[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]
[dropcap]”ఈ [/dropcap]రమణీ ప్రభాకర్ గారు నోట్‍బుక్‌లో ఈ నవల రాసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. ఆ రాత్రి పేజీలు తిప్పుతుంటే చాలా ఆసక్తిగా అనిపించి, మొత్తం చదివేశాను. నా కళ్ళమ్మట నీళ్ళు కారి చెంపల మీదుగా జారుతుండగా, జయంతి అనే స్టూడెంట్ వచ్చి “ఏమయింది? ఆ కన్నీరేమిటి?” అని అడిగింది.
“మన తెలుగువాళ్ళలో ఇంతటి ఘనకీర్తి కలిగిన త్యాగమూర్తులు వున్నారని మనకి తెలినే తెలీదు. వీరి పేర్లు చరిత్రకెక్కలేదు! వీరికి ఎటువంటి లాభం జరగలేదు. ప్రతిపలాపేక్ష లేకుండా ఈ రమణమ్మా, శ్రీహరిరావు దంపతులు జీవితం అంతా దేశభక్తితో ప్రజాసేవ చేశారు. వీరికి ఈ పుస్తకం వేయించడం చంద్రునికో నూలుపోగు” అన్నారు.
అంతా చప్పట్లు కొట్టాకా, “ఈ రమణీ ప్రభాకర్ నా దగ్గర కొచ్చి ఈ స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళాక నేను విజయవాడ పబ్లిషర్‍కి ఇద్దామని వెళ్తూ వుండగా, ఓ సంఘటన జరిగింది. కారు దారిలో ఆపి ఓ చోట కాఫీ తాగాము…”
“మళ్ళీ కారెక్కి చాలా దూరం వచ్చేశాక చూచుకుంటే ఆ స్క్రిప్ట్ అక్కడే వదిలేసినట్టు గుర్తొచ్చింది. మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళి వెతికాం… అయినా దొరకలేదు. ఈ సంగతి ఆవిడకి చెప్పడానికి భయం వేసీ….” అని ఆయన ఆపగానే, షాక్‍లో చూస్తున్న నేనూ… లలితా… అందరం ‘ఆఁ’ అని అరిచేశాం.
ఆయన మళ్ళీ కొనసాగిస్తూ, “మీరు ఉత్తమ పురుషలో కాకుండా తృతీయ పురుషలో రాయండి… బావుంటుంది” అన్నాను. ఆవిడ ఏం విచారించలేదు, భయపడలేదు. వెంటనే ధీమాగా ‘నేను రాస్తాను’ అన్నారు. ఐదు రోజులలో ఈసారి ఇచ్చిన స్క్రిప్ట్… ఇది వరకటి దానికన్నా ఎంతో బాగా వచ్చింది” అనగానే వింటున్న వాళ్ళంతా గట్టిగా ఆపకుండా క్లాప్స్ కొడుతూనే వున్నారు.
నేను మాత్రం ఇంకా షాక్ లోనే వున్నాను. మా అయన కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుకున్నారు…
వీరేంద్రనాథ్ మళ్ళీ “ఈవిడ రచన చదువుతుంటే, సిన్సియర్‍గా కమర్షియాలిటీతో నిజాలు చెప్పినట్టుగా వుంది. ఓ పదిహేను సంవత్సరాలు నాకన్నా ముందుగా పుట్టి వుంటే… నాకు గట్టి పోటీ ఇచ్చేదేమో” అన్నారు. నన్ను యద్దనపూడి సులోచనారాణి గారితో కూడా పోల్చారు. నాగేశ్వరరావుగారు నవ్వుతూ నా వైపు చూసి, “అంత రైటర్ కావాలి” అన్నారు.
మా బంధువులంతా నాగేశ్వరరావుగరికీ అమ్మమ్మకీ పూలమాలలూ, ఆయనతో ఫోటోలూ, ఒక ఇంట్లో ఫంక్షన్‌లా జరిగింది ఆ ఉత్సవం. అలా లీడర్ సభ నిర్వహించిన ఘనత యండమూరి వీరేంద్రనాథ్ గారిదీ, అభినందన భవాని గారిదీనూ!
