జీవన రమణీయం-159

0
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]ఎ[/dropcap]నిమిది రోజుల తర్వాత రమ్మక్క ఇంటి నుండి జ్యోతిర్మయీ కొత్తా ఇంటికి చార్లెట్ ప్రయాణం అయ్యాను. రమక్క బొట్టు పేట్టి చీరా, జాకెట్టు పెట్టింది. మేం ఎయిర్‍పోర్ట్‌కి వెళ్ళే దారిలో ఏదో కన్‌స్ట్రక్షన్ అవుతుండడం వల్ల, బావగారు కొత్త దారిలోంచి తీసుకెళ్ళారు. లేట్‌గా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాం. నాకు మొదటిసారి డాలస్‍లో సూట్‌కేస్ బయటే కర్బ్ చెకిన్ చేస్తే ఆలస్యంగా, అది మిస్‌ప్లేస్ అయి తిరిగి తిరిగి రావడం వల్ల, కర్బ్ చెకిన్ చెయ్యను. తీరా లోపలికి వెళ్ళాకా, వాళ్ళు ఆలస్యంగా వచ్చినందుకు నన్ను బోర్డ్ చేయనిస్తాం కానీ, సూట్‍కేస్ చెక్‍ఇన్ చెయ్యనివ్వం అన్నాం. నేను వెంటనే ఫెడెక్స్‌లో పంపమని బావగారికి చెప్పి, హేండ్ లగేజ్‍తో గబగబా ఫ్లయిట్ ఎక్కేసాను. ఫ్లయిట్ ఎక్కి జ్యోతికి కాల్ చేసి ఎడ్రస్ పంపమని, ఆమె పంపగానే, బావగారికి పంపాను. నా కంగారూ, మాట్లాడే విధానం అంతా చూసిన పక్క సీట్లో కూర్చున్న అబ్బాయి ‘తెలుగువారా?’ అని పలకరించి, తను డాలస్‌లో ఒక బిరియానీ హౌస్ నడుపుతానని, ‘సుధాకర్’ అని పరిచయం చేసుకొన్నాడు. మా సంభాషణ సినిమాల మీదకి మళ్ళింది. చెవికి రింగుతో, జుట్టుకి రబ్బర్ బ్యాండ్ వేసుకుని, టోర్న్ జీన్స్ ప్యాంట్‌లో నిర్లక్ష్యంగా కనబడుతున్న ఆ అబ్బాయి “తెలుగు సినిమాలు ఎందుకండీ అలా తీస్తున్నారూ? ఆ ఫైట్స్, బిల్డప్ షాట్స్, పెద్ద హీరోలు తమ వంశం గురించీ, తండ్రుల, తాతల గురించీ చెప్పుకునే గొప్పలు తప్పవా?” అని హేళనగా మాట్లాడాడు. “కమర్షియల్ హిట్స్ అవ్వాలంటే, జనం థియేటర్స్‌కి వెళ్ళాలంటే హీరోల సినిమాలకి ఆ మాత్రం బిల్డప్ వుండాలేమో… మంచి సినిమాలు టీవీలో చూస్తారు కానీ, థియేటర్‍కి వెళ్ళి ఎవరు చూస్తారు?” అన్నాను. “అసలు మంచి సినిమాలు అంటూ కథతో వచ్చే సినిమాలు మలయాళం, మరాఠీ, తమిళ్‍లో లాగా ఏం వచ్చాయని ఈ మధ్య?” అన్నాడు.

“అందరి బంధువయా చూసారా?” అడిగాను.

“ఆ! చంద్ర సిద్ధార్థ సినిమాలు అన్నీ చూస్తాను. ఆ నలుగురూ, మధుమాసం దగ్గర నుండీ…” అన్నాడు.

“టీవీలో చూసుంటారు” అన్నాను.

“అబ్బే! థియేటర్‌లోనే చూసాను. చెప్పానుగా ఆయన సినిమాలు అంటే ఇష్టం అనీ” అన్నాడు.

“మధుమాసం, అందరి బంధువయా – రాసింది నేనే” అన్నాను.

“ఆ?” అన్నాడు అర్థం కాక.

“ఆ రెండు సినిమాలకీ రైటర్‍ని నేనే. అందరి బంధువయాకి మాటలు కూడా రాసాను” అన్నాను.

అతను సీట్ బెల్ట్ తీసి, అనుకోని విధంగా ముందుకు వంగి నా కాళ్ళు టచ్ చేసి, “ఏం సినిమా అండీ? డైలాగ్స్ కోసమే డి.వి.డి. కొని పెట్టుకున్నాను. మా అమ్మా, నాన్నాగారు, అక్కా, బావా ఎవరొచ్చినా చూపిస్తాను, సినిమా అంటే ఇలా వుండాలని” అన్నాడు.

