జీవన రమణీయం-31

3
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]అ[/dropcap]మ్మకి అప్పట్లో తక్కువ వయసు వేసి ఆర్.టి.సి.లో ఉద్యోగం వేయించడం వలన మా పిల్లలు పెద్దయినా రిటైరవకపోతే, ఇంకా నల్గొండకి అప్ అండ్ డౌన్ జర్నీ రోజూ చెయ్యడంతో మేం పట్టుపట్టి వాలంటరీ రిటైర్‍మెంట్ ఇప్పించాం. శారీరకంగా అర్భకురాలు. ఓసారి వేడి నీళ్ళు పడి, ఒళ్ళు కాలిపోయీ, మరోసారి ఇంకో ఏక్సిడెంట్లో చాలా రక్తం పోయీ, ఎప్పుడూ చాలా బాధలు పడేది అమ్మ. కానీ అమ్మమ్మ సపోర్ట్‌తో మా ఇంట్లో ఇంతమంది అక్కల పెళ్ళిళ్ళూ, అన్నయల వడుగులు అన్నీ నిర్వహించుకొచ్చింది. మా పెద్ద పెద్దమ్మ తన కూతుళ్ళ పెళ్ళిళ్ళకి కూడా నాలుగు రోజుల ముందొచ్చి, వాకిట్లో కూర్చుని “ఇవాళ ఏం సినిమాకి వెళ్దాం?” అనో, లేదా, “అబ్బబ్బా ఇడ్లీ లోకి ఈ చట్నీ చేసేరేవిటే?”, “కాఫీ డికాషన్ పలచగా వుందేమిటీ?” అంటూ చుట్టాలింటికొచ్చినట్లు చేసేది! “మా చెల్లెలుండగా నాకెందుకు బాధ్యత? అది మా నాన్నగారు” అనేది అమ్మ గురించి.

రెండో పెద్దమ్మ ఎప్పుడూ కష్టాలే పడింది! అమ్మ మీద ఆధారపడేది కాదు! త్యాగ గుణంలో ఆవిడ అమ్మ కన్నా ఇంకో రెండాకులు ఎక్కువే చదివింది. పెద్దనాన్నని ముంబయి ఆసుపత్రిలో పెట్టినప్పుడు అమ్మమ్మా, పెద్దమ్మా ఆడవాళ్ళిద్దరే, ఆస్పత్రి దగ్గరగా రూమ్‌ తీసుకుని వుండేవారు… తోడు మగపిల్ల వాడుంటే బాగుంటుంది. కానీ రామూ అన్నయ్య (సొంత కొడుకు) మెడిసిన్ చదువుతున్నాడు, పాపం వెళ్ళడానికి కుదరదు అని ఆలోచిస్తుంటే, తన కొడుకు హనుమంతుని బి.కాం. పరీక్షల ముందు – ఇంకో ఏడు రాస్తాడులే – అని వాళ్ళకి సాయం పంపేసింది. ఆ వెళ్ళడం వెళ్ళడం ఆర్నెల్లు వున్నాడు. చదువు పోయిందా ఏడు, కానీ ఫలితం దక్కలేదు!

మా పెద్దమ్మలిద్దరూ మనవలు పుట్టాకా బి.ఏ.లూ, ఎమ్.ఏ.లూ చేశారు. పట్టుదల లెక్కువ మా వంశంలో. బహుశా తాతయ్యా అమ్మమ్మల పోలిక! మాకూ అదే వచ్చింది.

మా అమ్మ నాకీ వెన్నుపూస ఆపరేషన్ అప్పటికి రిటైర్ అవడం వల్ల అమ్మా నాన్నగారూ, మా కాలనీలోనే ఇల్లు తీసుకుని నాకు దగ్గర్లోనే వున్నారు. అమ్మ నాకు ఎంత సేవ చేసిందో నేను చెప్పలేను. ఆరు నెలలు బెడ్ మీద్ వుంటే మళ్ళీ ఆవిడ పసిపిల్లను పెంచినట్లు నన్ను చూసుకుంది! మనం అమ్మల ఋణం తీర్చుకోవాలంటే, వాళ్ళని మళ్ళీ జన్మలో కని పెంచడం తప్ప ఇంకో మార్గం లేదేమో!

