[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]అ[/dropcap]మ్మకి ఆర్.టి.సి.లో వుద్యోగం వల్లేమో ప్రయాణాలు అంటే చాలా ఇష్టం! మా తాతగారు కూడా స్వాతంత్ర్యోద్యమంలో పడి, ఒక చోట నుండి మరో చోటకి అస్తమానం ఫ్యామిలీని మార్చడం కూడా కారణం కావచ్చు! ఎవరో కొలీగ్ తీర్థయాత్రకి వెళ్తోంది అంటే అమ్మ కూడా వెళ్ళేది. పాటల ప్రోగ్రామ్స్ అంటే సరే సరి! బంధువులలో పెళ్ళిళ్ళకీ, పేరంటాలకీ, “పాపాయి గ్యారంటీగా వస్తుంది, ఆర్.టి.సి. కదా… ఫ్రీ” అనేవారు. అలా లిస్ట్‌లో మొదట మా అమ్మ పేరు పడేది. అమ్మ ‘చిట్ పాస్’ అని రాయించేది, దాని మీద తనతో బాటు ఒకళ్ళు లేదా ఇద్దరూ అని రాయిస్తే వాళ్ళకీ ఫ్రీ! మా అత్తయ్య చెల్లెల్ని తిరుపతి తీసుకెళ్ళింది, మా బామ్మని శ్రీశైలం, మా పెద్దమ్మ కూతుళ్ళని నెల్లూరు, గుంటూరు… ఎక్కడ తను పాడడానికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళేది. మా చిన్నతనంలో, అమ్మమ్మనీ, నన్నూ, అన్నయ్యనీ అస్తమానం అన్నవరం, తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్టలకీ, ఓ సారి బెంగుళూరు, మైసూర్‍లకీ; తరచూ మా పెద్దమ్మ దగ్గరరికి నాగపూర్‌కీ ఇలాగే తీసుకెళ్ళేది!
ఒకసారి మద్రాసు నేనూ అమ్మా వెళ్ళాం! నేను పదేళ్ళ పిల్లని. అమ్మ సినిమాలో పాట పాడటానికి ఎవరో రమ్మంటే నన్ను తోడు తీసుకుని వెళ్ళింది! అప్పుడు వీణ రంగారావు అనే మ్యూజిక్ డైరక్టర్ గారినీ, పెండ్యాల నాగేశ్వరరావు గారినీ, టి. చలపతిరావు గారినీ, ఎన్.టి.ఆర్. గారినీ కలిసాం. ఎన్.టి.ఆర్ నన్ను దగ్గరకి పిలిచి నా బుగ్గలు పుణికి, తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ‘విజయీభావ!’ అనే పాట హార్మోనియం మీద పెండ్యాల గారు పాడి వినిపిస్తున్నారు… గిరిజాల జుట్టూ, దబ్బ పండు రంగూ… ఎన్.టి.ఆర్. గారి స్ఫురద్రూపం అప్పుడూ, ఇప్పుడూ, ఇంకెప్పుడూ కూడా ఏ తరాలలో హీరోలకీ, ఏ భాషలోనూ రాదు! ఇప్పుటి హీరోలు (అనబడే వాళ్ళని చూసి) మా అమ్మ ‘ఎన్.టి.ఆర్.ని చూసిన కళ్ళతో’ అని వీళ్ళని చూస్తున్నందుకు ఎంతో బాధపడ్తుంది! అలా అమ్మ సినీ ప్రస్థానం, వుద్యోగం వల్ల ఎక్కువ ప్రయత్నాలు చెయ్యకముందే వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది! ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు తెలుస్తారనీ, అదే ఇండస్ట్రీలోకి వెళ్తాననీ ఆ పదేళ్ళ పిల్లకి తెలీదు! అసలు అమ్మకి సినీ ఫీల్డు అంటే వున్న ఇంట్రస్ట్ వల్లే నేను సినిమా రైటర్‍ని అయ్యాను.
