జీవన రమణీయం-23

0
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]చ[/dropcap]తురలో ‘తృప్తి’ ప్రచురితమైంది.

ఆ ఊపులోనే ‘మధురమైన ఓటమి’ అనే నవల రాశాను. ఆ నవలలో ప్రతీ పేజీలో ఎన్నో కొటేషన్స్ వుంటాయి. అందులో చాలా వరకూ నేను స్వంతంగా రాసిన కొటేషన్సే! ఎందుకంటే ఆ కాలంలో నా మీద యండమూరి గారి ప్రభావం చాలా వుండేది! ఆయన తన స్వంత కొటేషన్స్ కనిపెట్టి రాస్తూండేవారు.

“ప్రత్యూషం… ఆ రోజు సంక్రాంతి! అప్పటి వరకూ రంకెలు వేసిన చలి తానే మూడంకె వేసి డొంక దారి పట్టింది!”

“నా విషాదాన్ని చందమామ చిలక్కొయ్యకి తగిలించానే… మళ్ళీ ఎలా వచ్చావు వెన్నెలా? అన్నట్టుంది రాత్రి…” ఇలా అన్నమాట.

అవన్నీ నేనెలా రాసి దాచుకున్నానో… అలాగే నేను రాసినవీ అందరూ గుర్తు పెట్టుకోవాలనే అత్యాశ ఎక్కువైంది. దానికి తోడు అద్భుతమైన గురువుగారు దొరికారు. దాంతో ‘మధురమైన ఓటమి’ నిండా ఆ కొటేషన్సే.

“సాధించాలనే తపన ఉంటే సాధించలేనిది ఏదీ వుండదు… మనిషి ఒక్క ధైర్యాన్ని కోల్పోతే, ఇంక కోల్పోడానికి ఏమీ వుండదు… సర్వం కోల్పోయినట్టే!”

“ఉపయోగపడని ప్రశాంతత కంటే, ఉపయోగపడే సంఘర్షణే మేలు!”

“మనుషుల వ్యక్తిత్వాలు తెలిసేది వారి వారి హోదాలని బట్టి కాదు, ప్రవర్తనని బట్టి!”

“సమస్యలు రావడం కూడా మంచిదే… అవి  మనిషిని ఆలోచింపజేస్తాయి”

“విరుద్ధమైన భావాలున్నా ఫరవాలేదు. ఒకేలా స్పందించే మనసుంటే చాలు, మంచి స్నేహితులౌతారు”

“పెద్ద కోట గోడ లాంటి ప్రహరీ, ఎత్తయిన గేటూ, గూర్కా చూస్తే, గొప్పవాళ్ళు తమ కోసం తామే జైళ్ళు నిర్మించుకుంటారనిపించింది”

“ఇక ఒప్పందానికి వద్దాం… సర్దుకుపొదాం అని అందరూ అనుకుని వుంటే ప్రపంచంలో ఇన్ని విప్లవాలు వచ్చేవి కావేమో”

“ఒంటరితనంలో ప్రశాంతత కంటే అలజడే ఎక్కువ”

“ఆహ్లాదకరమైన స్నేహాలు ఆత్మకి ఆహారం”

“కష్టాల్లో వున్నప్పుడు అందరి మొహాలూ నిజాయితీగానే కనిపిస్తాయి”

“అప్పు ఓ సారి జీవితంలోకి ప్రవేశిస్తే, తిష్ట వేసుకుని కూర్చునే అతిథి. మనం పని చేసే యజమానికి మన దేహం మీదే హక్కుంటుంది. కానీ అప్పిచ్చిన వాడికి మన గౌరవం మీద కూడా హక్కు!”

“జీవితం విజ్ఞానం చేత నడపబడాలి, ప్రేమ చేత ప్రకోపింపబడాలీ” అన్ని నమ్మే ధృతీ; “జీవితం డబ్బు చేత నడుపబడుతుందీ, అవసరం చేత ప్రకోపింపబడుతుందీ” అని ఇప్పుడు తెలుసుకుంది!

