జీవన రమణీయం-18

0
1

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]”మీ[/dropcap]కిలా అయినందుకు వెరీ సారీ! బట్ మీరు ఫోన్ నెంబరు ఇస్తే, నేను ఫోన్ చేసి మా ఆవిడ్ని తీసుకెళ్తాను” అన్నారు మా వారు.

ఆ అమ్మాయి వెంటనే “చెప్తాను రాసుకోండి” అంది. సెల్ ఫోన్స్ అవీ లేవు. పబ్లిక్ ఫోన్ బూత్‌లు తప్ప.

నేను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను.

ఆమెకీ, ఆమె భర్తకీ పదే పదే కృతజ్ఞతలు చెప్పి, బయటకొచ్చి, రూపాయి కాయిన్ వేసి బూత్ నుంచి ఫోన్ చేశాం.

రింగ్ అవుతుంటే – చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము. వీరేంద్రనాథ్ గారి గొంతు మొదట మావారే విన్నారు. మావారు “స్వరూపారాణి గారు తీసుకొస్తానన్నది మమ్మల్నే… మా మిసెస్ రమణి…” అని చెప్తుంటే

“ఇంకా బయలుదేరలేదా మీరూ? ఐ యామ్ వెయిటింగ్…” అన్నారుట.

“వెంటనే బయలుదేరుతున్నాం సార్… ఎడ్రస్ చెప్తే…” అన్నారీయన.

ఆయన ఎడ్రస్ చెప్పారు. ఈయన మోటార్ సైకిల్ స్టార్ట్ చేశారు. కానీ నా మనో విహంగం అప్పటికే కపాడియా లేన్ చేరుకుంది… ఏం మాట్లాడాలో… ఎలా మాట్లాడాలో… ఏం అడగాలో… అన్నీ లలిత ముందు రోజే కొంత తర్ఫీదు ఇచ్చింది. అసలు లలితే నాతో రావాలనుకుంది. కానీ  మా వారొచ్చారు పరిస్థితుల వల్ల.

కపాడియా లేన్ లోని అమృత్ అపార్ట్‌మెంట్-1లో కిందే వీరేంద్రనాథ్ గెస్ట్ హౌస్ వుంది. ఈజీగానే వెళ్ళాం. బెల్ కొట్టగానే ఆయన ‘కమిన్’ అన్నారు.

ఎవరితోటో మాట్లాడ్తూ, సందేహంగా ఆగిపోయిన మమ్మల్ని చూసి “రండి రండి” అన్నారు. మేం రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాం. నా చేతులు వణుకుతున్నాయి. నా చేతిలో నా ఇటుక రంగు డయిరీ వుంది. అందులో నేను అప్పుడప్పుడూ రాసుకున్న కవితలున్నాయి.

ఆయనతో మాట్లాడుతున్న వాళ్ళు వెళ్ళిపోయాక, మా వైపు చూశారు. నవ్వి, “కాఫీ తీసుకుంటారా?” అని అడిగారు.

నేను వద్దనీ, మా ఆయన సరేనని తలలూపాము. కాఫీ ఎవరైనా కుర్రాడి చేత తెప్పిస్తారేమో అనుకున్నాను. ఆయనే కిచెన్‌లోకి వెళ్ళి, కలుపుతుంటే మేం షాక్ అయ్యాం. నేనైతే ‘అయ్యో, ఎందుకడిగామా పాపం’ అనుకున్నాను. కానీ ఆయన చేతుల మీదుగా కాఫీ కప్పు అందుకుంటుంటే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ విషయం లలితకి ఎలా చెప్పాలా… నమ్ముతుందా? అనుకున్నాను. ఒక్కసారిగా స్కూల్ పిల్లనైపోయాను!

ఆయన మావారి వుద్యోగ వివరాలు కనుకున్నాకా, “అదేవిటీ?” అని నా చేతిలో డయిరీ వైపు చూశారు. నేను అందించాను. అందులో కవితలు చదువుతూ ఒక పేజీ దగ్గర ఆగారు.

“తీయ తేనియ బోయీలై వలపు

పల్లకి నెత్తగా…

స్వప్న వీధుల గుండా స్వర్గం దారి

వెతుకుచుండగా…

కురిసే వెన్నెల నడిగా తోచిన దిక్కుల నడిగా…

మెరిసే చుక్కల నడిగా…”

అని అంతవరకే వుంది.