అమ్మని మొదటిసారి నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాకే ఫ్లయిట్ ఎక్కించాను! 2009లో అనుకుంట, గిరిధర్ గోపాల్ అని నా తమ్ముడి లాంటి వాడు, సత్యసాయి బాబా బంధువు, ఓ సినిమా తీస్తూ – ‘ఓ మై గాడ్’ అనీ, నన్నూ, అమ్మనీ, మా చిన్నోడు కృష్ణకాంత్‌నీ తిరుపతి తీసుకెళ్ళాడు. అమ్మ అదే ఫ్లయిట్ ఎక్కడం. చాలా థ్రిల్ అయింది! ఆ తర్వాత నేను ‘మధుమాసం’ షూటింగ్‌కి మలేషియా వెళ్తుంటే, మా ఆయన హడావిడిగా పాస్‌పోర్ట్, నాతో బాటు అమ్మకీ చేయించేసారు. “నన్నూ తీసుకెళ్తావా?” అని అడిగింది. రామానాయుడు గారు మా అమ్మకెందుకు టికెట్ కొంటారు? నేను హీరోయిన్‌ని కాదుగా! అప్పుడు స్నేహ, వాళ్ళమ్మ, వాళ్ళ అక్క కొడుకు మూడేళ్ళవాడూ, పర్సనల్ అసిస్టెంట్ కూడా మాతో వచ్చారు!
నేను అది గుర్తు పెట్టుకుని అమ్మ పుట్టినరోజుకి మలేషియా ట్రిప్ ఎరేంజ్ చేసాను. అప్పట్లో ఆవిడ స్నేహంగా వుండే మా పెద్ద పెన్ని (ఆవిడ కజిన్ సిస్టర్), అన్నయ్య కూడా ఎన్నడూ ఫారెన్ కంట్రీ వెళ్ళలేదని, అన్నా వదినా అందరం మలేషియా వెళ్ళాం! అప్పుడు అమ్మా పిన్నీ ఆ స్కైస్క్రేపర్స్‌ని చూసి ఆశ్చర్యపోవడం, స్టార్ హోటల్స్ ఎంజాయ్ చెయ్యడం, అవన్నీ నా ఎచీచ్‍మెంట్స్‌లా నేను ఎప్పటికీ మర్చిపోలేను! అది అమ్మకి నేనిచ్చిన బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అనుకుంటా. మూడు రోజు మలేషియా, మూడు రోజులు జెన్‌టింగ్ హై లాండ్స్! బాగా ఎంజాయ్ చేసాం.
అలా రెండు సార్లు నేను మలేషియా ట్రిప్‌ని ఎంజాయ్ చేసాను. చిన్నప్పుడు నాకు స్టాంప్ కలెక్షన్ హాబీగా వుండేది. ఓ నోట్‌బుక్‌లో అన్నీ అతికించేదాన్ని! అంతకు ముందు అగ్గిపెట్టెల కవర్లల్లా, అప్పుడు గౌస్ అనే పోస్ట్‌మాన్ సైకిల్ బెల్ కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూసేదాన్ని!
అమ్మమ్మ పోస్ట్‌మాన్‌కి “ఎండన పడి వచ్చావ్ పాపం” అని మజ్జిగ ఇచ్చి, మాటా మంతీ చెప్తుంటే, నేను అతనిచ్చే స్టాంపులూ, ఎవరో వదిలేసిన రీడర్స్ డైజెస్ట్, అప్పుడప్పుడూ సోవియట్ రష్యా పత్రికా తీసుకునేదాన్ని. నా పెళ్ళికి కూడా వచ్చాడు గౌస్. ఆ స్టాంపుల్లో ఒక మలేషియా స్టాంప్ కూడా ఇచ్చాడు! అసలు త్రీడీ ఎఫెక్ట్‌లో అన్నట్లు ఆ అమ్మాయీ, పక్కన తెల్ల కలువా నాకు ఇంకా గుర్తే! “అమ్మా, మలేషియా ఎక్కడుందీ? నువ్వు చిట్ పాస్ రాసి నన్ను తీసుకెళ్ళగలవా?” అని అప్పుడే అడిగాను కూడా! అమ్మ నవ్వింది. “నువ్వు పెద్దయి విమానంలో వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు” అంది. అప్పుడు ‘తథాస్తు’ దేవతలు డ్యూటీలో వున్నారనుకుంట!
