జీవన రమణీయం-3

    6
    4

    [box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

    నేను కడుపుతో వున్నప్పుడు, మా అత్తగారింటి పక్కన వుండే కామేశ్వరీ వాళ్ళింట్లో ఆదివారం రాత్రి పది గంటలకొచ్చే ‘క్విజ్ టైమ్’ (సిద్ధార్థ బసు ప్రోగ్రామ్) చూసేదాన్ని. చాలా రిక్వెస్ట్ చేసి చూసేదాన్ని.

    వాళ్ళు ఒకటి రెండు సార్లు రానిచ్చి, మూడోసారి “మావారు పడుకుంటారట… టీ.వీ. పెట్టద్దన్నారు” అనేసిందావిడ.

    ఆ రాత్రి నేను చాలా బాధపడ్డాను. అమ్మ మా అత్తగారికి చాలా భయపడ్తూ, నన్ను చూడడానికొచ్చేది. రాత్రి జరిగిన ఈ విషయం నేను కళ్ళనీళ్ళతో అమ్మకి చెప్పాను. అమ్మ ఆఫీసుకి వెళ్తాను అని వెళ్ళినదల్లా కాసేపటికే ‘సాలిడైర్’ టీ.వీ. రిక్షాలో పెట్టుకుని వచ్చింది. అలా అమ్మ నా పాలిటి కల్పవృక్షం అన్నమాట.

    “ఎంత చోద్యం? కూతురు అలా అడగ్గానే ఇలా ఇన్ని వేలు పోసి ఇంత పెద్ద వస్తువు కొంటావా? ఇదేటమ్మా నువ్వు నేర్పించె డబ్బు జాగ్రత్త? పది వేలు ఖర్చు చేశావా?” అని మా అత్తగారు బుగ్గలు నొక్కుకున్నారు.

    అమ్మకి  చీరల మీదా, బంగారం మీదా వ్యామోహం వుండేది కాదు. బిడ్దల ఆనందం మీద తప్ప! అంత నిస్వార్థంగా వుంటుంది. మాకూ అదే నేర్పింది. “ఈ ఆనందాలు డబ్బుతో కొనేవి కావు… పిల్లల కళ్ళల్లో వాళ్ళు ఆశించినవి పొందినప్పటి ఆనందం చూడగలగడం…” అనేది.

    అలా మా ఇంటికి ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ సాలిడైర్ టీ.వీ. వచ్చింది.

    ***

    డిగ్రీ ఫైనల్ యియర్ పరీక్షలప్పుడే అశ్విన్ పుట్టేస్తాడనుకున్నాను! కానీ పరీక్షలు రాయనిచ్చాడు. ఉమకి ఆగస్టు పదిన మదరాసులో ఆదిత్య పుట్టాడు. ఉమ చెల్లెలు విజయా (పి.వి.సింధు తల్లి) వాళ్ళాయన సురేంద్ర స్వీట్స్‌తో వచ్చి చెప్పారు. ఎంతో ఆనందించాను. కాని ప్రాణ స్నేహితురాలిని వెళ్ళి చూడలేని పరిస్థితి! తొమ్మిది నెలలు మనం మోస్తే, ఆ తరువాత ఊళ్ళోవాళ్ళు మోస్తారని, ప్రతివాళ్ళూ అడిగేవాళ్ళు – “రమణమ్మకి ఇంకా పురుడు రాలేదా?” అని.

    మా ఇంటి దగ్గరే ఏరియా హాస్పిటల్. డాక్టర్ దేవయాని ఆవిడ పేరు. నేను అడ్మిట్ అయ్యాకా, చాలామంది వచ్చి ఇట్టిట్టే కని వెళ్ళారు. నాకు మాత్రం నెప్పులు తప్ప పురుడు రాలేదు. నన్ను చూడ్డానికొచ్చిన చుట్టాలతో హాస్పిటల్ కిటకిటలాడింది.

