జీవన రమణీయం-32

2
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]అం[/dropcap]తకు ముందు ఓల్గా గారు వుత్తరం వ్రాసి నన్ను ఉషాకిరణ్ ఆఫీస్‌కి పిలిపించి నా ‘తృప్తి’ నవల చాలా బావుందని, సీరియల్‌గా పనికొస్తుందనీ సుమన్ గారికి సజెస్ట్ చేసినా పని జరగలేదు! ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళు మా ఇంటికి నవల రైట్స్ కొనడానికి రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకు బాలాజీ గారికి చాలా ఋణపడ్డాను. అనుకోకుండా ఆయన అప్పట్లో నా ‘రేపల్లెలో రాధ’ సినిమాలో కూడా నెగటివ్ రోల్‌లో ఎన్నిక గాబడ్డారు.

మొన్నీ మధ్యే యువకళావాహిని వాళ్ళు నాకు అవార్డు ఇస్తున్నప్పుదు, ఆయన ఈ విషయం స్టేజ్ మీద మైక్‌లో చెప్పి, “నేను ఎంతో ఇష్టపడ్డ సబ్జెక్ట్ ఈటీవీ వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళే నిర్మించి నాకా ఛాన్స్ లేకుండా చేశారు… ఈనాటికీ ఆ  బాధ మరిచిపోలేకపోతున్నాను రమణీ గారూ!” అన్నారు.

తెర వెనుక ఏం జరిగిందో నాకు తెలీదు! నేను మాత్రం ఈటీవీ జనరల్ మేనేజర్ ప్రసాద్ గారినీ, డైరక్టర్ గిరిధర్ గారినీ మా ఇంటికి రావడం చూసి చాలా ఆనందపడ్డాను.

రైట్స్‌కి ఎంత కావాలి? అని వాళ్ళు అడిగారు. నేను షరా మామూలే… “నేను స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తాను” అన్నాను.

నా కాలి ‘స్ప్లింట్’నీ, నన్ను ఎగాదిగా చూశారు. కానీ గిరిధర్ గారు “రచయిత్రే స్వయంగా రాస్తే అంతకన్నా కావల్సిందేం వుందీ? రాయండి” అన్నారు.

రైట్స్‌కి గాను ఏం ఇచ్చారో నాకు గుర్తు లేదు కానీ, ప్రతి ఎపిసోడ్‌కీ ఆ రోజుల్లో రోజుకి 1500/- (1999లో). నాకు అది పెద్ద మొత్తమే! అప్పట్లో నెలకి 500/- జీతంతో స్కూల్ టీచర్‌గా చేసేదాన్ని అని చెప్పాగా!

నా ఫిజియోథెరపిస్ట్ మంగేష్ కుమార్ ఎయిర్‌ఫోర్స్‌లో చేసేవారు. మా లలిత దేవతలా అతన్ని వెంటపెట్టుకొచ్చి పరిచయం చేసింది. అతనితో లిటరరీ కబ్లుర్లతో ‘కరెంట్’ పెట్టినప్పటి ‘చురుక్… చురుక్’ మన్న బాధ తెలిసేది కాదు కానీ… నేను కాలు సైకిల్ తొక్కుతున్నట్లు ఎత్తెత్తి వేస్తుంటే, వాకింగ్ ట్రై చేస్తుంటే మాత్రం అమ్మ చూడలేక ఏడ్చేసేది.

మా ఆయన జహీరాబాదు నుండి వచ్చినప్పుడల్లా నా కాలి వేళ్ళు కదులుతున్నాయా, అని ఆశగా చూసేవారు. ఒక రోజు బొటనవేలు దానంతట అది కదల్చగలిగాను… ఆ రోజు పిల్లలకీ, ఆయనకీ, అమ్మకీ పండగే అయింది. మా డాక్టర్ నాయక్ గారు ఫోన్‌లో నన్ను పలకరిస్తూనే వుండేవారు.

నేను ‘హద్దులున్నాయి జాగ్రత్త’ అనే నవల కూడా పక్క మీద పడుకునే రాశాను. ముగ్గురు స్త్రీల కథ అది. ఒకవేళ పురాణ కాలం నాటి అహల్యా, అనసూయా, సుమతీ ఇప్పుడుండి, అచ్చంగా అప్పుడొచ్చిన సమస్యల్లాంటివే వాళ్ళకి ఇప్పుడొస్తే ఎలా డీల్ చేస్తారు ఈ ఆధునిక స్త్రీలు అన్నదే కథాంశం!