ఏ రైటర్ కన్నా ఇంతకన్నా ఏం కావాలి?నా కళ్ళల్లో ఆనందంతో నీళ్ళొచ్చాయి.

“నా భాగ్యం అండీ, మీతో పరిచయం” అన్నాడు.

నాతో పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరితోనైనా నాకు పరిచయం అవుతుంది. అట్లాంటాలో నేను ఫ్లయిట్ చేంజ్ అయ్యాను చార్లెట్‌కి. ఈసారి నా పక్క సీట్లో కూర్చున్న ఆఫ్రికన్ అమెరికన్ మహిళ, నా వైపు చూసి నవ్విన విధానానికే, ఆమె అంటే నాకు చాలా ఇష్టం కలిగింది. నేను ‘ఆనందోబ్రహ్మ’ చదువుతున్నాను మా గురువుగారిది. నా చేతిలో పుస్తకం చూసి, “అది ఏ లాంగ్వేజ్” అని అడిగింది. “తెలుగు” అని చెప్పాను. “యూ లైక్ బుక్ రీడింగ్?” అంది. “యా… ఐ యామ్ ఏ రైటర్” అని చెప్పాను. ఆమె గొప్ప ఉత్సాహంగా, “ఓ… గ్లాడ దట్ ఐ మెట్ యూ” అని తన బ్యాంగ్ లోంచి ఒక బొమ్మల పుస్తకం తీసి చూపించి “ఈవెన్ ఐ రైట్… బట్ ఫర్ డఫ్ ఎండ్ డమ్ చిల్డ్రన్… మై నేమ్ ఈజ్ హెయిల్..” అని చెప్పి చెయ్యి కలిపింది. నేనూ నా పేరు చెప్పాను. అది ప్రొనౌన్స్ చెయ్యడానికి ఆమెకి కొంత సమయం పట్టింది. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటుంటే, ఆమె పెప్పర్‍ మింట్స్ తీసి ఇచ్చింది. అవి దాసినచెక్క వాసనతో వున్నాయి. ‘సినమిన్’ అని చెప్పింది. పిప్పర్‍మెంట్ కాదు, పెప్పర్‌ మింట్ అని మొదటిసారి ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాను! ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వుండగా చార్లెట్ చేరాము.

విమానంలో పరిచయమైన రచయిత్రి మిసెస్ హెయిల్‍తో

లగేజ్ లేదు కాబట్టి, బ్యాగేజ్ బెల్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఎంచక్కా బయటకి వెళ్ళిపోయాను. జ్యోతి ఎదురుగా నవ్వుతూ నిలబడింది.

జ్యోతి ముందుగా వచ్చేసిందట, లేకపోతే నేను కంగారు పడతానని. తను కార్లో ఎక్కాకా డ్రైవ్ చేస్తూ అన్న మాట నన్నింకా వెన్నాడుతోంది!

చార్లెట్ నిజంగా సుందరమైన ప్లేస్. “ఎంత బావుందో మీ ఊరు” అంటే, “మాకు బోలెడంత ఆకాశం వుంటుంది రమణీగారూ, మీకు వుండదుగా ఇలా” అంది.

అప్పుడు గమనించా. ఆకాశం అంటుకునే లాంటి స్కై స్క్రేపర్స్ లేవు. మా హైదరాబాద్ లో పెద్ద  పెద్ద బిల్డింగ్స్ లేని చోట్ల కూడా, ఇరుకు వీధులవడం వల్ల ఆకాశం కనబడదు! జ్యోతిర్మయీ కొత్తా సహజ శైలిలో చమత్కారంగా రాసే రచయిత్రి. ఆమె మాటలూ, బ్లాగ్‍లో కబుర్లూ ఎంతో బావుంటాయి. ఈ మధ్య కోవిడ్ పిరేడ్‍లో వాళ్ళ అమ్మాయి సాహితి పెళ్ళి ఎలా చేసారో కూడా అందమైన బ్లాగు రాసింది. వాళ్ళాయన రఘునాధ్ కొత్త గారు ఎంత మంచివారో, అంత సరదా మనిషి కూడాను! వాళ్ళ బాబు అప్పుడు 9th చదువుతున్నాడు. ఇప్పుడు వుద్యోగం కూడా చేస్తున్నాడట! అమ్మాయి మాత్రం నెల్లూరులో ఎం.బి.బి.ఎస్. చేస్తోంది అప్పుడు. నెల్లూరులో పాపని చేర్పించినప్పుడు నా దగ్గర ఒక్క పూట వుంది! అప్పుడు రాత్రి అంతా బోలెడు కబుర్లు చెప్పుకున్నాం!

