[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]జీ[/dropcap]వితంలో అన్నింటికన్నా కష్టమైన పని ‘No’ అని చెప్పడం! ఇది వినే వారికీ, చదివే వారికీ తేలిగ్గా వుండచ్చు కానీ, ఈ ‘నో’ చెప్పలేకపోవడం కూడా, కుటుబంలో వారసత్వంగా వస్తుందని మా అమ్మమ్మా, అమ్మా జీవితాలని చూసాకా, నాకూ వారి నుండే ఈ గుణం అబ్బిందని అర్థమైంది నాకు! అమ్మ ఆర్.టి.సి.లో తను సీనియర్ క్లర్క్‌గా చేస్తునే ఎంతోమందిని డిపోలలో, ఆఫీసుల్లో పనికి పెట్టించేది. ఇది వరకే చెప్పానుగా ఆవిడ దాతృత్వం గురించీ. నిన్న కూడా ఓ చిన్న, నెలన్నర పాపకి కేన్సర్ అంటున్నారని, మా కోడలి స్నేహితురాలి పాప గురించి చెప్తే, నేను నాకు తెలిసిన అంకాలజిస్ట్‌తో మాట్లాడ్తుండగానే, అమ్మ షిర్డీలో తాజుద్దీన్ బాబా సమాధి దగ్గరుండే పోతేబాబాకి 10,000 రూపాయలు గూగుల్ పే చేసేసింది! పాప పేరు మీద బీదలకి అన్నదానం, బాబా సమాధి ముందు రోజూ పండ్లూ, పూలూ వుంచమని! అంత దాతృత్వం. ఆవిడకి ‘నాన్న’గారి తాలూకు పెన్షన్ వస్తుంది. అదంతా ఇలాంటి సత్కార్యాలకే వినియోగిస్తుంది. షిర్డీలో పని చేసే సెక్యూరిటీ గార్డుల పిల్లల చదువులకీ, వృద్ధుల భోజనాలకీ ఎక్కువగా ఖర్చు పెడ్తూ, అక్కడే వుంటుంది, కరోనా వల్ల ఇక్కడ మా దగ్గర హైదరాబాదులో వున్నా. మొన్న షిర్డీ దేవస్థానంలో పని చేసే ఉన్నతాధికారి, హైదరాబాద్ వస్తుంటే, ‘అతుల్’ అనే సెక్యూరిటీ గార్డ్ అమ్మని చూడ్డానికి ఆయనతో బాటు జీప్‍లో వచ్చి, మాదాపూర్ లోని అన్నయ్య ఇంటిలో అమ్మని కలుసుకుని, ఆవిడ ప్రేమతో పెట్టిన భోజనం, అతడి స్నేహితుడితో గూడా తిని, ప్రసాదం ఇచ్చి వెళ్ళాడు! షిర్డీ, రహతా, సకోరీలలో అమ్మ అంటే చాలామందికి తెలుసు! ‘అమ్మ’ అనే వాళ్ళ సెల్‍ఫోన్స్‌లో వుంటుంది. మా నీహారికా కన్నన్ (ఫ్యాషన్ డిజైనర్) షిర్డీ వెళ్ళి అమ్మ గురించి వాకబు చేస్తూ, ఆవిడ నెంబర్ అక్కడున్న సెక్యూరిటీ గార్డుకి చెప్తే, సెల్‍లో ‘అమ్మ’ అని రావడం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారుట! ‘అమ్మ’ కోసం అని ముందే చెప్పచ్చుగా అన్నాడట ఆ సెక్యూరిటీ గార్డ్. అక్కడున్న దుకాణాల వాళ్ళకి కూడా అమ్మంటే చాలా ప్రేమ! అమ్మ వేసవిలో వాళ్ళకి లస్సీ, హోటల్ భోజనాలూ పెట్టిస్తూ వుంటుంది. ఆవిడ ఆనందం పెట్టడంలోనే వుంది! మా అమ్మ, నా చిన్నప్పటి నుండీ, చీరల కోసం, నగల కోసం భ్రమపడడం, కొనడం నేను ఎప్పుడూ చూడలేదు.
