జీవన రమణీయం-161

0
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]నా[/dropcap]కు భయమేసింది. ఎందుకంటే న్యూయార్క్‌లో ఫ్లయిట్ చేంజ్. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో వీడికి తెలీక మరీ పెద్దగా ట్రాన్సిట్ టైం లేకుండా రెండు గంటలు తీసుకున్నాడు. అంత నడిచి గేట్ దాకా వెళ్ళడానికీ, సెక్యూరిటీ చెక్‌కే బొటాబొటీ టైం సరిపోతుంది. నేను చాలా టెన్షన్ పడుతుంటే, టెన్షన్ వద్దు అని జ్యోతి ధైర్యం చెప్పింది. వీడి అన్న అంటే మా అశ్విన్ డి.ఏ.వీ.లో ఫస్ట్ క్లాస్‌లో వున్నాడని, వీడికి ఎల్.కే.జీ.లో సీట్ ఇచ్చారు డి.ఏ.వీ. పబ్లిక్ స్కూల్‌లో. ఇంటర్వ్యూ రోజున మా కృష్ణ “What is this” అని వెజిటబుల్స్‌లో వంకాయని చూపించి అడిగితే, “ఇది ఇత్తా ఇత్తా కోసి కూయ తేత్తుంది అమ్మ… మీకు రాదా?” అని అడిగి, ఆ అడిగిన మిస్‌ని “మీ చీల బావుంది” అని ఆవిడ శారీని ఎడ్మైర్ చెయ్యడం, ఇంకో మిస్ ‘షేక్ హ్యాండ్’ అడిగితే, బుగ్గ మీద కిస్ చెయ్యడం చూసి వాళ్ళు చాలా నవ్వారు. వెంటనే సీట్ కూడా ఇచ్చేసారు. మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ సత్యప్రియ కొడుకు క్రిష్ణ కార్తీక్‌కీ అదే రోజు ఇంటర్య్వూ అయింది. వాడు బలపం గుప్పెటతో పట్టుకుని రాశాడని కొంచెం సేపు సీట్ ఇవ్వడానికి హెజిటేట్ చేసారు. తర్వాత మా ప్రియ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే ఇచ్చేసారు. 1992 కొంచెం అమాయకపు రోజులు, అయినా ఇంతింత ఎడ్మిషన్ ఫీజ్, డొనేషన్‍లూ వుండేవి కావు! ఆ రోజుల్లో ₹ 5000/- ఎడ్మిషన్ ఫీజ్ కడ్తేనే మా అమ్మా వాళ్ళు అది ఎక్కువ అన్నారు.

మేం స్కూల్లో వుండగా, మా అన్నయ్యా, పెద్దమ్మ పిల్లలూ స్కాలర్‌షిప్ మీదా లేదా తెలుగు మీడియం కాబట్టి ₹ 3/-, ₹ 5/- ఫీజ్‌తో చదివేవారు. నన్ను ఇంగ్లీషు మీడియంలో వేసేటప్పటికి ₹ 9/- ఫీజ్ అనేసరికి ‘అమ్మో’ అనుకోవడం ఇంట్లో ఇప్పటికీ గుర్తు! ఇంతకీ క్రిష్ణ ఎడ్మిషన్ సంగతి ఎందుకు చెప్పానంటే, ఆ రోజు వాడు ఏడుస్తాడేమో, అని మొదటి రోజు  నేను ఏడుస్తూ గడిపాను, గేట్ బయట మధ్యాహ్నం దాకా, కానీ వాడు ఏడవలేదు! అశ్విన్ మాత్రం నేను వెళ్తే ఇంటికొచ్చేస్తా అని స్కూల్లో ఏడ్చేవాడు!

క్రిష్ణని మొదటి రోజు స్కూల్లో వదిలిపెట్టి, ఎంత టెన్షన్ పడ్డానో, ఇప్పుడు వాడు ఇంజనీరింగ్ చదివి, ఓ ఏడాది హైదారాబాద్‌లో, ఓ ఏడాది పూనేలో ఉద్యోగం చేసి – ఆరడుగుల వాడైనా – ఇంకా ఆ చిన్న కిట్టీ లాగే నేను ఆదుర్దా పడ్తూ కూర్చున్నాను! అశ్విన్ అయితే అమెరికా ఒంటరిగా వెళ్ళినా, చిట్టెన్‌రాజు వంగూరి అనే పెద్దాయన వీడికి ఎదురొచ్చి పరాయి గడ్డ మీద, ఇంటికి తీసుకెళ్ళి, గడ్డ పెరుగేసి అన్నం పెట్టి, లాప్‌టాప్ అదీ వాడ్ని తీసుకెళ్ళి కొనుక్కోమని, హ్యూస్టన్ లోని కాలేజ్ స్టేషన్ యూనివర్శిటీలో దింపారు.

