Site icon Sanchika

జీవన రమణీయం-43

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఈ[/dropcap]టీవీలో ‘అనూహ్య’ వీక్లీ సీరియల్ అయిపోగానే మళ్ళీ ఈటీవీ ప్రసాద్ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. నేను వెళ్ళేసరికి అక్కడ ఓ అబ్బాయి కూర్చుని ఉన్నాడు. ప్రసాద్ గారు నాకు పరిచయం చేస్తూ “ఇతను ఓ.ఎస్. అవినాష్. ఇతను ఓ సీరియల్ చేయాలనుకుంటున్నాడు… మంచి సబ్జెక్ట్ చెప్పండి…” అన్నారు.

ఆ ప్రసాద్ గారే గతంలో తల్లి పాత్రలేసే నటి గురించీ, ప్రసిద్ధమైన ఆర్ట్ డైరెక్టర్ గారి గురించీ ఓ కథ చెప్పారు ఈయనకి యాక్సిడెంట్ అయి మతిపోయిన టైంలో, వార్త తెలిసి భార్య ఏడుస్తూ పరిగెత్తుకొస్తే, గదిలోకి వెళ్ళకుండా ఆ నర్స్ “ఆయన భార్యని తప్ప ఐసీయూలోకి ఎవరిని ఎలౌ చెయ్యం” అందట. ఆవిడ “నేనే ఆయన భార్యని” అంటే, “అదేంటి ఆవిడ లోపల వున్నారే?” అందట. అది గుర్తు చేసి “ఆ సబ్జెక్ట్ చేద్దాం” అన్నాను.

“ఏదీ” అన్నాడు అవినాష్.

అప్పటికప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని రెండు వేరు వేరు ఊళ్ళలో పెట్టిన భర్త కథ ‘అగ్నిసాక్షి’గా ఓ ముప్ఫై నిమిషాలు నెరేషన్ ఇచ్చాను.

అందరికీ నచ్చింది. “సరే ఈ వారం వదిలేసి వచ్చే వారం టెలికాస్ట్ అవ్వాలి” అన్నారు ప్రసాద్ గారు. ఈటీవీ సీరియల్స్ అన్నీ నాకు అంతే నోటీస్ ఇచ్చేవారు. ‘పద్మవ్యూహం’లో అయితే మూడు రోజుల్లో జరిగిన ఎపిసోడ్స్ అన్ని చూసి నెక్స్ట్ సోమవారం నుంచి అందుకోవాలని గురువారంనాడు పిలిచి ఎపిసోడ్స్ చూపించారు నాకూ, అనిల్ కుమార్ గారికి.

‘అగ్నిసాక్షి’ ఓ.ఎస్.అవినాష్ దర్శకత్వంలో అలా అనుకున్నాం. ఇంకా నటీనటులు. అవినాష్ పెద్ద క్యాస్టింగ్ కావాలని మంజూభార్గవి దగ్గర్నుంచి ఆలోచించాకా, కవిత గారిని అనుకున్నాం. ఆవిడ హైదరాబాద్‌లో సెటిల్ అవుతున్న కొత్త రోజులు. ఆవిడ మొదటి భార్య అయితే, రెండో భార్య ఎవరు అని తెగ వెతికితే ఉప్పలపాటి నారాయణరావు గారి ‘వసంత కోకిల’లో వేసిన ‘ఉమా మహంతీ’ గుర్తొచ్చింది నాకు. ఆ అమ్మాయి ఎందుకో నాకు చాలా నచ్చేసింది. ఇంక భర్త ఎవరూ? బాగా చూసి చూసి నరసింహరాజు గారిని పెట్టుకున్నాం. “ఇద్దరు పెళ్ళాల కథకి బాగానే పట్టుకొచ్చారు” అని కవిత తెగ నవ్వింది. ఆ సీరియల్ అప్పుడే కవితకీ, నాకూ తెగ స్నేహం అయింది.

ప్రసాద్ గారు దీక్షగా స్క్రిప్టు చూసి టెలికాస్ట్ కూడా మిస్ అవకుండా చూస్తుండేవారు. కొన్ని డైలాగులు గుర్తుపెట్టుకుని నాతో చెప్పి మెచ్చుకునేవారు. అందులో ఒకటి “నేను సమస్య గురించి బాధపడుతుంటే, నువ్వు పరిష్కారాలు సూచిస్తున్నావు… ఈ గుణం చూసే ఆయన బాగా ఇష్టపడ్డారనుకుంట!” అని పెద్ద భార్య సవతితో అనడం!

