Site icon Sanchika

జీవన రమణీయం-180

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను పెళ్ళిళ్ళు అంటే ఆగను కదా, పెళ్ళి మండపంలో ముందురోజే కళ్ళాపులు చల్లి, ముగ్గులు పెట్టాలని అమ్మమ్మతో వెళ్ళిపోయాను. ఇంట్లో అమ్మా, మా కాబోయే వదిన జయశ్రీ మాత్రమే వున్నారు. అమ్మమ్మకి కొంగులా నేనూ వెనకాల తిరగడం చిన్నప్పటి నుండీ అలవాటు. కజిన్ పెళ్ళేమో, అందరం కలిసి మహా సందడిగా వున్నాం. అప్పట్లో నేను డాన్స్ నేర్చుకున్నాను కాబట్టి ‘శంకరాభరణం’లో ‘బ్రోచేవారెవరురా’ డాన్స్ నా చేత చేయించేవారు టేప్ రికార్డర్ పెట్టి మా అన్నయ్యలు.

నేను మహాధ్వజాయమానంగా వుండగా, ఇంట్లో వేరే సీన్ నడిచిందట రసకందాయంగా! సరే… తెల్లారి లేచి ముగ్గులు పెట్టి, అనవసరంగా లంగా ఓట్ణీ ఎగ్గట్టి అటూ ఇటూ తిరుగుతుండగా, మా అమ్మా వదినా వచ్చారు. మా వదిన నన్ను చూసి కిసుక్కుమని నవ్వుతూ “చెప్పనా? చెప్పనా?” అంటోంది మా అమ్మతో. అమ్మేమో “ఇప్పుడొద్దులే” అంది. అక్కడి నుండి నేను వెంటపడ్డాను, “ఏమిటీ అదీ? చెప్పద్దు అంటున్నావ్?” అని. మా వదిన చాలా సేపు బతిమాలించుకుని, చివరకు నన్ను ఎవరూ లేని ఓ మూలకి తీసుకెళ్ళి, బోలెడు నవ్వూ, కొంచెం మాటలూతో, “రాత్రి ప్రభాకర్ అన్నయ్య వచ్చాడు ఇంటికి” అంది.

“ప్రభాకర్ అన్నయ్యా?” నేను తుళ్ళిపడ్దాను ఈ కొత్త సంబోధనకి.

మా అమ్మా వదినా త్వరగా అన్నాలు తినేసి, టీ.వీ. చూస్తూ వుండగా, తెల్లని లాల్చీ పైజమా వేసుకుని, ప్రభాకర్ వచ్చి, ద్వారబంధానికి రెండు చేతులు పెట్టి నిలుబడి (బహుశా నేను మీ ద్వారబంధం అంత పొడుగున్నాను అని చెప్పడానికేమో!), “లోపలికి రావచ్చా అండీ?” అన్నాడుట.

మా అమ్మకి అన్నయ్య ఫ్రెండ్స్ రావడం అలవాటే కాబట్టి, “రావయ్యా… మిగతా వాళ్ళేరీ?” అందిట. మా అన్నయ్య లేకపోయినా, నానీ, జయరాం, ప్రభాకర్ మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడి “ఏమైనా కావాలా? తీసుకురావాలా?” అని అడిగిపోవడం మామూలే! మా అమ్మ ప్రశ్నకి జవాబు చెప్పకుండా “హాయ్ జయశ్రీ!” అని మా వదినని విష్ చేసి వచ్చి కూర్చున్నాడుట. ఇంతవరకూ చెప్పి మా వదిన మళ్ళీ నవ్వు.

“చెప్పు… తర్వాత నవ్వుదువు గాని… ఏం అన్నాడూ?” అన్నాను.

“సత్యవతమ్మ గారూ, మీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను, అన్నాడు” అంది.

“అమ్మని పేరు పెట్టి పిలిచాడా?” నాకు కోపం వచ్చింది. నాని అత్తయ్యగారూ అనీ, మిగతావాళ్ళు ఆంటీ అనీ అంటారుగా! నాకు అలా పేరు పెట్టి మా అమ్మని పిలిస్తే నచ్చదని ఆయనకి తెలిసాకా, ఇప్పటికీ అలాగే పిలుస్తున్నారు. వెనకాల అత్తగారూ అనీ, ముందు “సత్యవతి గారూ!” అనీ. అంత మొండి మనిషి!

