Site icon Sanchika

జీవన రమణీయం-187

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఫ్ల[/dropcap]యిట్ పది గంటలు ఆలస్యంగా వచ్చినా సౌరేష్ వాళ్ళ అమ్మమ్మ అదే ఎనర్జీతో వుండడమే గాక, వెంటనే నన్ను చూడటానికి కూడా వచ్చారు. మర్నాడు వాళ్ళూ, నేనూ, క్రిష్ణా డౌన్ టౌన్ వెళ్ళాం. పలుచని చీర కట్టుకుని వెళ్ళాను నేను. చలికి గడ్డ కట్టినంత పనైంది! మర్నాడు భరద్వాజా, ఇంద్రజా, ఇంకో అమ్మాయితో ఏష్‍మిన్ అనే పురాతనమైన సిటీకి కార్ బుక్ చేసి తీసుకెళ్ళాడు క్రిష్ణ. అక్కడ ఫ్యూజన్ రెస్టారెంట్‍లో, హిందుస్తానీ, అమెరికన్ ఫుడ్ తిన్నాం – షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, హేమమాలినీ, ధర్మేంద్రల పోస్టర్స్ చూస్తూ, పాత హిందీ సినిమా పాటలు వింటూ. సడెన్‍గా కమల హాసన్‌ది, ఒక డబ్బింగ్ సినిమాలో పాట తెలుగులో వినిపించింది. నేను ఆనందంతో వెయిటర్‍తో “ఇది ఏ భాషో తెలుసా?” అంటే, “ఇండియన్” అన్నాడు. “యా, తెలుగు ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్” అని గర్వంగా చెప్పాను. చాలా 1980లో కట్టిన బిల్డింగ్స్, మ్యూజియమ్, లైబ్రరీ చూసాం. క్రిష్ణ నాకు కోట్ కొన్నాడు. అది చాలా కంఫర్ట్‌బుల్‍గా అనిపించింది.

కుమారుడు క్రిష్ణతో రచయిత్రి

నేనూ క్రిష్ణా రోజూ బయటకు వెళ్తూ, సాయంత్రాలు వాకింగ్ కెళ్తూ, రివర్ సైడ్ కూర్చుని హంసల జంటలని చూస్తూ, రాత్రిళ్ళు చెట్లకి గుత్తులుగా వేలాడే దీపగుచ్ఛాల లాంటి మిణుగురులని… ఫైర్‍ఫ్లైస్ అని అంటారు, వాటిని చూస్తూ ఆనందంగా గడిపేవాళ్ళం. సిటీలోకెళ్ళి రకరకాల రెస్టారెంట్స్‌లో ఫుడ్ ట్రై చేస్తూ, మనిషి తొక్కే రిక్షా ఎక్కి మేం ఇద్దరమే చాలా ఎంజాయ్ చేశాం.

డౌన్ టౌన్‌లో సైకిల్ రిక్షాలో రచయిత్రి

ఒక రెస్టారెంట్‌లో నేలంతా ఎర్రని ఓల్డ్ పెన్నీలు తాపడం చేయించాడు ఆ ఓనర్, ఎన్ని లారీల పెన్నీలు తెప్పించాడో కానీ. ఆదివారం సౌరేష్ వాళ్ళమ్మా, అమ్మమ్మలతో, ఫార్మర్ మార్కెట్‌కి వెళ్ళాను. క్రిష్ణ రాలేదు. ఫ్రీగా ఐస్‍క్రీమ్స్, కేక్స్, జ్యూస్ ఇలాంటి చోట్ల శాంపిల్స్ పెడ్తారు. మేం ఆ రోజు రాస్‍బెర్రీ ఐస్‍క్రీం టేస్ట్ చేసాం. వాళ్ళు కొన్ని కూరగాయలు కొన్నారు. నేను ఫ్రూట్స్ కొన్నాను. కాన్వకేషన్ రోజుకి అశ్విన్ సెలెక్ట్ చేసి కొన్న సూట్‍ని తీసుకెళ్ళాను క్రిష్ణకి. ప్రతీ తల్లికీ, తండ్రికీ, అందరికీ అదో పండుగ, పిల్లలు వెళ్ళి డీన్ సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తుంటే తీసుకుని, ఆ తర్వాత టోపీలు పైకెగరేసి, ఒకళ్ళని ఒకళ్ళు హగ్ చేసుకోవడం. క్రిష్ణది ఓపెన్ ఎయిర్‍లో అయింది. పొద్దుట మేం అండర్ గ్రాడ్ చూడ్డానికి వెళ్తే, సౌరేష్ వాళ్ళ అమ్మమ్మ సీనియర్ సిటిజెన్ కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే కూర్చుని చూసాను.

