Site icon Sanchika

జీవన రమణీయం-172

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]కొ[/dropcap]త్త చెప్పులూ, కొత్త బట్టలూ, అంతకు ముందు వాడి చూడకుండా, ఎప్పుడూ ప్రయాణంలో వేసుకోకూడదు! నేను మలేషియా ఎయిర్‌పోర్ట్‌లో మా వాళ్ళు డ్రాప్ చేసాకా, ఇండోనేషియా వెళ్ళడానికి ఆ గేట్ నెంబర్ చూసుకుని, ఒక హేండ్ లగేజ్, పెద్ద సూట్‍కేస్‌తో నడుస్తూ వుంటే, ఆ దారి ఎంతకీ తెగలేదు… నా కొత్త చెప్పు నా కాలిని చెరుకు గెడలా నమిలేసింది. వదిలి నడిచే పరిస్థితి కాదు! వేసుకుని నడవలేను… ఫ్లయిట్ టైం అయిపోతోంది, చర్మం ముక్కలుగా తెగిపోతున్నా అలాగే నడిచాను… చాలా దూరం! ఎంతకీ రాదు!

లాస్ట్‌కి ఆ జకార్తా విమానం ఎక్కి కూర్చున్నాను. ఇండోనేషియాకి ఎరైవల్ వీసా. ముందుగా తీసుకోనక్కరలేదు. వాళ్ళు ఫ్లయిట్ ఫుడ్ పెట్టినట్టు నాకైతే జ్ఞాపకం లేదు! నేను వెళ్ళే ముందు, భువనచంద్ర (తెలుగు సినీ గేయ రచయిత) గారి భార్య సామ్రాజ్యలక్ష్మి గారు నాతో, “జాగ్రత్త రమణీగారు! వేరే గ్రహాంతరవాసులు, ఫ్లయిట్స్ ఇండోనేషియా మీదుగా వెళ్తుంటే, సముద్రంలో పడేస్తున్నారట!” అన్నారు.

అంతకుముందు రెండు విమానాలు అలా కూలిపోవడం నాకూ తెలుసు! “ప్రాప్తం వుంటే తీరం చేర్తాం” అన్నాను. నా సిద్ధాంతం అదే!

మా బాబాయి కూతురు లావణ్య ఇండోనేషియాలోని జటల్‍మర్‍లో ఇండోరమాలో వుంటుంది! ఇండోరమాలో సింథసైజింగ్ ప్లాంట్ వుంది. అందులో మా మరిదిగారు ఉద్యోగం చేస్తారు.

