Site icon Sanchika

జీవన రమణీయం-163

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]దా[/dropcap]రిలో మాధవ్ తెచ్చిన వ్యాగన్‍కి చిన్న రిపేర్ కూడా వచ్చింది. కొంచెం సేపు అవస్థ పడి, చివరికి సరిచేసుకుని మళ్ళీ పాత తెలుగు సినిమా పాటలు పాడుకుంటూ సాగిపోయాం. అలా పాడుకుంటుంటే, మనకిన్నిన్ని పాటలు వచ్చా! అనిపించింది. క్లబ్ సాంగ్స్ అయితే జ్యోతిలక్ష్మీ, హలం, జయమాలినీవి తెగ గుర్తుకొచ్చేస్తాయి వాళ్ళిద్దరికీ. మా అక్కా చెల్లెళ్ళం, వారి పిల్లలూ, అందరం కలిస్తే ఇలాగే పాడుకుంటాం! మన తెలుగు సినిమాలూ, అందులో సాహిత్యం, మన సంపద కదా! అయినా ఇప్పటి పాటలు నాకు అంతగా గుర్తు వుండవు. విన్నప్పుడు బావుంటాయి కానీ, ఇవి ఎంత గొప్ప పాటలైనా, చిన్నప్పటి జ్ఞాపకాల్లా హృదయంలో నాటుకుపోవడం లేదు! చిన్ననాడు తిన్న చెరుకు గడల రసాస్వాదనలా, కొద్ది కొద్దిగా రసం వూరుతున్నట్లు… ఆ సినిమా, ఆ ఏక్టర్లూ, ఆ సినిమాకి వెళ్ళడానికి ఇంట్లో మనం చేసిన యాగీ… ఎవరితో వెళ్ళామో… రిక్షాలో వెళ్లామో… నడిచి వెళ్ళామో… ఆ హీరో పాడుతుంటే ఎందుకు అది కంఠతా వచ్చేసిందో! ఇంట్లో వాళ్ళు, “దీనికి సినిమాలంటే పిచ్చి, సినిమా హాల్ దగ్గర టికెట్ చింపి లోపలికి పంపే వాడినిచ్చి పెళ్ళి చేసేస్తే సరి!” అని ఎన్నిసార్లు అన్నారో నాకింకా గుర్తే! అసలు బాల్యంలో ప్రతి సంఘటనా నాకిప్పటికీ కలల్లో సైతం గుర్తుకొస్తాయి. ఇప్పటికీ నాకు కల వస్తే, చిన్నప్పటి, మా ఆర్.టి.సి. కాలనీ, వాకిట్లో వేప చెట్టూ, పెరట్లోని మావిడీ, సపోటా, జామ చెట్లూ, మల్లెపందిరి, ఇంటి నుండి దూరంగా వుండే బాత్‌రూం మీదకి పాకి వుండడం, మేం వేసవిలో, పైకెక్కి  మొగ్గలు కోసుకోవడం, ఆ ఇంటికే అమితాబ్ బచ్చన్ వచ్చినా, నన్ను కలుసుకోడానికి కమల్ హాసన్ వచ్చినా… ఇన్ని లక్షలు పోసి కట్టుకున్న ఇప్పుడుంటున్న ఇంటికి ఎవరూ రారు అదేం ఖర్మో! మొన్నెప్పుడూ నన్ను కలుసుకోడానికి కలలో అమితాబ్ బచ్చన్ వస్తే అమ్మమ్మ పచ్చడి రుబ్బుకునే రోటి దగ్గర, ఆవిడదే వాలు కుర్చీ వేసి కూర్చోపెట్టి మాట్లాడ్తుంటే, అమ్మమ్మ కంచుగ్లాసుతో – పైట కొంగు చేతి మీద వేసుకుని, దాని మీద గ్లాసు పెట్టుకుని కాఫీ తెచ్చి ఇచ్చింది! నాకేమీ కొత్తగా అనిపించలేదు! ఈ ఇంటికెందుకొచ్చాడా? ఆ ఇల్లు ఇప్పుడు పడగొట్టేసారు కదా అన్న అనుమానం కూడా మచ్చుకైనా రాలేదు. ఈ మధ్యే రామానాయుడు గారొచ్చి “అర్జెంటుగా సినిమా తియ్యాలి… అప్పుడు చెప్పావే రమణీ! నలుగురు స్టూడెంట్ల కథ” అన్నారు. వేపచెట్టు కింద పేము కుర్చీ వేసి, కూర్చోపెట్టాను. మా శ్యామలమ్మ పళ్ళెంలో జంతికలు తెచ్చి పెట్టింది! ఎన్నడో పోయిన శ్యామలమ్మ, ఇప్పుడు లేని రామానాయుడు గారితో నేను మాట్లాడడం ఏమిటన్న స్పృహ లేకుండా, నేను అతి మామూలుగా మాట్లాడ్తున్నాను! ఆ కథ నిజంగా ఆయన బ్రతికుండగా, సినిమా తియ్యాలని ఎంతో అనుకున్నారు, కుదరలేదు. మా కోడి రామకృష్ణ గారు కూడా “స్టూడియోలో అందరి దర్శకుల సరసన నా ఫోటో లేదు, ఆ సినిమా నేనే తీస్తా!” అనేవారు. స్వర్గంలో ఆ చర్చలేవో ఇద్దరూ చేసుకుని వచ్చుంటారేమో! నిజంగా, ఓసారి ఆలోచించండి. కలలు మనకి ఇష్టంగా చిన్నప్పుడు గడిపిన ఇళ్ళల్లోనే జరిగినట్లుగా వస్తాయి!