ఇలా ఎన్నో డైలాగ్స్ ఆయన మెచ్చుకునేవారు. నేను షూటింగ్‌కి రోజూ వెళ్లకపోయినా, షెడ్యూల్స్‌కి ఒకటో రెండో సార్లు తప్పకుండా వెళ్లేదాన్ని. ఆర్టిస్ట్‌లు నాతో చాలా స్నేహంగా, ప్రేమగా వుండేవారు. లేడీ టెక్నీషియన్స్, హెయిర్ డ్రస్సర్స్ లాంటి వాళ్లు కూడా సమస్యలు ఉంటే నాతో చెప్పుకునేవారు!

ఆ సీరియల్ చేస్తున్నప్పుడే అవినాష్ పెళ్లి ఇంకో టీవీ నటి ఉషతో జరిగింది. ఆమె మీర్ హుస్సేన్ (నాగభూషణం గారి అల్లుడూ, ఎస్.డి.లాల్ కొడుకూ, కెమెరామెన్) గారి ‘శివలీలలు’ లో పార్వతి పాత్ర వేసింది ఈటీ.వీ.లో. యామినీ సరస్వతి గారు డైలాగ్స్ రాసేవారు. ఆ తర్వాత ఆయన దివంగతులయ్యారు. పంచ కట్టుకుని వచ్చేవారు.

నేను వారి పెళ్లి రిసెప్షన్‌కి వెళ్లి “జీవితంలో భాగస్వామ్యం” అవినాష్, ఉషలకి గిఫ్ట్‌గా  ఇచ్చాను. కానీ వారి భాగస్వామ్యం ఎక్కువ రోజులు నిలబడలేదు! విడిపోయారు. ఇద్దరూ మంచివాళ్లే పాపం. ఉష నా ‘అనూహ్య’లో కూడా ఉత్తేజ్‍కి జోడీగా వేసింది. ‘అగ్నిసాక్షి’లో పిల్లలుగా కవితకీ, ఉమా మహంతీకీ అనితా చౌదరీ, ప్రసాద్ బాబు గారి అబ్బాయి శ్రీకర్; ఇంకో ఇద్దరు చిన్న అమ్మాయిలూ. నవభారత్ బాలాజీ పెద్ద కొడుకుగా, ఇంకా అల్లుడిగా కమల్ (‘సీతారామయ్యగారి మనవరాలు’లో మీనాకి జోడీ), ప్రసిద్ధ సినీనటి కృష్ణవేణి… ఇంత మంచి స్టారింగ్ పెట్టారు. చాలా మంచి రేటింగ్‌తో బాగా పేరు తెచ్చింది నాకు.

‘యువ కళావాహిని’ వై.కె. నాగేశ్వరరావు గారు ‘అగ్నిసాక్షి’ మాటలకి ఉత్తమ రచయిత్రి అవార్డు కూడా ఇచ్చారు నాకు. ఆకెళ్ళ గారూ, యామినీ సరస్వతి గారూ, కొమ్మనాపల్లి గణపతిరావు గారూ, నడిమింటి నరసింగ రావు గారూ, గణేష్ పాత్రో గారూ ఇలా చాలా గొప్ప రచయితల తోటీ; జయంతి గారూ, కవిత గారూ, కృష్ణవేణి గారూ, సరస్వతమ్మ గారూ, మిశ్రో గారూ, సుబ్బరాయ శర్మ గారూ, నరసింహరాజు గారూ, రంగనాథ్ గారూ, హేమా చందర్ గారూ, ఉత్తేజ్ ఇలాంటి మంచి మంచి నటుల తోటీ నేను ప్రారంభంలోనే పని చేశాను చేశాను. వాళ్ళకి డైలాగ్స్ రాసాను.

నవలా, టీవీ ప్రస్థానం ఇలా ఉంటే ఇంక సినిమాల్లో అడపాదడపా ఈవీవీ గారితో సిట్టింగ్స్‌కి జనార్ధన మహర్షి పిలవడం; వెళ్లినప్పుడు వాళ్ళు డబ్బు ఇవ్వడం జరుగుతుండేది. కె.ఎస్. రామారావు గారు ఫోన్ చేశారు. “ఉదయ్ కిరణ్‌కి పనికొచ్చే కథలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగారు. ఆయనతో ‘మొగుడే రెండో ప్రియుడు’ సినిమా నా తప్పిదం వల్లే పోయిందని చెప్పాగా! అప్పటినుండి నాకు చాలా బాధగా ఉండేది. “ఉంది” అన్నాను. ఆనాటినుండి ఈనాటిదాకా ఎవరైనా “కథ ఉందా” అంటే “లేదు” అని జవాబివ్వలేదు.

సరే వెళ్ళాను, కె.ఎస్.రామారావుగారి కాంతి శిఖర అపార్ట్‌మెంట్‌కి, అది వారి ఆఫీసు. వాళ్ళ ఇంటికి కూడా చాలా ఆనందంగా వెళ్ళేదాన్ని. ఆవిడ కూడా నా నవలల గురించి చక్కగా మాట్లాడేవారు.

(సశేషం)

Exit mobile version