[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]మా[/dropcap] రెండోవాడు కృష్ణకాంత్, కనిపించని అల్లరి చేసేవాడు. బలపం ముక్కులోకి దూర్చేసుకోవడం, చెవిలోకంటా రబ్బరు దూర్చేసుకోవడం… లాంటివి.
“సుబ్బారావ్” అని పిలవగానే పాపం సుబ్బారావు రాత్రయినా, పగలయినా స్కూటరేసుకుని వచ్చి వీడ్ని ‘ఈఎన్‌టీ’ డాక్టరుకి చూపించేవాడు. పైగా దెబ్బలు తగిలితే అవి కోతిపుండు బ్రహ్మరాక్షసి అయ్యేదాకా చెప్పేవాడు కాదు! నేనే ప్రతిరోజూ స్కూలు నుండి రాగానే కాళ్ళూ చేతులూ అన్నీ పరీక్షించేదాన్ని! పిల్లలు చిన్నప్పుడు నేను రచనా వ్యాసంగం, స్కూలు ఉద్యోగం, ఇంట్లో పనితో చాలా అవస్థలు పడ్డాను.
అప్పుడే నేను టైం మేనేజ్‍మెంట్ నేర్చుకున్నాను. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు. తెలుగు సినీ రచయితల సంఘం కల్చరల్ సెక్రటరీ, నంది జ్యూరీ మెంబర్, సెన్సార్ బోర్డ్ మెంబర్, విమెన్ ప్రొటెక్షన్ సెల్ రచయితల సంఘం చైర్‌పర్సన్, సినిమా సిట్టింగులూ, టీ.వీ. సీరియల్స్, రకరకాల వంటలూ, సినిమా రివ్యూలు, టీ.వి.షోల మీద రోజు కామెంట్స్… వీటన్నింటికీ టైం ఎలా వుంటుందని?
సింపుల్… నేను ప్రయాణాల్లో పుస్తకాలు చదువుతాను. రాత్రిపూట పిల్లలు చిన్నగా వున్నప్పుడు, వాళ్ళు పడుకున్నాకా, మర్నాటి పొద్దుటే వాళ్ళకి బాక్సుల్లోకి ఏం చెయ్యాలో ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకుని పొద్దుట వండేదాన్ని! ఎప్పుడూ పొద్దుట లేవడం నాకు బద్ధకమే… కానీ అర్ధరాత్రుళ్ళు లేట్‍గా పడుకునేదాన్ని! ఆ సరస్వతీ దేవి కటాక్షం వల్ల, రాసిన దానిలో కొట్టివేటలూ, మార్పులూ, చేర్పులూ చాలా తక్కువ! చేసే పనిని దీక్షగా తపస్సులా చెయ్యడం చిన్నప్పటి నుంచి అలవాటు! వంట అయినా అలాగే చేస్తాను. మా అత్తగారి దగ్గర అరిసెలూ, లడ్డూ, బాదుషా, కాజాలు లాంటివి పెళ్ళి అయిన కొత్తలోనే నేర్చుకున్నాను. నాకు మిగతా ఆడపనులు ముగ్గులూ, కుట్లూ, అల్లికలూ లాంటివి రావు!
‘మొగుడే రెండో ప్రియుడు’ సీరియల్‌గా వస్తుండగా, పోస్ట్‌మేన్ నాకొచ్చే ఉత్తరాలన్నీ నేను పని చేసే స్కూలుకే తీసుకొచ్చి ఇచ్చేవాడు. అవి మామూలుగా కాదు, ఒక పెద్ద కట్టగా తెచ్చిచ్చేవాడు! గడిచిన కాలంలో మధురానుభూతులు నేను ఏదైనా మిస్ అయ్యానంటే అవి ‘ఉత్తరాలు’. ఎంత మంచి మంచి ఉత్తరాలొచ్చేవో!
ఒకనాడు మా స్కూలు ఓనర్ పోస్టుమేన్‌ని “అవేమిటి?” అని అడిగాడుట. పోస్ట్‌మెన్ రెడ్డి “మేడమ్ బడా రైటర్ సాబ్… ఫ్యాన్ మెయిల్ హై ఏ!” అన్నాడుట.
నాకా విషయం పోస్ట్‌మేన్ తర్వాత చెప్తే తెలిసింది. స్టాఫ్‌రూమ్‌లో ఒకనాడు మా టీచర్లం అంతా సందడిగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తుండగా, ప్యూన్ ఒక లెటర్ పట్టుకొచ్చాడు. అందులో నా పేరు రాసి ఈ టీచర్ని ఈ రోజు నుంచి ‘టెర్మినేట్’ చేస్తున్నాను అని రాసి వుంది. కింద అతని సంతకం!
