Site icon Sanchika

జీవన రమణీయం-182

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

నాకు పదేళ్ళప్పటి నుండీ ముషీరాబాద్ ఏరియా నుండి కుడి వైపుకి తిరిగి వెళ్తే వుండే కల్పనా టాకీస్ వున్న కవాడిగుడా ఏరియాతో మాకు అనుబంధం వుండేది. మా అమ్మమ్మ అక్కడే ఓ ఇల్లు కట్టింది. ఇల్లు కట్టడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అంటే, తాతయ్య ఫ్రీడం ఫైటర్ కాబట్టి అక్కడ స్థలం ఇచ్చారు! అమ్మమ్మకి ముగ్గురూ ఆడపిల్లలలే! భర్త స్వాతంత్రోద్యమం అంటూ, వున్నదేదో దేశం కోసం ధారపోసి, చివరికి ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ  తెలీని విధంగా, నూజెళ్ళ ప్లాట్‌ఫార్మ్ మీద చనిపోయారు. చివరిగా ఎవరో ఇల్లాలు, గొంతులో నీళ్ళు పోసిందట! అదేనేమో ఆయన స్వంతం కోసం ఎవరినైనా ఏదైనా సహాయం ఆశించడం! ‘నీళ్ళు… నీళ్ళు…’ అంటే ఆవిడ గొంతులో నీళ్ళు పోస్తే, ప్రాణాలు వదిలేసారుట. ఈ విషయం ఇంట్లో తెలీక, అమ్మమ్మ ఆవకాయ పెట్టడానికి కారాలూ, ఆవపిండీ కొట్టించి, ఆంధ్రా నుంచి తాతయ్య కాయలు తెస్తారని ఎదురు చూస్తోందిట పాపం!

తాతయ్యతో అప్పటిదాక ప్రయాణించిన ఆయన స్నేహితుడు సీతంరాజు రామారావు గారు గుడివాడలో దిగిపోయారు. ఆయనకి తెలిసి ఈ విషయం, తన సహ ప్రయాణీకుడు ఎవరో కాదు, the great freedom fighter సూరంపూడి శ్రీహరిరావు గారు, అని కాంగ్రెస్ ఆఫీస్‍లో ఈ విషయం తెలియజేసారు. గుడివాడలోని కాంగ్రెస్ ఆఫీస్‍లో శవాన్ని పెట్టి, వారి కుటుంబం ఎక్కడుందో తెలియక, రేడియోలో చెప్పించారుట! పేపర్‍లో ప్రకటించారుట! కానీ ముసలి తల్లినీ, ముగ్గురు పిల్లలనీ పెట్టుకుని వున్న రమణమ్మ గారు పేపర్ చదవలేదు, రేడియో లేక వార్త వినలేదు! దాంతో మూడు రోజులు శవాన్ని, ఆయన శిష్యుల సందర్శనార్థం వుంచి, మూడో రోజున చందనం కట్టల మీద దహనం చేసేసారుట. ఆ శవయాత్రలో పెద్ద పెట్టున – ఆయన ఉపన్యాసాలు విని ప్రభావితమైన జనం పాల్గొని, జయజయధ్వానాలు చేస్తూ కంట తడిపెట్టారుట, ఆయన భార్యా పిల్లాలు తప్ప! ఎవరు తల కొరివి పెట్టి పుణ్యం కట్టుకున్నారో కూడా తెలీదు!

నాలుగోనాడు తాతయ్య ఫ్రెండ్ పసల సూర్యప్రకాశరావు గారికి తెలిసి, జటా భవన్‌కి వచ్చి ఈ వార్త అమ్మమ్మకి వినిపించాలని చూస్తే, ఆవిడ పందిట్లో హరికథ వినడానికి వెళ్ళిందట. “అమ్మా, మీ నాన్నగారు పోయారు, మీ అమ్మగారిని పిలుచుకు రండి, ఈ వార్త చెప్పాలని వచ్చాను” అంటే, మూడో కూతురు, అంటే… మా అమ్మ… తన పసిబిడ్డను ఎత్తుకుని, ఏడుస్తూ వెళ్ళి తల్లికీ వార్త చెప్పి తీసుకొచ్చిందట! అలా ఓ ప్రస్థానం ముగిసింది! ఎక్కడో తూర్పు గోదావరి జిల్లాలోని మండపాకలో పుట్టి, కాంగ్రెస్‍లో చేరి, స్వాతంత్ర్యోద్యమం కోసం పోరాటం చేస్తూ, అన్ని జైళ్ళల్లో ఖైదీగా వుండి, బర్మాలోని మాండలె జైలులో కూడా వుండి, కుటుంబాన్ని నిత్య సంచారులని చేస్తూ, చివరికి ఈ భాగ్యనగరం చేర్చి, తన పడిన శ్రమకి విశ్రాంతి దేశమాత ఒడిలోనే అని, స్వాతంత్రం సాధించాకా, కన్నుమూసారు మా తాతగారు సూరంపూడి శ్రీహరిరావు గారు!