ఇలా ఎన్నో స్వంతంగా కల్పించి, ఆలోచించి రాసి, ఆ నవల సబ్జెక్ట్ ఆధారంగా “మధురమైన ఓటమి” అని పేరు పెట్టాను.

ఓ యాభై ఏళ్ళ వ్యక్తి… ఓ ఇరవై రెండేళ్ళ అమ్మాయితో “డబ్బే ముఖ్యం మానవీయ సంబంధాల కన్నా అని నిరూపిస్తాను… నువ్వు మానవ సంబంధాలూ, కుటుంబమే ముఖ్యం… అవన్నీ నిజాయితో కూడినవీ అని నిరూపిస్తే నేను ఓటమి నంగీకరిస్తాను” అనడం ఈ కథాంశం.

తల్లీ తండ్రీ, తమ్ముడూ, చెల్లీ, ఓ స్నేహితుడూ ఇవే ప్రపంచంగా పెరిగిన ఓ మధ్య తరగతి అమ్మాయి ధృతి ఈ పందేనికి ఒప్పుకుని ఆయనకి కుటుంబపు విలుపలు తెలియజేయాలనుకుంటుంది!

కానీ డబ్బు ప్రభావంతో ఒక్కొక్క మెట్టే దిగిపోయి, తనవాళ్ళే తనని నిచ్చెనగా చేసుకుని పైకి ఎదగాలనుకుంటే ఓటమి ఒప్పుకుంటుంది.

కానీ ఆ అమ్మాయి జీవితంలో కొచ్చాకా, జీవితపు విలువలు తెలుసుకున్న ధర్మానందరావుగారు, తనే ఓడిపోయానని అనడంతో కథ ముగుస్తుంది!

వీరేంద్రనాథ్ గారికి నా శైలి చాలా నచ్చింది. అది సుధా పబ్లిషర్స్ ద్వారా నవలగా ప్రచురించారు. ఆయన విజయవాడలో ప్రతి సంవత్సరం జరిగే బుక్ ఎగ్జిబిషన్‍కి వెళ్తూ నన్నూ రమ్మన్నారు. ఆయన సెక్రటరీ ఒకావిడ, అప్పటికే వయసులో నాకన్నా చాలా పెద్దావిడ, వల్లభు విజయలక్ష్మిగారు కూడా వస్తానన్నారు. అందరం విజయవాడ వెళ్ళడానికి నిర్ణయం అయింది. అక్కడ నా ‘మధురమైన ఓటమి’ ఆవిష్కరణ కూడా!

నేను ఆ ట్రిప్‍లో మొదటిసారి ‘ఎమెస్కో’లో పనిచేసే లక్ష్మిని కలిసాను. తరువాత అది స్నేహబంధం అయింది. ఇరవై ఆరు, ఇరవై ఏడేళ్ళ వయసులో పుస్తకాలూ, రచయితలూ, వారి చర్చలూ అన్నీ చూస్తుంటే, వింటుంటే అదేదో అద్భుత లోకంలో విహరిస్తున్నట్టు వుండేది! మమ్మల్ని చాలామంది భోజనాలకి పిలిచారు విజయవాడలో…

ఎవరెవరో వచ్చి కలిసారు. సాహిత్య చర్చలూ, సమావేశాలూ… అలా 3 రోజులు నేనూ విజయలక్ష్మి గారూ కలిసి తిరిగాము. గుడికి వెళ్ళి కనకదుర్గని దర్శించుకున్నాం.

ఎగ్జిబిషన్ గ్రౌండ్‍లో వీరేంద్రనాథ్ గారు అద్భుతంగా ప్రసంగించారు. “నేనెప్పుడైనా సభలో అలా మాట్లాడగలనా?” అనుకునేదాన్ని.

ఇంటికొచ్చేసరికి పిల్లలు పరిగెత్తుకొచ్చి నన్ను చుట్టేసుకున్నారు. మా అత్తగారు వాళ్ళని కంటికి రెప్పలా చూసుకునేవారు నేను లేకపోతే!

అమ్మమ్మని అమ్మ తీసుకెళ్ళి హుడా కాంప్లెక్స్‌లో అన్నయ్య ఇంట్లో పెట్టింది.