    పెద్ద జోక్, మా అత్తగారొచ్చి, “ఇది గవర్నమెంట్ హాస్పిటల్… అందుకే ఇంత రష్” అనడం.

    మా మావయ్య వాళ్ళింట్లో కాసిన ధనాస గోంగూర కోసుకొచ్చాడు. దాంతో అమ్మమ్మ పెట్టిన పులుసుకూర ముద్ద తినగానే నెప్పొలొచ్చాయి!

    మొత్తానికి పురుడొచ్చి మధ్యాహ్నానికి మగపిల్లాడు పుట్టాడు. అక్కడే వున్న మా పెద్దమ్మ “బాబుది ‘అశ్వని’ నక్షత్రం. అశ్విన్ అని పేరు పెట్టండి” అంది. అంతే అశ్వినీ కుమార్ అని ఫిక్స్ అయిపోయింది.

                

    మా అత్తగారి సంతోషానికి అవధులు లేవు! కాలనీ అంతా లడ్డూలు పంచిపెట్టారు. అశ్విన్ పుట్టడం ఆవిడకి ఏనుగెక్కినంత సంబరాన్నిచ్చింది. మా అమ్మకైతే వాడు నెత్తి మీద దేవుడే! ఆ ముందటేడే మా అన్నయ్యకీ రవిచంద్ర పుట్టాడు. ఇద్దరూ మనవళ్ళే అమ్మకి.

    ఇంటికొచ్చాకా, అమ్మమ్మ మహా పథ్యం. నా ప్రాణానికొచ్చేది. పాత చింత తొక్కు, తెలకపిండి కూర, వెల్లుల్లి కారం పొడి, అన్నం తడిపి పిండితే నెయ్యి కారేట్లు వుండాలి. ఆవిడ చేసిన కాయం నేను తినలేక నానా తిట్లు తిట్టేదాన్ని. రాత్రి పూట అన్నం పెట్టేవారు కారు!

    మా ఆయన వచ్చి కాసేపు ఎత్తుకుని కూర్చుని పిల్లాడ్ని, ఇంటికెళ్ళి స్నానం చేసేవారు. వీడికి మా శ్యామలమ్మ ఒళ్ళు రుద్ది నలుగు పెట్టి స్నానం చేయిస్తుంటే, ‘ఆ నలుపంతా పోయి మా రంగు రావాలి’ అనేది మా అత్తగారు. మా ఆడబిడ్డ ‘లక్స్ సబ్బు పెట్టి రుద్దండే’ అనేది. నా రంగొచ్చిందని వాళ్ళకి వెటకారం! ఈ రంగు పిచ్చి మా అత్తగారికి చివరిదాకా వుండేది పాపం.

    పిల్లాడు వేడి నీళ్ళకి సొమ్మసిల్లి పోతాడని, ఎక్కువగా పోయనిచ్చేదాన్నికాదు. అలాగే కాటుకలూ, దిష్టి చుక్కలూ కూడా మొహమంతా పెట్టనిచ్చేదాన్ని కాదు. అప్పుడు సరిగా పథ్యం చెయ్యకపోవడం, నడికట్టు వేసుకోకపోవడం వల్ల శిక్షలు ఇప్పటికీ అనుభవిస్తున్నాను. మా వదినా వాళ్ళమ్మ, శారదత్తయ్య నెప్పులొచ్చినప్పుడొచ్చినావిడ, నాకు పదకొండో నాడు స్నానం అయ్యేదాక వుంది! నా పథ్యం, పానం చూసేది.

    పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. క్లాసులో పాసయ్యాను. మంచి రోజు చూసి మా అత్తవారింటికి సారె పెట్టి అమ్మ సక్రమంగా పంపించింది.

    అప్పుడే నాలో ఈ సాహిత్యావిర్భావం కలిగింది. మా అత్తగారి దగ్గర ఆరు సిటీ సెంట్రల్ లైబ్రరీ కార్డులుండేవి! ఇంటి నిండా పుస్తకాలే! ఎన్నెన్ని నవలలు చదివేదాన్నో! పిల్లాడు పాలకి ఏడుస్తున్నా నాకు ఒళ్ళు తెలిసేది కాదు! పుస్తకాల పిచ్చి.

