Site icon Sanchika

జీవన రమణీయం-179

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను చాలా ఆశ్చర్యపోతూ జయరాంని “ఎందుకొచ్చావ్?” అని అడిగాను. “ఏం లేదు… నీకు శలవు ఎప్పుడు?” లాంటి ప్రశ్నలు అడిగిన తర్వాత “పప్పూ మీద నీ అభిప్రాయం ఏంటి?” అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూసాను. ప్రభాకర్‌ని మా అన్నయ్య ఫ్రెండ్స్ అంతా ‘పప్పూ’ అని పిలిచేవారు. నేను, ఆమ్లెట్ వేస్తూ రహస్యంగా మా ఇంట్లో పట్టుపడినప్పటి నుండీ ‘అట్లకాడ’ అని నామకరణం చేసా. మా ఫ్రెండ్స్ అంతా “‘అట్లకాడ’ ఇలా చేసాడే” అని చెప్తుండేవారు.

“ప్రభాకర్ మీద నా అభిప్రాయం ఇప్పుడేందుకూ?” అన్నాను. నేను 45 నెంబర్ బస్ కానీ 91 కానీ ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లో ఎక్కితే, నేను కూర్చునే బస్ కిటికీ దగ్గరగా నిలబడి సిగరెట్ తాగుతూ పొగ వదిలేవాడు! నేను ఇంటికొచ్చి మా అన్నయ్య దగ్గర ‘అట్లకాడ’కి పొగరెక్కువ అని, ఎలా సిగరెట్ తాగుతాడో చెప్పేదాన్ని! మా ఫ్రెండ్స్‌లో పద్మశ్రీ అనే అమ్మాయి చాలా పొట్టి! ఈయన పక్కనే బస్ స్టాపులో నిలబడితే తన పక్కన, హయిట్ చూసి, “నీ హయిటెంత?” అన్నాడనీ, అతని ఫ్రెండ్స్ అందరూ నవ్వారనీ, తెగ అవమానపడ్తూ వచ్చి నాకు చెప్పుకుంది! ఇలాంటి విషయాలు తప్ప నాకు పెద్దగా ఏం తెలీదు. షార్ట్‌హ్యాండ్ నేర్పించేటప్పుడు, ఏడిపించేవాడు. చూడడానికి బావుంటాడని మా స్నేహితురాళ్ళు అనేవారు. అంత తెలుపూ, అంత పొడుగూ మా కాలనీలో ఇంకెవ్వరికీ లేదు మరి!

నేను “నా అభిప్రాయం ఎందుకూ?” అని అడిగాకా, జయరాం “నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు వాడు” అన్నాడు.

నాకు షాక్ కొట్టినట్లయింది. ఇప్పటికే ‘నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం, ఐ లవ్ యూ’ లాంటివి నలుగురైదుగురి నోటమ్మట విని వున్నాను. ఇంట్లో మా అమ్మకి ఎవరో పెళ్ళి సంబంధం ఒకటి చెప్పారనీ, అబ్బాయి ఇంజనీర్ అనీ అమ్మమ్మతో మాట్లాడడం విన్నాను. అప్పట్లో ఇంజనీర్లూ, డాక్టర్లూ ఇంత విరివిగా వుండేవారు కారు! డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కోవడం అస్సలు వుండేది కాదు! అందుకే ఆ సంబంధాలకి డిమాండ్ కూడా చాలా ఎక్కువ! నా పెళ్ళి విషయం మా అమ్మ తరచూ మాట్లాడుతున్నా నేను ఎప్పుడూ పట్టించుకోలేదు! నాకు పెళ్ళి వయసు కాదు, 18 నడుస్తున్నాయి అంతే! ఇప్పుడు జయరాం చేత ఇతగాడు రాయబారం పంపిస్తే నేనేం జవాబు చెప్తాను. ఇంతకు ముందువాళ్ళు ప్రపోజల్ పెట్టగానే, అరిచి, తిట్టి, చెంప పగలగొడ్తాననీ, ఇంత యాగీ చేసేదాన్ని! కానీ మొదటిసారి, ఆ మాట వినగానే నాకు సిగ్గూ, ఎంతో ‘ఇది’గా మళ్ళీ ఇంకోసారి ఆ మాట వినాలనిపించడం నాకే తమాషాగా అనిపించింది!

