Site icon Sanchika

జీవన రమణీయం-175

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నా[/dropcap] జాతకంలో ఉద్యోగ గీత చాలా చిన్నదిగా వుంది. కానీ నేను నా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అయినప్పటి నుండీ ఉద్యోగాలు చేస్తూనే వున్నాను. పదో తరగతి అయిన శలవుల్లో పనిమనిషి పిల్లలకీ, ఇంకా కొందరు పిల్లలకి ట్యూషన్స్ చెప్పాను, జీతం తీసుకోకుండా. ఆ తర్వాత ఇంటర్‍మీడియట్‌లో, మారేడ్‌పల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరినప్పుడు, పారలల్‍గా టైప్‌లో కూడా చేరాను. ఆడపిల్లలకి ఇప్పటిలా ‘మాస్టర్స్ చేస్తావా? విదేశాలకి వెళ్తావా?’ లాంటి ఆప్షన్స్ పెద్దవాళ్ళు ఇచ్చేవారు కూడా కాదు! మహా అయితే ‘టీచర్ ట్రెయినింగ్‌కి వెళ్తావా? బ్యాంకు ఎగ్జామ్స్ రాస్తావా?’ అనేవారు. స్టాప్ సెలెక్షన్ కమీషన్‌కి సంబంధించిన కోచింగ్‌కి గైడ్ ఒకటి నాకూ కొనిచ్చారు.

 

ఆ నాలెడ్జి ఇప్పుడు టి.వి.లో కెబిసి చూస్తున్నప్పుడు, క్విజ్‍లో ఆన్సర్స్ చెప్పడానికి పనికి వస్తోంది. కెబిసి అంటే గుర్తొచ్చింది… “ఏ రాజు గారి వంద కుమారుల మీదుగా గంగని ప్రవహింప చేస్తే వారు బతికారు? కపిల మహాముని శాపం వల్ల భస్మం అయిన రాకుమారులు ఎవరు?” అని నిన్న కూడా అమితాబ్ బచ్చన్ ప్రశ్న అడిగాడు… సగరులు అని నాకు వెంటనే తెలిసింది… కానీ నార్త్ నుండి వచ్చిన కంటెస్టెంట్ ‘భగీరథ’ అన్నాడు. ఇది బహుశా దక్షిణాదిన మనకి చిన్నప్పటి నుండీ ఇళ్ళల్లో చెప్పిన రామాయణ భారతాది కథలు వినడం వల్ల కానీ, పందిళ్లలో విన్న హరికథలూ, బుర్రకథలూ, పురాణాల వల్ల కానీ, చందమామ, బాలమిత్ర లాంటి పిల్లల మేగజైన్స్‌లలో కూడా ఈ కథలు బొమ్మలతో ప్రచురితం అవడం వలన కానీ కావచ్చు! నార్త్ వాళ్ళకి పురాణ జ్ఞానం తక్కువగా వుండడం ఈ క్విజ్ ప్రోగ్రామ్ మొదలయిన రోజుల నుండీ గమనిస్తున్నాను! థాంక్స్ టు అవర్ అన్నగారు నందమూరి తారక రామారావు గారు…. వారు భారత భాగవతాలనీ, రామాయణాన్నీ, అని భాగాల కథలనీ తన సినిమాల ద్వారా అందించారు. పండితుల చేత రాయించారు… నాకైతే చిన్నప్పుడు చూసిన కృష్ణావతరాం, నర్తనశాల, దానవీరశూరకర్ణ, ఇంకో ఎన్నో సినిమాల ద్వారా ఉపకథలు కూడా తెలుసు! బహుశా ఎన్.టి.ఆర్ మనకి వుండబట్టీ, ఉత్తరాది వారికి లేకపోబట్టీ, వారికి పురాణ జ్ఞానం చాలా తక్కువ అనుకుంటాను! ఇంక ఇప్పుడయితే ప్రవచనాలు చెప్తున్నారు పెద్దలు! చాగంటి గారూ, గరికపాటి గారు ఎన్నో తెలీన విషయాలని పిల్లలకి సైతం అర్థం అయ్యేవిధంగా వివరిస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం పుస్తకం చదివితే మస్తకంలో నిలిచిపోతుంది ఏదైనా. రాస్తే ఇంక చస్తే మరచిపోం… విన్నది గాలికి పోతుంది కొన్నాళ్ళకి! మళ్ళీ చూసింది కలకాలం గుర్తుంటుంది.