మా పెద్దమ్మ గారు నాగపూర్ వెళ్ళినప్పుడు, “పాపాయ్, ఈ అమ్మాయి కష్టాల్లో వుంది. ఏదైనా వుద్యోగం చూడు, నీతో పంపిస్తా” అన్నా; “ఈ అబ్బాయికి హైద్రాబాదులో వుద్యోగం వచ్చింది. కొంత కాలం నీ ఇంట్లో పెట్టుకో” అన్నా – “అలాగే పంపించు అక్కా” అనేది!
మా అమ్మమ్మ గారు కూడా ఏ దూరపు బంధువు వచ్చినా, తెలిసిన వాళ్ళు వచ్చినా ఇంట్లో ఆశ్రయం ఇచ్చేసేవారు. ఎవరైనా సాయం అడిగితే ‘నో’ అనడం వాళ్ళకి తెలీదు! తమకే కష్టంగా గడుస్తున్నప్పటికీ, మనని అడిగారంటే, వీళ్ళకి ఇంకెంత కష్టంగా వుందో పాపం… అని ఆలోచించి, “రండి… చేద్దాం” అనేవారు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం, ఒక కుటుంబం, మంచి నక్షత్రంలో ఇంటి యజమాని పోలేదని, మొత్తం పిల్లలూ, మనవలతో సహా, మా ఇంట్లో దాదాపు ఆర్నెల్లు వున్నారు! ఇంకో దూరపు బంధువు కూతురు కాన్పు అయితే, వాళ్ళింట్లో పురిటి గది లేదని, మా ఇంట్లో మూడవ నెల వచ్చేదాకా పెట్టారు. ఇంక ఏడాదీ, రెండేళ్ళు వుద్యోగం కోసం వచ్చి వున్న వాళ్ళు ఏడు, ఎనిమిది మంది! నెల నెలా ఆస్పత్రులలో, ఆఫీస్ పనులకో ఆంధ్రా నుండి వచ్చేవారికి బస, కేరాఫ్ పాపాయి ఇల్లు. అందులోనూ చిక్కడపల్లి, మంచి సెంటర్‍లో వుండేవాళ్ళం!
అమ్మమ్మ అయితే శారీరకపు శ్రమకి అస్సలు వెనుకాడేది కాదు! ఎవరింట్లో పెళ్ళి అన్నా, అశుభం అన్నా, పురుడన్నా, ఈవిడ వెళ్ళి వారితో బాటే వుండి, వంట చేసి, రోగులైతే సేవ చేసి, అసహ్యం అనుకోకుండా ప్రేమగా ‘మదర్ థెరెసా’లా చేసేది. అది మా తాతగారు చాగల్లులో హరిజనాశ్రమం పెట్టి, ఈవిడకి ఇప్పించిన తర్ఫీదు కూడా!
తరువాత నా తరం వచ్చింది! నేనూ ‘నో’ అనలేను! నాకు నా అదృష్టమో, పూర్వజన్మ సుకృతమో కానీ టీ.వీ, సినిమా ఫీల్డులోకి వెళ్ళిన నాటి నుండీ పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు!
అక్కినేని నాగేశ్వరరావు గారికి ‘లీడర్’ బుక్ అంకితం ఇచ్చినప్పటి నుండీ, మంచి అనుబంధం వుండేది. ఎంత అంటే, “అపాయింట్‍మెంట్ అక్కర్లేదు నీకు, ఎప్పుడు ఇటుగా వెళ్ళినా వస్తూ వుండు” అనేవారు. ఆయన చివరి రోజుల దాకా అలాగే వెళ్తూ వుండేదాన్ని.
రామానాయుడు గారు, నేను చెప్తే, “రమణీ చెప్పింది, అంటే ఆలోచించే చెప్తుంది” అని ఎవరినైనా అసిస్టెంట్ డైరక్టర్లుగా, మిగతా పనుల్లో పెట్టేసుకునేవారు.
