[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]మా[/dropcap] అమ్మ సత్యవతీదేవి మంచి సింగర్ అవటం మూలాన చిన్నప్పటి నుండీ పాటలూ, నాటకాలూ అన్నింటితో నాకు పరిచయం వుండేది. రేడియోలో నాటికలు కూడా ఒకటి రెండు వేశాను. ఉప్పలూరి సుబ్బరాయ శర్మ, మల్లాది మహాదేవ శాస్త్రీ, నిట్టలా అందరినీ ‘మావయ్య’ అని పిలుస్తుండేదాన్ని. అలాగే లలిత సంగీతం ఆర్.టీ.సీ. లో ఐ. పాప, మా అమ్మా, ఇంద్రగంటి జానకీబాలా మాత్రమే పాడేవారు. వారం రోజులు జరిగే ఆర్.టీ.ఆర్.సీ. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో వుండటానికి ట్రావెల్సర్ బంగ్లా ఇచ్చి, వంటలు కూడా వాళ్ళే చేయించి పెట్టేవారు. పెళ్ళివారిల్లులా వుండేది.
గంగోత్రీ, పెదకాకానీ, తెనాలీ, శ్రీకాకుళం…ఇలా అన్ని డిపోల నుంచీ వచ్చి నాటకాలాడేవారు. ఆఖరి రోజు ప్రైజులుండేవి. అమ్మకి చాలాసార్లు ఫస్ట్ ప్రైజులొచ్చాయి.
నానీకి పెళ్ళికాక ముందు నుండే వాళ్ళ నాన్నగారి ట్రూప్‌లో ఏక్ట్ చెయ్యడం అలవాటు. పెళ్ళయ్యాకా వాళ్ళాయన క్రిష్ణ ఇష్టపడలేదు! మానేసి రైల్వే సర్వీస్ కమీషన్‌కీ, స్టాప్ సెలెక్షన్‌కీ గైడ్స్ తెప్పించుకుని ప్రిపేర్ అవుతూ వుంటే, నేనూ స్టాఫ్ సెలెక్షన్‌కి గైడ్ తెప్పించుకున్నాను.
మా ఆయన “నీకు రాదు… నానీకి వస్తుంది. వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి” అన్నారు. అసలు నేను ఐ.ఏ.ఆర్.ఐ.లో రిటన్ ఎగ్జామ్ పాసయి కడుపుతోటి వుండి రాజేంద్రనగర్ వెళ్ళి టైపింగ్ కూడా పాసయ్యి, డెలివరీ డేస్ కావడంతో ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి వుండేదాన్ని. ‘ఫ్లయిట్‍లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి రా’ అనే సలహా అప్పట్లో మధ్య తరగతి వాళ్ళెవరికీ ఇవ్వాలని తట్టలేదు! నా మనసులోనూ పిల్లలను ఇంట్లో విడిచి ఆఫీసుకు వెళ్ళడం, అందులోనూ ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని, అస్సలు ఇష్టం లేదు!
మన రాత ఇంకో చోట ‘రాతలు’ రాయమని వుంటే వుద్యోగాలెందుకు చేస్తామూ?
ఈసారి అంబాజీ ఇంట్లోకి నానీ, నేనూ పక్క పక్క ఇళ్ళలోకి వచ్చాక సత్యప్రియ దగ్గర్లోనే వున్నా రాకపోకలు అంతగా లేవు! పక్కింట్లో మరాఠీ వాళ్ళుండేవారు. రమేష్ అని, అతని రెండో బార్య యశోద. మొదటి భార్యకి ముగ్గురు సంతానం. యశోదకి ఇద్దరు పిల్లలు. అత్తగారు కూడా వీళ్ళతోనే వుండేది. యశోద వయసొచ్చిన మగ పిల్లలు రతన్, నాగా, రాజూ అనే ముగ్గుర్నీ సవతి పిల్లల్లా కాకుండా బాగానే చూసేది! ఎంత బాగా చూసినా, ఎప్పుడైనా తిడితే అత్తగారు “నేనూ వాళ్ళూ బావిలో దూకి చస్తాం” అని కొడుకుని బెదిరించేది. యశోద బట్టలు కుట్టేది. ఆ పక్కనుండే బాలక్క ఇంట్లో బట్టలు అమ్మేది. తరువాత గణేశ్ టెక్స్‌టైల్స్ పెట్టారు. అనూ టెక్స్ కూడా వాణీనగర్‌లో పెట్టారు. రోడ్డు మీదకి ఉండేది ఇల్లు. అందులో పెట్టి ఆ తర్వాత ఇన్ని బ్రాంచీలు డెవలప్ చేశారు. యశోద అత్తగారు నా ఒళ్ళోనే పోయారు జ్వరంతో. అంతా భయపడినా, నేను తులసి తీర్థం పోస్తూ కూర్చున్నాను.
నాకు మా అమ్మమ్మ పెంపకంలో అస్సలు అలవడనిది – చిట్టీలు వేయడం, ఇన్‌స్టాల్‌మెంట్స్ మీద బట్టలు కానీ వస్తువులు కాని కొనడం! ఆ రెండూ మా ఇంట్లో ఇష్టం వుండదు. భయం అనే మాట మాత్రం వుండదు.
