[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]”మీ[/dropcap] ఫోటో చూసి పెళ్ళి కాని పిల్ల అనుకుంటున్నారేమో ఆయన” అంది. ఈ విషయం నేను గుర్తు పెట్టుకుని పాతికేళ్ళ తర్వాత కూడా రాస్తున్నానంటే… ఎంతగా హర్ట్ అయ్యానో వూహించండి! కవితల పోటీకి నేను అసలు ఫొటో పెట్టలేదు.
మనుషుల స్వభావాలు అంతే… సాధారణంగా మన పక్కింటాయనో, దగ్గర బంధువో గుర్తింపు పొంది ప్రముఖుడైపోతున్నాడంటే బాధగా వుంటుంది! బాగా పాపులర్ అయ్యాక, “మా వాడే… నాకు బాగా క్లోజ్… మా ఇంట్లోనే తినేవాడు… మా నాన్నగారే చదివించారు…. పాపం ఏమీ లేనివాడు, కాళ్ళకి చెప్పులు కూడా నేనే ఇచ్చా!” ఈ టైపులో చెప్పుకోవడం పరిపాటే! పసివాడిని చంకనేసుకుని వెలుగుతున్న మతాబులా వెళ్ళిన నేను, వత్తి ఆరిపోయిన బాంబ్‌లా ‘తుస్సు’మంటూ రావడం అమ్మమ్మ గమనించింది.
“నీకు మనుషులెప్పుడు అర్థం అవుతారే? మీ తాతగారిలా అన్నింటికీ తొందర…” అని తిట్టింది.
మా ఆయన ఆఫీసు నుండి రాగానే, ఎగ్జైట్‌మెంట్‌తో మాటలు తడబడ్తూ… “యండమూరి… యండమూరి గారు రమ్మన్నారు… నా కవిత చదివారుట…” అని మొత్తం చెప్పేశాను. ఆయన కూడా అనందపడ్డారు!
ఆ రోజు నుండీ ఈ రోజు వరకూ నా ప్రతి ఎచీవ్‌మెంట్‌కీ అదే చిరునవ్వు! అదే ప్రోత్సాహం… నా ఆనందమే తన ఆనందం… ఇటువంటి భర్త నా పూర్వజన్మ సుకృతం… అప్పుడు గాని ఈ సంగతి అర్థం కాలేదు. కానీ నా సాహితీ ప్రయాణంలో, నా సినీ జీవిత ప్రయాణంలో చాలా మంది రచయిత్రులనీ, అటకెక్కిన వారి రచనలనీ చూస్తుంటే నేనెంత అదృష్టవంతురాలినో మరీ మరీ అర్థమవుతూ వచ్చింది.
ఆదివారం పిల్లల్ని కూడా ప్రొద్దుటే తయారు చేసి మా అత్తగారి దగ్గర వదిలి మేం స్వరూపరాణితో కలిసి వీరేంద్రనాథ్ దగ్గరకి వెళ్ళడానికి నిశ్చయించుకుని పడుకున్నాం! రాత్రి నిద్ర పడితే ఒట్టు… మర్నాడు లలితా, సుశీలతో ఈ విషయం చెప్పేసుకున్నాక సగం మనశ్శాంతి దొరికింది.
లలిత బుగ్గలు సొట్టలు పడ్తూ, కళ్ళు మూసుకుపోతూ మనసులోంచి నవ్వింది. “నాకు తెలుసు నా ఫ్రెండ్ చాలా గొప్ప రైటర్ అవుతుందని” అంది. సుశీల కూడా అంతే సంతోషపడింది. అటువంటి స్నేహితులనే ‘స్నేహితులు’ అని చెప్పుకోవాలి. ఈరోజు దాకా వాళ్ళిద్దరూ, మా ఉమా నా వెన్నంటే వున్నారు.
