జీవన రమణీయం-162

0
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]వా[/dropcap]రం రోజులు జ్యోతి ఇంట్లో ఎంత సరదాగా గడిచిపోయాయో! ఫణీ, మాధవ్‍లతో కలిసి నేను అట్లాంటా, క్రిష్ణ రేలీ వెళ్ళేరోజున ఏర్పాటు అయింది. ఈలోగా చాలా పనులు చేశాం, రేలీ వెళ్ళి!  మా సుశీల అనే ఆప్త మిత్రురాలి కొడుకు హరీష్ రేలీలో వుండేవాడు అప్పుడు. హరీష్, క్రిష్ణ చిన్నప్పటి నుండి ఒకే కాలనీలో ఆడుతూ పెరిగిన పిల్లలు.

మేం మూర్తి ఇంటికి, జ్యోతి దింపితే వెళ్ళి, మూర్తి ఇంట్లో ఓ రోజున్నాం. మూర్తికి ఆఫీసు వుండడం వల్ల హరీష్ మమ్మల్ని యూనివర్శిటీకి తీసుకెళ్తానన్నాడు. ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే భోజనం. మా సుశీల – వాళ్ళ కోడలు లక్ష్మీభారతితో “నేనూ రమణీ వేరు కాదు! నేను వచ్చినట్లే భావించి చూస్కో” అందిట!

మూర్తి స్వంత తమ్ముడిలా చూసుకొంటాను, అన్నప్పుడు వి.ఎన్. ఆదిత్య “అలా అన్నాడంటే ప్రమాదమే నండీ! మంచినీళ్లు తీస్కురారా… అని జెల్లకాయ కొడ్తాడు” అనడం గుర్తొచ్చింది.

“అమ్మా భారతీ! అత్తగారి మీద ఏమైనా కోపం వుంటే వంటలో చూపించకు! నా మీద చూపించు” అన్నాను నవ్వుతూ.

లక్ష్మీభారతి పేరుకి తగ్గ పిల్ల! హరీష్‍కి సంబంధాలు చూస్తున్నప్పుడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే మా సుశీల భర్త శ్రీనివాసమూర్తి గారు, కంప్యూటర్‍లో మేట్రిమోనీలో ఈ అమ్మాయి ఫోటో చూపిస్తూ, “ఆ చిరునవ్వు చూస్తూ అన్నం పెట్టకపోయినా వుండచ్చండీ, నాకు బాగా నచ్చింది ఈ అమ్మాయి కోడలిగా!” అన్నారు.

మా సుశీలకైతే నోట్లో నాలిక లేదు అనడానికి తార్కాణం పెళ్ళయి నలభై ఏళ్ళు దాటినా, అత్తగారి అనుజ్ఞ లేకుండా గడప దాటేది కాదు! వచ్చేవాళ్ళూ, పోయేవాళ్ళతో మడీ దడీ, వంట చేస్తూ, వడ్డిస్తూ, కనీసం ఓ గంట తనకంటూ పర్సనల్ టైం లేకుండా వుండేది! మగ పిల్లలు తప్ప ఆడపిల్లలు లేరు నాలాగా! కోడళ్ళ పట్ల ఎంత ప్రేమ చూఫించగలదో నాకు తెలుసు! భారతి లాగే పేరుకి పూర్తి న్యాయం చేస్తుంది!

హరీష్ రేలీలో మంచి వుద్యోగం, దురదృష్టవశాత్తూ తండ్రి పోగానే, ఇండియాకి మార్చేసుకుని వచ్చేసాడు. ఇది జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత.

కానీ ఇప్పుడు ఆఫీసు వాళ్ళు పంపారు, మూడేళ్ళ కోసం. అది అయిపోబట్టి ఇండియా వచ్చేస్తున్నారని సామాన్లు డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు.

భారతి నన్నూ, క్రిష్ణనీ చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంది. “అయ్యో ఆంటీ మొహం వాచి వున్నాం, బంధువుల కోసం… మా అత్తయ్యగారు బాగా వంట చెయ్యమని పది సార్లు చెప్పారు” అంది.

