జీవన రమణీయం-174

2
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఆ[/dropcap]గస్టు 15, 2021… ఈరోజు ఆఫ్ఘనిస్తాన్‍లో తాలిబన్‌లు ప్రభుత్వాన్ని ఆక్రమించి, తమ కొత్త ప్రభుత్వంగా ప్రకటించుకుని, అధ్యక్షుడు పారిపోయేట్టు చేసిన రోజు.

నేను ఈ డేట్లు ఎందుకు రాస్తానంటే, ఈ జీవన రమణీయం పుస్తకం నా తరువాతి తరాల వారు చదువుతున్నప్పుడు, ఇది రాస్తున్నప్పటి కాల మాన పరిస్థితులు తెలియాలని. ఆఫ్ఘనిస్తాన్‌లో కాందహార్‌లో 24-12-99న ఓ ప్లేన్ హైజాక్ చేసి, నవ దంపతులలో ఒకరిని చంపి, “మొత్తం అందరినీ చంపేస్తాం, మీ బందీలుగా వున్న మా టెర్రరిస్టులు ముస్తాక్ అహమ్మద్ జార్గర్, అహమ్మద్ ఒమర్ సైద్ షేక్, మరియు మసూద్ అజార్‌లని విడుదల చేస్తే 176 ప్రయాణీకులను చంపకుండా వదిలిపెడ్తాం” అని ప్రకటించారు. ఆరోజు కూడా వాళ్ళు పవిత్ర దినంగా భావించే శుక్రవారం. IC 814 అనే నెంబరు గల ఫ్లయిట్‌ని, ఇండియన్ ఎయిర్‍లైన్స్ ఎయిర్‌బస్ A 300 ని, నేపాల్‌ లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఖాట్మండు నుండి ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వస్తుండగా, హైజాక్ చేశారు.

కాందహార్‌లో హైజాక్ చేయబడిన విమానం ముందు టెర్రరిస్టులు

37 ఏళ్ళ కేప్టెన్ దేవీ షరన్, ఫస్ట్ ఆఫీసర్ రాజేందర్ కుమార్, ఇంకో 58 ఏళ్ళ ఫ్లయిట్ ఇంజనీర్ అనిల్ కుమార్ జగ్గీ వున్న కేబిన్ లోకి 5 మంది మాస్క్ వేసుకున్న టెర్రరిస్టు‍లు ప్రవేశించి సాయంత్రం 5.30 ప్రాంతంలో, వారిని బెదిరించి, ప్రభుత్వానికి వారి డిమాండ్‍లు తెలిపాకా, అమృత్‍సర్, లాహోర్, దుబాయ్‍లలో ఆపి, ఫ్యూయల్ లోడ్ చేసుకుని, 27 మందిని దుబాయ్‍లో దింపి, పాశవికంగా ఒకరిని పొడిచి చంపి, మిగతా చాలామందిని గాయపరిచారు. ఫైనల్‍గా తాలిబన్ ఆక్రమిత ప్రాంతం అయిన కాందహార్‍లో విమానం ఆపి, వారి డిమాండ్‍లు నెరవేర్చుకుని, మిగతా వారిని విడుదల చేసారు. మిలేనియం ఎటాక్‌డ్ ప్లాట్స్‌లో అదొకటి. అప్పటి ప్రభుత్వంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్‍గా ఉన్న ముల్లా గనీ బర్దార్‌తో మన ప్రభుత్వం సంప్రదింపులు జరిపి, నెగోషియేషన్స్ చేసి, దురదృష్టవశాత్తు ఈ మసూద్ అజార్ అనే టెర్రరిస్ట్‌ని అప్పగించింది. ఆ ముల్లా గనీ బర్దార్‌ ఇప్పుడు కొత్తగా వెలసిన తాలిబన్ ప్రభుత్వపు అధ్యక్షుడు. తాలిబన్ అంటే స్టూడెంట్ అని అర్థం!

అప్పుడు నా పిల్లలకి 13, 10 ఏళ్ళు. టీవీలో ఈ హై డ్రామా చూస్తూ రక్తం ఉడికిపోయింది. ఎందుకంత అన్యాయంగా ఆ దుర్మార్గులని వదిలి పెట్టాలి అనిపించింది! చాలా బాధపడి ఆ రోజున నేను అన్నం తినలేదు! ఈ విషయం నాకు గుర్తొస్తోంది. గాంధారి పుట్టిన దేశంలో మనుషులు ఇంత క్రూరంగా ఎందుకుంటారా అనిపించింది.