ఇప్పుడు నేనే స్వయంగా వీడ్ని దింపుకోడానికి వచ్చి రేలీ ఎయిర్‌పోర్ట్‌లో, డి.ఏ.వీ. స్కూల్ ముందు పడిగాపులు పడ్తున్నట్లు కూర్చుని వున్నాను. అందరూ దిగి వెళ్ళిపోయారు. ఇంతలో మూర్తి ఫోన్ వచ్చింది. “ఇంకా రాలేదు మూర్తీ” అని నేను చెప్పేలోగానే, “క్రిష్ణ వచ్చాడండీ, లగేజ్ బెల్ట్ దగ్గర వున్నాడట” అన్నాడు మూర్తి. “మీకెలా తెలిసింది?” ఆశ్చర్యంగా అడిగాను. “ఏమో… నాకు కిష్ణ ఇండియా నెంబరే వచ్చింది మరి” అన్నాడు. నేను ఆశ్చర్యబోయాను. ఇంతలో క్రిష్ణ వస్తూ కనిపించాడు. ఆత్రుతగా వెళ్ళి గట్టిగా హగ్ చేసుకున్నాను. “న్యూయార్క్‌లో ఫ్లయిట్  మిస్ అవుతా ననుకున్నాను” అన్నాడు. నన్ను భయపెట్టడానికి, “ఎయిర్‌పోర్ట్‌లో ట్రామ్‌లో లగేజ్ విసిరేసి, నేను మూవింగ్‌లో ఎక్కాను” అన్నాడు. నేను భయపడ్తుంటే, “అది సికింద్రాబాద్ రైల్వే స్టేషనా? మూవింగ్‌లో తలుపులెయ్యకుండా వుండడానికీ?” అని నవ్వాడు. నా పిల్లలిద్దరూ నన్ను ఇలా ఏడిపిస్తునే వుంటారు. అంటే ర్యాగింగ్ చేస్తుంటారు. వాడు ఎయిర్‍టెల్ నుంచి ఫోన్ చేస్తే, ఇంటర్నేషనల్ కాల్ వచ్చింది. అది ఎలాగో నాకు అర్థం కాలేదు. “ఏరా నువ్వు ఇంటర్నేషనల్ కాలింగ్ పెట్టుకుని వచ్చావా” అంటే, “నేనేం చెయ్యలేదమ్మా” అన్నాడు.  కడవంత గుమ్మడికాయైనా కత్తిపీటకి అలుసేగా!

కుమారుడు కృష్ణతో రచయిత్రి

జ్యోతి డ్రైవింగ్‌లో ముగ్గురం మూర్తి ఇల్లు చేరాం. మూర్తి సాంబార్, అన్నం వండాడు. ఆవకాయ, పెరుగూ వున్నాయి. క్రిష్ణ భోం చేసి, “రూంలో పడుకో” అనగానే వెళ్ళి కింద నేను వేసిన ఎక్స్‌ట్రా బెడ్ మీద పడుకుని క్షణాల్లో నిద్రపోయాడు. మొదటిసారి ఇండియా నుండి అమెరికా వెళ్తే కల్చర్ డిఫరెన్స్ చాలా కొడ్తుంది! అది నాకు అనుభవం! కానీ పిల్లలకి అంత వుండదు అనుకుంట! చిన్నప్పటి నుండీ ఇంగ్లీషు నావెల్స్ చదవడం, సినిమాలు చూడడం వల్ల! మా పిల్లలిద్దరికీ బుక్ రీడింగ్ అలవాటు చిన్నప్పటి నుండే వుంది. దానికి కారణం మా సైనిక్‌పురీలో ఆర్కెడ్ అనే లైబ్రరీ నడిపేది ఎక్స్ ఆర్మీమేన్ కోడలు సరస అనే తమిళియన్. ఆవిడ దగ్గర బుక్స్ తెచ్చి ఎంతకీ వీళ్ళు రిటర్న్ చెయ్యకపోతే, నేను ఫైన్ కడ్తూ వుండేదాన్ని! ఆవిడ మా ఉమక్క ఫ్రెండ్. అయినా చాలా స్ట్రిక్ట్. మా అశ్విన్‌ని “ఇంక బుక్స్ అయిపోయాయి బాబూ! రాగానే ఫోన్ చేస్తాను” అనేది కొన్నిసార్లు. అంత ఎక్కువగా చదివేవారు వీళ్ళు. ఇప్పటికీ వుద్యోగాలయ్యాకా, రాత్రి పూట ఓ గంట అయినా బుక్ చదువుకుని పడుకోకపోతే రిలాక్స్ అవలేం అంటారు పిల్లలు. మొన్న మా మేనల్లుడి కొడుక్కి  ‘ఫేమస్ ఫైవ్’ బుక్ కలెక్షన్ పంపుతూ చెప్పాను, ‘మూడో తరం లోనూ బుక్ రీడింగ్ వుండాల’ని!

