జీవన రమణీయం-190

5
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]డా[/dropcap]లస్‍లో కూడా కన్వెన్షన్ సెంటర్‍లోనే వున్న హోటల్‍లో మంచి రూమ్ ఇచ్చారు. విండో లోంచి వ్యూ చూస్తే డాలస్ నగర శోభ, ఎడ తెగక పారే ఏరు లాంటి కారుల బారులూ, భలే బావున్నాయి!

హోటల్ కిటికీ నుండి డాలస్ నగర శోభ

నాకు చిన్నప్పటి నుండీ స్టార్ హోటల్స్‌లో వుండాలని వుండేది. అసలు సినిమా ఫీల్డుకి వచ్చాకా, ఎక్కడికి వెళ్ళినా, మంచి హోటల్ ఎకామిడేషన్ ఇస్తారు. కానీ పెళ్ళి అయ్యాక మొదటిసారి మావారు స్టార్ హోటల్స్, కనీసం 3 స్టార్స్ వుండేట్లు చూసి, నన్ను ‘Make My Trip’ యాప్ ద్వారా ఇండియాలో అటు కన్యాకుమారి నుండి ఇటు సిమ్లా మనాలీ దాకా తిప్పారు. ఎంత మంచి పర్యాటక ప్రదేశం అయినా, “మీరు వెళ్ళండి, నేను హోటల్ రూమ్‍లో వుండి రాసుకుంటాను” అనేదాన్ని! అంత ఇష్టం హోటల్స్.

ఇంక ఇంటర్నేషనల్ ట్రిప్స్‌లో మలేషియాలో, అమెరికాలో తానా, ఆటా, నాటా లకి వచ్చినప్పుడు అద్భుతమైన ఎకామిడేషన్‍ ఇస్తారు. మా షూటింగ్స్‌కి అవుట్‌డోర్ వెళ్తే సరే సరి! కానీ నేషనల్ జ్యూరీ, ఇంటర్నేషనల్ జ్యూరీస్‌లో వెళ్ళినప్పుడు ఢిల్లీలో అశోకా హోటల్‍లో నెల రోజులున్నా. ఇంటర్నేషనల్ జ్యూరీకెళ్ళి బెంగుళూరులో 10 రోజులున్నాను. మా క్రిష్ణ నేను వెళ్ళగానే ‘హిల్టన్ హోటల్స్’లో బుక్ చేసి, లాగ్ వేగాస్, లాస్ ఏంజిల్స్ లాంటివి ప్లాన్ చేసేవాడు! సో… నాకు అంత ఇష్టం హోటల్ రూమ్స్ అంటే!

కానీ, నాటా కొచ్చాను కాబట్టి, త్వరగా తయారయి, బయటకొచ్చి కన్వెన్షన్ సెంటర్‍కి వెళ్ళే బస్ ఎక్కాను. డాలస్ నగరంలో ఇలాంటి లిటరరీ తెలుగు ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు, అచ్చు మా హైదరాబాద్‍లో చిక్కడపల్లిలో నిలబడ్డట్లు వుంటుంది! అంతమంది తెలుగువాళ్ళూ, తెలిసినవాళ్ళూ వచ్చి పలకరిస్తుంటారు.

నాకు ఎవరో అడ్డుగా నిలబడడంతో తలెత్తి చూస్తే వంగూరి చిట్టెన్‌రాజు గారు. ఆనందంగా పలకరించాను. ఆయన డాలస్ క్వీన్ విక్టోరియా సమేతుడై వచ్చారు, అంటే ఆయన శ్రీమతి గిరిజ గారితో కలిసి. ఆయన రెండవ కుమార్తె పెళ్ళయి డాలస్‍లోనే వుంటుంది. మనవరాళ్ళు కూడా ఇద్దరు. దానితో చీటికీ మాటికీ డాలస్ రావడం తాతయ్యా, అమ్మమ్మలకి పరమానందం కదా!

చాలామంది అమ్మాయిలొచ్చి, ‘నా కాలమ్ దాటని కబుర్ల’నీ, కౌముదినీ, కిరణ్ ప్రభ గారినీ కలిపి పలకరించేసారు!