రచయిత్రి, క్రిష్ణ, హరీష్, భారతి

సామాన్లు ఏవి కొనుక్కోవద్దని క్రిష్ణకి బెడ్, వంటగది సామాగ్రి మొత్తం, ప్లేట్లూ, కప్పులు, గరిటలతో సహా ఇచ్చారు. మిక్సీ ఎవరో ఫ్రెండ్‌కి ముందు రోజే ఇచ్చేసామని తెగ బాధ పడ్డారు.

భారతి వంట కూడా బాగా చేసింది! అంటే అత్తగారి మీద చాలా ప్రేమ వున్నట్లే! కానీ మా ఇద్దరికీ చేసిన క్వాంటిటీస్ ఇంకో నలుగురికి చులాగ్గా సరిపోతాయి. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, ఆలూ కర్రీ, బీరకాయ పచ్చడీ, సాంబార్, కేరట్ హల్వా చేసింది. నన్ను ఒకే ఒక కోరిక కోరింది. “ఆంటీ నా లగేజ్ చాలా ఎక్కువ వుంది, కనీసం 5 kgs మీతో తీసుకెళ్ళగలరా?” అని. “అయ్యో, అదెంత పని?” అన్నాను. కానీ పూర్తిగా మాట మీద నిలబడలేకపోయాను, పాపం!

వెల్స్ ఫార్గో ఎటిఎం వద్ద కుమారుడు క్రిష్ణతో రచయిత్రి

హరీష్ తన కారులో నన్నూ, క్రిష్ణనీ యూనివర్సిటీకి తీసుకెళ్ళాడు. ముందుగా వెల్స్ ఫార్గో బ్యాంక్‌లో మా చెక్స్ డిపాజిట్ చేసి, యూనివర్సిటీకి వెళ్ళి ఫీజ్ కట్టాం. హరీష్ ల్యాప్‌టాప్ తెచ్చి గేప్ దొరికినప్పుడు పని చేసుకుంటూ కనిపించాడు. ఎంత పొందికయిన పిల్లాడో, ఆ తర్వాత మంతెన సత్యనారాయణ గారి వైద్యం నచ్చి, చాలా రోజులు వుప్పు మానేసి పచ్చి కూరలు తిన్నాడు. ఇప్పుడు వుప్పు తింటున్నాడో లేదో అడగలేదు! మా ఇంటికి దగ్గర్లోనే వుంటారు.

హరీష్, క్రిష్ణ

తర్వాత నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి వెళ్ళాం. ఎంత బాగుందో! నేను మా పెద్దబ్బాయి అశ్విన్ చదివిన యూనివర్సిటీ కళ్ళతో చూడలేదు, వాడి కాన్వొకేషన్‌కి కూడా వెళ్ళలేదనే బాధ వుండిపోయింది నాకు! క్రిష్ణ యూనివర్సిటీ అంతా తిరిగి చూసాం. ముఖ్యంగా రోబోటిక్ లైబ్రరీ… అక్కడ మాత్రమే వుందిట! అక్కడ కుర్చీలు ఒకటి రెండు ఎత్తుకొద్దామా అనిపించింది. ఒక దానిని పోలినది ఇంకొకటి లేకుండా 3000 రకాలు వున్నాయి! క్యాంటిన్ కూడా బావుంది. నా తల్లి మనసు సంతృప్తి పడింది. నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ సింబల్ వోల్ఫ్. యూనివర్సిటీ బస్‌లపై కూడా ఈ వోల్ఫ్ లైన్ అని రాసి ఉంటుంది.

నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ భవనం
యూనివర్సిటీ బస్

హరీష్ ఈవెనింగ్ మూర్తి ఇంట్లో వదిలి వెళ్ళాడు. భారతి ఇచ్చిన సామాన్లు ముందు గదిలో కార్పెట్ మీద వదిలేసా. ఆ రాత్రికి నేనే వంట చేసాను. బీరకాయ పచ్చడీ, అరటికాయ వేపుడూ, చారూ చేసా. మూర్తి ఇంట్లో, జ్యోతి ఇంట్లో ‘నెట్‌ఫ్లిక్స్’ మొదటిసారి అంటే 2014లో చూసి ‘మా ఇండియాలో ఎప్పుడొస్తుందో’ అనుకున్నా! ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ వాళ్ళ హోమ్ థియేటర్‌లో చూసాం.

