జీవన రమణీయం-156

2
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]క[/dropcap]మర్షియల్ రచనలని సాహిత్యం లోకే పరిగణించకపోతే వీళ్ళకి శరత్ చంద్ర చటోపాధ్యాయా, రబీంద్రనాథ్ టాగోర్, విశ్వనాథ సత్యనారాయణ గారూ కూడా వుండేవారు కారు! అంత కమర్షియల్ వేల్యూ వున్నవి వాళ్ళ నవలలు.

నేను బాగా గౌరవించే నాకు ఆప్తుడైన ఒక పెద్దాయన “నీకు కోపం వచ్చినా, నువ్వు చెప్పే పేర్లు కలవాళ్ళకి సాహిత్యంలో అంత స్థానం లేదు!” అనడంతో నాకు చిర్రెత్తుకొచ్చి “వరండా మీదకి వాళ్ళు వస్తే ఇప్పుడు ఆటోగ్రాఫ్‍ల కోసం ఎవరి దగ్గర జనం గుమిగూడ్తారో చూద్దామా? జనుల కోసం, రంజిప చెయ్యడం కోసం రాసి ప్రముఖులయిన వాళ్ళకి మీరు సాహిత్యంలో, మీ థీసిస్‍లలో స్థానం ఇస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత? జనం గుండెల్లో వారి స్థానం ఎవరూ తీసెయ్యలేరు! వాళ్ళ సక్సెస్‍ని చూసి మీకు అసూయ!” అన్నా.

పక్కనున్న వంశీ రామరాజు బాబాయ్ “జూనియర్ రంగనాయకమ్మ అంత వుద్రేకం వుంది నీకు!” అన్నారు. నేను చెప్పదలచుకున్నది మైక్‍లో చెప్పాల్సింది. కానీ నన్ను అంత గౌరవంగా పిలిచిన పెద్దల మీద గౌరవంతో ఆ పని చెయ్యలేదు!

అట్లాంటాలో నేనున్న సమయం చాలా తక్కువ! ఒక రాత్రి ఫణి ఇంట్లో, మళ్ళీ నాటా ప్రోగ్రామ్స్ అయ్యాక ఒక రోజు అనుకుంట.

మాధవ్ దుర్భా ఫామిలీ, గాయత్రి, పల్లవిలతో అట్లాంటాలో

గాయత్రి వంట చేసి పెట్టి, ఆఫీస్‍కి వెళ్ళిపోయాకా, ప్రణవికి సిరెంజ్‍తో పాలు తాగించి ఫణి, స్నానం చేయించి తయ్యారు చేసాడు! పల్లవి నా దగ్గరకి జడలు వెయ్యమని వచ్చింది. వాళ్ళమ్మ లాగా పల్లవికి పదేళ్ళకే బారు జడ. నాకేమో ఆడపిల్లలు లేక, జడలు వెయ్యడం అలవాటు లేదు! ఒక్క జడ వేసాను. “ఇట్స్ నైస్ ఆంటీ” అని నా మనసుని ఆనందపరిచి, “ఆంటీ, విల్ యూ బ్రింగ్ బన్నీ టు మై హౌజ్?” అంది. ఆ పసిపిల్లకి ‘అల్లు అర్జున్’ని నేను చూపిస్తాననీ, చూపించగలననీ  బాగా మనసులో పడిపోయింది. ఆ సంగతి అరవింద్ గారితో చెప్తే, “పల్లవి హైదరాబాద్ వస్తే, నేను బన్నీని చూపించే ఏర్పాటు చేస్తాను” అని మెసేజ్ చేసారు! ఆ మెసేజ్ వల్ల మనశ్శాంతి పొందింది!

ఫణి ఇంట్లో సొరకాయ కోస్తూ

ఫణి పెరటి తోట లోంచి నా చేత ఆనపకాయా, టమాటాలూ, కాకరకాయలూ కోయిస్తూ ఫొటో తీసాడు. తర్వాత భోజనం చేసి, ఫణి “అక్కా, స్వామి నారాయణ టెంపుల్ చూపిస్తా పద!” అన్నాడు. మేం ఇద్దరం టెంపుల్‍కి వెళ్ళాం. చాలా సేపు పూజారి ఇంకా గుడి తెరవక వెయిట్ చేయాల్సొచ్చింది. ఇంతలో లగ్జూరియస్ కార్‍లో పూజారి గారు డ్రైవ్ చేసుకుంటూ రావడం చూసి, మన ఇండియా పూజారులకి కూడా ఈ ఎకనామిక్ స్టాండర్డ్ వస్తే బావుండ్ను, అని మనస్ఫూర్తిగా అనుకున్నాను.