అంటే అహల్యని తప్పు చేసిందని, రాయివి కమ్మని శపించాడు భర్త… అనసూయని నగ్నంగా వడ్డించమన్నారు అతిథులు… సుమతి వ్యభిచారీ, కుష్టురోగీ అయిన భర్తని బుట్టలో పెట్టుకుని, అతని వేశ్య దగ్గరకి తీసుకెళ్ళాల్సొచ్చింది! ఇదే నా సబ్జెక్ట్.

ఈ నవలకి పేరు నా మిత్రుడు శివనాగేశ్వరరావు సజెస్ట్ చేశాడు. Beware of Dogs లాగా ‘హద్దులున్నాయి జాగ్రత్త’ అని.

“శృంఖలాలు తెంచుకోవడమే విశృంఖలం అయితే ఈ స్త్రీలు విశృంఖలంగా ప్రవర్తించారు” అని బ్యాక్ కవర్ మేటర్ రాసాను ఆ రోజుల్లోనే!

‘ఆలింగనం’ నవల రాసి సగమే పంపించాను బలరాం గారికి. “బావుంది… మొత్తం నవల పంపిస్తే స్వాతిలో ప్రచురిస్తాం’ అని లేఖ రాశారు. ఆ రోజుల్లో ఆయన ఉత్తరాలు రాయడం, రచయితలతో మాట్లాడ్డం స్వయంగా చేసేవారు. ‘ఆలింగనం’ స్వాతిలో వస్తున్నప్పుడే ఆంధ్రభూమి ఎడిటర్ ఎ.ఎస్.లక్ష్మి, నేను ఫోన్ చేస్తే, “నేను ఎదురు చూస్తున్నాను మీరు మా ఆంధ్రభూమికి ఎప్పుడెప్పుడు రాస్తారా అని” అంది.

‘ఖజురహో’ కనకాంబరరాజు గారు వుండగా రాస్తే, ‘హద్దులున్నాయి జాగ్రత్త’, ‘ప్రేమించాకా ఏమైందంటే’ లక్ష్మిగారుండగా రాశాను. ఒక దురదృష్టకరమైన ప్రతిపాదన ఆవిడ చెయ్యడం వలన నా మనసు విరిగి నేను మళ్ళీ ఆంధ్రభూమికి ఒక్క కథ కూడా పంపించలేదు! కానీ మేం ఇద్దరం అప్పట్లో చాలా స్నేహంగా మసిలాం. మా ఫ్రెండ్ దేవరకొండ లలిత కూడా ఆంధ్రభూమిలో కవితలు రాసింది. ఒకసారి ఆంధ్రభూమి రైటర్స్ మీట్ నిర్వహిస్తే రావూరి భరద్వాజ గారూ, పి.ఎన్.రావు గారూ, సుధామ గారూ, కస్తూరి మురళీకృష్ణ గారూ, పి.వి. రామకృష్ణ అనే చిన్నబ్బాయీ అందరూ వచ్చారు.

అప్పట్లో రైటర్స్ కొందరు ఘోస్ట్ రైటర్స్‌ని మెయిన్‌టెయిన్ చేసేవారు! యాజమాన్యానికి ఈ విషయం తెలిసినా, ఇతర లాభాల దృష్ట్యా చూసీ చూడనట్టు ఊర్కొనేవారు.

మూడు నెల అనంతరం నేను బెడ్ మీద నుంచి లేచి ‘రేపల్లెలో రాధ’ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లాను.

ఇటీవల మరో సినిమా షూటింగ్‌లో సోమరాజు గారితో రచయిత్రి

ఈ సినిమాకి కోటిగారు సంగీతం చేసి చక్కని పాటలు అందించారు. నేను ‘రేపల్లెలో రాధ’ సినిమా గురిచి మాట్లాడేడప్పుడు సోమరాజు గారి గురించి చెప్పకపోతే అది అన్యాయమే అవుతుంది. దేవినేని రవి అనే కో-డైరక్టరు ఎమ్.ఆర్.వీ. ప్రసాద్ గారితో వచ్చారని చెప్పాను కదా… సోమరాజు గారు శరత్ గారికి ఇంకో కో-డైరక్టర్. ఈయనకి ‘రేపల్లెలో రాధ’ ఎంతగా నచ్చిందంటే, ఆయన పేరాలు పేరాలు చదివి చెప్తూ నా దగ్గర కంటతడి పెట్టేసుకునేవారు. ఇప్పుడు కలిసినా, “మళ్ళీ ఇంకోసారి తీయాల్సిన సబ్జెక్ట్ అమ్మా” అంటారు.

మా ఇంటిల్లిపాదిమీ ‘అన్నపూర్ణ’లో ఓపెనింగ్‌కి వెళ్ళాము. అంతకుముందే ప్రసాద్ గారు నాతో చర్చించి మా ఇంటికి ఫొటోలు పంపించి చూపించి, హీరోగా దిలీప్ తాడేశ్వర్‌నీ, హీరోయిన్‌గా గాయత్రీ రఘురామ్‌నీ పెట్టుకున్నారు. రఘురామ్ గారు పెద్ద కొరియోగ్రాఫర్. ఆ అమ్మాయి పేరును ఈ సినిమాలో దీక్షగా మార్చారు.