మా అయనకి జహీరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయింది. పిల్లలు చిన్నవాళ్ళు. కొత్త కాలనీ. డాక్టర్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ఈయన కూడ వూళ్ళో వుండడం లేదు! అందుకని అమ్మమ్మని పంపించాల్సొచ్చింది. అందుకు ఇప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను… ఎందుకంటే ఆవిడకి నా ఇంట్లో వుండడం చాలా ఇష్టం!

నేను రాసిన లీడర్ తర్వాత మా అత్తగారికి ‘మధురమైన ఓటమి’ చాలా చాలా నచ్చింది. ఆవిడ “ఇలాంటి నవలలే రాయి… పిచ్చి పిచ్చివి రాయకు” అన్నారు. ఆ తరువాత ఎప్పుడూ తన చిన్నతనం, తన కుటుంబంలోని రాజకీయాలూ అన్నీ చెప్తూ, “అలాంటి పల్లెటూరి కథకొటి రాయకూడదూ?” అన్నారు.

మా అత్తగారు నన్ను ఎప్పుడూ ‘అదీ’ అని కానీ, ‘ఏమే’ అని కానీ అనేవారు కాదు! మా ఆడబిడ్దలిద్దరూ మాత్రం చాలా చనువుగా… ‘అదీ… ఒసేయ్’ అనేవారు. నేను వారి కన్నా చాలా చిన్నదాన్ని. మా పెద్దాడబిడ్డ లలితగారికి నాకూ ఓ ఇరవై ఏళ్ళు వార. వాళ్ళ అబ్బాయి నా వయసు వాడు! రెండో ఆడబిడ్డ కూడా దాదాపు 12 ఏళ్ళు పెద్ద. నా గురించి మా అయనతో మా అత్తగారు “ఆ అమ్మాయి…” అని చెప్పేవారు. ఆవిడ ఎనభై ఏళ్ళావిడని కూడా ‘ఆ అమ్మాయీ’ అని చెప్పేవారు!

యండమూరి గారు స్వహస్తాలతో ఫెయిర్ చేసిన కథ

నా రచనా వ్యాసంగం మంచి వూపు అందుకుంది. ప్రేమ కథల పోటీ కోసం ఆంధ్రభూమిలో నేను ‘ముద్దు’ కథ రాస్తే, యండమూరి గారి చదివి, పోటీకి పంపడానికి ఆ రోజు లాస్ట్ డేట్ అని తనే స్వహస్తాలతో దాన్ని ఫెయిర్ చేసి పంపించారు. దానికి నాలుగో బహుమతి వచ్చింది.

ఆ సంఘటన నేను జీవితంలో మరచిపోలేను! ఆయన ముత్యాల కోవ లాంటి అక్షరాలలో నా కథని చూసుకోవడం, మరపురాని అనుభవం. ఆ తరువాత పెద్ద కథల పోటీలో ‘ఆత్మ కథ’, ఇలా వరుసగా ఏ కథ పంపినా పోటీలో ప్రైజులు కొట్టేదాన్ని!

 

 

***

 

ఒకసారి ఆంధ్రజ్యోతి ఎడిటర్ తోటకూర రఘుగారు ‘చలం శతజయంతి’ ఉత్సవాల సందర్భంగా, ఎవరైనా రచయిత్రి చేత ఓ మంచి నవల రాయించమని వీరేంద్రనాథ్ గారిని అడిగారు. నేను అప్పటికే చలం సాహిత్యం అంతా నూరుకు తాగేశాను!

అందుకని వీరేంద్రనాథ్ గారు నన్ను అడగగానే “దైవమిచ్చిన భార్య” ఇన్‍స్పిరేషన్‌తో ఒక నవల రాస్తానని చెప్పాను. దానికి వీరేంద్రనాథ్ గారు ‘మొగుడే రెండో ప్రియుడు’ అని పేరు పెట్టి, ప్రకటన కూడా నెక్స్ట్ వీకే వేసెయ్యండి” అన్నారు.

నేను అప్పటికప్పుడు రాయడం మొదలుపెట్టాను. మొదటి భాగం ఇవ్వగానే చదివి యండమూరి గారు అడ్డంగా చింపేసారు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here