నేను ఏకనాథ సార్ అనే ఆయన దగ్గర టైప్‌తో బాటు షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకునేదాన్ని. అప్పుడే మా అన్నయ్య ఫ్రెండ్ ప్రభాకర్ స్టెనోగా ప్రాగా టూల్స్‌లో పని చేస్తున్నాడు. అతనికి షార్ట్ హ్యాండ్ హయ్యర్ కూడా అయిందని విన్నాను. సో.. నాకు ఇంటి దగ్గర అప్పుడప్పుడూ ప్రభాకర్ ట్యూషన్ అన్న మాట!

పదహారేళ్ళ వయసులో మా జెనరేషన్‍లో అమ్మాయిలు ఎక్కువగా ప్రబంధనాయికల్లా, సిగ్గుగా, ఒబ్బిడిగా, లంగా ఓణీలతో, మాటి మాటికి ఓణీ సవరించుకుంటూ, ఆసక్తికరంగా ఉండేవారు! ఎవరైనా డిబేట్ చేస్తే ఈ విషయంలో నేను చాలా సేపు మాట్లాడగలను. అందరం దాదాపుగా పుస్తకాలూ, అందులోనూ, ప్రణయ కథల నవలలూ చదివేవాళ్ళం. తెలుగు సినిమాలలో స్త్రీలని శృంగారాత్మకంగా (బూతుగా కాదు) చూపించేవాళ్ళు! మా తరంకి వచ్చేసరికీ జయప్రదా, జయసుధా, జయచిత్రా, విజయశాంతీ, రాధా, రాధికా, సుహాసినిలు, శ్రీదేవీలు వచ్చినా – మేం మార్నింగ్ షోలకి వెళ్తే బ్లాక్ అండ్ వైట్‌లో సావిత్రీ, జమునా, బి. సరోజా, కాంచనా, కృష్ణకుమారీ, దేవికా, చంద్రకళా, వాణిశ్రీలు లంగా ఓణీల్లో, కాటుక దిద్దిన సోగకనులతో, వాలుజడలతో, ముద్దబంతి పువ్వుల్లా వుండేవారు! ‘అటైర్’ గురించి మాట్లాడితే మహాపాపం అన్నట్లుగా చూస్తున్నారు ఈ కాలం పిల్లలు. ఆ అటైర్‍లో ప్రతి అమ్మాయి దేవకన్యలా వుండేది. సరే, సౌలభ్యం కోసం షెల్వార్లు, ప్యాంట్లూ, మినీ స్కర్ట్సు వేసుకుంటున్నారు పిల్లలు. కానీ ఆ రోజుల్లో నేనూ రమాదేవీ, భవానీ, సంధ్యా మేం అంతా టైప్ ఇన్‌స్టిట్యూట్‌లకి కాయితం దోశ పొట్లంలా రౌండ్‍గా చుట్టి పట్టుకొని, లంగా ఓణిల్లో వెళ్తుంటే వెనుక అబ్బాయిలు కామెంట్ చేస్తూ రావడం సర్వసాధారణంగా వుండేది… “శ్రీదేవి నిన్న రాలేదేం?… జయప్రద ఏంటిరా ఈరోజు మందారపువ్వు పెట్టుకోవడం మర్చిపోయింది?” అని. ఎప్సీబా అనే అమ్మాయి అయితే బటన్ చేమంతులూ, గుత్తుల గులాబులూ పెట్టుకుని వెళ్తుంటే, ‘వెనుక మేకలొస్తున్నాయి జాగర్త…’ అనేవారు కుర్రాళ్ళు! మేం కూడా చాలా వరకూ నవ్వుకుని వదిలేసేవాళ్ళం! ఆ వయసులో అస్సలు ఎవరూ పట్టించుకోకపోవడం కన్నా, పట్టించుకోవడం బాగానే వుండేది అసలు టైప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రేమలు చెప్పనే అక్కర్లేదు… అక్కడే ఇద్దరూ టక టకా ‘I Love You’ అని టైప్ చేసేసుకునేవారు.