శ్రీ రామానాయుడితో రచయిత్రి

ఫణీ, నేనూ మాధవ్ మధ్యాహ్నం మూడు గంటలకు అట్లాంటాలోని ఫణి ఇంటికి చేరాం. మాధవ్ ఆ రోజు సాయంత్రం ఫణి కుటుంబాన్నీ, నన్నూ వాళ్ళింటికి భోజనానికి రమ్మని పిలిచాడు. గాయత్రి అయినా వూరుకునే రకం కాదు! తనూ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసి, పిల్లల్ని ముస్తాబు చేసి బయల్దేరింది. మాధవ్ తల్లి తండ్రులూ, వాళ్ళని చూడ్డానికి డాలస్ నుంచి కార్‍లో వచ్చిన మాధవ్ దుర్భా అక్క సుజనా పాలూరీ అక్కడే వున్నారు. అప్పటికి సుజనతో నాకు పెద్ద అనుబంధం ఏర్పడలేదు. మాధవ్ అక్కగానే పరిచయం. ఇప్పుడు నాకు చాలా దగ్గరి ఆత్మీయురాలు. సుజనా, రామారావు పాలూరి గార్లకి మౌక్తిక, ప్రబంధ్ ఇద్దరు పిల్లలు. మాధవ్, అపర్ణలకి సాధనా, అభిరామ్ ఇద్దరు పిల్లలు. ఇది జరిగిన ఆరేళ్ళకి ఇప్పుడు మౌక్తిక మెడిసిన్ పాసయి, ఎం.డి. చేస్తోంది.

మాధవ్ తల్లిదండ్రులని చూసుకునే పద్ధతి, పిల్లలందరికీ మార్గదర్శకం. తల్లిగారికి, అస్వస్థతగా చాలా రోజులు మంచంలో వున్నారు. వారికి బాగా లేనప్పుడు కూడా సందేహించకుండా, లెగ్ ఫ్రాక్చర్ అయిన తల్లిని, ఫ్లయిట్‍లో విజయవాడ నుండి, మాధవ్ తీసుకొచ్చిన వైనం, అతను చెప్తుంటేనే, చిన్నవాడయినా, దణ్ణం పెట్టేసాను! చాలా బాగా చూసుకున్నాడు. ఎవరో తెలీని కాన్సర్ పేషంట్లకే బోన్ మేరో డొనేట్ చేస్తాడు మాధవ్. తల్లి తండ్రులకి సేవ చెయ్యడంలో విచిత్రం ఏముందీ?

భోజనాలు అయ్యాకా, మాధవ్ వాళ్ళ హోం థియేటర్‍లో ‘ఫ్రోజెన్’ సినిమా చూసాం పిల్లలతో కలిసి. నాకైతే చాలా నచ్చింది. ఇంత పెద్దయినా మా అబ్బాయిలిద్దరూ ఏనిమేషన్ చిత్రాలు ఇష్టంగా చూడడం చూసి నేను ఆటపట్టించేదాన్ని! ఇప్పుడు నేనూ చూస్తున్నాను. ‘లయన్ కింగ్’ మా అమ్మకీ చూపించాను మొన్న.

రోజంతా ప్రయాణంలో అలసిపోయి, ఫణీ, మాధవ్ వాళ్ళతో సందడిగా గడిచిపోయినా, పడుకున్నాకా మళ్ళీ క్రిష్ణని వదిలిపెట్టి చాలా మైళ్ళు వచ్చేసాననీ, మళ్ళీ రెండు మూడేళ్ళ వరకూ వాడిని చూడలేనేమోననే తలపుతో గుండెల్లో చాలా బాధొచ్చేసింది.