***
అశ్విన్ చిన్నతనం గురించి చెప్పేడప్పుడు తప్పకుండా మా పెద్దాడపడుచు లలిత వదినగారి గురించి చెప్పాలి. వాడిని ప్రాణంగా చూసేవారు. నేనన్నా చాలా ప్రేమగా వుండేవారు. పనీ, వంటా, ఇల్లు అందంగా పెట్టుకోవడం మా అత్తగారి పోలికలే అయినా, వదిన గారికి డబ్బు ఖర్చు చెయ్యడం కూడా బాగా సరదా! వచ్చిన ప్రతి సినిమా చూడాలి. అన్ని నవలలు కొనాలి. బజార్లో కొచ్చిన కొత్త వస్తువు ఇంట్లో వుండాలి. ఇల్లంతా ఆధునికమైన ఫర్నిచర్ వుండేది. మొదట చిక్కడపల్లిలో వుండేవారు, తరువాత రహత్‌మహల్ థియేటర్ పక్కన ప్రశాంత్ టవర్స్ అని కడితే అందులో వుండేవారు. ఆవిడకి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. మగపిల్లలు చందూ, రామూ ఇంచుమించు నా వయసు! ఆడపిల్ల సుధకి మా పెళ్ళికి పదహారు. తరువాత ఆవిడ కాలం చేశాకా, నేనూ మా ఆయనా దాని కన్యాదానం పీటల మీద కూర్చుని చెయ్యవలసి వచ్చింది.
మా తోడికోడలు డా. గీతాశర్మ ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు రీడర్‌గా ఉండేది. ఆవిడ నాకన్నా పన్నెండేళ్ళు పెద్ద. బావగారు బ్యాంక్ ఆఫీసర్. వారిల్లు ఆనంద్‌బాగ్‌లో మా ఇంటికి దగ్గరగానే వుండేది. ఆదివారాలొస్తే ఆవిడ బోలెడు వంట చేసేది. భద్రమ్మ అని ఆవిడ చిన్నప్పటి పనిమనిషి వచ్చి ఇల్లంతా సర్ది, వంటలు చేసేది. గీతకి అప్పుడూ ఇప్పుడూ కూడా వంట చెయ్యడం – అందరికీ పెట్టడం చాలా ఇష్టం! అన్ని రకాల వంటలూ వచ్చు.
నేను కడుపుతో వున్నప్పుడు ఆవిడ మొదటిసారి అమెరికా వెళ్ళింది. “ఆవిడ ఇంక వెనక్కి రాదు… నా కొడుకునీ తీసుకుపోతుంది” అని మా అత్తగారు చాలా బెంగపడ్డారు. కానీ అటువంటిదేమీ కాలేదు. గీత సైంటిస్ట్. ఇప్పటి హెపటైటిస్ వాక్సిన్, శాంతాబయోటిక్స్ నుంచి ఆవిడే జనరేట్ చేసింది.
నానీ నాకు మేకప్ గురించీ, అభినయం గురించీ, నాటక పరిషత్తుల గురించీ చెప్తూ వుండేది. అజయ్, అశ్విన్ ఒకే వయసు. నెలల పిల్లలు.
మా అమ్మ అశ్విన్‌ని తీసుకుపోతూ వుండేది. వుండలేక నేనూ పరిగెత్తేదాన్ని! మా అబ్బాయి పుట్టాకా నేను అమ్మ కోసం బెంగపెట్టుకోవడం మానేసాను. నాన్న అశ్విన్ పుట్టాకా వాలంటరీ రిటైర్‌మెంట్ తీసేసుకున్నారు.
అశ్విన్‌కి అస్తమానం ఆనారోగ్యం చేసేది. బొద్దుగా వుండేవాడు కాదు! రవిచంద్ర, మా అన్నయ్య కొడుకు. వాడికీ వీడికి పదకొండు నెలలు తేడా! ఇద్దరూ ఆడుకునేవాళ్ళు, అంతలోనే కొట్టుకునేవాళ్ళు! వాడు వీడి మొహం మీద గిచ్చేసేవాడు. మా అత్తగారు “మీ అమ్మా వాళ్ళింటికి మా వాడిని తీసుకెళ్ళబోకు” అనేది.
మా అన్నయ్య పెళ్ళి కాగానే అస్సాం వెళ్లిపోయారు. ఎన్.బి.సి.సి.లో వర్క్ చేసేవాడు. మా అమ్మకి పిల్లల మీద అలవి మాలిన బెంగ. దానితో మా ఆయన ఆల్విన్ నిస్సాన్‌లో పి.ఎ. టు జి.ఎమ్‌గా చేసేటప్పుడు బావమరిదికి ఎకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో వుద్యోగం వేయించి అస్సాం గౌహతి నుండి హైదరాబాద్ రప్పించారు. వాళ్ళు అజామాబాద్, ఆర్.టి.సి. కాలనీలోనే వుండేవారు. అప్పుడు బావా బావమరుదులిద్దరూ ఎర్రగడ్డలో వున్న ఆల్విన్ నిస్సాన్‌లో ఉద్యోగం చేసేవారు.
మా ఆయనకి అప్పుడు టి.వి.ఎస్. మోపెడ్ మాత్రం వుండేది. ఒకనాడు “మా ఆఫీసులో పనిచేసే అయన ఇంట్లో ఒక వాటా ఖాళీ వుందిట… నాకు ఆఫీసుకు దగ్గరగా వుంటుంది. వెళ్ళిపోదాం” అన్నారు.
నేనూ నానీ కౌగిలించుకుని తెగ ఏడిచాం. రామచంద్ర టాకీసు, సంధ్యా బుక్ లెండింగ్ షాపూ, ఆండాల్ మిక్స్చర్ షాపూ, నా ఆనందబాగూ ఎలా వదిలి వెళ్ళడం అని!
(సశేషం)