నా ప్రతి చిన్న ఎఛీవ్‌మెంట్‌కి ఆనందపడ్తూ, నా ప్రతి కథకీ పొంగిపోతూ అమ్మ నన్ను ఎంతో ప్రోత్సహించేది. అమ్మ అప్పుడు అందరికీ సాయపడడమే కాదు, ఇప్పుడు మూడేసి నెలలు షిర్డీలో వుంటుంది. ఆ సెక్యూరిటీ గార్డ్స్, కాటేజీల వాళ్ళూ, డ్రైవర్లూ ‘అమ్మా’ అని కాళ్ళ మీద పడ్తూ, డైరక్ట్‌గా దర్శనాలకి తీసుకెళ్ళిపోతూ వుంటారు. వాళ్ళ పిల్లల చదువులకి డబ్బులివ్వడం, ముసలివాళ్ళకి ‘హోమ్’కి డబ్బులివ్వడం చేస్తూ ఉంటుంది. నాన్న తాలూకూ పెన్షన్ వస్తుంది. ఆవిడ జీవితంలో ఒకరి మీద ఆధారపడిన మనిషి కాదు!

అలా నేను సర్జరీ అయి బెడ్ మీదున్న రోజుల్లో ఒక రోజు అమ్మ నేను నిద్రపోతుంటే వచ్చి లేపి, “ఎవరో ఇద్దరు పెద్ద మనుషులు కార్లో వచ్చి, ‘బలభద్రపాత్రుని రమణి గారు వున్నారా?’ అని అడిగారే, కూర్చోపెట్టి మంచినీళ్ళిచ్చాను. ఒకసారి రా గుర్తుపడ్తావేమో?” అంది.

నేను అతి కష్టం మీద లేచి నడుంకి బెల్టూ, కాలుకి సపోర్టూ (స్ప్లింట్) పెట్టుకుని వచ్చి ముందు గదిలో సోఫాలో చూస్తే ఇద్దరు పెద్ద మనుషులు వున్నారు.

“నమస్తే” అన్నాను.

ఒకాయన లేచి “నమస్తే.. నా పేరు దేవినేని రవి. డైరక్టర్ శరత్‌గారి దగ్గర కో-డైరక్టర్‌ని. ఈయన ఎమ్.ఆర్.వి. ప్రసాద్ గారని మన నందమూరి బాలకృష్ణ గారి తోడల్లుడు, మిమ్మల్ని కలవాలని వచ్చారు” అన్నాడు.

నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. కూర్చుని, “ఏం పని మీద వచ్చారండీ?” అని అడిగాను.

ప్రసాద్‌గారు మాట్లాడారు, మంచి ఇంగ్లీషు ఆయనది. ఎడ్యుకేషన్ అంతా విదేశాల్లోనేట. “నేను సుల్తాన్ తీసాకా, మళ్ళీ శరత్ గారితోనే ఇంకో సినిమా తీద్దామనుకుంటుండగా, చాలా కథలు విన్నాం, ఏదీ నచ్చలేదు. నిన్న డైరక్టర్ గారు విజయవాడ వెళ్తూ, ప్లాట్‌ఫార్మ్ మీద మీ ‘రేపల్లెలో రాధ’ నవల కొని చదివారుట. వెంటనే ఫోన్ చేసి ‘మనకి సబ్జెక్ట్ దొరికినట్టే, వెంటనే వెళ్ళి ఆవిడతో మాట్లాడండి, రచయిత్రి ఎడ్రస్ పుస్తకం మీద వుంది’ అన్నారు. అందుకే వచ్చాం” అన్నారు.

నాకు అప్పుడు ఎన్ని డబ్బులు అడగాలో, అసలు సినిమా అంటే ఏం ప్రొసీజరో ఏమీ తెలీదు! కానీ నా నోట ఏ దేవుడు పలికించాడో కాని ఒక మాట అన్నాను.

“చాలా సంతోషం… కానీ సినిమా తీసేడప్పుడు నన్ను కథా చర్చల్లో, స్క్రీన్ ప్లేలో, షూటింగ్‌లో ఇన్‌వాల్వ్ అవనివ్వాలి… ఆ కండీషన్ మీద నా నవల ఇస్తాను…” అన్నాను.

ఆయనా రవిగారూ ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు.