నాకు షార్ట్ హ్యాండ్ ఇంటి దగ్గర చెప్పడానికొచ్చిన పెద్దమనిషి కూడా అలాగే ప్రేమలో పడ్డాడు నాతో! ఏం చేస్తాం… షార్ట్ హ్యాండ్ అటకెక్కింది… తాళిబొట్టు మెడకెక్కింది… ఇంతకీ నా మొదటి ఉద్యోగం పదిహేడేళ్ళప్పుడు, టైప్ నేర్చుకుంటూ వుండగానే ప్రారంభం అయింది. ఓనాడు దామోదర్ సార్ అనే అతను, మా ఏకనాథరావు సార్‌తో చాలా సేపు టైప్ ఇన్‌స్టిట్యూట్‌లో మంతనాలు ఆడి వెళ్ళాకా, సార్ నన్ను పిలిచి “హాలీడేస్‍లో ఏం చేస్తున్నావ్?” అంటే, “పుస్తకాలు చదువుకుంటున్నాను లైబ్రరీ నుంచి తెచ్చుకొని” అని చెప్పాను. “మీరు ఆర్.టి.సి. క్వార్టర్స్‌లో ఉంటున్నారు కదా, అక్కడికి దగ్గరగా వున్న స్వస్తిక్ మేన్యుఫాక్చరర్స్‌లో టైపిస్ట్ కావాలిట… ఎక్కువేం పని వుండదు.. రోజుకి ఓ నాలుగు ఐదు లెటర్స్ టైప్ చెయ్యాలి, సార్ దగ్గర డిక్టేషన్ తీసుకోవాలి… 300 రూపాయలు జీతం… ఎందుకైనా పనికొస్తుంది… ఈ రెండు నెలలూ చెయ్యి” అన్నారు.

నేను వెంటనే ఆనందంగా ఒప్పుకున్నాను. నాకు స్వతంత్ర్యంగా, పాకెట్ మనీ అన్న విషయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అప్పటికి ఎం.కామ్ చేసిన మా అన్నయ్య ఇక్కడ వుద్యోగం దొరక్క, అస్సాంలో NBCCలో వుద్యోగం వస్తే వెళ్ళిపోయాడు. అప్పట్లో ఏ ఆఫ్రికా ఖండమో వెళ్ళిపోయినట్లు మా అమ్మ ఏడ్చింది. “చాలా దూరం గౌహతి… నాలుగు రైళ్ళు మారాలి, మూడు రోజులు ప్రయాణం” అని నేను అందరికీ చెప్తుండేదాన్ని.

అలా నేను తల వూపి ఇంటికొచ్చి మా అమ్మమ్మకి “నాకు ఉద్యోగం వచ్చింది” అని చెప్పాను. అమ్మ నవ్వి “ఎన్ని రోజులు చేస్తావ్? నీ పొగరుకి?” అంది. మాట పడనూ, ప్రథమ కోపం – ఇవన్నీ మా అమ్మ అభిప్రాయాలు! నేను విభేదించను! సరే, మంచి రోజు చూసుకుని, ఓణీ కాకుండా నేవీ బ్లూ కలర్, అజంతా బొమ్మలున్న హేండ్ ప్రింటెడ్ చీరా, చీరలో ఇచ్చిన బ్లౌజ్‌తో నేను మొదటిరోజు ఆఫీస్‍కి వెళ్ళాను.

అది మా ఇంటికి పది నిమిషాల నడక దూరంలో వున్న ‘స్వస్తిక్ మాన్యుఫాక్చరర్స్ లిమిటెడ్’ అన్న ఆఫీస్. రెండు గదుల ఆఫీసు, వెనకాల ఫాక్టరీ వుండేది. అందులోనే ‘నారాయణ దాస్’ గారనే ఎండీ గారి రూం. వెనకాల ఆయన కొడుకు విజయ్, ఎకౌంట్స్ హెడ్, ఇద్దరు కుర్రాల్ళూ, ఓ ప్యూన్… మొత్తం ఆఫీసు వ్యవహారాలు చూసుకునే ‘దామోదర్ సార్’ అనే మేనేజరు వున్నారు.

నన్ను దామోదర్ సార్ చాలా ప్రేమగా చూసుకునేవారు. నారాయణ దాస్ గారు, ఎస్.వి.రంగారావు గారిలా భారీ ఆకారం. కన్నడ వాళ్ళు. రోజూ పాతకాలం వాళ్ళలా కోటూ, కోటుకి గడియారం చైన్, కింద పంచెతో వచ్చేవారు. వెళ్ళిన మొదటి రోజే నేను బొటాబొట కన్నీళ్ళూ కార్చేలా చేసారు! డిక్టేషన్‌కి లోపలికి పిలిచి, తన ముందే టైప్ చెయ్యమన్నారు. కంగారులో మిస్టర్‍కి బదులు మిసెస్ అని టైప్ చేసాను!

(సశేషం)

Exit mobile version