[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]అ[/dropcap]సలు మనుషులను నమ్మడమే నేను చేస్తున్న తప్పా? అని చాలా అనిపించేది!
‘అనూహ్య’, ‘ఆలింగనం’ తర్వాత నేను ‘ఔనంటే కాదంటా’ సీరియల్ ఆంధ్రజ్యోతికి రాసాను. అప్పుడు నామిని సుబ్రహ్మణ్యం గారు ఎడిటర్. ఆయన “ఆడవాళ్ళు జనరల్‌గా మబ్బుగా ఉంటారు, మీరు బాగా సెన్సాఫ్ హ్యూమర్‌తో రాస్తారే” అని ఆశ్చర్యపోయేవారు.
‘ఆలింగనం’ రాస్తున్నప్పుడే నేను ఒకసారి ఆంధ్రభూమికి ఫోన్ చేస్తే కొత్త లేడీ ఎడిటర్ “మీరు ఎప్పుడు మా పత్రికకి రాస్తానంటారా అని ఎదురు చూస్తున్నాను. ‘ఆలింగనం’ ప్రతివారం చదివాను” అంది.
నేను ‘ఖజురహో’ సీరియల్‌గా రాస్తుండగా అనూహ్యమైన సంఘటనలు జరిగి కనకాంబరరాజు గారిని తీసేసి ఈవిడని పెట్టారు. అప్పుడు ప్రొప్రయిటర్ వెంకట్రామారెడ్డి గారు నాగార్జున హోటల్‌లో మీటింగ్ పెట్టి “ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకి రండి” అని నాతో ప్రత్యేకంగా చెప్పారు. నేను తరువాత ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరకు వెళ్ళలేదు.
‘హద్దులున్నాయి జాగ్రత్త’, ‘ప్రేమించాక ఏమైందంటే’ సీరియల్స్ నేను ‘ఖజురహో’ తర్వాత ఆంధ్రభూమికి రాసాను.
అప్పుడు ఆ ఎడిటర్‌తో చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. ఓసారి ఆంధ్రభూమి రచయితల ప్రెస్ మీట్ పెట్టిందావిడ. రామకృష్ణ అనే ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి అప్పట్లో అందులో ఏదో సీరియల్ రాస్తూ ఉండేవాడు. ఓ చెత్త రచయిత్రి (క్షమించండి… ఆవిడ చెత్త రాయడం, మాట్లాడటం రెండూ చేసేది) ఆ కుర్రాడిని నేను ఎంకరేజ్ చేస్తున్నానని, అతను నా ఘోస్ట్ రైటర్ అనేదట. నేను ఏదైనా నా స్వంత దస్తూరితో ఇస్తాను కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆవిడ మాట ఏ ఎడిటరూ నమ్మలేదు. రైటర్స్ మీట్‌లో పి.యన్. రావు గారూ, సుధామ గారూ, కాళోజీ నారాయణరావు గారూ, భావరాజు సత్యమూర్తి గారూ, కస్తూరి మురళీకృష్ణ గారూ మొదలైనవారు పాల్గొన్నారు. 2001లో మాట ఇది! ‘రేపల్లెలో రాధ’ అప్పటికే రిలీజ్ అయిపోయింది. నాతో పాటు నా స్నేహితురాలు దేవరకొండ లలిత కూడా ఆ ప్రెస్ మీట్‌లో పాల్గొంది. అప్పటికి లలిత రెండు కవితలు ఆంధ్రభూమిలో రాసింది.
నేను ‘స్వాతి’ బలరాం గారికి ఫోన్ చేసి “నవల పంపిస్తాను” అని చెప్తే “ఆంధ్రజ్యోతిలో, భూమిలో రాస్తున్నారుగా, అక్కడే రాయండి” అన్నారు. అది అలకగా తోచి నేనూ పంపించలేదు!
మొదటి అడుగు నుండి నాకు గుండెలనిండా ‘దమ్ము’ ఉండేది. దాన్ని విశ్వాసం అని, ధైర్యం అని రాసుకుంటారు అనుకుంటా. ఎవరు ‘వద్ద’న్నా ఇంకో ద్వారం ఓపెన్ అవుతుందిలే, ఏంటి వీళ్ళని అడిగేది అనుకునేదాన్ని.
అసలు ఆంధ్రజ్యోతిలో అంత హిట్ సీరియల్ ఇచ్చాక, ‘అనూహ్య’ రెండు భాగాలు రాసి పంపిస్తే ఆ ఎడిటర్ “గెస్ట్‌హౌస్‌కి రండి, మాట్లాడదాం” అన్నాడు.
నేను మళ్ళీ ఫోన్ చేసి “మా వారికి శనివారం హాలిడే. శనివారం రమ్మంటారా?” అని అంటే, “మీ వారితో వస్తావా? మతుండే మాట్లాడుతున్నావా? ఇలాగైతే అవకాశాలు ఎలా వస్తాయి అనుకుంటున్నావ్?” అని చిరాకు పడి వెళ్ళిపోయాడు. నాకు ఏమీ అర్థం కాలేదు.
నాకు అర్థమయ్యేలోగా అతని వుద్యోగం వూడిపోయింది పాపం!