అక్కచెల్లెళ్ళు కలిసినా, ఇలా స్నేహితురాళ్ళు కలిసినా, రాత్రి పూట, పాత జ్ఞాపకాలని, సముద్రం ఒడ్డున గవ్వలు ఏరుకుంటున్నట్లు ఏరుకుంటూ, చెప్పుకునే కబుర్లు ఎంత బాగుంటాయో కదూ!

నేను హేండ్ బ్యాగ్‌లో రెండు జతల బట్టలు ముందు జాగ్రత్తగా పెట్టుకుంటాను కాబట్టి సరిపోతుంది. నా సూట్‌కేస్ ఫెడెక్స్‌లో మూడు రోజులకి వచ్చింది.

జ్యోతీ, రఘునాధ్ గార్లు పిల్లలకి తెలుగు నేర్పుతారు పాఠశాల ద్వారా. ఆ సిలబస్, బుక్స్ అన్నీ జ్యోతే తయ్యారు చేస్తుంది. చాలామంది వాలంటరీగా, ముందుకొచ్చి టీచ్ చేస్తారు కూడా! అలాగే మల్లాది గారి అన్నగారి అబ్బాయి కూడా పాఠశాలలో టీచ్ చేస్తున్నాడని తర్వాత విన్నాను. చార్లెట్ మరీ అంత పెద్దది కాకపోవడం వల్ల, జ్యోతికి తెలుగు వాళ్ళంతా బాగా తెలుసు. మొన్న సినిమా ప్లేబ్యాక్ సింగర్ ఉష భర్త శ్రీకాంత్ దేవరకొండ నాతో “చార్లెట్‍లో వున్నానండీ” అని అంటే, “అక్కడ మా ఫ్రెండ్ జ్యోతిర్మయీ కొత్తా వుంటుంది” అంటే, “నాకు తెలుసండీ” అన్నాడు. అంత ఫేమస్ అన్నమాట. మా అబ్బాయి ఫ్రెండ్ వైష్ణవికి, చార్లెట్ స్టేట్ యూనివర్సిటీలో ఎం.ఎస్.కి సీట్ వచ్చిందని జ్యోతికి చెప్తే, ఫోన్ చేసి ఇంటికి పిలిచి స్వంత పిల్లలా ప్రేమగా చూసుకొంది.

జ్యోతి ఇల్లు ఎంత అందంగా వుందో వర్ణించలేను. ఆమె మనసంత అందంగా వుంది! క్రిందే వున్న రూమ్ నాకిచ్చింది. పైన త్రీ బెడ్ రూమ్స్ వున్నాయి. ఇల్లు ఎంత బాగా అలంకరించుకుందో, వంటింట్లో పాంట్రీ అంతే అందంగా అమర్చుకుంది. బయట గ్రిల్ మీద బర్గర్స్ చెయ్యడం, మొదటిసారి వాళ్ళింట్లోనే చూసాను. రకరకాల వంటలు చేసి పెట్టింది. నేను వుండగా రావడానికీ, సాహిత్య సమావేశం పెట్టుకోవడానికి ఒక ఆదివారం ఫణి డొక్కా, మాధవ్ దుర్భా అట్లాంటా నుండి వచ్చేట్లుగా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా దగ్గర్లో వున్న రఘునాధ్ గారి ఫ్రెండ్, వాళ్ళ కుటుంబంతో దగ్గర్లోని సోమా టెంపుల్‌కి ప్లాన్ చేసారు. జ్యోతి ఎప్పుడు లేచిందో కాని, పులిహోరా, దద్ధోజనం చేసి, చిటికెలో తయ్యారయింది!

ఎంతో సరదాగా కబుర్లతో ప్రయాణం చేసి వెళ్ళాం. పూజారి గారికి జ్యోతి నా పేరు చెప్తే గుర్తు పట్టారు కూడా! ఆ టెంపుల్‍లో పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం వుంది. మెట్లు ఎక్కి పైకి వెళ్తే, శివుడు, వినాయకుడూ, వెంకటేశ్వరస్వామి లతో చాలా అందమైన టెంపుల్. అందరం లంచ్ చేసాకా, పిల్లలు చాలా సేపు ఆటలాడారు. అలిసిపోయాక, బయల్దేరాం.   

సోమా టెంపుల్ పూజారితో

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here