    మా అత్తగారు పని దగ్గర నిక్కచ్చైన మనిషి. పని సరిగ్గా లేకపోతే కడిగి పారేసేది. మళ్ళీ ఇద్దరం కూర్చుని నవలల గురించి చర్చించుకునే వాళ్ళం!

    అమ్మ ఆర్.టి.సి.లో ఉద్యోగం ట్రై చెయ్యమంది.

    “నీలాగా నాకు వెనక అమ్మమ్మ లేదు, పిల్లల్ని చూసుకోడానికి” అన్నాను. “సరే, నీ ఇష్టం అంది.

    అసలు మా అమ్మ పెదనాన్న పోగానే, మా పెద్దమ్మ కూతురు వాణక్కకి ఆర్.టి.సి.లో వుద్యోగం వేయించినప్పుడే, “నా అక్క కూతురుకి ఇవ్వండి ఉద్యోగం. నా స్వంత పిల్లలకి అడగను” అని రాసిచ్చేసింది.

    మా మావగారిదో ‘లోకం’. ఆయన ఆసనాలు, ఒంటికి నూనె రాసుకోడం, మజ్జిగలు… అనేక పొడులు చేసి కలిపి నాన పెట్టడం. ఆరోగ్య సంరక్షణార్థం ఇంటి నిండా అశ్వగంథలూ, ద్రాక్షారిష్టాలూ… అనేకం వుండేవి. సమయం చిక్కితే పిల్లాడ్ని పలకరించేవాళ్ళు.

    ఇల్లు సరిపోయేది కాదు! మేం తలుపుఏసుకుంటే, ఎన్నో వస్తువులు ఆయనవి అందులో వుండేవి. నాకూ పసిపిల్లాడికి పాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందైన పరిస్థితి. అప్పుడే భయంకరమైన నీటి ఇబ్బందొచ్చింది కాలనీలో. గుంటల్లో దిగి పట్టుకోవడం, లేదా బోరింగ్ కొట్టుకోవడం!

    ఇంక లాభం లేదని ఇల్లు చూసుకుందాం అని నేనూ మా ఆయనా నిశ్చయించుకున్నాం.

    ఓ రోజు మళ్ళీ పిల్లాడ్ని చంకనేసుకుని అప్పలస్వామి గారింటికి వెళ్ళాను. అంకుల్, ఆంటీ, “అరే.. ఇల్లు మార్పిస్తున్నాం అమ్మా! కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. కానీ నానీ వాళ్ళకి వైజాగ్ నుండి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయింది. ఇక్కడో ఇల్లు కడ్తుంటే మాట్లాడాము. అందులో రెండు భాగాలున్నాయి. ఒకటి మీరు తీసుకోండి. ఎంచక్కా పక్కపక్కనుంటారు” అన్నారు.

    అలా అంబారీ ఇంట్లో మేమూ, నానీ మళ్ళీ పక్క పక్క భాగాల్లో ఆనంద్‌బాగ్‌లో చేరాం. బావిలో నీళ్ళు ఎండిపోయాయి. ఎదురుకుండా పొలాలు వుండేవి. ఆ మోటబావి వాడు మోటర్ వేస్తే పరుగున వెళ్ళి పట్టుకొచ్చుకుని, ఇంట్లో డ్రమ్ముల నిండా, బిందెల నిండా నింపుకోవాలి.

    చెప్పాగా ఏదీ కష్టం, శ్రమా అనిపించేది కాదు! అంతా థ్రిల్లే… ప్రతీ రోజూ సంతోషంగా గడిచేది. మగాళ్ళు వెళ్ళాకా నానీకీ నాకూ నవలల గురించి, నాటకాల గురించీ బోలెడు కబుర్లు! నానీకి ‘అజయ్’ అని ఒక కొడుకు.

    (సశేషం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here