ఎమ్.ఆర్.వీ. ప్రసాద్ గారు బాలకృష్ణ గారి భార్య వసుంధరగారి స్వంత అక్క భర్త. ఆయన తండ్రి ఈ నవల చదివి కేవలం నన్ను కలుసుకోడానికి ఆ రోజు ‘అన్నపూర్ణకి వచ్చారుట. ఆ పాత్రలను అంత బాగా రాసినందుకు ఆయన నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అప్పట్లో టచ్ స్ర్కీన్‌లూ, సెల్ఫీలూ లేవు!

బాలకృష్ణ గారు ఏం మాట్లాడారో ఇప్పటికీ గుర్తుంది. “ఒక్కడి కోసం అందరు కలిసీ, అందరి కోసం ఒక్కడు నిలిచీ… అన్న ప్రేరణతో రాసిన సబ్జెక్టులా వుంటుంది ఈ నవల… ఇంతమంచి నవల రాసిన రచయిత్రి అభినందనీయురాలు….” అంటూ ఏవేవో కాంప్లెక్స్ సెంటెన్స్‌లు కూడా చెప్పారు.

డైరక్టర్ శరత్ గారు చాలా పెద్ద మనిషి. నేను పల్లెటూళ్ళ బ్యాక్‌గ్రౌండ్ లోంచి రాలేదు, అసలు పల్లెటూర్లు ఒక్కసారి కూడా చూడలేదు పుట్టాకా, హైదరాబాద్‌లో పుట్టి పెరిగానని తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. మా అత్తగారు తన చిన్నతనం, ఉమ్మడి కుటుంబం, తల్లి లేని తనని మేనమామ భార్య తల్లిగా పెంచి పెద్ద చేసి పెళ్ళి చెయ్యడం… అన్నీ నాతో చెప్తూ వుండేవారు. “ఓ మంచి పల్లెటూరూ, వాటిల్లో ఉండే అనుబంధాలూ ప్రతిబింబించే  నవల రాయమని ఆవిడ అడిగితే రాసిన నవల ‘రేపల్లెలో రాధ’.

శరత్ గారు మంచి మంచి పూలవీ, డిజైన్‌లవీ చొక్కాలేసుకునేవారు. సరదాగా వుంటూనే అతి మర్యాదగా మాట్లాడేవారు. చాలా బాగా తీసారు సినిమా.

ముందుగా మాట్లాడుకున్న ప్రకారం నాకూ, అమ్మకీ, మా చిన్నబ్బాయికీ (ఏడు చదువుతున్నాడు అప్పుడు) ఏ.సీ. కోచ్‌లో రైల్లో రిజర్వేషన్ చేయించి ప్రసాద్ గారు షూటింగ్‌కి రాజమండ్రి తీసుకెళ్ళారు.  రైల్లో కల్పానారాయ్, సరస్వతమ్మగారు, సత్యనారాయణ గారూ, రమాప్రభగారు, గుమ్మడి గారూ, చలపతిరావుగారూ కూడా వచ్చారు.

అమ్మకి మంచి కాలక్షేపం అయింది. అక్కడ సూర్యా ఏ.సి. హోటల్లో అందరికీ గదులు తీశారు. సుధగారూ, సుజాతగారు మద్రాసు నుండి ఫ్లైట్‌లో వచ్చారు.

కల్పనారాయ్‍ని వేరే హోటల్‌కి మార్చడంతో, పని మనిషి వేషం వెయ్యడానికొచ్చినావిడ పెద్దగా పోట్లాడి వెళ్ళిపోయారు.

అందరూ షూటింగ్‌కి ఏ ఐదు గంటలకో లేచి రెడీ అయి కార్లలో, వ్యాన్‌లలో వెళ్ళిపోయారు. నేనూ, అమ్మా, మా వాడూ లేచి తయారయ్యి ఎమ్.ఆర్.వీ. ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే “మీరు పలహారాలవీ చేసి రెడీగా వుండండమ్మా… భోజనాల కొచ్చినప్పుడు వద్దురు గాని, కడియం దాటి మారేడుమాకలకి రావాలి. రెండు గంటల ప్రయాణం…” అన్నారు.

మా కృష్ణకాంత్ టీ.వీ. చూస్తూ హోటల్ లోనే వుంటానని మారాం చేస్తే, మొదటి రోజు వాడిని బలవంతం చేసి మాతో బాటు తీసుకెళ్ళాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here