చిన్నప్పటి నుండీ నేను కన్న కల, రామానాయుడు గారు సాకారం చేసారు ‘మధుమాసం’ షూటింగ్ అప్పుడు! చాలా ఆనందంగా, అద్భుతంగా గడిచింది! ఎక్కడ లేడీస్ టాయ్‍లెట్స్ కనిపించినా స్నేహ ‘టాండాస్’ అని జేమ్స్‌బాండ్‌లా, పిస్టల్ పట్టుకున్నట్లు పోజ్ పెట్టి అల్లరి చేసేది! ఆ దేశం నేను చాలా ఇష్టపడడానికి కారణం లంకావీ లాంటి ద్వీపాల్లో అందమైన ప్రదేశాలలు మాత్రమే వెతికి మా సినిమా ప్రొడక్షన్ వాళ్ళు షూట్ చెయ్యడం వల్లనేమో! అందుకే వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళాలి అనుకున్నాను. రెండవసారి అమ్మని తీసుకెళ్ళాను. కానీ మూడవసారి కూడా వెళ్తానని వూహించలేదు! యాత్రా పాత్రా ప్రాప్తం వుంటేనే! అంతే కాదు, మా అమ్మమ్మ గారు నిద్ర రుణం, నీళ్ళ రుణం వుంటేనే వెళ్ళగలం అనేవారు! అదెంతో నిజం! మూడవసారి అవకాశం నేను అనుకోకుండా వచ్చింది.
2015లో ఒక రోజు, అప్పుడు నేను సెన్సార్ బోర్డ్ మెంబర్‌ని, అప్పుడే ‘అత్తారింటికి దారేది’ సినిమా చూసి వస్తున్నాం, థియేటర్‌కి వెళ్ళి. అప్పుడప్పుడూ కట్స్ అమలు చేసారా అని థియేటర్‌కి చెకింగ్‌కి వెళ్ళేవాళ్ళం! మా డైరక్టర్ చంద్రసిద్ధార్థ ఫోన్ చేసాడు.
“మీరు ఓ సారి ఫిల్మ్ నగర్‌లో సురేష్ గెస్ట్ హౌస్ దగ్గర ఇద్దర్ని కలవాలి, వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అవార్డ్స్ ఇవ్వడానికి తెలుగు ఇండస్ట్రీ నుండి జ్యూరీని వెతుకుతున్నారు, మీ పేరు చెప్పాను” అని.
నేను సినీ మేక్స్ దగ్గరే వున్నాను కాబట్టి నా తోటి మెంబర్‌కి బై చెప్పి సురేష్ గెస్ట్ హౌస్‌కి వెళ్ళాను. చంద్ర సిద్ధార్థ చెప్పాడంటే, ఆ స్టాండర్ట్ నేను వూహించగలను. మంచి మనుషులే వుంటారు.
అక్కడ అతనూ, వీరూ పోట్లా అనే ఇంకో దర్శకుడూ, మరో ఇద్దరు తమిళియన్స్ వున్నారు. వాళ్ళల్లో కాస్త తెలుగు వచ్చినతని భాష ఇలా వుంది.
“మీరుదా మలేషియా వచ్చిందీ, నాన్ మంచి హోటల్ ఇచ్చానూ, భోజనం పెట్టి పూడ్చానూ, నీ రొంబ సంతోషం అయిందీ…”
“నేనెప్పుడొచ్చానూ? నాకెప్పుడు హోటల్ ఇచ్చారూ?” అని నేను నోరు తెరిచి ఆశ్చర్యపోతే,
చంద్ర సిద్ధార్థ కలగ చేసుకొని “మనం సౌత్ ఇండియన్ కొరియోగ్రాఫర్స్ అవార్డ్స్ ఇవ్వడానికి SICAకి వెళ్తే, మలేషియాలో ఇవన్నీ వాళ్ళు సౌకర్యవంతంగా ఎరేంజ్ చేస్తారుట అన్నాడు.
మలేషియా పేరు వినగానే నాకు ఆనందం అయింది. “వస్తా” అన్నాను.
నా రెజ్యూమీ తీసుకున్నారు. లేడీ టెక్నీషియన్‍గా నా సీనియారిటీ, పేరూ ఇలాంటి జ్యూరీలకి బాగా పనికి వచ్చాయి! పెద్దగా డబ్బు సంపాదించలేకపోయినా, ఇండస్ట్రీ నాకు ఇచ్చినన్ని గొప్ప అవకాశాలు డబ్బులొచ్చిన చాలామందికి ఇవ్వలేదు! ఆ తర్వాత ‘ఈ టికెట్’ పంపడానికి ఆ రవి అనే మిడిల్ ఏజ్ పెద్దమనిషి నాతో ఇలా ఫోన్ ద్వారా సంభాషణలు చేసేవాడు! అతనికి ఇంగ్లీషూ, తెలుగూ నాకు అరవం ఎంత వచ్చో అంత వచ్చు! కానీ రాని రెండు భాషలూ ధారాళంగా మాట్లాడేవాడు.