మధ్యలో ఒకసారి స్కూల్ నుండి అమరావతి పిక్‍నిక్ వెళ్ళాం. మా వదిన జయశ్రీని కూడా తీసుకువెళ్ళాం. ఏర్పాట్లు అన్నీ మా స్కూలు ప్రిన్సిపాల్ దరిద్రంగా చేశాడు. కానీ, అమరావతి మాత్రం బాగా ఎంజాయ్ చేశాం.
ఆ గుళ్ళో మాకు మాచిరాజు వేణుగోపాల్ అనే జ్యోతిష్యుడు కనిపించారు. ఏదో రాసుకుంటున్న ఆయనతో పరిచయం కలిగి, మాకు గైడ్‌గా వ్యవహరించారు. ఆయన జ్యోతిష్యం చెప్తారని తెలిసి మా వదిన తన చెయ్యి జాపి ఆకతాయితనంతో ఇద్దరు పిల్లల తల్లైన తను “నాకు పెళ్ళెప్పుడవుతుందీ?” అని అడిగింది.
ఆయన సీరియస్‌గా చూసి “మీకు నేను చెప్పను… మీ చెయ్యి జాపండి” అని నా చెయ్యి చూశారు. చాలా సేపు చూసి “మీరు ప్రఖ్యాతి గాంచే రచయిత్రి అవుతారు. నో డౌట్, చాలా పేరొస్తుంది” అన్నారు. అప్పటికింకా ఓం అంటే ఢం రాదు. బడి పిల్లలకి తప్ప ఏమీ రాయలేదు!
ఆనాటి మాచిరాజు వేణుగోపాల్ గారి మాట నేను లైట్‍గా తీసుకున్నా నా స్నేహితురాళ్ళు లైట్‌గా తీసుకోలేదు! మా సుశీల ఇప్పటికీ “ఆరోజే చెప్పారుగా ఆయనా” అని గుర్తు చేస్తూ ఉంటుంది. హస్తసాముద్రికాన్నే నమ్మాల్సివస్తే 2019 నుండీ నాకు చాలా మంచి పీరియడ్ అని చాలా మంది చెప్పారు. అది విని 1996లో నిట్టూర్చేదాన్ని… ‘అప్పటిదాకా అంటే… చూద్దాంలే’ అని.
నేను శనివారం టీ.వీ.లో సినిమా చూడనే లేదు… రేపు యండమూరి గారిని కలవగానే ఏం మాట్లాడాలి? నేను నా ఇటుక రంగు డైరీలో రాసుకున్న కవితలు చదివి వినిపించాలా? నా ప్రచురింపబడిన కథలు చూపించాలా? ఆయన ‘వెన్నెల్లో ఆడపిల్ల’ గురించి మాట్లాడాలా? ‘ఆనందో బ్రహ్మ’ గురించా? అసలు ‘ఋషి’ చదివి పులకరించిపోయే మా ఆయన నన్ను మాట్లాడనిస్తారా? అన్నీ తనే మాట్లాడేస్తారా? అని లక్ష సందేహాలు… అసలు అంత ఆత్రుతా, ఉత్సాహం అంతకు ముందెన్నడూ నా జీవితంలో కలగలేదు… మా అక్క పెళ్ళిలో ముగ్గులు పెడ్తున్న నా దగ్గరకొచ్చి మా ఆయన “నిన్ను నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను… నువ్వేం అంటావ్?” అన్న సందర్భం తర్వాత!
ఆదివారం పిల్లల్ని గబగబా తయారు చేసి, అమ్మమ్మ కాళ్ళకి దండం పెట్టి, అత్తగారింటి దగ్గర పిల్లల్ని అప్పగించి, స్వరూపరాణి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాము.
మా చిన్నవాడు అప్పటికే వాళ్ళ బామ్మకి “అమ్మ ‘వండమూరి యారేంద్రనాథ్’ ఆఫీస్ కెళ్తోంది” అని చెప్పేశాడు.