పెళ్ళిపందిరి శుభాంజలి వెలగా గారితో రచయిత్రి

ఈ లిటరరీ మీట్‌లో నాకు చివుక్కుమన్న విషయం, ఓ రచయిత – కమర్షియల్ నవలా రచయితలకి సాహిత్యంలో అస్సలు చోటు లేదన్నట్లు మాట్లాడాడు! జనతా క్లాస్‍లో లేకపోయినా, మా ప్రైవేట్ బిజినెస్ క్లాసులు మాకుంటాయి కదా! అసలు సాహిత్యంలో మా యద్దనపూడి సులోచనరాణి గారికీ, యండమూరి వీరేంద్రనాథ్ గారికీ, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారికీ చోటు లేకపోతే, మా తరంలో రచయితలం చాలావరకు తయారయ్యేవాళ్ళమే కాదు!

I hurted… పక్కనే వున్న వంశీ రామరాజు బాబాయ్, “నువ్వు రంగనాయకమ్మ గారిలా పోట్లాడ్తున్నావ్… సిద్ధాంతాలు అంటూ” అన్నారు. అవును… ఆవిడ సైతం నాకు మార్గదర్శకం, రచనల్లో. ఆవిడ పేరు కూడా ఎత్తకపోవడం ఎంత దుర్మార్గం? అసలు ఆంధ్రదేశంలో ‘బలిపీఠం’, ‘స్వీట్ హోమ్’ చదవని వాళ్ళుంటారా? ‘బారిస్టర్ పార్వతీశం’ అయినా మా తరానికి ఆలస్యంగా తెలిసింది కానీ, ‘స్వీట్ హోమ్’లో విమలా బుచ్చిబాబూ ఇంటింటి పాత్రలు కదూ!  మావారు మొదటి ప్రేమలేఖలో ‘ర’ ఒక లైనులో, ‘మణి’ ఒక లైనులో రాస్తే… “నా పేరు చీల్చి చెండాడుతావా బుచ్చీ?” అంటూ, విమల ఇన్‌స్పిరేషన్‌తోనేగా – నేనూ చీల్చి చెండాడినదీ!

నాటా సాహిత్య వేదిక

పెద్దవాళ్ళని, తమ పనులు తాము చేసుకోలేని దూరపు బంధువు ముసలమ్మకి విమల చేసిన సపర్యలు చూసాకేగా, అమ్మమ్మని వారానికి ఓ తలంటు పోసి, రోజూ నూనె రాసి తల దువ్వి, జడ వేసి, చీర కట్టి, పెరాల్సిస్ వచ్చాకా, నా దగ్గర పెట్టుకుని చూసుకున్నదీ! ముఖ్యంగా మన పిల్లలకి, పసితనంలో ఇలా అమ్మమ్మలూ, ముత్తవ్వలూ ఇంట్లో వుండడం తెలిసి రావాలి! ముత్తవ్వ మంచం హాల్లో వేయడం షోకి అడ్డు… మూలన పడెయ్యాలి… అనే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం! ఇంటికి పెద్దవాళ్ళు పార్వతీ పరమేశ్వరుల్లాగా… వాళ్ళు ముందు గదిలోనే వుండాలి! మా కింద ఇంట్లో, ఎంటర్ అవగానే, హాల్లో కిటికీ దగ్గర మంచం వేసుకుని మా ఆడపడుచు, పెద్దావిడ పడుకుంటారు. గేట్ తెరుచుకున్నా, మెట్లు ఎక్కి ఎవరయినా పైకి మా దగ్గరకి రావాలన్నా, “ఎవరూ? ఏం పని మీద?” అన్న సెక్యురిటీ క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేసే రావాలి! ఆ మంచం గదిలో వేసుకోండి, సోఫా సైడ్‌కి కాదు, మధ్యలో ఉండాలి అని నేను అనను! అలాగే మా ఇంట్లో దీవాన్ తలుపుకి ఎదురుగా వుంటుంది. అమ్మ దాని మీద పడుకుని, బాబా పారాయణ చేస్తూ వుంటుంది!