“ఆ సంగతి అడగడానికి అతనికి నువ్వు కావల్సి వచ్చావా? సరే… నేను ఈవెనింగ్ ఇంటికొచ్చాకా మాట్లాడ్తా…” అని రివ్వున లోపలికెళ్ళిపోయా! ఆ మాట డైరక్ట్‌గా అతను చెప్పి వుంటే బావుండేదనిపించింది! లోపలికి రాగానే ఏ పనీ చెయ్యబుద్ధి కాక, నాలో నేనే నవ్వుకుంటూ ఏదో బుక్ చదువుతున్నాను. మా ఎం.డి. గారి అబ్బాయి వచ్చాడు.

“నీకు ఆఫీసు టైమ్‍లో అబ్బాయిలతో కబుర్లేమిటీ? ఎవరతనూ?” అన్నాడు.

నాకు చిర్రెత్తుకొచ్చింది. “మీకెందుకు చెప్పాలీ? అది నా పర్సనల్” అన్నాను.

“ఎం.డి. గారికి తెలిసిందంటే?” అని బెదిరించబోయాడు. నేను సర్రున డ్రా లాగి అందులోంచి కాయితం తీసాను, అది అతను ‘I LOVE YOU’ అని టైప్ చేసిన కాయితం.

“ఏయ్? నాకు ఇలా అందరి ముందూ లవ్ లెటర్ ఇస్తున్నావా?” అన్నాడు నవ్వుతూ గట్టిగానే. ఎందుకొచ్చిందో అంత కోపం కానీ, “షట్ అప్” అన్నాను. వీరావేశంతో ఎం.డి. గారి రూంలోకి నడిచాను. దామోదర్ సార్ అడ్డం వచ్చి ఆపాలని చూసారు. నేను ఆగలేదు! వెళ్ళి, ఎం.డి.గారు ఎవరితోనో ఫోన్‍లో మాట్లాడ్తుంటే, అక్కడే వెయిట్ చేసాను.

ఆయన ఫోన్ పెట్టేసి “ఏంటి?” అన్నారు. రవి హడావిడిగా లోపలికొచ్చి, “అన్నీ తప్పులు టైప్ చేస్తుంటే కోప్పడ్డాననీ” అని ఏదో చెప్పబోయాడు.

“రవీ! ఆ అమ్మాయిని చెప్పనీ…” ఆయన గద్దించారు.

“సర్… చిన్న మేటర్ సర్. నేను చూసుకుంటానది” అని దామోదర్ సార్ ఎంటరయ్యారు. “చిన్నదైనా పెద్దదైనా నాకు తెలియాలి” అన్నారు ఎం.డి.గారు.

“నేను ఇంక ఇక్కడ జాబ్ చెయ్యను సార్… సారీ” అన్నాను.

ఆయన “ఎందుకూ?” అన్నారు.

“నేనేం అనలేదు” రవి కంగారుగా అరిచాడు.

“నాకే ఇష్టం లేదు. డిగ్రీలో చేరుతున్నాను. స్టడీస్ కంటిన్యూ చెయ్యాలి” అన్నాను.

రవి ‘అమ్మయ్య’ అనుకున్నాడు.

దామోదర్ గారు ఊపిరి పీల్చుకున్నారు.

“కాదు! ఏం జరిగిందో నేను చెప్తాను సార్” అన్నాడు, గుమ్మంలో నిలబడి విజయ్. రవి కంగారుగా, “నీకెందుకూ?” అని ఇంకా ఏదో కన్నడంలో అంటూ దబాయించాడు అన్నగారిని. విజయ్ లోపలికి రాగానే, నాకా పంచాయితీ ఇష్టం లేక బయటకి వెళ్ళిపోయాను. దామోదర్ గారు విజయ్‍ని బయటకు పంపించాలని చూసినా, “ఆ అమ్మాయిని రవి చాలా ఏడిపిస్తున్నాడు, అందుకే మానేస్తోంది” అని విజయ్ చెప్పేసాడు.

నేను పర్స్ తీసుకుని బయటకి వస్తూ వుంటే, లోపల నుండి ఎం.డి.గారు రవి మీద కేకలు వెయ్యడం వినిపించింది కన్నడంలో, ఇంగ్లీషులో. సినిమా ఏక్టర్ డాక్టర్ శివరామక్రిష్ణయ్య గారిలా కనిపించే మా ఎం.డి. గారిని చూడడం అదే ఆఖరి సారి నేను! ఆయనంటే నాకెందుకో చాలా అభిమానంగా వుండేది మనసులో.