తర్వాత అల్లు అరవింద్ గారినీ నేను మొదట్లో పలు రకాలుగా ఆబ్లిగేట్ చేసి, వుద్యోగాలు పెట్టించేదాన్ని. నా మాట కాదనేవారు కారు. ఇండస్ట్రీలో కె.ఎస్. రామారావు గారూ, ఎస్. గోపాలరెడ్డి గారూ, పరుచూరి గోపాలకృష్ణ గారూ, నాగబాబు గారూ కూడా నన్ను ఎంతో అభిమానించి నా మాటకి విలువిస్తారు. కానీ ఒకళ్ళిద్దరూ, నేను ఎంతో మంచిగా చెప్పి వాళ్ళని పనికి పెట్టించాకా, నా మాట వుంచకుండా, చెడుగా ప్రవర్తించి, నాకు చెడ్డ పేరు తెచ్చారు!
పని ఇచ్చిన పెద్దలు నన్ను ఒక్క మాట కూడా అనలేదు! మళ్ళీ నేను ఎవరికో వైద్యానికో, చదువుకో సాయం చెయ్యమని వెళ్తే కూడా చేసారు! ఎవరైతే అక్కడ దొంగపనులూ, అబద్ధాలు చేసి వాళ్ళకి నష్టం చేశారో, వాళ్ళే వచ్చి ఏడుస్తూ, “ఇలా చేసాం మేడం” అని నాకు చెప్పారు. అందులో ఆడపిల్లలూ వున్నారు. ఆ పెద్ద మనుషులకి నేను నమస్కరించి ‘సారీ’ చెప్పాను.
“నువ్వు నల్లనివన్నీ నీళ్ళూ, తెల్లనివన్నీ పాలూ అనుకుంటావ్… నీ కోసం కాకుండా, ఇతరుల కోసం కష్టపడ్తావ్… ఆ సాయాలేవో నీ కోసం అడిగి వుంటే బావుండేది!” అన్నారు ఓసారి అరవింద్ గారు. నాకు ‘నో’ అని చెప్పడం కూడా నేర్పించ చూసారు. “నాకిప్పుడు టైం లేదు… బిజీగా వున్నాను… లేదా మీరు అడగమన్న పెద్దాయనకీ నాకూ ఇప్పుడంత మాటలు లేవు… ఆయన దేశంలో లేరు…” ఇట్లా చెప్పమన్నారు. “సరే” అన్నాను కానీ, ఆయన్ని వదిలేసి వేరే వారి ద్వారా సహాయాలు చేయించడం మొదలుపెట్టాను! ఆ వచ్చిన వాడి మాటలు “తిండానికి తిండి లేదూ, పిల్లలకి స్కూల్ ఫీజ్ లేదూ, పెళ్ళాం ఆస్పత్రికి డబ్బులు కట్టలేకపోతున్నానూ” ఇలా వుండేవి! పర్సనల్‍గా కూడా పర్స్ చూసి, ఎంతుంటే అంతా ఇచ్చేసేదాన్ని. ఎక్కువగా “ఆయనతో ఓ మాట చెప్పండి… ఫలానా పని కావాలీ” అనో; “వేషం కావాలీ… ఫలానా పనికి మీరు రికమెండ్ చేస్తే అయిపోతుందీ” అని వస్తారు. నాకు ‘నో’ చెప్పడం రాదు, కానీ నేర్చుకుంటున్నా.
నా దగ్గర అసిస్టెంట్‌గా పని చేసినవాళ్ళూ, నా దగ్గరి స్నేహితులూ, పెద్ద సినిమాలు తీసే డైరక్టర్లు అయ్యారు! ఇప్పుడు పెద్ద హోదాల్లో వున్నారు చాలామంది. వాళ్ళని నేను ఏం అడగలేదు, కానీ అడిగితే చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఈ తరం వాళ్ళు. ‘No’ చెప్పడం వాళ్ళకి వచ్చు! మా తరం లాగా ఫూలిష్‌గా బాంధవ్యాలు వాళ్ళు పెంచుకోరు. పంచుకునే తరం కాదిది, తెంచుకునే తరం!
(సశేషం)