నేను టీచర్‌గా నా పని ఏనాడు అశ్రద్ధ చెయ్యలేదు. లెసన్ ప్లానులూ, అన్నీ సక్రమంగా రాస్తాను. పిల్లలకి నేనంటే ఇష్టం! పేరెంట్స్‌కి అభిమానం. ఎవరూ కంప్లయింట్ చెయ్యరు… కానీ ఎందుకు జరిగిందబ్బా అనుకున్నాను… కానీ పెద్దగా బాధపడలేదు. నా బాధల్లా అప్పట్లో లలితనీ, సుశీలనీ రోజూ కలవలేనే అని మాత్రమే. కానీ మా టీచర్లు అంతా ఆల్‌మోస్ట్ ఏడ్చేశారు. లలిత కళ్ళు ఎర్రబడేట్లు ఏడ్చింది. ఆవేశంగా అందరూ ఆఫీస్ రూం లోకి వెళ్ళి “రమణిని ఎందుకు తీసేసారు?” అని అడిగారు. “ఇదర్ కా ఖానా ఖాకే ఉదర్ కా గానా బజారే ఉనో…” అన్నాడట ఆయన.
నేను మాత్రం ఎంతో రిలీఫ్‌గా నా జీతం సెటిల్ చేస్తున్నప్పుడు “మేరే ఆటోగ్రాఫ్ లీజియే సార్… ఫిర్ నహీ మిలేగా!” అని నవ్వుతూ సైన్ చేసి వచ్చేసాను. పోస్ట్‌మెన్ చెప్పిన సంగతి నాకు గుర్తుంది. అతనికి ఈగో కొట్టింది. అందుకే తీసేసాడు. అప్పట్లో వీరేంద్రనాథ్‌గారు అతి దీక్షగా ‘విజయానికి ఐదు మెట్లు’ రాస్తుండేవారు! ఆయన రాస్తున్నవి కొన్ని ఛాప్టర్లు చదువుతూ లైఫ్ అంటే ఏమిటో, పైకి రావాలంటే ఏం చెయ్యాలో నేను శ్రద్ధగా నేర్చుకుంటున్నాను.
‘మొగుడే రెండో ప్రియుడు’ ఏడో వారంలో వుండగా నాకో ఫోన్ కాల్ వచ్చింది. నేను తీసి, “హలో” అనగానే, అవతల నుండి మెటాలిక్ వాయిస్ ఖంగుమంటూ “నమస్కారం… నేనొక చిత్ర నిర్మాతను… నా పేరు కె. ఎస్. రామారావు… మీ ‘మొగుడే రెండో ప్రియుడు’ చదువుతున్నానండీ… చాలా బావుంటోంది” అన్నారు. నాకైతే అప్పట్లో సినిమాల గురించి ఏమీ తెలీదు! “నమస్కారం… మీరెమైనా సినిమాలు తీసారా ఇంతకుముందూ?” అని అడిగాను.
ఆయన కాస్త షాక్ అయినట్టున్నారు. ఓ నిమిషం నిశబ్దం తర్వాత “తీసానమ్మా… ఛాలెంజ్, అభిలాష, రాక్షసుడు, మరణమృదంగం, ముత్యమంత ముద్దు… స్టూవార్టుపురం పోలీస్ స్టేషన్…” అంటూ చెప్పుకొచ్చారు! నేను నోరు తెరిచేసా… ఈ సంఘటన నా దురదృష్టం కొద్దీ లేట్‍గా జరిగింది. ఆ ముందు వారం… నా జీవితంలోనే అతి దురదృష్టకరమైన సంఘటనొకటి జరిగింది.
ఓ రోజు మధ్యాహ్నం ఇంటి ముందు కారాగింది. ఒక పెద్దాయన లోపలికొచ్చి, “అమ్మా నా పేరు కామినేని ప్రసాద్. మీ సీరియల్ చదువుతున్నాను. చాలా చాలా నచ్చేసింది. సినిమా తీయాలనుకుంటున్నాను. అందుకే వచ్చాను…” అన్నారు.
నేను కంగారుపడి మర్యాదలు చేసాను. మా సుశీల సినిమా పేరు వినగానే పరుగున వెళ్ళి కూల్‌డ్రింక్స్ పట్టుకొచ్చింది.
పక్కనున్న వ్యక్తిని ఆయన అల్లుడని పరిచయం చేసారు. వాళ్ళు నాకు పదిహేను వేలకి చెక్ రాసిచ్చి, ఓ కాయితం మీద సంతకం పెట్టించుకుని కారెక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు గుర్తుకి తెచ్చుకుంటే వాళ్ళ మొహాలు కూడా గుర్తుకు రావడం లేదు.
నేను గురువుగారికి ఫోన్ చేసి చెప్తే, “మొత్తం ఎంతిస్తాం అన్నారు సినిమాకి?” అన్నారు. “అడగలేదు” అన్నాను. “అలా చేస్తే ఎలా అండీ” అన్నారు.
తరువాత వారానికే కె.ఎస్. రామారావుగారు ఫోన్ చేసి, “ఈకథ సినిమాగా తీస్తే బావుంటుంది. మీకు అంగీకారమైతే ఓసారి వచ్చి కలవండి” అన్నారు.
నేను చాలా నొచ్చుకుని “కామినేని ప్రసాద్‌గారుట… ఆయన ఎడ్వాన్స్ ఇచ్చారండీ” అన్నాను.
“మీరైతే ఓసారి మా క్రియేటివ్ కమర్షియల్స్ ఆఫీసుకి రండి, ఎల్లుండి ఉదయం” అన్నారు.
(సశేషం)