సాయంత్రం ‘క్రిష్‌కాంత్ బలభద్రపాత్రుని’ పేరుని పిలిచి, వాడికి సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు, నేనూ ముందుకెళ్ళి, ఛాన్స్‌లర్‍ని రిక్వెస్ట్ చేసాను, “నేను వాళ్ళ అమ్మని, నాకూ ఈ ఫొటోలోకి రావాలని వుంది” అని. ఆయన ఎంతో సంతోషంగా “ప్లీజ్ కమ్ మేమ్.. ఆర్ యూ ఫ్రం ఇండియా?” అని నా డ్రెస్‍ని చూసి గుర్తించి అడిగి, ఫొటో తీయించుకున్నాడు. నన్ను చూసి మిగిలిన ఇండియన్స్ చాలా మంది ఇదే పని చేశారు.

కుమారుడి కాన్వకేషన్‌లో రచయిత్రి

ఆ తర్వాత మాకు యూనివర్సిటీలో స్నాక్స్ ఇచ్చారు. ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‍ని నేను “మా ఫొటో ఎలా చూసుకోవచ్చూ?” అంటే నవ్వి, “మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి యూనివర్సిటీ వెబ్‌సైట్‍లో పెడ్తాను” అని డీటెల్స్ ఇచ్చాడు.

ప్రొఫెసర్ మైకేల్ కే తో రచయిత్రి,క్రిష్ణ

క్రిష్ణ ప్రొఫెసర్ మైకేల్ ‘కే’ నాతో “మీరు చాలా అదృష్టవంతులు, క్రిష్ణ చాలా బ్రిలియంట్ బోయ్” అనగానే, వాడిని ఎల్.కె.జి.లో చేర్పించిన ఫీలింగ్ గుర్తొచ్చింది! అశ్విన్ ఇప్పటికీ ఆట పట్టిస్తాడు – “వాడికి ఇంజనీరింగ్‍లో కేంపస్ ప్లేస్‍మెంట్ వస్తే హ్యుండైలో, నీ సిట్టింగ్స్ ఆయ్యాకా, వెళ్ళి వెయిట్ చేసి, కార్లో ఇంటికి తెచ్చేసేదానివి, కంపెనీ బస్ ఎక్కనిచ్చేదానివి కావు! ఇప్పుడు ఎం.ఎస్.లో జాయిన్ అవడానికి వెళ్తే, ముందుగా వెళ్ళి, ఎయిర్‍పోర్ట్‌లో రిసీవ్ చేసుకుని, వాడి ఎక్కడా కల్చర్ షాక్ కొట్టనీకుండా, నీ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళి సాంబార్ అన్నం పెట్టించావు! వాడి కాన్వకేషన్‍కి వెళ్ళి, డీన్‍తో నువ్వూ పక్కన నిలబడి ఫొటో తీయించుకున్నావ్! వాడితో ఇంటర్వ్యూకి కూడా వెళ్ళి జాబ్ వచ్చాకా, ఇండియా వచ్చావ్… ఇంకా నీకు చిన్న పిల్లాడే వాడు!” అని.

