Site icon Sanchika

జీవన రమణీయం-166

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఇం[/dropcap]దాక ఆ స్త్రీ గురించి చెప్తూ, ‘తోడూ నీడా’ రాజేశ్వరి గారు అన్నాను కదా! నేను కలుసుకున్న ఇంకో మంచి మనిషి నా జీవన ప్రయాణంలో. ఇది చాలా తమాషాగా జరిగింది. 2018లో మా పెద్ద వాడికి ఓ సంబంధం చెప్పాడు ఓ పెద్ద మనిషి! అతనంత పెద్ద మనిషి కాదని ఆ తర్వాత తెలిసింది అనుకోండీ… మా అబ్బాయి విషయం వదిలేసి… “మీ నవ్వు వినాలనుంది… అందుకే ఫోన్ చేసా… మీ గొంతు నన్ను హాంట్ చేస్తోంది” అంటుంటే, ఓ రోజు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చా! ఎవరన్నారు ఆడవాళ్ళకి ఓ ఏజ్ వచ్చాకా ఈ బాధలు తప్పుతాయని? మా పెద్దమ్మ గారు ఒంటరిగా వుండే వ్యక్తి. ఆవిడకి పార్క్‌లో ఓ ముసలాయిన పరిచయం అయి, “మీ ఇల్లెక్కడుంది మేడం?” అని హిందీలో పరిచయం చేసుకుని, నార్త్ ఇండియన్ మనిషి, 70 ఏళ్ళావిడని “కెన్ ఐ కిస్ యూ?” అని అడిగాడట! ఈవిడ జీవితం అంతా మహారాష్ట్ర విద్యుత్ సౌధాలో జాబ్ చేసి రిటైరయి వచ్చి ఇక్కడ హైదరాబదులో సెటిల్ అయినావిడ! ఈ ఇతివృత్తం కథలకీ, నవలలకీ, సినిమాలకీ పనికొస్తుందేమో కానీ నిజ జీవితంలో ఆవిడ చెప్పు తీసి, 80 ఏళ్ళ ముసలాయనని బయటకి తోలేసారు! నాతో ఈ ఇన్సిడెంట్ చెప్తే, నేను బాగా నవ్వి “మా సినిమా ఇండ్రస్ట్రీలో 80 కాదు 90 వచ్చినా ఇలా మాట్లాడే వాళ్ళను చూసాను! ఇక్కడ ఎలౌడ్ అనుకుంట” అన్నాను. మా పెద్దమ్మ చాలా అందమైనావిడ! అది వేరే సంగతి.

సో… ఈ రాజేశ్వరి గారి మనవరాలు పెళ్ళి సంబంధం మా ఆర్కిటెక్ట్ అబ్బాయికి చెప్తూ, “మీకేం అభ్యంతరం లేదుగా? ఆవిడ రీమేరేజ్ చేసుకున్నారు” అన్నాడు… “నాకేం అభ్యంతరం?” అన్నాను. “ఈ మధ్యే చేసుకున్నారు…” అన్నాడు. నాకు కుతూహలం కలిగింది. “ఆవిడ వయసెంత వుంటుంది?” అన్నాను. “అరవై పైనే” అన్నాడు.

అయితే ఆవిడని కలుసుకోవాలి అనుకున్నాను. ఆ తర్వాత నేను ఆవిడ్ని కలుసుకున్నాను.

రాజేశ్వరి గారితో రచయిత్రి

మోహినీ రాజేశ్వరి అన్న ఆవిడ రాజమండ్రిలో టీచర్‍గా చేసి, ముగ్గురు పిల్లల్ని సింగిల్ మదర్‍గా చాలా కష్టాలు పడి పెంచి పెద్ద చేసాకా, వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్దయ్యాకా, ఒక నాడు ఆవిడ పెద్ద కొడుకు (అప్పటికే ఆయన పిల్లలు పెద్దవాళ్ళు) “నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకో అమ్మా, నీకో కంపేనియన్ దొరుకుతారు” అన్నారుట! ఆవిడ ‘ఛ.. వద్దు… ఈ వయసులో నాకు పెళ్ళేవిటి?’ అన్న దిశలో కాకుండా, ఆలోచించారు.