నాగేశ్వరరావు గారు వెళ్తూ నాతో “ఒకసారి కలుద్దాం అమ్మా… నేను కబురు చేస్తాను” అన్నారు. నేను ఎంతో ఆనందపడినా, అలా అందరితోనూ అంటారల్లే వుంది పెద్దవాళ్ళు అనుకున్నాను.
కానీ నా ఆలోచన వమ్ము చేస్తూ ఆయన ఫంక్షన్ జరిగిన తెల్లారి, మా సాయి బాబాయ్‍కి ఫోన్ చేసి (బాబాయ్ వంశీ సంస్థ వల్ల ఆయనకి బాగా తెలుసు), “మీ అమ్మాయి రమణీ ప్రభాకర్‍ని ఒకసారి ఇంటికి రమ్మనండి… వాళ్ళయన ఫోన్ నెంబరు నాకు ఇవ్వండి” అని చెప్పారట.
నేను మా అమ్మ వాళ్ళింట్లో వుండగా మధ్యాహ్నం మా బాబాయ్ ఇంటి దగ్గరగా వుండే మా మా మావయ్య గారు (మా వదిన జయశ్రీ తండ్రి) బస్సులో ఎండన పడొచ్చి, “అమ్మా నిన్నూ ప్రభాకర్‍నీ నాగేశ్వరరావు గారు తన ఇంటికి రమ్మన్నారట. సాయి భాస్కర్ చెప్పాడు” అని శుభవార్త మోసుకొచ్చారు.
పిల్లలకి అన్నం పెడ్తున్న నేను ఆయన చివరగా అన్న మాటలు నిజమే అని తెలుసుకుని థ్రిల్ అయిపోయాను. ఇంటిల్లిపాదీ ఇంకా ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగలేదు.
మరునాడు మా ఆయన ఆఫీసుకి ఫోన్ చేసి “ప్రభాకర్ గారితో మాట్లాడాలి” అన్నారట. “మీరెవరని చెప్పాలి?” అంటే, “అక్కినేని నాగేశ్వరరావు, ఫిల్మ్ ఏక్టర్ అని చెప్పండి” అన్నారట!
ఫోన్ తీసిన అబ్బాయికి ముందు రోజు పుస్తకావిష్కరణ సభ గురించి తెలుసు కాబట్టి నమ్మాడు.
“ప్రభాకర్… అక్కినేని గారి ఫోన్” అని సెక్షన్‍లో అరిచి చెప్పాడుట. ఈయన మొదట నమ్మకపోయినా… తర్వాత “వెళ్ళు… ఫోన్ తీసుకో… ఆయన ఎదురు చూస్తున్నారు..” అని ఆ అబ్బాయి అంటే, నిజమేనని తెలుసుకుని ఫోన్ తీసి “సార్… నమస్తే…” అన్నారు.
ఆయన అవతలి వైపు నుంచి “పని వేళ యందు అసౌకర్యం కలిగిస్తే క్షమించండి… మిమ్మల్ని ఇద్దరినీ మా ఇంటికి ఆహ్వానిద్దాం అని ఫోన్ చేశాను. నా ఫోన్ నెంబరు రాసుకోండి… ఇది నా పర్సనల్ నెంబర్. రమణీ ప్రభాకర్‍కి ఇవ్వండి..” అన్నారుట.
మా ఆయన ఆదివారం వస్తాం అని ఎన్నో కృతజ్ఞతలు చెప్పి పెట్టేశాక, సెక్షన్‍లో ఓ చిన్న పండగే అయిందట!
ఆ తరువాత నేను ఆయన పర్సనల్ నెంబర్‍కి ఫోన్ చేసినప్పుడు, అడ్రెస్ చెప్పారు.
“మీ ఇల్లు ఎలా తెలుసుకోవాలి” అన్న నా ఫూలిష్ ప్రశ్నకి “గుడిసెల వెంకటస్వామి గారి ఇంటి పక్కన… ఆయన చాలా ఫేమస్” అన్నారు అల్లరిగా!
(సశేషం)