స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ కొద్ది రోజులూ ఆయన మనశ్శాంతిగా లేరు! పదవి కోసం పాకులాడి ఆ తర్వాత రాజకీయాల్లో దేశాన్ని ముక్కలు చెయ్యడం, అవినీతీ, కుళ్ళు స్వార్థంతో కూడిన రాజకీయాలని ఎదిరించారు! మళ్ళీ తీవ్రవాదన్న ముద్ర వేయించుకున్నారు! ప్రాణ మిత్రుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, బూర్గుల రామకృష్ణారావు గారు లాంటి పెద్దలు, ఏదైనా ఓ పదవి తీసుకోమని చెప్పారు. ఆయన అప్పటికే రాజకీయాలని రొచ్చుతో, పడుపు వృత్తితో పోల్చి, “ఒళ్ళు అమ్ముకున్న అమ్మలు, కడుపుకి తిండి లేక, గతి లేక ఆ పని చేస్తారు. నీతి అమ్ముకునే పొలిటీషియన్స్ వారితో పోల్చడానికి కూడా అర్హులు కారు!” అని తిట్టి ‘విప్’ అనే పత్రిక సరోజినీదేవి నాయుడు గారి కుమారుడు డా. జయసూర్యతో కలిసి పెట్టి, గవర్నమెంటు సప్రెస్ చేసిన కేసులన్నీ మళ్ళీ తవ్వి తోడి, వాదించి కోర్టులో, తీవ్రవాదిగా అరెస్టయ్యారు. రేణిగుంటలో లక్క పిడతలమ్ముకునే పేదవాడి మరణాన్ని లాకప్ డెత్‍గా నిరూపణ చేసి, పోలీసులపై కేసులు పెట్టారు! ఆయన ప్రజా జీవితం అశాంతిగా, అన్నార్తుల కోసం, అన్యాయాలకి బలౌతున్నవారి కోసం ఆక్రోశంగా గడిచింది! ‘He who thinks of the suffering humanity, cannot be peaceful and happy!’ అన్న మహాత్ముని మాటకి నిదర్శనం శ్రీహరిరావు గారి జీవితం! ఒక అవిశ్రాంత పోరాట యోధుని జీవితం అలా అర్ధోక్తిలో ముగిసింది!

లీడర్ శ్రీ సూరంపూడి శ్రీహరిరావు గారు

అక్కడి నుండి మా అమ్మమ్మ సూరంపూడి వెంకట రమణమ్మ గారి ఒంటరి పోరాటం మొదలయింది! ముగ్గురు ఆడపిల్లలకీ పెళ్ళిళ్ళు అయ్యాయి. అందరినీ ఆవిడ చదివించింది. వారు స్వశక్తితో వుద్యోగాలు సంపాదించుకున్నారు. పెద్ద కూతురు దుర్గా సావిత్రీదేవిని, వరుసకి తమ్ముడైన శేషగిరికిచ్చి చేసుకుంది. వారికి తొలి చూలు ఓ మగబిడ్డ పుట్టాడు. దౌహిత్రుడని తాతయ్య చాలా ప్రేమని పెంచుకున్నారట! అతను ఏడాది పెరిగి, ఏదో జబ్బు చేసి పోయాడుట. అప్పటి నుండీ ఆయన బిడ్డలని ఎత్తుకుని ముద్దాడడానికి జంకేవారుట! దూరం నుండే ప్రేమగా చూసేవారుట!

ఆ తర్వాత మా సావిత్రి పెద్దమ్మకి ఇద్దరు ఆడపిల్లలు – లక్ష్మీ, వాణి, ఆ తర్వాత రామూ అనే మగపిల్లాడూ, చివరిగా ఉమ అని ఆడపిల్లా కలిగారు.

రెండవ పెద్దమ్మ శ్రీదేవికి మొదట ఆడపిల్ల విజయలక్ష్మీ, మళ్ళీ శాంతీ, ఆ తర్వాత ఇద్దరు మగ పిల్లలు – హనుమంతరావు, శ్రీహరిరావు, ఆఖరిగా రమ పుట్టారు.

