మని మంచినీళ్ళు అడిగి, ఆవిడ తెచ్చే లోగా, పరుపు చింపి అందులో వేసి, “నీ బిడ్డ నన్ను అన్యాయంగా అనుమానించింది…ఇదిగో ఇక్కడే పరుపులో పడింది” అని పరుపులోంచి తీసినట్టు తీసి ఇచ్చి వెళ్ళింది! నేను దాన్ని ఇంట్లో మనిషిలా చూసాను, నాదే తప్పు! అందుకే ఒక్క మాట కూడా అనలేదు. మరునాడు గేటు తెరుచుకుని వస్తూ వుంటే “రావద్దు” అన్నాను. “నీ పిల్లల్ని  ఇంతప్పటి  నుండీ పెంచాను… నీకు సేవ చేసాను… నన్ను దొంగ అంటావా?” అని అరిచి గగ్గోలు పెట్టినా నేను ఒక్క మాట కూడా అనలేదు! మళ్ళీ రానివ్వలేదు. ఒకే కాలనీలో వున్నా మళ్ళీ నేనెప్పుడూ, సుశీల మొహం చూడలేదు.

అలా మగడంపల్లి బాబా పేరు నా స్క్రీన్ ప్లేలో వాడుకుని నిజజీవితంలో దొంగని పట్టుకున్నాను. అమ్మ రిటైరయ్యాకా వచ్చిన డబ్బుతో చేయించుకున్న చంద్రహారం… ఆవిడది నిఖార్సయిన కష్టఫలం!

నాకు స్కూల్లో తెలుగు చెప్పిన తెలుగు పండిట్, ఇంకో స్కూల్లో పని చేసే టీచర్‍తో కలిసి లేచిపోయి (ఇలా అనవచ్చో లేదో?), ఇద్దరూ కలిసి ‘ఇళ్ళు’ వదిలి వెళ్ళిపోయి, హైదరాబాద్ శివార్లలో అనేక ఎకరాలు ఆక్రమించుకుని ఆశ్రమం కట్టుకున్నారు. వాళ్ళావిడ కూడా మా స్కూల్లో టీచరే! చాలా మంచావిడ. ఆవిడ కర్మసన్యాసిని, ఈయన బాధ్యతల నుండి తప్పించుకుని, సన్యాసం వేషం వేసుకుని వెళ్ళిపోతే, ఈయన తల్లిదండ్రుల్నీ, పిల్లల్ని కష్టపడి పోషించి, నానా బాధలూ పడి సంసారం గట్టెక్కించింది! నేను ఆ ఆశ్రమానికి అమ్మని తీసుకుని వెళ్ళాను. ఈ తెలుగు పండిట్ నన్ను తొమ్మిదో తరగతిలో వుండగా, ‘పదహారేళ్ళ వయసు శ్రీదేవీ’ అని పిలవడం, నోట్స్ చూపిస్తుంటే కావాలని కాలు తొక్కడం చేసేవాడు! అందుకే సన్యాసం వేషం అన్నాను. లేదా నిజమైన ఆత్మజ్ఞానం, ఆ పక్క స్కూల్లో పని చేస్తున్న పంతులమ్మ వల్ల వచ్చి ఆత్మజ్ఞాని అయితే… చెప్పలేం!

నన్ను చూసి గుర్తు పట్టి కూడా, పట్టనట్టు  నటించాడు. నేను ఆయన అసలు పేరుతో ‘శాస్త్రి’ అని పలికితే, “‘శర్మ’, శాస్త్రి కాదు!” అని సవరించాడు. “మీకు పూర్వాశ్రమంలోని పేరు మీద కూడా భ్రాంతి పోలేదు. పూర్వాశ్రమం గురించి ఎందుకు మాట్లాడద్దు అన్నారు?” అని అడిగాను. ఇంతలో ఆయన ‘పార్ట్‌నర్’ అయిన ‘మాతాజీ’… అలాగే పిలుస్తున్నారు… “ఆయన స్వామీజీ… పూర్వ జీవితం గురించి ప్రశ్నలు వెయ్యద్దు… ఇంక వారి ధ్యానానికీ, ఏకాంత సమయానికీ వేళ అయింది. మీరు వెళ్ళి రండి” అంది. “మీకు పక్క స్కూల్లో పని చేస్తున్నప్పటి నుండే మా సార్‌తో స్నేహం వుండేదా?” అన్నాను. ఆవిడ వేలు గుమ్మం వైపు చూపిస్తూ వెళ్ళమంది. నేను బాగా నవ్వి “నేనో రచయిత్రిని! వూహించగలను” అన్నాను.