“అమ్మా మీరు  బెడ్ మీదున్నారు. మీ వెన్నెముకకి పెద్ద ఆపరేషన్ అయిందని చెప్పారు మీ అమ్మగారు. మేం వెంటనే షూటింగ్ మొదలుపెడదాం అనుకుంటున్నాం… ఎలా వస్తారూ?” అని అడిగారు.

“మీరు సరే అనండి. వస్తాను” అన్నాను.

యాభై వేలకి ఎగ్రీమెంట్ అయింది. పాతిక వెంటనే ఇచ్చేసారు. ముహూర్తం రోజున మిగతాది ఇస్తాం అన్నారు.

అంతా కలలాగా జరిగిపోయింది. నేను బెడ్ మీద నుండి లేచి కోలుకుని, అంత త్వరగా వస్తానని అప్పుడు వారు అనుకోలేదట! అప్పటికే ఆంధ్రప్రభలో ఈ సీరియల్ పెద్ద హిట్! వీరేంద్రనాథ్ గారు తన ఆపీసుకే రాఘవ అనే ఎడిటర్‌నీ, వి.ఎన్. సతీష్ (వి.ఎ.న్.ఆదిత్య అన్న) అనే కో-ఎడిటర్‌నీ పిలిపించి ఈ కథ నా చేత చెప్పించి రాయించారు. డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.రేపల్లెలోరాధా.కామ్ అని వెబ్‌సైట్‌లు రాని రోజుల్లేనే నా చేత ఆ పేరు పెట్టించారు.

వీరేంద్రనాథ్ గారు ‘ప్రేమ’ రాస్తున్నప్పుడు ఆ శైలి చూసి, ముగ్ధురాలినై, నేనూ చాలా కష్టపడి అందంగా అక్షరాలను పేర్చుకుంటూ ఆ నవల రాశాను. పాఠకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్ని ఉత్తరాలొచ్చేవో, మా పోస్ట్‌మాన్ రెడ్డి “మళ్ళీ ఇంకో కట్ట వచ్చింది, జీతం గిట్టుబాటు అవడం లేదు. గాడిద బరువు మోయిస్తున్నారు” అని జోక్ చేసేవాడు.

అంతకు ముందే శివలెంక కృష్ణప్రసాద్ గారనే నిర్మాత గురించి చెప్పాగా, ఆయన “ఓ తమిళ్ డైరక్టర్ అద్భుతమైన కథ చెప్పాడమ్మా. అతని పేరు సారంగన్… కానీ తమిళ వాసనలు ఎక్కువగా వున్నాయి…” అని నాకు ఓ కథ చెప్పి, నా చేత స్క్రీన్ ప్లే చేయించారు. ఆ సినిమాకి నేనే ‘అనగనగా ఓ అమ్మాయి’ అని పేరు పెట్టాను. సౌందర్య, శ్రీకాంత్, రఘువరన్ అందులో ఏక్ట్ చేశారు. ఆ సినిమాకి నేను మొదటిసారి తెరమీద పేరు చూసుకున్నాను. నా తెరంగేట్రం ‘అనగనగా ఓ అమ్మాయి’తో అయింది!

కానీ అది నా కథ కాదు. ‘రేపల్లెలో రాధ’కి పి.బి. ఆర్ట్స్ వాళ్ళొచ్చి ‘ప్రియదర్శినీ’ బ్యానర్‌ మీద చేస్తాం, బాలకృష్ణ గారు కూడా ఒక ప్రొడ్యూసర్ అని చెప్పెళ్ళాకా, ఇంకో తమాషా సంగతి జరిగింది.

సడెన్‌గా ఈ టీవీ నుండి జనరల్ మేనేజర్ ప్రసాద్ గారు ఫోన్ చేశారు – “అనూహ్య నవల చదివాం… ఓసారి మీ ఇంటికి రావాలనుకుంటున్నాం, నేనూ డైరక్టర్ గిరిధర్ గారూ” అని! నేను చాలా సంతోషించాను.

ఆర్టిస్ట్ రోహిణి తమ్ముడు బాలాజీ వారం వారం వాళ్ళావిడ స్వాతిలో వస్తుంటే చదివి చెప్తే, ఆ నవల ఎలాగైనా సీరియల్‌గా తీయాలని వాళ్ళకి సజెస్ట్ చేశాడట. గిరిధర్ గారు అది చదివి, ప్రసాద్ గారికి చెప్తే ఇద్దరూ కలిసి నా దగ్గరకి వచ్చారు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here