స్వరూపరాణి ఇంటికి వెళ్ళి తలుపు కొడ్తే వాళ్ళ అత్తగారొచ్చి తలుపు తీశారు. “స్వరూపరాణి ఉందా అండీ?” అని అడిగాను.
“లేదమ్మా” అన్నారు. అని తలుపు వేసేయ్యబోయారు.
ఆ సమాధానానికే నా ఉత్సాహం మీద నీళ్ళు జల్లినట్లు ఫీల్ అయ్యాను. ఆవిడ తలుపు వేసే లోపల దాన్ని పట్టి ఆపుతూ, “నన్ను రమ్మని పిలిచిందండీ… స్వరూప ఎక్కడ వుందీ?” అని ఆత్రంగా అడిగాను.
“ఆస్పత్రిలో” అందావిడ.
నా కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది. కన్నీళ్ళొకటే తక్కువ.
“ఏంటీ?” అని కింద బైక్ మీదున్న మా ఆయన కీడు శంకించి సైగలు చేస్తున్నారు.
“స్వరూపకి నిన్న రాత్రి నుండీ డీసెంట్రీ, ప్రొద్దుట నుండీ వాంతులు కూడా స్టార్ట్ అవడంతో ఆస్పత్రిలో ఎడ్మిట్ చేశాం” చెప్పిందావిడ.
నేను కళ్ళనీళ్ళ పర్యంతం అవడం చూసి, మా అయన బైక్ స్టాండ్ వేసి పైకి వచ్చారు…
“స్వరూప ఆస్పత్రిలో ఎడ్మిట్ అయ్యిందట… లేదుట…” అని ఏడుపుగొంతుతో చెప్పాను.
ఆయన నా భుజంమీద చెయ్యి వేశారు. కళ్ళతో ధైర్యం చెప్పారు, ‘ఏడవద్దన్నట్టు’ సైగతో.
“ఏ హాస్పిటలో చెప్పండి… మేం చూసెళ్తాం” అన్నారు. యండమూరి గారి పేరు ఎక్కడా బయటపెట్టలేదు! ఆవిడ కాస్త సంకోచించి “శారదా నర్సింగ్ హోమ్” అంది.
“థ్యాంక్స్” అని, నాతో “రమణీ… టైం లేదు… త్వరగా బైక్ ఎక్కు” అన్నారు.
నాకు కాస్త ఉత్సాహం వచ్చింది. “స్వరూప దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ నెంబరు తీస్కుందామా?” అడిగాను.
“ఔను… ఎడ్రస్ కూడా తీసుకుని వెళ్దాం” అన్నారు.
నేను కళ్ళు తుడుచుకుని బైక్ ఎక్కాను. అదే నా జీవితానికి సోపానం అవుతుందని ఆయనకీ తెలీదు, నేనూ అనుకోలేదు! రయ్యిన శారదా నర్సింగ్ హోమ్‍కి వెళ్ళాము. ఆత్రంగా ఆవిడ చెప్పిన రూమ్ నెంబరు వెతుక్కుంటూ వెళ్ళాం.
వాళ్ళయన అనుకుంటా బేబీని ఎత్తుకుని బయట కూర్చుని కనిపించారు. నేను పాపని గుర్తుపట్టాను.
“ఇదే రూమ్ అండీ” అన్నాను. వాళ్ళయన లేచి సందేహంగా చూశారు. మా అయన విషయమంతా టూకీగా వివరించి “ఓసారి మీ మిసెస్‌తో మాట్లాడాలి మేం” అన్నారు.
“రండి” అని ఆయన లోపలికి తీసుకెళ్ళారు.
స్వరూప చేతికి సెలైన్ పెట్టారు. బలహీనంగా మాట్లాడ్తోంది.
“అయ్యో! మీరొచ్చారా? నాకిలా అయింది… సార్ ఎదురుచూస్తూంటారు” అంది.
(సశేషం)