స్వామీ నారాయణ టెంపుల్, అట్లాంటాలో

స్వామీ నారాయణ్ టెంపుల్ అట్లాంటాలో చూసి తీరాల్సిన గుడి! సిరి చిందులు వెయ్యడం, సంపదని తివాచీగా పరవడం, ఆడంబరం అంబరం దాటడం, ఆ లతలూ, తీగలూ, చెక్కిన పాలరాతి స్తంభాలలో, వజ్రాలు పొదిగిన విగ్రహాల్లో, మొహం చూసుకోదగ్గ నేల మీద పాలరాతి గచ్చులో కనిపించింది!

స్వామీ నారాయణ టెంపుల్, అట్లాంటాలో

కళ్ళు రెండూ చాలలేదు ఆ గుడి సౌందర్యాన్ని చూడడానికి! అద్దాల మంటపంలా వున్న ఆ గుడిలో తిరుగుతుంటే, అది మయ సభ ఏమో అన్నట్లుగా వుంది! బాపట్స్ అని పిలవబడే వాళ్లు అన్ని చోట్లా ఈ మందిరాలు నిర్మించారు. చాలా సిరి సంపదలున్న వాళ్ళు వీరు. ఈ నగిషీ పనులు చేసిన గోడలు, స్తంభాలు సైతం దిగుమతి చేయించారట. స్వామీ నారాయణ్ అంటే ‘బలరాముడు’ అని నాకు అర్థమయింది. శ్రీకృష్ణుడూ, సుభద్రలూ కూడా పక్కన వున్నారు. ఆయనలో లక్ష్మీదేవి అంశ కూడా ఉండడం విశేషం!

బయట ఫుడ్స్ అనేకం అమ్ముతున్నారు. మేమూ ఏవో స్వీట్స్ కొన్నట్లు గుర్తు! ఏ గుడిలో అయినా ప్లమ్స్, పెద్ద పెద్ద ఆపిల్ పండ్లూ, బ్లాక్ బెర్రీస్ ప్రసాదంగా పెడ్తారు! నేను యూ.ఎస్.ఏ.లో పండ్ల మీద బ్రతికేయగలను. అంత ఇష్టం నాకు. హ్యూస్టన్‍లో చూసానూ, అట్లాంటాలో చూసానూ స్వామీ నారాయణ్ టెంపుల్స్. చికాగోలో కూడా చాలా బావుంటుందిట… కానీ నేను వెళ్ళలేదు!

ఇక్కడ కొంచెం ఆగి, అమెరికాలో గృహస్థులకి అతిథుల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి కొంత చెప్తాను! ఇక్కడా ఆ పరిస్థితి వున్నా, అమెరికాలో ఎక్కువ! ఒక వ్యక్తి పెళ్ళాన్ని తీసుకొని వచ్చాడు. “ఈ బ్రెడ్ ముక్కలు… నేను పీక్కుతినలేను… నన్ను ఎవరి ఇంట్లోనైనా వుంచండి” అన్నాడు. ఫణి ఇంట్లో బాలాంత్రపు రమణ దంపతులూ, నేను వుండడం వల్ల, ఇంకో అమ్మాయిని “మీ ఇంట్లో పెట్టుకోండి” అని సూచించడం జరిగింది. అప్పుడు మాధవ్ దుర్భా ఇంట్లో అస్వస్థులైన తల్లి తండ్రులూ, ఒక పూట మీగడ రామలింగేశ్వరరావు గారినీ కూడా వుంచడం జరిగింది. వడ్డేపల్లి కృష్ణగారికి కొడుకు వున్నాడు. సుద్దాల అశోక్ తేజ గారికీ వాళ్ళ అబ్బాయి వున్నాడు.

ఈ వ్యక్తి కోపిష్టి స్వభావం కలవాడు. ఈ అమ్మాయి ఆయన పేరు చెప్పగానే “అమ్మో! నేనూ మా ఆయన ఇద్దరం ఆఫీసులకి వెళ్ళేవాళ్ళం. నేను పొద్దుట వండి ఫ్రిజ్‍లో పెట్టి వెళ్తే, రాత్రొచ్చి వేడి చేసుకు తింటాం, ఒక్కోసారి మిగిలిపోతే, మర్నాటికి కూడా వేడి చేస్కుని తింటాం, బాబోయ్ ఆయనకి వేడి వేడిగా ప్రెష్‍గా వుంటే కానీ తినడు… అదీ రుచులు రుచులుగా, పైగా మా ఆయనకి నేర్పిస్తున్నాడు… ‘ఈ గడ్డి నేనైతే చస్తే తినను… ఎలా భరిస్తున్నారు?’ అని. నేను పెట్టుకోను” అని తేల్చి చెప్పింది .