“ఇంకో వాక్యం రావాలి ఇక్కడ…” అన్నారు.

“తోచకే వదిలేశా…” అన్నాను.

ఆయన నవ్వి…

“నీ కోసం కురిసే వెన్నెల నడిగా… తోచిన దిక్కుల నడిగా… మెరిసే చుక్కల నడిగా… భూమ్మీద నువ్వు కనిపించావ్….

చటుకున్న తిరిగొచ్చా” అని పూర్తి చేసి చూపించారు!

ఆ థాట్‌కి నాకు మతిపోయింది. మా వారికీ చూపించాను. ఎన్నో కబుర్లు… వెన్నెల్లో ఆడపిల్ల గురించీ, ఆనందోబ్రహ్మ గురించీ, ఋషి గురించీ, పర్ణశాల గురించీ… ఎంతకీ తెగలేదు కబుర్లు…

మావారితో ఆయన “మీ మిసెస్ చాలా బాగా రాస్తున్నారు. రచయిత్రిగా ఎదగనీయండి” అన్నారు.

మావారు నావైపు చూశారు. నేను బాగా రాస్తానని ఆయనకింకా తెలీదు అప్పటికి.

నేను చాలా సిగ్గుపడ్తూ, నా బైండ్ నోట్ బుక్ తీసి “లీడర్… అని మా తాతగారి కథ రాశా… దీన్ని ఎందులోనైనా వేయిస్తే బావుంటుంది. ఆయనా, అమ్మమ్మా గొప్ప దేశభక్తులు” అన్నాను.

“అబ్బే! దేశభక్తులు చరిత్రలు ఎవరూ చదవరమ్మా” అనేసారు వెంటనే.

నేను డిజప్పాయింట్ అయ్యాను. అది చూసి, “ఇక్కడ వుంచి వెళ్ళండి. ఇదీ… చదువుతాను” అన్నారు.

నాకు ఏనుగెక్కినట్లు అయింది.

“మీరు నిజంగా బాగా రాస్తారు. వదిలి పెట్టకండి” అని వాకిలి దాకా వచ్చి చెప్పారు. అప్పటికే ఆయన వుద్యోగం వదిలేసి, ఫుల్ టైమ్ రైటర్ అయి ఎంత సంపాదిస్తున్నారో చెప్పారు కూడాను!

ఆయన మెచ్చుకోవడం… నా పుస్తకంలో తన ఆటోగ్రాఫే కాకుండా కవిత పూర్తి చెయ్యడం నాకు కలలా వుంది! ఇద్దరం ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుని వచ్చేస్తుంటే, “ఆ కవితల్లో రెండిటికి టిక్కు పెట్టాను, ఆంధ్రభూమికి పంపండి” అన్నారు.

“అలాగే” అన్నాను.

ఇంటికి తిరిగొస్తూ కూడా ‘ఇది జీవితంలో మరచిపోలేని రోజు కదా’ అని అనుకున్నాం!

గురువు గారి మాటల్లో…

“వస్తున్నప్పుడు ఊరి మొదటి వేపచెట్టే, వెళ్తున్నప్పుడు ఊరి చివర వేపచెట్టు అవుతుంది… రెండిటికీ మధ్య ఆనందానికీ విషాదానికీ మధ్య పరుచుకున్న అనుభవం వుంటుంది”

క్లాక్ టవర్ దగ్గర కామత్‌కి వెళ్ళి “నిజంగానే? యండమూరే?” అనుకుని, మా ఆయన్ని గిల్లమని, నిజమేనని ధ్రువీకరించుకుని, ఇడ్లీ తిని కాపీ తాగి, అత్తగారి ఇంటికొచ్చాం.

అప్పటికే క్రిష్ణ ‘దండమూడి వీడేందనాధ్’ గారి దగ్గర నుండొచ్చేసారా?” అని అడుగుతూ ఎదురొచ్చాడు. అశ్విన్ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు! మా అత్తగారు “యండమూరాయన” అనేవారు. అందరం అక్కడి విశేషాలు గురించి మాట్లాడుకున్నాం. మా ఆడపడుచు శారద కూడా ఆయన నవలల గురించి మాట్లాడింది.

అక్కడి నుండి పిల్లలను తీసుకుని వస్తూ దారిలో శారదా నర్సింగ్‍హోం దగ్గర ఆగి స్వరూప రాణికి జరిగినదంతా చెప్పి ‘థ్యాంక్స్’ చెప్పి ఇల్లు చేరాము!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here