“ఏమిటి బాబూ?” అమ్మ కంగారు పడిందట. “మీ అమ్మాయికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు అని తెలిసింది” అన్నాడట. మా అమ్మ ముందూ వెనుకా ఆలోచించకుండా, “ఔను బాబూ, ఎవరో చెప్పారు, ఇంజనీర్ సంబంధం… పిల్లాడు మంచివాడుట…” అని చెప్తుంటే, మా వదినకి ఈయన మొహంలో మార్పులు తెలిసిపోతున్నాయిట… చాలా తెలుపు కాబట్టి చటుకున్న మొహం ఎర్రబడిపోయిందిట!

మా వదిన మా అమ్మ చేతి మీద చెయ్యి వేసి, ఇంకా మిగతా వివరాలు చెప్పబోతుంటే ఆపిందట. అప్పుడు ప్రభాకర్ గొంతు సవరించుకుని, “మీ అమ్మాయికి ఇంక సంబంధాలు చూడడం మానేయండి” అన్నాడుట. అమ్మకి ఇంకా అర్థం కాలేదు. “అదేవిటి బాబూ? అంకుల్ వేరే ఊళ్ళో ఉద్యోగం, అస్సలు పట్టించుకోరు… నేను చూడకపోతే ఎలా? అందులోనూ మంచి సంబంధం…” అంటుంటే, “నేను చేసుకుంటాను” అన్నాడుట!

“నేను చేసుకోవాలనుకుంటున్నాను అనాలి కానీ, నేను చేసుకుంటాను… ఏమిటీ? అందులోనూ నన్ను అడక్కుండా?” అన్నాను. నాకు ఒళ్ళు మండింది. జయరాంని రాయబారం పంపి, అదే ఫైనల్ అనుకుంటున్నాడా? అని.

మా వదిన చిరాగ్గా “నన్ను చెప్పనీ! లేదా నువ్వు చెప్పు… మధ్యలో ఆపకు” అంది.

“సరే… తర్వాతా?” నాకూ వుత్సాహంగానే వుంది ఆ ఘట్టం మొత్తం వినాలని! “సరే.. మీ అమ్మగారికి చెప్పావా?” అని అమ్మ వెంటనే అడిగిందట! లేకపోతే టెక్నికల్‌గా ఆవిడ చాలా తప్పు చేసేసినట్లు అయ్యేది.

“లేదండీ! మా అమ్మ తప్పకుండా ఒప్పుకోదు” చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేసాడుట. వింటున్న నేనూ, అప్పుడు మా అమ్మా, వదినా అంతా వులిక్కిపడ్డాం.

“ఏంటీ?” అందిట ఆశ్చర్యంగా మా అమ్మ.

మా అమ్మకి తన కూతురి అందం, తెలివి తేటలూ, సత్ప్రవర్తనా మీద బోలెడు నమ్మకం! అసలు ఎవరూ కాదనరు అనుకుంటుంది. మా కజిన్ సిస్టర్ మరిది ఒకడు సి.ఎ. చదువుతూ, నన్నిచ్చి పెళ్ళి చెయ్యమని, సైకిల్ మీద రాణీగంజ్ డిపోకొచ్చి ఈవిడ్ని బతిమాలాడు అప్పటికే! “మా అమ్మాయి ఇష్టం దాని పెళ్ళి” అని ఈవిడ చెప్పేసింది. ఇంకో ఇద్దరు కూడా “మీ అమ్మాయిని మా మరిదికి మాట్లాడనా?” లేదా, “మా తమ్ముడున్నాడు మేడం… చూస్తే వదులుకోవాలనిపించడం లేదు” అన్నారట లేడీ కొలీగ్స్. అవన్నీ ఈవిడ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఏవరేజ్ హీరోతో సినిమా తీసినవాడికి బాక్స్ ఆఫీస్ హిట్ అవుతుంది నీ సినిమా అని వాళ్ళు చెప్పినట్లు అయిపోయింది! దాంతో “మా అమ్మ తప్పకుండా ఒప్పుకోదు” అన్న ఈయన మాట ఆవిడకి శరాఘాతంలా తగిలింది. “ఎందుకనీ? మేమూ మీ శాఖేనే” అందిట. ఆయన నవ్వి “శాఖా, జాతకాలూ పట్టింపులు కావండీ, నాకు ఓ పెళ్ళి కాని అక్క వుందని తెలుసుగా, తనకి అయ్యేదాక నాకు సంబంధాలు చూడను అంది. నాకూ చేసుకోవడం ఇష్టం లేదు! కానీ మీరు చాలా తొందరపడి తనకు సంబంధాలు చూస్తున్నారు, కాబట్టి చెప్తున్నాను. ఓ రెండేళ్ళు ఆగండి… నేనే చేసుకుంటాను… తనంటే నాకు చాలా ఇష్టం…” అన్నాడుట.