వీరేంద్రనాథ్ గారు ‘డేగ రెక్కల చప్పుడు’ నవలలో ఈ తాలిబన్ల ఘాతుకాలనీ, మత మౌఢ్యాన్ని విపులీకరించారు. స్త్రీల పట్లా, పిల్లల పట్ల దయ చూపద్దని ఏ దేవుడు ఏ మత గ్రంథంలో చెప్తాడు? ఎందుకీ ఆధిపత్యం పోరు… మిగతా ప్రపంచాన్ని జయించాలని, స్వంతవారిని నరమేధం చేస్తూ.  స్త్రీని అసలు మనిషిగానే పరిగణించరు. అన్నదమ్ముడితోనో, భర్త తోనే కాకుండా వీధిలో కనబడితే, దండనకు పాత్రురాలుట. మదర్సాలో చదువుకుంటున్న పసిపిల్లలు, సైన్యంలో చేరి, ఆత్మాహుతి దళాలుగా వుండడానికి నిరాకరిస్తే, ఒక కాలూ, చెయ్యీ తీసేస్తారుట. మోకాలు దాకా, ఇనుప గొట్టాలు కోసే రంపంతో, పిల్లవాడిది నరికి, పవిత్ర గ్రంథంలో చెప్పబడినట్లు కాకుండా, ఒక ఇంచ్ తక్కువ కోసాం అని, నెత్తుటి మడుగులో, మొండికాలుతో, అప్పుడే స్పృహ వచ్చి విలవిలలాడ్తున్న వాడిది, ఇంకో, ఇంచ్, టేప్‌తో కొలిచి, రంపంతో నరకడం… తలచుకుంటేనే, “భగవంతుడా… ఎందుకు ఇటువంటి దుర్మార్గుల్ని సృష్టించావు? ఇవన్నీ పైగా మతం, దైవం పేరిట చెయ్యడం ఏమిటి?” అని ప్రశ్నించాలి అని అనిపిస్తుంది! వారానికి ఒకసారి వీధుల్లోకి ఒక బండి మీద చెక్క కాళ్ళూ, చేతులు, అమ్మకానికి వస్తాయట. చాలా మంది చిన్నపిల్లలు, చెక్కకాలితో, చెక్క చేతులతో మనకి వీధుల్లో కనిపిస్తారట. అంతటి కిరాతకాలని కూడా మనుషులు జీవన పంథాగా ఎలా మార్చుకుంటారో చెప్పే సన్నివేశం! పోనీ అలా కోయించుకోకుండా, వారు చెప్పినట్టు సైన్యంలో చేరితే, వాడికి బాంబ్ అమర్చి ఆత్మాహుతి చేసుకునేట్లు మారుస్తారట. ఇంక మాస్ రేప్‌లూ, నరకడాలూ, రాళ్ళతో కొట్టి చంపడాలూ, శవాల కుప్పగా వూళ్ళని మార్చడాలూ… ‘డేగ రెక్కల చప్పుడు’లో రాసారు. ఇంకో ‘హోమ్ కమింగ్’ అనే ఇంగ్లీషు సీరియల్‍లో కూడా ఇవన్నీ భయానకంగా చూపించారు! తర్వాత ఆ సీన్స్ కమల్ హాసన్ తీసిన ‘విశ్వరూపం’ సినిమాలో కూడా చూసాం!

నాకు ఒక్కోసారి మనం ఈ దేశంలో పుట్టడం ఎంత అదృష్టం అనిపిస్తుంది… కానీ అదే సమయంలో ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో స్త్రీల మీద ఈ తాలిబన్‍ల లానే ఆంక్షలూ, ఘాతుకాలు, హానర్ కిల్లింగ్స్ పేరిట కన్న కూతురునే, ఆమె భర్తతో పాటు చంపెయ్యడాలూ, గ్యాంగ్ రేప్‌లూ, స్త్రీ ఎదురుతిగి ప్రశ్నించిందని ‘నిర్భయ’లా రాక్షసంగా మానభంగం చేసి, వెళ్ళే బస్ లోంచి వివస్త్రగా మన రాజధాని నడి రోడ్డు మీద పారెయ్యడం… ఆమె ప్రాణాలు విడిచాకా, మనం కొవ్వొత్తుల యాత్రలూ చూస్తే… కనీసం ఈ రాష్ట్రంలో పుట్టాం, అంతే చాలు అనిపించేది! కానీ ప్రపంచం యావత్తూ విస్తుపోయేలా నలుగురి కిరాతకులు ‘దిశ’ని ఒక రాత్రంతా, ప్రాణం పోయేదాక బలాత్కారం చేసి, సజీవంగా కాల్చి చంపాకా, ఈ రాష్ట్ర రాజధాని లోనూ ఆడపిల్లకి రక్షణ లేదని గుండెలు గుబగుబలాడ్తున్నాయి… అదే ఆగస్టు 15న, మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం చేసుకుంటుండగా, ఈ కరోనా కష్టసమయంలో కూడా, మన పక్క రాష్ట్రంలో మన తెలుగు అమ్మాయిని, సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒకడు కిరాతకంగా గొంతు కోసి చంపాడు, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి టిఫిన్ తీసుకురావడానికి టిఫిన్ బండి దగ్గరకు వెళ్తే…