ఇంటికొస్తూనే, ఆనందంగా ఎగిరి గెంతులేస్తూ, మా కుక్కతో ఆడాను. అమ్మమ్మతో వుత్సాహంగా, “ఇంక రేపటి నుండీ వుద్యోగానికి వెళ్ళను… కాలేజీలో చేర్తాను” అని ఎనౌన్స్ చేసాను. “మీ అమ్మ ఎప్పుడో అంది, ఇది మూడో నెల జీతం తీసుకోదనీ” అని అమ్మమ్మ నవ్వింది. రెండు విషయాలకి నేను ఆనందంగా వున్నాను. రెండో విషయం జయరాం వచ్చి చెప్పిన విషయం! ఇంటి ముందు స్కూటర్ ఆగింది. దామోదర్ గారొస్తూ హడావిడిగా, అమ్మమ్మ కాళ్ళకి దణ్ణం పెట్టి, “చిన్నపిల్ల తొందరపడింది…” అని ఏదో చెప్పబోయారు. “కూర్చోండి… ఏం జరిగిందసలూ?” అమ్మమ్మ అడిగింది. “ఏం లేదు… మా ఎం.డి. గారి చిన్నబ్బాయి ఏదో అన్నాడనీ…” అని ఆయన చెప్తుంటే… “ఏదో కాదు సార్… ‘I LOVE YOU’ అని టైప్ చేసి ఇచ్చాడు” అన్నాను.

భర్తతోనూ, అన్నతోనూ రచయిత్రి

ఆయన తెల్లబోయారు. అంతదాకా నన్ను తిట్టాడు, నేను కోపం వచ్చి మానేస్తున్నాను అనుకున్నారు. “అయ్యో అప్పుడే ఎందుకు చెప్పలేదమ్మా? వాడి చెవులు మేలి వేసి సారీ చెప్పించేవాడినీ, మీది ఎంత గొప్ప వంశం… మీ తాతగారెంతటి స్వాతంత్ర్య సమర యోధులూ?” అని టపటపా చెంపలు వేసుకున్నారు. నేను నవ్వుకున్నాను, రవి ముందు మాత్రం ఈయన పప్పులు వుడకవు… అతనంటే ఈయనకి చచ్చే భయం అని. అమ్మమ్మ ఇంక ఏమీ అనకుండా “అది చదువుకుంటానంటోంది లెండి… సరే! రేపటి నుండీ రాదు” అంది. ఆయన కాఫీ తాగి, “రేపొస్తే ఈ పన్నెండు రోజుల శాలరీ తీసుకోవచ్చు” అన్నారు. “నాకు వద్దు… ఇంక ఆ ఆఫీసులో అడుగుపెట్టను” అన్నాను. “సరే, ఇక్కడ సంతకం పెట్టు, నేను తెచ్చి ఇస్తాను” అని ఓచర్ మీద సంతకం పెట్టించుకుని ఆయన తన స్కూటరెక్కి వెళ్ళిపోయారు.

“కన్నడ వాళ్ళయితే ఏమైందీ? పిల్లాడు బుద్ధిమంతుడైతే ఇచ్చి చేసేయచ్చు” అని అమ్మమ్మ అమ్మతో చెప్పింది. “నువ్వు చేసుకోవాడ్ని… నేను చేసుకోను” అని గదిలోంచి అరిచాను.

“నన్ను చేసుకుంటానంటే సరే!” అని అమ్మమ్మ అనడంతో, అమ్మ బాగా నవ్వింది. నేను ఆ రోజు సాయంత్రం ప్రభాకర్ మా ఇంటికి వస్తాడని ఎక్స్‌పెక్ట్ చేసాను. హాయిగా చమేలీ పూలు కోసుకుని దండ కట్టుకుని పెట్టుకున్నాను. చాలా ఎదురుచూసాను. రాలేదు! ‘ఈ జయరాం ఏం చెప్పాడో వెళ్ళి’ అని విసుక్కున్నాను.

అనుకోకుండా మా కజిన్ పెళ్ళి, అందరం ముందురోజే విడిదికి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాం! మా అన్నయ్య మురళి లవ్ ట్రాక్ నడుస్తోంది, మా నాన్న పెద్దమ్మ కూతురు శారదత్తయ్య కూతురు, జయశ్రీతో. నాకు కాబోయే వదిన కూడా తను చదువుతున్న దుర్గాబాయ్ పాలిటెక్నిక్ కాలేజ్ హాస్టల్ నుండి, ముందురోజే పెళ్ళికి వెళ్ళడానికి మా ఇంటి కొచ్చేసింది.

(సశేషం)

Exit mobile version