జకార్తా నుంచి ఇండోరమాకి నాలుగు గంటలు ప్రయాణం వుంటుంది. నేను మా చెల్లెలితో కారు పంపిస్తే చాలు అన్నాను. కానీ మా సాయి బాబాయి పెద్ద వయసులో కూడా, పాపం నేనెప్పుడు తిన్నానో ఏమో అని క్యారేజ్ పట్టుకుని మరీ తనే స్వయంగా నాలుగు గంటలు రానూ, నాలుగు గంటలు పోనూ ప్రయాణం చేసి వచ్చి జకార్తాకి, నా కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. మా పిన్ని ఆలూ టమాటా కూరా, చపాతీలు పంపించింది. మా బంధువుల్లోనే కాదు, నేను పుట్టి బుద్ధి ఎరిగాకా తిన్న వంటల్లో ప్రథమ వరుసలో నలుగురు వుంటే, అందులో మా పిన్నీ, నెక్స్ట్ మా చెల్లెలు లావణ్య వుంటారు! ఆ తరువాత చాలా రోజులకి వీళ్ళతో సమానమైన రుచిలో, అంతే కాక వివిధ దేశాల వంటలు చేసే ఆవిడ, మా అమ్మ ఫ్రెండ్ రాజహంస గారని, ఆవిడా ఇండోనేషియాలో చాలా ఏళ్ళు వుండి వచ్చారు. ఆవిడ కలిసారు. ఆవిడ చేత్తో కలాఖండ్ చేసినా, బిసీబెళ్ళా బాత్ చేసినా, ఆవకాయ పెట్టినా కూడా సూపర్బ్! అద్భుతమైన వంట. వారి ఇల్లు సాలార్‌జంగ్ మ్యూజియంను తలపిస్తూ వివిధ రకాలైన కళాకృతులు, జూట్‌తో, పింగాణీతో, క్లాత్‌తో, పెయింట్స్‌తో, మట్టితో చేసినవి వుంటాయి. అవన్నీ ఆవిడ క్లాసెస్‌కి వెళ్ళి నేర్చుకున్నారట! అసలు ధూళీ, మట్టీ, మాసిపోవడం లాంటివి వాళ్ళ ఇంట్లో వుండవు! స్విచ్ బోర్డుల మేనియా నాకు, అవి ఎప్పుడూ మా ఇంట్లో తెల్లగా మెరుస్తూ ఉండేట్లు తుడుస్తుంటాను. ఆవిడ ఇండోనేషియా నుండి తెచ్చిన చీపుర్తో ‘బెడ్స్’ వూడవడం చూశాను. ఆ చీపురు సోఫాలు, బెడ్స్ తుడవడానికే ఉపయోగిస్తారుట! అసలు అంత అందంగా వంటగది కానీ, మిగతా గదులూ, ఫర్నిచర్ పెట్టుకునే వాళ్ళని నేనీ మధ్య కాలంలో చూడలేదు, అతి గొప్ప కోటీశ్వరులని వదిలేస్తే!

సో, ఆవిడ వంటకు కూడా నేను స్టార్ రేటింగ్ ఇచ్చాను! ఆవిడ ఆవకాయ పాలిథిన్ కవర్‍లో ప్యాక్ చేసి ఫ్రిజ్‍లో పెట్టి, ఎప్పటికప్పుడు తీసి వాడడం వలన అది, ఎప్పటికీ ఫ్రెష్‌గా, నల్లబడకుండా, నిన్నా మొన్నా పెట్టినట్లుగా వుంటుంది! డిటెక్టివ్ నవలలు రాసే గిరిజశ్రీ భగవాన్ గారి మరదలు ఈవిడ. గిరిజ వీళ్ళ అక్కగారుట.

అలా మా పిన్ని స్టార్ రేటింగ్ కుక్. ఆవిడ పంపిన ఆలూకూరా, చపాతీ నేను ఆవురావురుమని తిన్నాను. బాబాయ్ నన్ను చూడగానే కౌగిలించుకుని, ఆ తర్వాత కార్లో కబుర్లు మొదలుపెట్టాడు. ఇక్కడ కొంచెం ఆగి మా బాబాయ్ గురించి చెప్పాలి…. మా సాయి బాబాయ్ మా నాన్న తమ్ముళ్ళలో మధ్యలో వాడు. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. మా నాన్న నలుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు. మొదట మా పెద్ద బాబాయ్ ఉమా మహేశ్వరరావు పోయారు. తర్వాత మా నాన్న ఆనందభూషణరావు పోయారు. ఈ మధ్యన 2018లో మా ఆఖరు బాబాయ్ బలరామశర్మ కూడా పోయారు. ఈయన ఉమ బాబాయ్, బలరామ్ బాబాయ్‌ల మధ్యవాడు. ఇప్పుడొచ్చిన సాయి బాబాయ్ పూర్తి పేరు సాయి భాస్కర్. ‘పి అంట్ టి’లో పని చేసినా, వంశీ రామరాజు గారు వంశీ కల్చరల్ సంస్థ పెట్టినప్పుడు ఆయనతో కూడా వుండి, సంస్థకు చాలా ఏళ్ళు కుడి భుజం అయి వుండేవాడు! ఆ సమయంలో మా బాబాయి చతురోక్తులకీ, హాస్య ప్రియులైన పెద్దలు చాలామంది ఆనందించి, ఈయన కంపెనీ కోరుకునేవారు. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్యులు. మా పిన్ని చేసే చేగోడీలు ఆయనకి చాలా ఇష్టం! మా బాబాయ్ ఇంట్లో ఏ ఫంక్షన్ కైనా ఆయన వచ్చేవారు. తర్వాత టి. సుబ్బిరామిరెడ్డి గారు, డా. సి. నారాయణరెడ్డి గారూ, దాసరి నారాయణ రావు గారూ… అంతా మా బాబాయ్‌కి బాగా క్లోజ్.