కొడుకే పేపర్‍లో ప్రకటన కూడా ఇచ్చారుట! అప్పుడు వచ్చిన రెస్పాన్స్‌లూ, ప్రహసనాలూ, పక్కన పెడితే, ఈవిడకి ఓ గొప్ప ఆలోచన వచ్చింది! తనకి ఆ రోజుల ప్రకారం, చిన్నతనంలో ఓ డాక్టర్‌కి ఇచ్చి పెళ్ళి చేస్తే, ఆయన మానసికంగా బోలెడు బాధలు పెట్టాడుట! పెద్దవాళ్ళు ‘పిల్లలు పుడితే సంసారాలు చక్కబడతాయి’  అనే కాన్సెప్ట్‌తో ముగ్గురు పిల్లలు పుట్టేదాకా ఈవిడని ఇంటికి రానివ్వలేదు! ఆ తర్వాత ఈవిడ భరించలేక వచ్చేసి, టీచర్ ట్రైనింగ్ అయి, ఉద్యోగం చేస్తూ, పిల్లల్ని ప్రయోజకుల్ని చేసింది. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని, ఉన్నతస్థాయిలో వున్నారు! ఇప్పుడు అరవై పై బడిన తనకి, కొడుకు “నీకో పార్ట్‌నర్ వుంటే బావుంటుంది” అన్నాడు. ఇలాగే చాలా మంది అనుకోవచ్చు కదా! అని ఆవిడ, ‘తోడూ నీడా’ అనే ఆర్గనైజేషన్ హైదరాబాదులో స్థాపించారు. ఇక్కడ 50 పై  బడిన వాళ్ళకి రెండో వివాహాలు చేసుకునే అవకాశం వుంది. పక్కాగా ప్రాపర్ పేపర్స్‌తో, తమ వివరాలు, ఐడెంటిటీ కార్డ్; వివాహం చేసుకునేవారు డైవోర్సీ అయితే, ఆ లీగల్ డాక్యుమెంట్స్, పార్ట్‌నర్ చనిపోయి వస్తే, ఆ డెత్ సర్టిఫికెట్ అన్నీ నమోదు చేసుకోవాలి. ఇలా మొదలయినప్పుడు, ఓ పారిశ్రామికవేత్త, ఉన్నత విద్యావంతుడు, చాలా డబ్బున్న స్థితిమంతుడు, ఆయనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ వున్నాయి, ఆయన రిజిస్టర్ చేసుకున్నారట. ఆయన కుమార్తె, అల్లుడూ డాక్టర్లు. ఇద్దరు పిల్లలు. ఆయన కుమారుడు ఇంజనీర్, అతనూ వెల్ సెటిల్డ్. ఏ బాదరబందీలూ లేవు. నేను చూసా కాబట్టి చెప్తున్నా, అందగాడు, మంచి పర్సనాలిటీ! రాజేశ్వరి గారు ఆయనని చాలా ప్రశ్నలు వేసారు, ఆయన ఏం ఆశించి ఈ వయసులో ఈ పెళ్ళి చేసుకుంటున్నారో అని. “ఈ వయసులో ప్రయాణాల్లో కంపేనియన్ కావాలి… నాకు పనులు చెయ్యడానికి వంట మనిషీ, బోయ్ అంతా వున్నారు…. కలిసి సినిమాలకి వెళ్ళడం, డిన్నర్ చెయ్యడం, స్నేహితుల్లా కబుర్లు చెప్పుకోవడం, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు, ఆ వివరాలన్నీ సేకరించి ఇంగ్లీషులో మాట్లాడి ఏర్పాట్లు చెయ్యగలగడం….” ఇలాంటివి చెప్పారుట! సో… రాజేశ్వరిగారు చాలా మంది స్త్రీలను ఆయనకి రెండవ వివాహానికి గాను చూపించారుట! సహజంగా స్త్రీలకి ఇటువంటి పెళ్ళి కొడుకు దొరకడం అదృష్టమే అనుకుని, అందరూ ఆయన చేసుకుంటే బావుండ్ను అనుకున్నారు ఆర్గనైజేషన్‌లో. కానీ ఆయనకి ఎవరూ నచ్చలేదు! ఒకరోజు సడెన్‍గా “మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను” అని రాజేశ్వరి గారికే అప్లికేషన్ పెట్టారు. ఆ పెద్ద మనిషి పేరు దామోదరరావు గారు! ఈవిడ ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు, ఆలోచించారు. పిల్లలతో మాట్లాడారు. ఆయన కేస్ట్ కూడా వేరే! పిల్లలు, ఇద్దరు కొడుకులూ, కూతురు కూడా ఆనందంగా, “ఆలోచించకు, ‘ఎస్’ చెప్పేయ్” అన్నారు. కానీ వాళ్ళ పిల్లలకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ముఖ్యంగా కూతురికి ఇద్దరూ కూతుళ్ళే! అందుకని ఈవిడ సంశయించారుట! ఆ కూతురే… “అమ్మా… ఇన్నేళ్ళు నువ్వు త్యాగం చేసింది చాలు… ఈ ఏజ్‍లో కావాలసిన కంపేనియన్ లభిస్తుంటే కాదనకు, మేం మా సంసారాల్లో ఫుల్ బిజీ… నీకు అంతగా కంపెనీ ఇవ్వలేకపోతున్నాం” అన్నాకా, ఈవిడ ఆయనకి ‘ఎస్’ చెప్పారు. ఆయన కుమార్తె, కుమారుడూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, పెద్ద పొజీషన్స్‌లో వున్నారు, సేమ్ కారణాల వల్ల ఆనందంగా ఆమోదించారు. నవలల్లో సినిమాల్లో కాదు, నిజ జీవితంలోనూ పెద్ద మనసున్న వాళ్ళు వుంటారు. ఆ తర్వాత వారిద్దరూ సింపుల్‌గా మేరేజ్ చేసుకున్నారు.

ఆయన బంధువులందరికీ గర్వంగా పరిచయం చేసారు. ఇదీ వాళ్ళ కథ! నాకెంతో నచ్చి, ఆవిడతో స్నేహం చేసాను. 2012లో పెళ్ళి చేసుకున్నారు. 2010లో ‘తోడూ నీడా’  స్థాపించాకా, సరిగ్గా రెండేళ్ళకి! పెళ్ళి అయ్యేటప్పుడు రాజేశ్వరి గారికి 62, దామోదర్ గారికి 65 ఏళ్ళు. ఇప్పుడు తొమ్మిది వర్షాలు పూర్తయి ఆనందంగా వున్నారు. ఈ సంగతులు వ్రాయడానికి ఆవిడ పర్మిషన్ అడగడానికి ఇప్పుడే ఫోన్ చేసాను. ప్రోబ్లమ్ ఏంటంటే, రాజేశ్వరి గారు, నేను మాట్లాడడం మొదలుపెడితే దానికి అంతం వుండదు! ఇంకో కారణం ఏ సమస్య చెప్పినా ఆవిడ పరిష్కారం చెప్తారు, లేదా సహాయం చెయ్యడానికి ట్రై చేస్తారు. నా మంచి స్నేహితుల లిస్ట్‌లో ఆవిడ ఒకరు!

‘తోడూ నీడా’లో ఓ కార్యక్రమంలో రచయిత్రి

(సశేషం)

Exit mobile version