ఆ రాత్రి నేనూ, మూర్తీ, జ్యోతీ చాలా సేపు కబుర్లు చెప్పుకుని పడుకున్నాం. పొద్దుటే లేచి క్రిష్ణతో సహా చార్లెట్ ప్రయాణం అయ్యాము.

క్రిష్ణ జ్యోతీ వాళ్ళయన రఘు గారికి చాలా క్లోజ్ అయిపోయాడు. అప్పుడే జ్యోతి బర్త్ డే రావడంతో, క్రిష్ణా, రఘూ కలిసి సర్‌ప్రైజ్ బర్త్ డే పార్టీ ఎరేంజ్ చేశారు. కేక్, స్నాక్స్ తెచ్చి, ఫ్రెండ్స్‌ని పిలిచేదాకా జ్యోతికి తెలీదు!

జ్యోతి కూడా “క్రిష్ణా ఏం తింటావ్?” అని అడిగి మరీ చేసి పెట్టింది. ఆ వీకెండ్ డొక్కా ఫణీ, మాధవ్ దుర్భా అట్లాంటా నుంచి వచ్చారు. సాహితీ సమావేశం ఏర్పాటు చేసింది ఇంట్లో జ్యోతి. ఆరోజు దగ్గర దగ్గర ముప్ఫై మందికి పలహారాలు చేసారు. అక్కడ అమ్మాయిలు లడ్డూలు, బాదుషాలూ, జిలేబీలూ కూడా యూట్యూబ్‌లో చూసి చేసేస్తారని విన్నానే కానీ, అప్పుడు ప్రత్యక్షంగా చూసాను. ఇక్కడ ఇండియాలో అమ్మాయిలు వంటగదిలోకి రావడం తక్కువ! అక్కడ అమెరికాలో ఎవరింట్లో గెట్ టుగెదర్ అయినా, పెళ్ళి అయినా, అంతా తలో చెయ్యీ వేసి ఫాస్ట్‌గా రకరకాల వంటలు చేసేస్తారు, ఈగో లేకుండా! ఆరోజు చాలా చేసారు. సాహితీ సమావేశం చాలా బాగా అయింది. మా ఫణి ‘టేకిట్ ఈజీ’ అనే కాలమ్ రాసేవాడు కౌముదిలో. ఆ ఫాన్స్ చాలామందే వుండేవారు. అలాగే నా ‘కాలమ్ దాటని కబుర్ల’కీ. మాధవ్ వుద్యోగంలో చాలా బిజీ! అయినా మేలు రకం కథలు రాసాడు కౌముదిలో.

జ్యోతిర్మయి గారింట్లో సాహితీ సమావేశం

మేం స్వీయ కథా పఠనం చేసాం. ఆ తర్వాత వచ్చిన సాహితీ మిత్రులు కూడా కొన్ని వారి రచనలు చదివారు. ఫణీ, రఘూ జోక్స్‌తో సభ బాగా అయింది. జ్యోతి కథ చదువుతుంటే, “కొత్త కథా?” అని ఎవరో అడిగితే, షార్ప్‌గా “మా ఇంటి పేరే కొత్త, నేను పాత కథెలా చదువుతానూ?” అంది. సమయస్ఫూర్తి ఎక్కువ!   

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here