‘ఆ ఒక్కటి అడిగేసెయ్’ అని మయూరిలో సీరియల్ రాశాను అని చెప్పాను కదా! అప్పుడు ఆ ప్రొప్రయిటర్ కూడా నాతో అసభ్యంగా మాట్లాడడానికి ట్రై చేశాడు ఫోన్‌లో. నేనేమీ అనలేదు. ఇంకో సీరియల్ సగంలో రాయడం ఆపేశా. అప్పట్లో చిక్కుల్లో పడి అతను పత్రిక ఆపేసుకున్నాడు. ఇలా మిస్‌బిహేవ్ చేసేవాళ్ళూ తగిలారు. ఒక రచయిత మా ఇంటికి చీకటిలో గుర్తులు అడుగుతూ, పక్క వాళ్ళు సెప్టిక్ ట్యాంక్‌కి తవ్విన గోతిలో పడ్డాడు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరగలేదు. కానీ అతని నీచమైన నైజం నాకు అర్థమైంది. ‘మొగుడే రెండో ప్రియుడు’కి వీరేంద్రనాథ్ గారు ఒక చిత్రకారుడికి బొమ్మలు వెయ్యమని చెప్తే, అతనికి స్క్రిప్ట్ కావాలన్నాడు. నేనూ లలితా వెళ్ళి చిక్కడపల్లిలోని అతని ఆఫీస్‌కెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చొచ్చాము. మరునాడే ఇంటికొచ్చాడు. మా అమ్మమ్మ గారు ఉండేవారు నా దగ్గర. “ఎవరు బాబు? ఏం కావాలి? ఎక్కడనుండి వచ్చావు? ఏం పని? మా అమ్మాయి ఎంత కాలంగా తెలుసు? నిన్ను రమ్మందా?” లాంటి ప్రశ్నలు గుమ్మంలో నిలబెట్టి అడిగేసరికీ తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
ఇంకో సినిమా రైటర్ కూడా పాపం ‘నా మాట వింటే అవకాశాలు ఇప్పిస్తా’ టైప్‌లో మాట్లాడితే గట్టిగా బుద్ధి చెప్పా. నా నాలికకి చాలా పదును ఉండేది. నేను అంత హార్ష్‌గా తిడ్తానని, సన్నగా మెత్తని గొంతుతో మాట్లాడే నన్ను చూస్తే ఎవరూ అనుకునేవారు కారు. ‘ఖజురహో’లో ఓ అందమైన అమ్మాయి సమాజం మీద పగ పెంచుకుని, తన అందాన్ని ఎరగా వేసి, సమాజం మీద ముఖ్యంగా గొప్ప వారి మీద ఎలా పగ పెంచుకుని, తన ద్వేషాగ్నికి తనే ఎలా అహుతి అయిపోతుందో రాసాను.
కనకాంబరరాజు గారు నా శైలిని చాలా మెచ్చుకునేవారు. ఆయన్ని తీసేశాక కొన్నాళ్ళు రామచంద్రరావు అనే ఎడిటర్ వచ్చారు. ఆయనతో బాటు ఆయన ఆశ్రితులందరినీ కూడా వెళ్లగొట్టారు పాపం!
అప్పట్లో కథల పోటీలో నాకు ఒకేసారి ‘అనంతం’, ‘మోసం’ అనే కథలకు ప్రథమ బహుమతీ, మూడో బహుమతీ వచ్చాయి.
పదివేలు ప్రథమ బహుమతీ, రెండువేలు మూడో బహుమతీనూ. నేను ఆ డబ్బుతో నల్లపూసలు చేయించుకున్నాను. అవి వేసుకుంటే ఎంత గర్వంగా ఉండేదో!
‘అనూహ్య’కి ఓపెనింగ్ ‘డయానా మరణవార్త’తో చెయ్యమని సాయికృష్ణ అనే ఫ్రెండ్ చెప్పాడు. ‘బాబాయ్ హోటల్’, ‘బాయ్ ఫ్రెండ్’ హీరో అని చెప్పుకున్నాంగా.
ఆ స్ఫూర్తితోనే ‘హద్దులున్నాయి జాగ్రత్త’ క్లింటన్ కేసు జరుగుతున్నప్పుడు, తన భర్తని సమర్థిస్తూ హిల్లరీ క్లింటన్ అన్న మాటలతో ప్రారంభించాను!
సుమతీ, అనసూయా, అహల్యలనే పౌరాణిక పాత్రలను తీసుకుని, వాళ్ళకు వచ్చిన లాంటి పరిస్థితులు ఇప్పటి ఆధునిక మహిళల కొస్తే ఏం చేస్తారని చెప్తూ, ఆ మహిళలు ఎలా ‘డీల్’ చేశారో చెప్పిన నవల ‘హద్దులున్నాయి జాగ్రత్త’. చాలా స్పందన వచ్చింది.
అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా నాకు స్త్రీ పాఠకులూ, స్త్రీ అభిమానులూ చాలా ఎక్కువ! చాలామంది ఆ నవల రాసేటప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్‌కి వచ్చేస్తూ వుండేవారు! కొంతమంది సమస్యలు నా నెత్తిమీద వేసుకొని తీర్చడానికి చాలా కష్టపడ్డాను కూడా!
(సశేషం)