ఈ దంపతులు ఇంకో ఫ్రెండ్ ఇంట్లో వుండి, “అమ్మయ్యా, అందర్లా కార్పెట్ కాకుండా, వుడెన్ ఫ్లోర్ వుంది మీకు… హాయిగా పసుపు రాసేసుకున్నాను” అని ఆవిడ అనడంతో, మా ఫ్రెండ్ గాభరగా వెళ్ళి బాత్‍రూమ్‍లో టబ్ చూస్తే, మొత్తం పసుపు మరకలు! ఆవిడ పసుపు రాసుకోకపోతే డయిలీ ఆయన వూర్కోడట!

ఇంకో దంపతులు… ఒకరి ఒకరు గారాబాలు పరాయి ఇంట్లో. “వేడి నీళ్ళు తప్ప తాగను… చన్నీళ్ళు జలుబు చేసేస్తాయి… ఏవండీ మీరు పడుకునే ముందు పాలు తాగండి” అని ఆవిడ, “నువ్వు ఇంకో రెండు ఇడ్లీలు వేసుకో..” అని ఇరవై ఇడ్లీలు లాగించే ఆయన భార్యకి మర్యాదలు… “ఆయనకి పెరుగు పులిస్తే తినరు… కొంచెం అప్పటికప్పుడు తోడు పెట్టండి” అని ఆవిడ.

పాపం బయట ఏదో చార్జర్ కొనుక్కుంటానంటే, ఫణి ఆ పెద్దాయనని తీసుకెళ్తే, “మీ క్రెడిట్ కార్డ్‌తో కొనేయండి” అని ఆయన తర్వాత ఆ డబ్బు ఇచ్చే ఊసే ఎత్తలేదు! ఎయిర్‍పోర్ట్‌కి వచ్చేటప్పుడు ఒక చోట సమోసాలు, కచ్చోరీలూ కొన్నాడని ఫణి, ఆయన మర్నాడు కూడా “ఫణిగారూ, నిన్న తెచ్చిన చోట సమోసాలు తెస్తారేంటీ? బావున్నాయి” అని అడిగాడు.

ఓ జంటని మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటారు అని నేను అడిగితే, నాలుగు బాదం పప్పులూ, రెండు కీరా ముక్కలు అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. మరి ఇలా పరాయి వాళ్ళింట్లో, ఇరవై ఇడ్లీలూ, అర డజన్ అరటిపండ్లూ, కేకూ, పెడ్తే ఇంకా తినేస్తున్నాడే వాళ్ళాయనా? వాళ్ళింట్లో శనివారం, గురువారం, మంగళవారం ఉపవాసంట! సాయంత్రం కాస్త ఉప్పుడు పిండి కానీ అరటి పండు కానీ తింటారుట! వాళ్ళు వుండే ప్రాంతంలో అసలు కూరగాయలు దొరకవుట! ఇద్దరే వుంటారు. బోలెడంత సంపాదన, పిల్లలు వెల్ సెటిల్డ్… వీళ్ళ దారిద్ర్యం అది… తినగలిగీ, పిసినారితనం వల్ల తినలేక, ఇక్కడ ఇట్లా తింటుంటే… తర్వాత వారికి అజీర్తి చెయ్యడం కూడా చూసాను. మొత్తానికి వాళ్ళు పర్స్ తియ్యకుండా, అన్నీ ఇతరుల చేత కొనిపించి బోలెడు షాపింగ్ చేసారు, కూతుళ్ళ కోసం, మనవళ్ళ కోసం… ఇంకొకరికి కాశీలో అది వదిలిపెట్టాను, ఇంకో చోట ఇది వదిలిపెట్టానూ… అని నియమాలు! ఇవన్నీ వాళ్ళని హోస్ట్ చేసే హోస్ట్‌లకి ఎంత ఇబ్బందికరమో గమనించరు. అసలే ఆడా మగా అందరూ పొద్దుటే లేచి, ఇంటెడు పని, పనిమనుషులు లేకుండా చేసుకుని, పిల్లలకన్నీ ప్యాక్ చేసి, వాళ్ళని క్రెచ్‍లోనో, బడిలోనో దింపి, వీళ్ళు మైళ్ళు, మైళ్ళు గంటల తరబడీ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసులకి వెళ్ళి, వుద్యోగాలు చేసుకోవలసిన దంపతులు యూ.ఎస్.ఏ.లో!  

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here