“అప్పుడు మీ అమ్మగారు ఒప్పుకుంటారా?” అమ్మ ఆశగా అడిగిందట. “అప్పుడూ ఒప్పుకోదు, మా అమ్మకి లవ్ మేరేజ్‍ అంటే చిరాకు! మా అన్నయ్య అలాగే మా వదినని లవ్ మేరేజ్ చేసుకున్నాడు. తను తమిళియన్… అంతే కాదు” అని ఆగి, చిన్నగా నవ్వి, “మీ పక్కన కూర్చునుందే జయశ్రీ…. అంత తెల్లగా వుండాలి కోడలు అని ఆవిడ డిసైడైపోయింది… మీ అమ్మాయేమో…” అన్నాడట.

రచయిత్రి భర్త, అన్నయ్య మురళి, కజిన్ డా. రాము

వింటున్న నేను కస్సుమన్నాను “నేను నలుపు అన్నాడా?” అని. మా వదిన నవ్వుతూ “నేను మంచి రంగు అన్నాడు కూడా!” అంది.

నేను మూతి ముడుచుకుని, “తర్వాతా?” అన్నాను. అప్పుడు మా అమ్మ “అది చామనచాయ. నీ పక్కన నిలబడితే నలుపు అని కూడా అనిపిస్తుంది… మరి నీకెలా నచ్చిందీ?” అందిట. మా అమ్మకీ చివుక్కుమనే వుంటుంది పాపం! కన్న తల్లి కదా… బాక్స్ ఆఫీస్ హిట్ అనుకున్న ప్రొడ్యూసర్‍కి, రివ్యూయర్ 2.5/5 అని రేటింగ్ ఇచ్చినట్లు అనిపించి వుంటుంది!

“నాకు తన రంగే ఇష్టం అండీ! అసలు చూసినప్పుడే, పెద్దయ్యాకా ఈ అమ్మాయి, తననే పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను” అన్నాడట.

ఆయన నన్ను చూసింది నా తొమ్మిదో క్లాసులో. అప్పటి దాకా కాలనీలో ఆడుకుంటున్నప్పుడు చూసినా, ఈ దృష్టి వుండదు కదా! మొదటి సారి తను – నేను స్కూల్ నుండి రాగానే, “ఏయ్ పిల్లా… అట్లకాడ ఎక్కడుందీ?” అని అడిగాడు. నేను వంటగదిలోని వింత వాసనలు కోడిగుడ్డు అట్టువని తెలిసి, “అమ్మతో చెప్తా… అమ్మతో చెప్తా” అని మా అన్నయ్యని చూడగానే, వాడి పిలక నా చేతికందినట్లుగా, గొప్ప వుత్సాహంతో ఎగిరాను! ఆ రోజుల్లో బ్రాహ్మణ కొంపలోకి గుడ్దు రావడం, అదీ పెనం మీద అట్టు అవడం ఎంత పెద్ద తప్పూ? అన్నయ్య భయపడిపోవడం, వాడి మిత్రులకో పెద్ద తమాషా! అన్నయ్య మొదటిసారి సిగరెట్ తాగుతూ కూడా నా చేతికి ఇలాగే పట్టుబడిపోయి, అమ్మతో చెప్పకుండా వుండడానికి బోలెడు లంచాలు ఇచ్చాడు! ఆ సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది… అదీ, నన్ను దగ్గర్నుంచి, వింతగా చూస్తూ వుండిపోవడం.. తర్వాత అన్నయ్య అస్సాంలో వుద్యోగం వచ్చి వెళ్ళిపోయాకా, లూజ్ కనెక్షన్ వల్ల ఊరూరికే కరెంట్ పోతుంటే, కరెంట్ తీగని కర్రతో కొట్టాల్సి వచ్చేది. నేను గోడెక్కి కర్రతో  కొట్టినా నాకు అందక అవస్థ పడుతుంటే, వెనుక నుండి ప్రభాకర్ వచ్చి “తప్పుకో… ఆ కర్ర ఇటియ్యి” అని కరెంట్ వైరుని తను కర్రతో కొట్టగానే ‘కరెంట్’ వచ్చింది! నేను పొడుగ్గా వున్న అతను మునివేళ్ళ మీద నిలబడి, కనీసం స్టూల్ కూడా ఎక్కకుండా కరెంట్ వైరుని కొట్టడం చూసి ఆపకుండా నవ్వుతూనే వున్నాను… అప్పుడు అతను విచిత్రంగా చూడడం గుర్తొచ్చింది.

(సశేషం)

Exit mobile version