పురాణాలలో రాక్షసులనీ, వారి జాతి లక్షణాలనీ వర్ణించారు. చిన్నప్పుడు బాలమిత్రా, చందమామ పుస్తకాలలో రాక్షసులని, భయంకరంగా కొండంత శరీరంతో ఒళ్ళంత ముళ్ళులాంటి బొచ్చుతో, తల మీద కొమ్ములతో, నోట్లో కోరలతో బొమ్మలేసేవారు! ఇప్పుడు అలా ప్రత్యేకంగా కనబడకుండా, సామాన్యంగా సన్నగా, పొట్టిగానో, మామూలుగానో, మన పక్కన నడుస్తున్నవాడు అమాంతం జేబులో నుండి యాసిడ్ సీసా తీసి దాడి చేస్తాడనో, చాకు తీసి దారుణంగా మెడని తెగేదాకా కత్తిరిస్తాడనో ఏ అమ్మాయీ వూహించదు కదా! అసలు ఈ ఫేస్‌బుక్‌లో పరిచయాలూ, దిక్కుమాలిన స్నేహాలు ప్రాణం మీదకి తెచ్చేదాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు? వయసొచ్చిన వేడిలో, బాల్యం అప్పుడే వీడిన మత్తులో, వీళ్ళు ఓ ఫోటో పెట్టగానే, “వావ్… హౌ బ్యూటీఫుల్‌”, “సో ప్రెట్టీ”, “గార్జియస్” అనే కామెంట్స్‌కీ, లైక్‌లకీ పడిపోయి, వారితో మెసెంజర్ ద్వారా చాట్ చేసి, ఆ వెధవ వీడియో కాల్‍లో నీ అందాలు చూపమంటే చూపి, ఆ తర్వాత వాడి తీరు నచ్చక, కట్ చేస్తే, అది గొప్ప అవమానంగానో, వాడి ఎంటర్‌టెయిన్‌మెంట్ చెయ్యి జారిపోయినందుకో రెచ్చిపోయి, ఉచ్చం నీచం మరిచిపోయి, ఇటువంటి ఘాతుకాలు చేసే ఛాన్స్‌ లెక్కువ వున్నాయి! అందుకే ఆడపిల్లలు అప్రమత్తంగా వుండాలి. నేను అమాయకపు, తొలి ప్రేమ మైకపు యవ్వనం గురించే చెప్పాను. కానీ నేను – నడివయసు స్త్రీలను కూడా ఈ మత్తుకీ, వ్యామోహాలకీ, ఎర అవడం భంగపడి ఆత్మహత్యలు చేసుకోవడం లేదా వాడు వీరి అసభ్య ఫోటోలతో బ్లాక్‍మెయిల్ చేస్తే లొంగిపోవడం, భర్తకి తెలియకుండా డబ్బులు ఇచ్చిన్నాళ్ళు ఇచ్చి, చివరికి ఆత్మహత్య చేసుకోవడం విన్నాను. పోలీసులూ అలాంటి వుచ్చుల్లో పడకండని హెచ్చరిస్తూనే వున్నారు! కానీ సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో, ఎంతవరకు అందులో వుండాలో, ఆ హద్దులు ఎవరు చెప్తారు వీళ్ళకి? నా ఫేస్‌బుక్‍లో, నా కన్నా చాలా పెద్దవాళ్ళూ, నా వయసు వాళ్ళూ కూడా “నేను ఈ నరకం తట్టుకోలేకపోతున్నాను… ముఖ పుస్తకం నాకు ప్రేమా, ఆప్యాయతా, ఆలంబనా ఇస్తుందని ఆశపడ్డాను… భంగపడ్డాను. మోసపోయాను… టాటా… బై బై… నేను ఇంక ఈ జీవితం నుంచి శలవు తీసుకుంటాను” అనే లాంటి పోస్టులూ, “ఫలానా స్త్రీ నన్ను వేధిస్తోంది. నా పర్సనల్ లైఫ్‍ బజార్న పెడ్తోంది” అని భోరుమని విలపించడం, లేదా పోలీసుల దాకా వెళ్ళి కేసులు పెట్టడం, ఇంకా కొందరు భర్త గురించీ, అత్తమామల గురించి, ఇంటిగుట్టు బజార్న వేసుకుంటూ పోస్టులు పెట్టడం, ఇవన్నీ ఫూలిష్‌గా చేస్తుంటే నాకు ఆశ్చర్యం! వీళ్ళకి ఈ ఎఫ్.బి…. ఇదంతా వర్చ్యువల్ ఫ్రెండ్‌షిప్… దీన్ని సీరియస్‍గా తీసుకోకూడదు… అన్నీ అందరికీ విప్పి చెప్పి ప్రమాదాలు కొని తెచ్చుకోరాదు అని తెలీదా? అసలు వీళ్ళు ఎవరు? మన భర్తా? అమ్మానాన్ననా? అన్నదమ్ములా? వీళ్ళ కోసం ఏడవడం, భరించలేం అంటూ ఆత్మహత్మలు ఏమిటి? ఎకౌంట్ క్లోజ్ చేసి, ఎంచక్కా మజ్జిగన్నం తిని పడుకోక! అని నవ్వు కూడా వస్తుంది!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here