“హలో… ఐ కేమ్ హైదరాబాద్ నెక్స్ట్ మంత్”
“వచ్చారా?”
“నో… కేమ్… నాట్ డిసెంబర్, జాన్యువరీ… నవంబర్… నెక్స్ట్ డిసెంబర్, నెక్స్ట్”
“నేను ఎల్లుండి మలేషియా వచ్చిందీ…”
“ఏమిటి అప్పుడే వెళ్ళిపోయారా?”
“నో మేడం.. త్రీ డేస్‌గా హాపెండ్… అప్పుడే వచ్చింది”
“ఏవొచ్చిందీ?”
“నానే వచ్చింది!”
“ఓకే వెళ్తా అంటారా? త్రీ డేస్ తర్వాత?”
“పురియమా? థాంక్ గాడ్… టెల్లింగ్ ఇంగ్లీష్… యూ నో అండర్‌స్టాండ్… టెల్లింగ్ తమిళ్ యూ నో అండర్‌స్టాండ్… టెల్లింగ్ తెలుగు… అదిదా పురిల్లే… వాట్ మేడం? బిగ్ రైటర్… బిగ్ జ్యూరీ మేడం… ఐ వెంట్ మలేషియా ఎల్లుండి, పురియమా? మండే దా ఇదూ… ట్యూస్‌డే, వెడ్‍నెస్ డే, థర్స్ డే… ఐ వెంట్! సో సింపుల్”
“ఓకే థర్స్ డే వెళ్తారు, అర్థం అయింది, మా టికెట్ వచ్చిందా?”
“మీరు వచ్చింది కదా! అప్పుడే నేనూ వచ్చింది”
“మీరూ నేను కలిసి వెళ్తామా? ఎప్పుడూ?”
“మలేషియా మీరు వెళ్ళిందీ… అండర్‌స్టాండ్… అప్పుడే నాను వచ్చిందీ”
“నేనెప్పుడెళ్ళానూ… ఇంకా హైద్రాబాద్ లోనే వున్నాను.”
“అయ్యో మురుగా! మురుగా! నాన్ వచ్చింది… ఇచ్చింది టూ డేస్ ఆఫ్టర్”
“ఏం ఇచ్చిందీ?”
“వారు వస్తారు అప్పుడే”
“ఎవరు వారు?”
“టికెట్”
“ఎప్పుడు వస్తారు టికెట్?”
“నిన్న”
“నిన్న రాలేదు… రేపు వస్తుందా?”
“వస్తారు మేడం… బుక్ చేసింది”
“ఎవరూ చేసింది?”
“నానే చేసింది”
“ఎప్పుడు?”
“ఎల్లుండి”
“ఎల్లుండి కాదు, మొన్న అయి వుంటుంది”
“వెయిట్ పణ్ణు మేడం, నిన్న వెళ్తాయి నేను, 24 అవర్స్ దా వెయిట్ పణ్ణు… నిన్న మీకీ వస్తారు టికెట్… కయ్యిల పూడ్చి, ఫ్లయిట్ లో తోసే డ్యూటీ దీనికీ ఇచ్చింది”
“దేనికి ఇచ్చింది?”
“నానుకి!”
“ఎప్పుడు ఫ్లయిట్?”
“మొన్న… జస్ట్ టూ డేస్”
“మొన్న అయితే ఎల్లుండి ఎలా వెళ్తాను?”
“మొన్న అంటే, టుడే 8th కదా… 10th మొన్న!”
“సరే” అన్నాను అర్థం అయి.
కాలచక్రంలో మొన్నా, నిన్నాలూ తిరిగి రావని చిన్నప్పటి నుండీ నా విశ్వాసం… కానీ ఈ పెద్దమనిషి ఓపిక పట్టు… మొన్నా, నిన్నా మళ్ళీ వస్తాయి… అని చిరాకు పడ్తున్నాడు కూడా. ఏం చేద్దాం అని వెయిట్ చేసా.
(సశేషం)