ఆ తర్వాత నామిని సుబ్రమణ్య నాయుడు గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్‍గా వుండగా ‘ముక్తి’ అని మూడు వారాల పెద్ద కథ, ఈ స్వామిజీ, వాళ్ళావిడని ప్రధాన పాత్రాల్ని చేసి రాసాను.

వీళ్ళకి సొసైటీ భయం పోయిందీ, ఎకరాలు ఎకరాలు లాభం! లేకపోతే ఇలా కాపురాలు విడిచి, డైవోర్సులు లేకుండా చేసే సహజీవనానికి లోకం ఎన్ని పేర్లు పెట్టేది? ఇప్పుడు మాత్రం కాళ్ళ మీద పడి కానుకలిస్తోంది! ఎంత తెలివి కదా! ప్రజలు ఎంత వెర్రివాళ్ళు కదా!

ఈ స్వామిజీనే మా ఇంటి దగ్గర సాయిబాబా గుడికి కూడా ఓపెనింగ్‍కి వచ్చాడు. పెద్ద మొత్తంలో, సర్వసంగ పరిత్యాగికి విరాళాలు దక్కాయి! ఓం తత్ సత్! ఇలాంటి వారూ వుంటారు. నండూరి శ్రీనివాస్ గారు యూట్యూబ్‌లో చెప్పే నిజమైన స్వామిజీలూ, సర్వసంగ పరిత్యాగులూ వుంటారు… మన కర్మఫలాన్ని బట్టి దొంగబాబాలూ, మంచి బాబాలు దొరుకుతారు!

నేను సెన్సార్ బోర్డ్‌లో వుండగా, నిత్యానంద బాబా మీద సినిమా తీసి, అతని రాసలీలలూ, అక్రమాలూ చూపిస్తే, అతని భక్తులు సినిమా ప్రదర్శన ఆపడానికి రివైజ్ కమిటీకి వెళ్ళడమే కాకుండా, సెన్సార్ అవుతుంటే, మాతో కలిసి చూసి, ఆ సీన్స్‌కి “మా కృష్ణ భగవాన్ లీలల్ని ఇలా అక్రమ సంబంధాలుగా చూపిస్తారా? ఎంత కారణ జన్ముడు ఆయన?” అని నేల మీద పడి ఏడ్చారు! తమాషా ఏంటంటే, వారు నిజంగా ఆయన్ని నమ్ముతున్నారు! భారతదేశంలో ఎంతమంది డేరా బాబాల గుట్టు రట్టు చేసినా, ఇంకా కాషాయం కట్టుకుని ఎవరినా ఆశ్రమం కట్టుకుంటే, వెళ్ళి నిలువు దోపిడీ ఇవ్వడానికి, పాపాలూ, మోసాలు చేసి గడించిన డబ్బుతో జనం రెడీగా వుంటారు! వారు కేవలం భజనలు చేయించి, విభూదులు పెట్టి ఆపితే అదృష్టం. లేదా ‘క్షుద్రవిద్యలూ’, ‘గుప్తనిధులూ’, ‘బలులు’ వైపు తిప్పారా? అంతే సంగతులు… మానసికంగా వీక్‍గా వున్నవారూ, స్క్రీజోఫ్రీనియా పేషంట్లూ వీరికి ఈజీ ప్రే లు!

మాకు తెలిసిన కుటుంబంలో 1999, 2000 ప్రాంతాలలో ‘రాంసే’ అనే అతను తీసే దెయ్యాల హారర్ ఫిల్మ్స్ ఎక్కువగా చూసింది, చార్టర్డ్ ఎకౌంటెన్సీ చేసే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా చార్టర్డ్ ఎకౌంటెంట్సే! బాగా విద్యాధికులు… ఆ అమ్మాయికి ‘దెయ్యం’ పట్టిందన్నారు… రాత్రి అయితే భయం, కేకలు, ఏడుపులు, వింత ఆకారాలు కనపడ్తున్నాయి అని గొడవ… పూజ గదిలో కుంకుమ అంతా మొహానికి మొత్తేసుకోవడం, నిమ్మకాయలు నోటితో కొరకడం, తాయెత్తులు, దిగదుడుపులు, ఇలా వుండేది పరిస్థితి! ఇప్పుడు కూడా ఓటిటిలో ఇలాంటి హారర్ చూసే వీక్ హార్ట్స్ జాగ్రత్త… వాళ్ళ కోసమే ఇది రాస్తున్నాను!  

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here