[box type=’note’ fontsize=’16’] టీవీ,
సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ
రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం
‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]మం[/dropcap]జులా సూరి అనే ఆవిడ, జ్యోతి ఫ్రెండ్, నన్ను భోజనానికి కూడా పిలిచారు. జ్యోతి నన్ను లైబ్రరీకి తీసుకెళ్ళింది. అక్కడ పద్ధతి ఎంత బావుందో, సిక్ వాళ్ళకీ, చిన్న పిల్లలకీ వాళ్ళు కేర్ టేకర్స్‌ని కూడా ఇస్తారు. పుస్తకాలు సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాకా, ఆన్‌లైన్‍లో ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు డేట్. అక్కడే కూర్చుని ఎంత సేపయినా చదువుకోవచ్చు. ఆ వాతావరణం చూస్తే అసలు రాబుద్ధి కాలేదు బయటకి. సేఫ్ వే లో పూలూ, మాల్స్‌లో షాపింగ్, ముఖ్యంగా డాలర్ షాప్‌లో నేను చాలా వస్తువులు కొన్నాను. అక్కడ నేను మా వదినకీ, నాకూ, ఇంకో ఫ్రెండ్‌కి కొన్న వెజిటబుల్ కట్టర్స్ చాలా ఏళ్ళు వాడాము.
నాకు వెరైటీగా పెడదాం అని జ్యోతి, పిజ్జా, బర్గర్, పాస్తా లాంటివి చేసి పెట్టింది. తను చాలా మంచి కుక్! కానీ నేను ఆమెతో, “జ్యోతీ, అన్నం వండి ఆవకాయతో పెట్టు, నోరు చచ్చిపోయింది” అన్నాను. “మీరు కొత్తవి ట్రై చేస్తారు అనుకున్నాను, మీరూ ఇంతేనా?” అంది. “ఔను కదూ! నేనూ అంతే” అని నవ్వుకున్నాను. జ్యోతి వంట చాలా బావుంటుంది అని చెప్పానుగా! తన డ్రైవింగ్‍లో ‘జుమ్మని’ తిరగడం, తినటం భలే గడిచింది! నా అదృష్టం కొద్దీ అప్పుడు ఉద్యోగం చేయడం లేదు జ్యోతి, అంతకు ముందు బ్యాంకులో చేసేది. జ్యోతికి స్టాక్ మార్కెట్ గురించి కూడా మంచి అవగాహన. ఆ విషయం రేలేలో మూర్తిని కలిసాకా, నాకు తెలిసింది.
‘మూర్తి మావయ్య’ అనే అబ్బాయి, మా ‘బాస్’ సినిమా షూటింగ్ అప్పుడు ఆదిత్యని కలవడానికొస్తే, “‘మూర్తి మావయ్య’ అండీ” అని డైరక్టర్ వి.ఎన్. ఆదిత్య నాకు పరిచయం చేసాడు. ఆదిత్య కన్నా చిన్న అబ్బాయి, ‘మావయ్య’ వరుస అవుతాడని, వీళ్ళు ఆట పట్టిస్తున్నారని నాకు అర్థమైంది. అప్పుడు వివేక్ కూచిభొట్లా, మూర్తీ, ఆదిత్యా, వీళ్ళు సిద్ధార్థా కాలేజ్ ఓల్డ్ బ్యాచ్ అనీ; అప్పటి నుండి స్నేహితులనీ నాకు తెలిసింది. వివేక్ కూచిభొట్ల ‘అలా మొదలయింది’ సినిమా నుండి ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో పార్ట్‌నర్. సియోటిల్‍లో వుండే విశ్వప్రసాద్ గారితో ఈ మధ్య పవన్ కళ్యాణ్‌కీ, వీళ్ళకీ కూడా కొలాబరేషన్ అయింది.
చెంగల్వల మూర్తి అనే ఈ అబ్బాయి ‘రేలే’లో వుంటాడు, నార్త్ కరోలినా స్టేట్‌లో. మొదటిసారి ఏక్సిడెంట్ అయి క్రిష్ణ ప్రయాణం ఆగిపోయినప్పుడు, మూర్తి “పంపండీ, మా ఇంట్లో వుంచుకుని, నా స్వంత తమ్ముడిలా చూసుకుంటాను, ఏం ఫర్వాలేదు” అని అన్నాడని చెప్తే కూడా మా ఆదిత్య జోక్ చేసాడు – “స్వంత తమ్ముడిలా చూసుకుంటా అన్నాడా? ఇంక అంతే… ‘ఒరేయ్ మంచి నీళ్ళూ తేరా… చెట్లకి నీళ్ళు పోయరా’ అని టెంకి జెల్లలిస్తాడు… అదీ వాడి ప్లాన్!” అని.