వచ్చిన వాళ్ళు ఈవిడ పలకరింపులకీ, కుశల ప్రశ్నలకీ జవాబులు చెప్పే లోపలికి రావాలి! నా కోసం వచ్చిన వాళ్ళు ఈవిడకి ఫాన్స్ అయిపోతూంటారు. “మీరు మాట్లాడ్తూ వుండండి, కాఫీ తాగి. నేను వేడిగా బంగాళాదుంప వేయించి, పప్పు చారు పెట్టేస్తా. నిన్న వెలగపండు పచ్చడి కూడా చేసాను. నాలుగు గుమ్మడి వడియాలు వేయించుకున్నాం అంటే పులుసులోకి, అమోఘంగా వుంటుంది” అంటూ, “తినొచ్చాం, బాబూ” అని ఎదుటివాళ్ళు అన్నా వినిపించుకోదు!

ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్ళాను అనుకుంటున్నారా? డాలస్‍లో జరిగిన సాహిత్య సభకీ, అమ్మ చేతి వంటకీ ఏమిటి సంబంధం అంటే… ఇదే సాహిత్య ప్రయోజనాలు… పెద్దవాళ్ళకి ఆప్యాయంగా, వారు మనకిచ్చిన ప్రేమకి ప్రతిగా, ఎలా సేవలు చేసి చూసుకోవాలి? సేవ చేయించుకునే స్థితిలో లేకపోతే ఎలా వారి ఇష్టాలని గౌరవించి, వారికి నచ్చినట్లు వారు వుండేలా చూడాలీ? ఇవన్నీ మేం పుస్తకాలు చదివే నేర్చుకున్నాం. అవి కమర్షియల్ నవల్స్ అని వీళ్ళు తేలిగ్గా తీసే పారేసే సాహిత్యం నుండి! అసలు ‘మీనా’, ‘సెక్రటరీ’, ‘జీవన తరంగాలు’ లలో ఎంతటి ఆత్మాభిమానం వుందీ ఆడపిల్లలకి? తమ కాళ్ల మీద తాము నిలబడాలని ఎంతటి తపన? గొప్పవాళ్ళు ఎలా బ్రతుకుతారో చెప్పడం వల్ల, ఎవరికైనా గొప్పగా బతకాలని అనిపిస్తుంది కదా! ‘గొప్పగా’ అంటే పడవంత కారులో, లంకంత బంగళాల్లో వుండడం కాదు, ‘ప్రేమ’. ఎదుటివారి కోసం ఏమైనా చేయడం, అదే ఎదుటివారి నుండి ఆశించడం… సున్నితమైన భావాలు, గాయపడడాలు, అపార్థాలు, తిరిగి వాటిని సవరించుకుని బ్రతుకు వీణపై గమకాలు పలికించుకోడాలు… ఎన్నెన్ని ప్రేమ నవలలు చదివాం? థ్రిల్లర్స్, టెక్నాలజీ, క్రైమ్, లాజిక్స్, సరదా కబుర్లూ, ఇవన్నీ నవలల్లో యండమూరీ, మల్లాదీ రాస్తే, తొమ్మిదో తరగతి నుండీ కళ్ళూ, నోరూ విప్పార్చుకుని చదివాంగా! అసలు మా అమ్మమ్మ కోసం నేను చదివి వినిపించిన ‘శరత్ చంద్ర చటర్జీ’ నవలలు – బడదీదీ, దేవదాసూ, తోడికోడళ్ళూ, పరిణీతా – వీటిని మించిన కమర్షియల్ నావెల్స్ వున్నాయా? లేట్‍గా చదివినా, లేటెస్ట్‌గా రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారి నావెల్స్‌లో కమర్షియాలిటీ తక్కువా? జనంలోకి ఎంత బాగా చొచ్చుకుపోతే అంత కమర్షియల్ నవల! ఆ నవల సేల్స్ అంత బావున్నట్లు లెక్క!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here