కాన్వకేషన్ అయిన తెల్లారి రేలే లోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. సౌరేష్ వాళ్ళ అమ్మా, అమ్మమ్మా కూడా వచ్చారు. వెంకటేశ్వరుడికి మూడు డాలర్లు వేసి దణ్ణం పెట్టాను – ‘బ్యాంకులో డబ్బులు నిల్ అయిపోయేలోగా వీడికి జాబ్ వచ్చేట్లు చెయ్యి స్వామీ, లేదా నాతో వెనక్కి తీసుకుపోవలసి వస్తుంది! అలా జరగనివ్వకు’ అని. సౌరేష్ వాళ్ళ భాష చూసి పూజారి “మీరు తమిళియన్సా?” అంటే, వాళ్ళకి చాలా కోపం వచ్చింది. “మేం దా తెలుంగు వాళ్ళం… అచ్చ తెలుగుందాం పేసి పూడుస్తాం…” అన్నారు. పెద్ద జోక్ ఏంటంటే, క్రిష్ణ “వాళ్ళతో డమ్ షెరాడ్స్ గేమ్ ఆడుకో, నీకు తోస్తుంది” అనేవాడు. “వాళ్ళ మాటే నాకు అర్థం కావడం లేదు, సినిమా పేర్లు ఎలాగురా?” అంటే, “ఏక్షన్స్ బాగానే చేస్తారేమో” అన్నాడు. నాకు బాగా నవ్వొచ్చింది.

క్రిష్ణకి X.P.O. Logistics అనే సంస్థలో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అది రిచ్‌మండ్‍లో. 3 గంటలు కార్లో వెళ్ళాలి, ప్రొద్దుట పది గంటలకి ఇంటర్వ్యూ అంటే 6 గంటలకే లేచి తయారయ్యి, 6.30 కల్లా ఇద్దరం కార్ రెంటల్‍కి తీసుకుని ప్రయాణం అయ్యాము. వాన పడ్తోంది. “నేను ఎందుకురా?” అని క్రిష్ణతో అంటే, “నువ్వు నా లక్కీ చామ్‍వి, రావాలి” అన్నాడు. మేం రిచ్‍మండ్ రీచ్ అయ్యేసరికి 9.30 అయింది. మెక్‌డోనాల్డ్స్‌లో బర్గర్ తిని, కాఫీ తాగి, ఆఫీస్‌కి వెళ్ళాం.

నేను కార్ లోనే కూర్చున్నాను. వాడు లోపలికి వెళ్ళాడు. షిర్డీ బాబాని నేను, “ఆ ఉద్యోగం వాడికి తప్పక రావాలి, నేనింకా ఇరవై రోజులు అమెరికాలోనే వుంటాను. ఆలోగా శుభవార్త వినాలి” గట్టిగా వేడుకున్నాను. ఓ గంటకి క్రిష్ణ వచ్చాడు. “బాగా చేసావా?” అంటే నవ్వాడు.

