[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]
[dropcap]నా[/dropcap]గేశ్వరరావుగారు అలా అంటే నేను “మీ కన్నా ఫేమసా ఈ తెలుగు దేశంలో?” అని అడగద్దూ? ఊహూ. అప్పటి అమాయకత్వంలో ఏం తెలీదు. “సరే” అన్నాను.
మా ఆయనకి చెప్పాను. కొత్తదని ఓ కాటన్ శారీ కట్టుకుని వెళ్ళాను. అమ్మ 300/- పెట్టి కొంది ఏదో పండక్కి. అసలు వెళ్ళడానికి ఎంత భయమో. జూబ్లీ హిల్స్ అంటే అదేదో దేవతలుండే ప్రదేశం… కారెక్కడం గొప్పవాళ్ళే చెయ్యాలీ… ఫ్లయిట్ ఎక్కడం అసలు ఈ జన్మలో లేదూ అనుకునే రోజులవి!
నాగేశ్వరరావుగారి దగ్గరకు వెళ్తున్నాం అని ఎవరికీ ఆ రోజు చెప్పలేదు, మా అమ్మమ్మకి తప్ప! ఎందుకంటే మేం వస్తాం అంటే మేం వస్తాం అంటారని. అంతిష్టం ఆయనంటే అందరికీ! పిల్లల్ని కూడా తీసుకువెళ్ళలేదు. గొప్పవాళ్ళింట్లో అల్లరి చేస్తారేమోననీ. ఏం పగలగొడ్తారో ఏమో అని!
ఆటో ఎక్కి వెళ్ళాం ఎడ్రస్ వెతుక్కుంటూ. ముందో రూమ్ ఉంటుంది. ఆయన పర్సనల్ పనులు చూసుకునే రాజు అనే కుర్రాడుండేవాడు. తరువాత ఎంత క్లోజ్ అయిపోయాడో నాకు! అసలు పెద్దవాళ్ళు చెప్పినట్టు ‘అమృత ఘడియలు’ అనేవి ప్రతిరోజూ ఉంటాయి… అక్కినేని నాగేశ్వరరావుగారిని నేను చూసిన ఘడియలు అలాంటివి. ఆయన ఇంటి గడప మొదటిసారి తొక్కేడప్పుడు ఈయనతో నాకు ఆత్మీయబంధం ఏర్పడుతుంది… ఎప్పుడంటే అప్పుడు “నేను వస్తున్నా” అని ఫోన్ చేసి వెళ్ళిపోయే స్థితి వస్తుందీ అని అస్సలు అనుకోలేదు. అదిరే గుండెలతో, ఎంతో భయంగా, కొత్త కాటన్ చీరలో బిత్తర చూపులు చూస్తూ వెళ్ళాను.
అసిస్టెంట్ లోపలికి వెళ్ళి మేం వచ్చాం అని చెప్తే, కొంతసేపటికి ఆయనే బయటకొచ్చి “రండి.. రండి… ఇల్లు వెతుక్కోడం కష్టం కాలేదు కదా!” అన్నారు చిలిపిగా నవ్వుతూ.
నేను ఆయనకి తలూపుతునే హాల్లో ఆయన ఎవార్డ్సునీ, ఆయన ఆడవేషం ఫొటోని చూస్తూ వుండిపోయాను.
ఆయన ఆ ఫొటో తీసుకొచ్చి నా చేతిలో పెట్టి “ఇదిగోండి రమణీ ప్రభాకర్ గారూ! ఆ అమ్మాయి మీకన్నా అందంగా వుందని ఈర్ష్య పడకండేం?… మా అమ్మకి ఆడపిల్లలు లేరు. అందుకే తన ముచ్చట నా మీద తీర్చుకునేది! అదే నాకు జీవనోపాధి అయి తరువాత అన్నం పెట్టింది” అన్నారు.
ఆయన తల్లి గురించి ఎక్కువగా మాట్లాడేవారు. తరువాత గార్డెన్ లోకి తీసుకెళ్ళి, అక్కడ పూసిన పెద్ద పెద్ద గులాబీలు రెండు కోసి నాకిచ్చారు! అందులో ఒకటి నా డైరీలో ఎండిపోయి మొన్న మొన్నటి దాకా వుండేది.