పొద్దుట ట్రైన్‌లో వెళ్ళాలా, కేబ్‌లో వెళ్ళాలా? అని ఆలోచిస్తుంటే, హరీష్ ఫోన్ చేసి తను కారు తీసుకున్నాను రెంట్‌కి, తనే దింపుతాను జ్యోతి ఇంట్లో అన్నాడు. నా గుండెల బరువు దిగిపోయింది. నేనూ, క్రిష్ణా ఇద్దరమే, ఇంత సామాను వేసుకుని ట్రైన్‌లో వెళ్ళడానికి, ఇద్దరికీ కొత్త! ఏం కాదు అని మా క్రిష్ణ అన్నా, నేను వినలేదు. మేం మూర్తి ఇంట్లోంచి హరీష్ ఇంటికి వెళ్ళేటప్పుడు, ఒక తప్పు చేసేసా. నా హేండ్ బ్యాగ్ కలర్ లోనే వున్న గూచీ బ్యాగ్ ఒకటి భారతి తన కజిన్ కోసం ఇచ్చిందని, అది ఫ్రంట్ రూంలో వదిలేసా అని చూసుకోలేదు. అదీ, నా బ్యాగ్ లానే నేవీ బ్లూ కలర్‍లో వుండడం చూసి, అది మూర్తి వైఫ్ రాజీదీ అనుకుని, మిగతా సామాన్లు తీసుకుని వచ్చేసాను.

జ్యోతి ఇంట్లోకి రమ్మన్నా, హరీష్ మళ్ళీ కార్ వెనక్కి ఇచ్చేయాలి, మర్నాడే ఇండియా ప్రయాణం, ఇంకా సర్దుకోవాల్సినవి వున్నాయి అని మంచినీళ్ళూ బయటే తాగి వెళ్ళిపోయాడు.

అంత హడావిడిలో కూడా నా ఫ్రెండ్ కొడుకు, మూడు గంటలు మమ్మల్ని డ్రైవ్ చేసి తీసుకొచ్చి దింపి వెళ్ళాడు. మొత్తం ఆరు గంటలు… మన జీవితంలో ఇంత బిజీగా వున్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చెయ్యడానికి ఇన్ని గంటలు వెచ్చించామా ఎప్పుడైనా అని ప్రశ్నించుకుంటే, మనం హెల్పింగా? కాదా? అన్న జవాబు వస్తుంది! నేను హరీష్ మోస్తరే… టైం విలువ తెలీదని నా గురించి మా ఆయన అభిప్రాయం. బట్ సుశీలా, లలిత, నేనూ అంత ఫ్రెండ్స్‌మి.

మూర్తి, హరీష్, భారతిలతో రచయిత్రి

ఆ తర్వాత రోజులు పరిగెత్తాయి. జ్యోతి ఇంట్లో, శనివారం పొద్దుటే ఫణీ డొక్కా, మాధవ్ దుర్భా వచ్చారు. సందడే సందడి! జ్యోతి వంటలూ, రఘు గారు పైన్ ఏపిల్ కట్టర్‍తో డెమాన్‌స్ట్రేషన్, ఆ తర్వాత సాహితీ సమావేశం! ఇదంతా అయ్యాకా సోమవారం రఘునాథ్ కొత్తా గారి ఫ్రెండ్ ఒకరు క్రిష్ణని రేలీ తీసుకెళ్ళి, యూనివర్సిటీలో దింపుతానన్నారు. చాలా మంచి మనిషి!

నాలో కొడుకు వెళ్తున్నాడన్న దిగులు మొదలు! కదిలిస్తే ఏడ్చేటట్లు వున్నాను. కానీ మా ప్రయాణం కూడా అప్పుడే అట్లాంటాకి, భోజనాలు అయ్యాకా. క్రిష్ణ ‘హే ఏడవకు’ అని హగ్ చేసుకుంటే కట్టలు తెగపడింది. ‘కోర్కెల వల నీవు, చింతల చెలి నీవు, నాటక రంగానివే మనసా’ అన్న పాటలోని పదాలు ఎంత నిజం! పిల్లలు పెద్ద చదువులు విదేశాల్లో చదవాలీ, మనని వదిలిపోకూడదు… ఎలా సాధ్యం? ఇంక ఫణీ, మాధవ్ కార్లో నా మనసు సరిచెయ్యడానికి పాత సినిమా పాటల అంత్యాక్షరీ మొదలుపెట్టారు! క్లబ్ సాంగ్స్‌తో సహా!   

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here