మా బాబాయ్‌కి సేవాగుణం ఎక్కువ. ఎవరు చనిపోయారని తెలిసినా, వెంటనే వెళ్ళి, ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ తమ బాధలో తాము వుంటే, ఈయన కావలసిన ఏర్పాట్లు చూసి, అది రాత్రి పూట అయితే శవజాగారం చేసి, ఈ వయసులో కూడా, అన్ని కార్యక్రమాలు అయ్యాక ఇంటికి వచ్చి స్నానం చేసి అప్పుడు భోం చేస్తాడు. అది దగ్గరి వాళ్ళే కానక్కరలేదు, తెలిసినవాళ్ళూ, ఒక కాలనీ వాళ్ళూ అయినా చాలు! ఈయానా, మా డైరక్టర్ వి.ఎన్. ఆదిత్య గారి నాన్నగారు వాడ్రేవు సత్యప్రసాద్ గారూ ఫ్రెండ్స్. ఎటువంటి దురలవాట్లూ, కనీసం పేకాటా, సిగరెట్టూ లేని మా బాబాయ్, ఆదివారం మలక్‌పేట్ రేస్ కోర్సులలో టికెట్స్ అమ్మేవాడు. సత్యప్రసాద్ గారు కూడా అమ్మేవారు. అది కుటుంబానికి ఎక్స్‌ట్రా ఇన్‌కం కోసం మాత్రేమే కానీ, వీళ్ళు సరదాకి కూడా ఎన్నడూ లోనికి వెళ్ళి గుర్రపు పందాలు చూసింది లేదు! అంతే కాక వీరిరువురికీ సాహిత్యాభిలాష ఎక్కువగా వుండేది.

మా బాబాయ్, సత్యప్రసాద్ గారూ, పరిషత్తు నాటక పోటీలు చూడటానికి తప్పక వెళ్ళేవారు. మా బాబాయ్ అయితే నాటకాలకి జడ్జిగా కూడా చేశాడు. మా నాన్నగారి మేనత్త కొడుకు కోనా ప్రభాకరరావు గారు, ఆయన తమ్ముళ్ళు గోవిందూ, హేమసుందర్రావూ, వీళ్ళంతా ఈ నాటకాలలో పేరు పొందినవాళ్ళు. వాళ్ళల్లో ఒక సోదరుడి కొడుకు ‘కోనా వెంకట్’గా ఇప్పుడు తెలుగు సినీ చిత్రసీమలో, రైటర్, ప్రొడ్యూసర్‌గా బాగా పైకి వచ్చినతను. అటు సాహిత్యం, సాంస్కృతికం, ఇటు సమాజసేవా… అన్ని రంగాల్లో మా సాయి బాబాయ్ చాలా పేరు సంపాదించాడు. ఆయనతో కబుర్లకు కొదవేముంది? నన్ను తీసుకురావటానికి వచ్చేటప్పుడు ఇండోనేషియన్ భాష తప్ప మరోటి రాని డ్రైవర్‍తో కూడా ఆయన తెలుగులో ఇంగ్లీషులో బోలెడు సంభాషిస్తూ వచ్చాడుట!