మా అమ్మ సత్యవతీ దేవి మూడో కూతురు. శ్రీకాంత్ మురళీ అనే అన్నయ్య, నేనూ అంతే!

శ్రీ సూరంపూడి శ్రీహరిరావు గారు, రమణమ్మ గార్ల కుమార్తెలు

తాతగారు పోయేనాటికి హనుమంతు అన్నయ్యా, మా మురళీ అన్నయ్య – ఇద్దరు మగపిల్లలు పుట్టారు, మూడు తరాలకి! మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇద్దరూ అక్క చెల్లెళ్ళే!

దూరం నుండి చూసి పిల్లల్ని ముద్దు చేసి “వెళ్ళొస్తా” అని చెప్పి వెళ్ళిన తాతయ్య మళ్ళీ తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారు! అందుకని, ఆ తర్వాత పుట్టిన ఉమక్కకీ, రమక్కకీ, చిన్ని అని పిలుచుకునే శ్రీహరి అన్నయ్యకీ, నాకు ఆయనని చూసే భాగ్యం కలగలేదు! ఆ మాటకొస్తే పిల్లలం ఎవరికీ కూడా అయన జ్ఞాపకాలు లేవు! గుమ్మడి గారు, నాకు ‘రేపల్లెలో రాధ’ షూటింగ్‌లో కలిసినప్పుడు – “మా తాతగారు మీలా వుంటారని నా భావన సార్” అని ‘లీడర్’ పుస్తకం ఇస్తే, అక్కడికక్కడే చదివేసి, “ఆ మహానుభావుడితో నన్ను పోల్చావా తల్లీ? మా జెనరేషన్‍లో ఆయన పేరు వినని స్టూడెంట్ వుండేవాడు కాడు! అంత గొప్ప ఆయన మనవరాలు రాసిన పాత్ర నేను పోషిస్తున్నందుకు ఆనందంగా వుంది” అన్నారు.

అమ్మమ్మ, అమ్మలతో రచయిత్రి

చాలామందికి తెలీక పోయినా తాతగారు అప్పుడు ‘లీడర్’గా ప్రముఖులు. అందుకే ‘లీడర్’ అన్న పుస్తకం, అమ్మమ్మ గారు నాకు తమ లక్నో పాదయాత్ర మజిలీలు చెప్తూ వుండగా, పుస్తకంగా రాసాను! రాజకీయ నాయకులు అంటే ఆయనకి ఇష్టం వుండదని, “పుస్తకావిష్కరణకి ఎవరిని పిలుద్దాం?” అని మా గురువు గారు యండమూరి వీరేంద్రనాథ్ గారు అడగగానే, “అక్కినేని నాగేశ్వరరావుగారిని పిలుద్దాం, మా అమ్మమ్మకి అభిమాన నటులు” అన్నాను. ఆ తర్వాత ఆయన ఒప్పుకుని ముఖ్య అతిథిగా రావడమే కాకుండా, జీవితాంతం ఒక గురువుగా, స్నేహితుడిగా, గాడ్ ఫాదర్‍గా నన్ను చూసుకున్నారు! “ముందుగా ఎపాయింట్‌మెంట్ అఖ్ఖర్లేదు… ఇటుగా వెళ్తుంటే వచ్చి వెళ్ళు” అనేవారు! అలాగే నెలకోసారైనా వెళ్ళి కబుర్లు చెప్పి కలిసి కాఫీనో, భోజనమో తీసుకుని వచ్చేదాన్ని. ఆఖరి రోజుల్లో ఆయన నడవలేని స్థితి కొచ్చాకా, ఇంక చూడలేక మానేసాను! నాకున్న గొప్ప గొప్ప స్నేహాలు, పెద్దలతో సాన్నిహిత్యం, నేను ఆ గొప్ప మనిషికి మనవరాలిగా పుట్టడం వల్లనే అనుకుంటాను. తర్వాత అమ్మమ్మకి కొంత గవర్నమెంట్ లాండ్ ఇస్తే – అందరు స్వాతంత్ర సమరయోధుల భార్యలకీ ఇస్తూ – ఆ కల్పనా టాకీస్ వెనుక ఇల్లు కట్టుకుంది. అదే ఆవిడ ప్రాణాలు తీసేటంత శాపంగా మారింది. “కొడుకు లాంటి వాడివి” అంటూ సత్యనారాయణ అనే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‍కి అద్దెకిస్తే, 20 ఏళ్ళ తర్వాత ఇల్లు నాదే అని కోర్టులో కేసు వేసాడు.

(సశేషం)

Exit mobile version