వాడితో యూనివర్సిటీ కాంపస్ అంతా తిరుగుతూ, వాడు ఫొటోలు తీస్తుంటే, తీయించుకుంటూ, రోబోటిక్స్ లైబ్రరీలో రోబోలని చూస్తూ, కేంపస్ లైఫ్ ఎంతో ఎంజాయ్ చేసాను. పిల్లలతో అలా ఒంటరిగా గడిపే టైమ్ దొరికితే వదులుకోకూడదు… అందుకే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను! పెళ్ళయి, ఉద్యోగాల వల్ల వలసపోయే వాళ్ళతో వెళ్ళి వుండడం, ముందు ముందు, వయసు వల్ల కుదరకపోవచ్చు, కుదిరినప్పుడే వెళ్ళాలి. పిల్లలతో కలసి ఆనందంగా గడిపే క్షణాలు స్వర్గాలు! అంత కన్నా సౌక్యం వేరొకటి వుండదు! “అమ్మా షూస్ లేస్ నేను కడ్తాను, చెవుల్లో గాలి వెళ్తుంది, కాప్ పెట్టుకో, ఇక్కడ ‘బక్‌లావా’ అనే స్వీట్ బావుంటుంది, తిను” – ఇలా చూసుకుంటుంటే, మనం చిన్నప్పుడు వాళ్ళకి షూస్ వేసి, తల దువ్వి, యూనిఫార్మ్ వేసి స్కూల్‌కి దిగబెట్టడం… వాడికి అప్పుడు లోకంలో ప్రతీది విచిత్రంగా వుండడం, మనం విడమర్చి ఈ లోకాన్ని పరిచయం చేయడం గుర్తొచ్చేవి! ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర బటన్ నొక్కి రోడ్ ఎలా దాటాలో; వాల్‌మార్ట్‌లో, కాస్టికోలో ఎలా షాపింగ్ చేయాలో, బిల్ ఎలా పే చేయాలో, కార్ రెంటల్‍కి తీసుకునేటప్పుడు ఫొటోస్ తీసి కండీషన్ వాళ్ళకి చెప్పడం, రిటర్న్ ఇచ్చేటప్పుడు మళ్ళీ అలాగే చేసి, ముందు నుండే వున్న స్కార్స్ అవీ వాళ్ళకి చూపించడం – ఇవన్నీ క్రిష్ణ చేస్తుంటే ఆశ్చర్యంగా నాకు తెలీని లోకాన్ని చూసేదాన్ని!

నేను రేలేలో వుండగా, మా డైరక్టర్ వి.ఎన్.ఆదిత్య, నా సోదరుడితో సమానం, అతను పరిచయం చేసిన చెంగల్వల మూర్తి, మాకు చాలా సాయం చేసాడు. అలాగే చార్లెట్టాలో వుండే జ్యోతిర్యయీ, రఘునాథ్ కొత్తా దంపతులు. నేను వచ్చానని తెలిసి వచ్చి చూసి వెళ్ళారు. మూర్తి ఓ పూట వాళ్ళింటికి తీసుకెళ్ళాడు భోజనానికి. నేను అతని శ్రీమతినీ, పిల్లల్నీ అప్పుడే చూసాను. అంతకు ముందు వెళ్ళినప్పుడు వాళ్ళు లేరు! ప్రత్యేకంగా చెప్పుకోవలసింది, కళ్యాణీ ప్రణీత! ఈ అమ్మాయి కౌముది ద్వారా పరిచయం, వచ్చి నన్ను ఇటాలియన్ రెస్టారెంట్‌కి తీసుకెళ్ళింది లంచ్‍కి. ఓ హేండ్ బ్యాగ్ ప్రెజెంట్ చేసింది. ఇప్పటికీ నేనంటే ప్రాణం పెడ్తుంది.

కళ్యాణీ ప్రణీతతో రచయిత్రి

నాతో చాలా మంది ఫోన్లు చేసి మాట్లాడేవారు రేలేలో ఉండగా. డల్లాస్‍లో నాటా సభ అవుతోందని తెలిసి, “నేనూ వస్తా” అంటే, డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, డా. ఇస్మాయిల్ సుహైల్ పెనుగొండ, అప్పటి తెలుగు లిటరరీ ఛైర్‍కి పరిచయం చేసారు. ఆ అబ్బాయి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని, నా పేరు ఇన్వైటీస్‌లో వేయించి, నా దారి భత్యాలు ఇప్పించాడు. నేను వస్తున్నానని శుభాంజలి వెలగా అనే ఆవిడ, ‘పెళ్ళి చూపులు’ బ్యూరోకి ఆహ్వానించింది. అలాగే ఇంకో ఇద్దరు వాళ్ళ ఫోరమ్స్‌కి ఇన్వైట్ చేసారు.

(సశేషం)

Exit mobile version