తన స్వహాస్తాలల్తో మాకు అల్పాహారం, కాఫీ అందించారు. మా ఆయనతో, “ప్రభాకర్ గారిని నేను అభినందించాలి… ఏ కళైనా భర్త ఒప్పుకోకపోతే భార్య అందులో ప్రగతి సాధించలేదు” అన్నారు. తను ఇండస్ట్రీలో కొచ్చిన కొత్త రోజులూ, తన భార్య అనారోగ్యం, అందుకే ఆవిడ బయటకి రాలేకపోవడం అన్నీ ఆత్మీయంగా చాలాసేపు మాట్లాడారు. నాతో నా భవిష్యత్తులో ఏం చెయ్యాలనుందో అడిగి తెలుసుకున్నారు. రచనని నిర్లక్ష్యం చెయ్యద్దనీ చెప్పి, “ఇలాంటి మనవరాలున్న మీ తాతగారు అదృష్టవంతుడు…” అన్నారు.
ఆయన నా చేతిని పట్టుకుని కరచాలనం చేస్తున్నప్పుడు, ఇంకో నిమిషం పట్టుకుని నవ్వాను.
“ఏమ్మా?” అన్నారు ఆ నవ్వుకి అర్థం చెప్పమన్నట్టు.
“ఈ చేయి సావిత్రినీ, అంజలీ దేవీ, బి.సరోజా, కృష్ణకుమారీ, జమున గార్లని తాకింది కదా!… అందుకే పట్టుకున్నాను” అన్నాను.
“ఇప్పుడు రమణీ ప్రభాకర్‍ని కూడా…” అని మా ఆయన వైపు చూసి, “ఏమీ అనుకోకండి… ఈ పిల్లని చూస్తే కాస్త జోకులెయ్యాలనిపిస్తోంది” అన్నారు. మావారు నవ్వేశారు.
అలా రెండు గంటల పాటు ఎంతో ఆప్యాయంగా రోజూ చూసే వాళ్ళతో మాట్లాడినట్టు ఆయన మాట్లాడుతూ, మా సంసారం, పిల్లలూ, నా టీచర్ ఉద్యోగం, ఈయన ఉద్యోగం, స్థితిగతులూ అన్నీ కూలంకుషంగా తెలుసుకున్నారు.
ఆటోగ్రాఫ్ అడిగితే “కొన్ని జన్మాంతర బంధాలుంటాయి… వారిని ఈ జన్మలో కలిసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది” అని రాసి ఇచ్చారు.
ఆయన నిజంగా అలా ఫీల్ అయ్యారంటే మాత్రం అది నా పూర్వజన్మ సుకృతం! ఎందుకో అది నిజమే అనిపించింది. తరువాత తరువాత ఆ బంధం బలపడి, ఇండస్ట్రీలో నాకొచ్చిన చిక్కులను ఆయన తీర్చారు. మా పెద్దమ్మ కొడుకు కొడుకుకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయితే ఆయన ఎప్పుడు నిమ్స్‌లో అర్జెంటుగా రూమ్ కావాలన్నా ఇప్పించారు! ఓసారి ఆయనే స్వయంగా వచ్చి మరీ “పేషంట్‍ని చెట్టు క్రింద పడుకోపెట్టారన్నారు. రూమ్ త్వరగా ఇవ్వరా?” అని ఎడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‍ని కేకలేశారు.
మధ్యాహ్నాలు నాతో కబుర్లు కూడా చెప్పేంత స్నేహం అయింది మాకు! మా ఇంట్లో ప్రతి శుభకార్యానికీ నేను పిలిస్తే వెంటనే వచ్చేవారు.
“నేను మీకు ఏం ఇవ్వగలనూ? మీరు – మేం డబ్బులు తీసుకుని నటిస్తుంటే, ఉత్తి పుణ్యాన బోలెడు ప్రేమిస్తారు, అభిమానం కురిపిస్తారు… ఈ ఇళ్ళూ వాకిళ్ళూ, కార్లూ అన్నీ ఆ అభిమానం ఇచ్చినవే! వాటికి బదులు తీర్చుకోలేం… అందుకే నేను మాత్రం ఎవరు ప్రేమగా పిలిచినా వారిళ్ళకి వస్తాను” అనేవారు.
ఇంతకీ ఎ.ఎన్.ఆర్.ని చూసి ఇంటికి రాగానే, మొదట అమ్మమ్మ ఒళ్ళంతా చెవులు చేసుకుని తన అభిమాన హీరో ఏమన్నాడో చెప్పించుకుని వింది. తరువాత మా అమ్మ. అందరికీ ఆ ‘లీడర్’ ఆయన ఏక్ట్ చేసి సినిమాగా తీసేస్తారేమో అన్నంత అమాయకపు ఆలోచనలుండేవి.
మా లలితా, సుశీలా, మిగతా మిత్రులూ కూడా అన్నీ చెప్పించుకుని విన్నారు.
(సశేషం)