మేం ఇల్లు చేరేటప్పటికి, వంట చేసేసి మా చెల్లెలూ, మరిదీ, పిల్లలూ అంతా రెడీగా వున్నారు. వాళ్ళది 3 బెడ్ రూమ్‍ల ఇల్లు. వెనుక సర్వెంట్ క్వార్ట్సర్స్‌లో ‘ఇబూ’ వుంటుంది. ఇబూ అంటే వాళ్ళ హెల్పర్. ఆ అమ్మాయి ఇండోనేషియన్ అయినా, మన వంటలన్నీ నేర్పించింది మా చెల్లెలు. లావణ్య ఇండియా వస్తే, ఓసారి పండగకి బూరెలు, పులిహోర కూడా చేసి పెట్టిందట. లావణ్యా శ్రీకాంత్‌లకి ఇద్దరు పిల్లలు.

మా పిన్ని  చాలా జబ్బు పడి లేచింది అంతకు ముందే. నేనూ చాలా రోజులుగా అదే చూడడం తనని.  ఇక్కడికొచ్చాకా, తేరుకున్నట్టు, తేటగా కనిపించింది. ఆవిడకి విమానం ఎక్కడం అంటే భయంగా వుండేది! అలాంటిది, పిల్లల కోసం, తల్లి ఏ ఫోబియాని అయినా జయిస్తుంది అని చెప్పడానికన్నట్లు, ఇండోనేషియా ఫ్లయిట్ ఎక్కి వచ్చేసింది.

నేను సంక్రాంతి పండగకి వెళ్తున్నాను అని, నేతి అరిశలు, మురుకులు, చెక్కలూ తీసుకెళ్ళాను. మా చెల్లెలికో వెండి కుంకుమ భరిణ, పిల్లలకేవో స్టోరీ బుక్స్. మరిది గారికేవీ కొనలేదే, అని మనసులో అనుకుని, మలేషియాలో నేను హరి అనుమోలు గారితో షాపింగ్‍కి వెళ్ళినప్పుడు మా పెద్దవాడికి కొన్ని షర్ట్‌లు కొన్నాను. అందులో ఒకటి తీసి ఇచ్చాను. అది మా చెల్లెలి ఫోర్స్ వల్ల వెంటనే వేసుకొనొచ్చాడు శ్రీకాంత్. కానీ చాలా పొడుగయింది. “ఏం పర్లేదక్కా, ఇలా చేతులు మడత పెట్టుకొంటాడులే” అని మా లావణ్య అతని చేతులు మడత పెట్టి, అలాగే బయటకి షాపింగ్‌కి కూడా తీసుకొచ్చింది.

జకార్తాలో స్కైస్క్రేపర్ల వద్ద రచయిత్రి

భోజనాలు అయ్యాకా, మేం, అంటే నేనూ బాబాయ్ ఆ రోజు ప్రయాణంలో నాలుగు గంటలు కాకుండా, ఇంకో నాలుగు గంటలు, మా బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళూ అందరి గురించీ మాట్లాడుకున్నాం. మా చెల్లెలు “గిన్నీస్ బుక్‌లో ఎక్కేయగలరు మీ ఇద్దరూ” అంది.

వాళ్ళ ఇబూ చేసే పూరీల గురించి చెప్పక తప్పదు. అవి తన చేత్తో నూనెలో వేయగానే రౌండ్‍గా, బంతుల్లా అవడం చూసి ఆశ్చర్యపోయాను. “అదే పిండితో మనం చేసినా అలా రావక్కా!” అంది లావణ్య. అది నిజం! ఏదో టెక్నిక్ వుంది తన చేతిలో.

పిన్ని, బాబాయ్, లావణ్యగార్లతో రచయిత్రి

లావణ్య అనర్గళంగా ఇండోనేషియా భాష మాట్లాడ్తోంది. లిపి మాత్రం ఇంగ్లీషేట. ఇండోనేషియన్ భాషలో ‘బాగూస్’ అంటే ‘బావుంది’ అని అర్థం. వాళ్ళ ఇబూని మెచ్చుకునేందుకు ఈ పదం నేర్చుకున్నాను.

(సశేషం)

Exit mobile version