కుమారుడు క్రిష్ణతో రచయిత్రి

ఇది రాస్తున్న రోజున జూన్ 2, 2021న, మాకు మా క్రిష్ణ సియోటిల్‍కి టికెట్స్ బుక్ చేయించాడు. నిజానికి నేనిప్పుడు ఫ్లయిట్‌లో వుండాల్సిన దాన్ని! కానీ కరోన బీభత్సం కారణంగా, ఇండియాలో డెత్ రేట్‌ని చూసి, కంట్రోల్ కాని కోవిడ్, సమయానికి ఇవ్వలేని వాక్సిన్‍ల కారణంగా, యూ.ఎస్.ఏ. మా బి1, బి2 వీసాల వారి ప్రయాణాలన్ని రద్దు చేసింది…. మళ్ళీ ఎప్పుడో తెలీదు. అనుకున్నవన్నీ తారుమారు అయ్యాయి. ప్రపంచం అయోమయంలో కొట్టుమిట్టాడ్తోంది.

అమెరికా అంటే, వీసా వుంటే, హైదరాబాద్, ఢిల్లీలా తిరగొచ్చుననుకుని, పిల్లల్ని అక్కడ్కి పంపిన మాలాంటి తల్లిదండ్రులు హతాశులయ్యే పరిస్థితి. బ్యాన్! వాళ్ళు ఇటు రాలేరు, మేం అటు వెళ్ళలేం… కరోనా… కరోనా… ఏ ఛానెల్ పెట్టినా, ఏ పేపర్ చదివినా… కరోనా కరాళ నృత్యం, ఆ కర్కశ పదఘట్టనల కింద పడి నలిగిపోయిన పిల్లలూ, పెద్దలూ ఎందరో! ఈ ఘోరాలకి మా తరం సాక్షీభూతులుగా వున్నాం.

మరునాడు అట్లాంటాలో ఫణి ఇంట్లో నేను లేచేటప్పటికే గాయత్రి ఆఫీస్‍కి వెళ్ళిపోయింది. కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కూడా సిద్ధంగా వుంది. ఫణీ, నేను కథలూ, స్క్రీన్ ప్లే, షూటింగ్ బడ్జెట్‍లు మాట్లాడుకున్నాం, అప్పుడే ‘అమ్మ కోరిక’ అనే మరో కథ తను రాసుకున్నది కూడా షార్ట్‌ఫిల్మ్‌గా తియ్యాలనుంది అని చెప్పాడు ఫణి. మధ్యాహ్నం లంచ్ చేసి, కాసేపు పడుకుని లేచేటప్పటికీ, గాయత్రి వచ్చింది. మధ్యలో ఫణి “అక్కా, నేనొచ్చి సినిమా ఫీల్డ్‌లో నా లక్ పరీక్షించుకోనా? రైటర్‌గా కానీ డైరక్టర్‍గా కానీ?” అన్నాడు. అప్పుడు మేం ఫణి ఇంటి వెనుక బాల్కనీలో కూర్చుని వున్నాం, మా వెనకాల పెద్ద వనం… నీళ్ళు! విఠలాచార్య సినిమా సెట్టింగ్‌లా, సువిశాలమైన ఇల్లు అతనిది!  నేను “పెద్ద పెద్ద డైరక్టర్లకి జుబ్లీహిల్స్‌లో ఇంత ఇల్లు లేదు తెలుసా? ఇవన్నీ వదులుకొని, వచ్చేస్తావా? వద్దు… ఇప్పుడు చేస్తున్న పనే మంచింది! స్క్రిప్టు రెడీ అయ్యాకా, వచ్చి సినిమా తీసుకుని వెళ్ళు! ఈలోగా ఎవరైనా ఎన్.ఆర్.ఐ. ప్రొడ్యూసర్స్‌ని రెడీ చేసుకో” అన్నాను. మరి మంచి సలహా ఇచ్చానో, కాదో కాలమే చెప్పాలి!

గాయత్రీ, నేనూ షాపింగ్‌కి వెళ్ళొచ్చాం. చాక్లెట్స్, చిన్న చిన్న గిఫ్ట్స్, కలోన్స్ మా పెద్ద అబ్బాయికి కొన్నాను.

మర్నాడు ఎర్లీ మార్నింగ్ నా ఇండియా ప్రయాణం. ఫణి ఎయిర్‍పోర్ట్‌లో లగేజ్ వెయింగ్ మెషిన్ దగ్గర వున్న ఓ అమ్మాయితో తమాషా చేశాడు. మూడు కిలోలు ఎక్కువైంది. “ఏదీ, చూస్తాను” అని తీసుకుని పైన జిప్‍ల్లో పెట్టిన మేగజైన్స్ లాగేసి, సూట్‌కేస్ అడ్డంగా వున్న దాన్ని నిలువుగా పెట్టి, చెక్ చేసి, “సరిపోయింది” చూడమన్నాడు. ఆ అమ్మాయి కన్‍ఫ్యూజ్ అయి, సూట్‌కేస్ పంపించేసింది. నేను తిరుగు ప్రయాణం అయ్యాను.

(సశేషం)

Exit mobile version