ఆదిత్య ఫ్రెండ్స్ కూడా అతని లాగే నన్ను అక్కలా చూస్తారు. కృష్ణ వచ్చే సమయానికి నన్ను రేలే తీసుకువెళ్తానంది జ్యోతి. అదీ ప్లాన్! నేను వచ్చిన నెల రోజులకి క్రిష్ణని కలవడం చాలా ఎక్సైటింగ్‌గా వుంది.
మూర్తి ఇంటికి క్రిష్ణ వచ్చే రోజు పొద్దుట చేరాము. మూర్తిదీ చాలా పెద్ద ఇల్లు. అతని భార్య రాజీ అప్పుడు ఏదో సర్జరీకి ఇండియా వెళ్ళింది. క్రిష్ణ మొదట వస్తామనుకున్నప్పుడు స్ప్రింగ్‌లో, మేము తిరుపతి వెళ్ళాము కదా, మా కారులో. అప్పుడు మూర్తి చెల్లెలు రాధికా, వాళ్ళ బావగారూ, అలివేలు మంగాపురంలో వుంటారు, వచ్చి మమ్మల్ని కలిసారు, క్రింద తిరుపతి ‘భీమాస్’ హోటల్‌లో. మూర్తి పిల్లలకి బుక్స్ ఇమ్మని ఇచ్చింది. మూర్తికి వైష్ణవీ, చంద్రికా అని ఇద్దరు ఆడపిల్లలు. ఆదిత్యే ఆ పేర్లు పెట్టాడుట!
ఆ పుస్తకాలు నేను భద్రంగా ఇప్పుడు తీసుకొచ్చి అప్పజెప్పాను. జ్యోతీ, మూర్తీ పరిచయం అయిన గంటకల్లా షేర్స్, స్టాక్ మార్కెట్ గురించి బోలెడు మాట్లాడుకుంటుంటే, గ్రీక్ అండ్ లాటిన్‌లా నాకు ఏమీ అర్థం కాక, నేను ఓ నిద్ర పోయి లేచాను. మేము ఎయిర్‍పోర్ట్‌కి వెళ్తుంటే మూర్తి తనూ వస్తానన్నాడు గానీ, మేం వద్దు అన్నాం. మళ్ళీ తనే “నేను వంట చేస్తా లెండి, అయితే ఇంట్లో వుండి” అన్నాడు.
మూర్తి చెప్తే తెలిసింది, ప్రశాంత్ అని అక్కడ మా అన్నయ్య కోడలి స్వంత బావ వున్నాడనీ, అతనూ మూర్తీ మంచి ఫ్రెండ్స్ అనీ. ప్రముఖ కమ్యూనిస్ట్ లీడర్ డాక్టర్ ఆదుర్తి విఠల్ గారూ, మా అన్నయ్య కోడలు తేజస్వినికి మేనమామ. ఆయన తమ్ముడు రామయ్యగారూ డాక్టరే. వారి అబ్బాయి ప్రశాంత్. సూర్యాపేటలో రైలు గాని, బస్ గాని దిగి “రామయ్య గారింటికి” అంటే తీసుకెళ్తారు. అంత ఫేమస్. దురదృష్టవశాత్తు విఠల్ గారు రెండేళ్ళ క్రితం పోయారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రియశిష్యులు. అయినా హాస్పిటల్ పేరు ‘విఠల్ ఆసుపత్రి’ అనే వుంటుంది. రామయ్య గారి రెండో అబ్బాయి కూడా డాక్టరే. అతను చూసుకుంటున్నాడు. ప్రశాంత్ మొదటి అబ్బాయి. అతని భార్య వాణి. రెండవ సారి ఆడపిల్ల పుట్టింది అప్పుడు ఆ అమ్మాయికి. ఇలా లోకం చాలా చిన్నది అన్నట్లు తెలిసిన వాళ్ళు తగుల్తూనే వుంటారు. రేలేలో వున్న ఇంకో ఆప్తుడు మా ఫ్రెండ్ సుశీల చిన్న కొడుకు హరీష్. క్రిష్ణ కోసం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాం.
ఫ్లయిట్ వచ్చి అందరూ దిగుతున్నారు – కానీ ఎంతకీ కృష్ణ మాత్రం రాలేదు!
(సశేషం)